‘‘మొన్న రాత్రి మనం ఫంక్షన్ నుండొచ్చిన తర్వాత ఈ టేబుల్ సొరుగులో పెట్టిన నీ చేతి బ్రాస్లెట్ కనిపించడం లేదు ఏమైంది నాన్నా?’’
పలుకలేదు వరుణ్.
‘‘లాకర్లో పెడదామని చూస్తే లేదు. ఎంత వెతికినా దొరకలేదు.. ఒక్క రోజులోనే ఇంత మటుమాయమా?’’
‘‘ఇంకెక్కడో పెట్టి మర్చిపోయుంటావ్…. మళ్ళీ జాగ్రత్తగా వెతుకు సంధ్యా’’ అన్నాడు భార్యతో… ఎప్పుడూ బిజినెస్‌తో బిజీగా
వుండే కోటీశ్వరుడు, నగరంలో పేరైన వ్యాపారవేత్త ప్రకాశరావు.
‘‘లేదండీ… ఈ ర్యాక్‌లోనే ఉంచాను’’ నిర్ధారణగా అంది సంధ్య.
‘‘మరోసారి సరిగా వెతుకు’’ అంటూ హాల్లో కెళ్ళాడాయన.
మేడమీది నుండి ఆయన దృష్టి వీధి గేటువైపు మళ్ళింది.
ఎదురింటి రాజయ్య తన కొడుకుతోపాటు గేటుముందు నిలుచుండడం గమనించి లోపలికి పిలిచాడు.
‘‘ఏం రాజయ్యా ఇలా వచ్చావ్?’’ అంటూ పకరించాడు.
‘‘ఆయ్యగారూ…’’ మెరుపులా ప్రకాశరావు కాళ్ళమీద పడి భోరున విపించాడు రాజయ్య.
‘‘ఏంటిది రాజయ్యా…’’ కంగారుగా వెనక్కి జరుగుతూ అన్నాడు ప్రకాశరావు.
‘‘మమ్మల్ని మన్నించండయ్యా’’ అంటూ ఓ కవర్ తీసి ఆయన చేతిలో వుంచాడు రాజయ్య.
ఆదుర్దాగా అది తీసి చూశాడు ప్రకాశరావు.
అది… అది… గదిలో తన భార్య వెతుకుతున్న రెండు తులాల బంగారు బ్రాస్లెట్!’’
‘‘ఇది…. ఇది… నీకెలా దొరికింది రాజయ్యా?’’
అదోలా అడిగాడు ప్రకాశరావు.
అందుకు సమాధానంగా, తన కొడుకును ప్రకాశరావు పాదాలమీద పడేశాడు.
‘‘అయ్యగార్ని క్షమించమని అడగరా దౌర్భాగ్యుడా!’’ అన్నాడు బాధగా రాజయ్య.
‘‘నా తప్పు కాయండయ్యగారూ…’’ ఏడుస్తూ అంటున్న శంకర్‌ను లేవనెత్తాడు ప్రకాశరావు.
‘‘ఇంతకూ సంగతేంటి రాజయ్యా?’’
తలొంచుకున్న రాజయ్య పలుకలేదు.
‘‘రాజయ్యా… వరుణ్ కోసం మా ఇంటికొచ్చిన వీడు దీన్ని దొంగిలించాడా?’’
కాస్త కఠినంగానే అన్నాడు ప్రకాశరావు. ఉలిక్కిపడ్డాడు రాజయ్య.
‘‘లేదయ్యా… లేదు… అంతమాటనకండి… కూటికి పేదలమైనా గుణానికి మాత్రం కాదయ్యా…. జరిగిందంతా చెప్తాను!’’
అంటూ అంతా పూసగుచ్చినట్టుగా వివరించసాగాడు రాజయ్య.
*****************************************
‘‘ఒరే శంకర్… ఏమైందిరా? ఎందుకలా వున్నావ్?’’
తోటకూర కాడలా వాడిపోయిన వాడి వదనం, కన్నీటి చారలతో కూడిన శంకర్ చెంపలు చూస్తుంటే వరుణ్‌కు చెప్పలేని బాధ కలిగింది.
‘‘చెప్పరా… ఏం జరిగిందిరా?’’
వాళ్ళ చిన్న డాబా ఇంటిముందున్న వేపచెట్టు మొదట్లో దీనంగా కూర్చున్న తన మిత్రుడు శంకర్ పక్కనే తాను
కూర్చుంటూ అడిగాడు ఆ ఎదురింటి మేడిoటి అబ్బాయి, శంకర్ మిత్రుడు వరుణ్.
‘‘మా గౌరిని మా నాన్న అమ్మేస్తడంటరా వరుణ్!’’
‘‘ఆ!’’ ఊలికిపాటుగా చూశాడు వరుణ్!’’
అవున్రా! ఏడాది నుండి అంటనే వున్నడు మా నాన్న, ఈ కరోనా కరువు కాలం మన బతుకే మనకు బరువైతుంటే ఈ ఆవు
గౌరమ్మనెలా సాకేదిటరా? అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నడురా!’’
అంటు మిత్రుడి భుజంపై తలవాల్చి బావురుమన్నాడు శంకర్.
‘‘ప్లీజ్‌రా ఏడవకు!’’ మిత్రుడి కన్నీళ్ళు తుడిచాడు వరుణ్.
‘‘వరుణ్….గౌరి నాకు ప్రాణంరా! నేను తింటేనే అది తినేది. నిన్న పేరంటం అమ్మ తెచ్చిన అరటిపండు పెడితే…
ఆకలితోటున్నాగాని అది తిన్లేదు. నేను సగం పండు తిన్నంకనే గౌరి తిన్నదిరా!’’
అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు శంకర్.
‘‘ప్లీజ్ శంకూ ఏడ్వద్దు! ఎప్పుడూ జోక్లేస్తూ నవ్వించే నువ్వలా వుంటే నేను చూడలేనురా!’’
అంటూ ప్రేమ నిండిన బాధతో పదేళ్ల వరుణ్, తొమ్మిదేళ్ళ శంకర్‌ను కౌగిలించుకున్నాడు…. తోచిన రీతిలో ఓదార్చాడు. ఆపై,
అంతులేని ఆలోచనతో అన్యమనస్కంగానే ఇంటికి చేరుకున్నాడు వరుణ్.
‘అవును… గౌరి గంగిగోవులాంటిదంట! శంకర్‌కు అది ప్రాణం వంటిది. అది లేకుంటే వాడుండగలడా? చదవగలడా? తనతో ఆడగలడా?’
అనుకుంటూ ఎంతగానో ఆలోచించాడు… తెల్లారగానే ఓ నిర్ణయానికొచ్చి స్థిమితపడ్డాడు వరుణ్.
‘‘శంకూ, ఒరే శంకర్’’ అని పిుస్తూ, శంకర్ వాళ్ళ ఇంటి గేటు తెరుచుకొని లోపలికొచ్చాడు వరుణ్.
స్టూల్ పైన నిల్చొని, ఆవు గౌరి వీపును బ్రష్‌తో రుద్దుతున్న శంకర్ దగ్గరకు చేరాడు.
‘‘ఒరే వరుణ్… గౌరి వెళ్ళిపోవడం తప్పదంట కదరా!’’
ఏడుపు నడుమనే గౌరి గంగడోలును ముద్దాడుతూ వణికే కంఠంతో అన్నాడు శంకర్.
‘‘నో… నో… శంకర్… నిన్నొదిలి గౌరి వెళ్ళిపోకూడదు… నువ్వు హాపీగా వుండి నాతో ఆడుకోవాలంటే, గౌరి నీతోనే వుండాలి!’’
‘‘అదెట్లా?’’
‘‘అది… అది… ఇట్లా… ఇదిగో ఇది మీ నాన్నకివ్వు! గౌరినమ్మకుండా దీన్నమ్మితే, గౌరి తిండికి సరిపడా డబ్బులొస్తాయి!’’
అంటూ ఉత్సాహంగా ఓ కవరు తీసి శంకర్ షర్ట్ జేబులో వుంచాడు వరుణ్! సంకోచంగా చూశాడు శంకర్.
‘‘ఇది నాదేలేరా!’’ అంటూ శంకర్ భుజం తట్టాడు వరుణ్.
‘‘అయితే వరుణ్…. దీంతో నా గౌరమ్మ తల్లి నాతోనే వుంటదా? నాతోనే తింటదా? నాకు జరమొచ్చి పడుకుంటే ప్రేమగా నా ఒళ్ళంతా నాకుతదా?
సంభ్రమంతో కూడిన అపురూప భావంతో, ఆ కవర్‌ను జేబుపై నుండే గుండెకు హత్తుకున్నాడు…. ఆనందంగా గౌరినీ
వరుణ్నీ కలిపి కౌగిలించుకొని కోటి సుద్దుతో కూడిన ముద్దులెన్నో పెట్టుకున్నాడు శంకర్.
*****************************************రాజయ్య చెప్పిందంతా కళ్ళతో కన్నట్టుగానే చెవులతో విన్నాడు ప్రకాశరావు.
‘‘వరుణ్’’ అంటూ కొడుకును కేకేశాడు.
అందరూ భయపడ్డారు కొడుకునేం చేస్తాడోనని! భయం భయంగా తండ్రి దగ్గరకొచ్చాడు వరుణ్.
‘‘సారీ నాన్నా!’’ ఏడుస్తూ తండ్రి కాళ్ళకు చుట్టుకు పోయాడు.
‘‘లే…. నాన్నా…లే!’’ అంటూ కొడుకును లేవనెత్తి గుండెకు హత్తుకున్నాడు.
ఆపై అదే సందిటికి శంకర్‌ను కూడా చేరబిలిచాడు ప్రకాశరావు.
‘‘రాజయ్యా… సృష్టిలో తీయనిది స్నేహమని అంటారు. అది నిజమేనని… ఎల్లలులేని తన స్నేహ ధర్మాన్ని నిరూపించాడు
మా పిల్లవాడు! గోమాతను తల్లిలా భావించి, దానికి దూరం కాలేక తల్లడిల్లిపోయిన మీపిల్లవాడెంత జంతు ప్రేమికుడో నా
కళ్లక్కట్టింది రాజయ్యా… దయకు మించిన ధర్మం లేదని మీవాడు, స్నేహానికి మించిన సిరిసంపదల్లేవని మా వాడు…
తమ తమ ధర్మాల మర్మాు విప్పి చెప్పారు!’’
అంటూ చెమరించిన కళ్ళద్దుకున్నాడు ప్రకాశరావు.
‘‘అయ్యగారూ….’’ ఆశ్చర్యంగా చూశాడు రాజయ్య.
‘‘రాజయ్యా… మన సంస్కృతిలో గోవుకున్న విలువను ఈ చిన్న పిల్లలు తెలియజేశారు. గోమాత అణువణువు
అమృతప్రాయమని, గోసంబంధిత ప్రతి అంశం అమూల్యమైనదని… శాస్త్రవేత్తలు సైతం నిరూపించిన నిజం. ఎన్ని అనారోగ్యాల
పాలౌతున్నా కూడా జనం ఆ నిజం గుర్తించడం లేదు.
ఇంతెందుకు… పురిట్లోనే తల్లిపోయిన నేను చిన్న నాటి నుండి… మా పల్లెలోనే గోవు తల్లి పాలతోనే పెరిగానన్న సంగతి
ఇప్పుడీ బాలజ్ఞానుల వల్లనే గ్రహించగలిగాను!’’
సన్నగా కంపించింది ప్రకాశరావు స్వరం.
‘‘అయ్యా…!’’ అయోమయంగా చూశాడు రాజయ్య.
‘‘ఎందుకంటే ప్రస్తుతానికి పదీ పాతిక దాకా దేశవాళీ గోవుల్ని కొందాం ఓ గోశాలను నడిపిద్దాం!’’
‘’అయ్యగారూ…’’ రాజయ్య కళ్ళ నుండి ఆనందబిందువులు రాలిపడ్డాయి.
‘‘అంతేకాదు రాజయ్యా… గోవుల్ని కబేళాకు తరలించే పాపపు పనినాపివేసే పనిలో పాల్గొందాం! కడదాకా కాడీకవ్వాలనాడిoపజేసే మన పాలతల్లిని…. జాతి సౌభాగ్యవల్లిని… మన గోమాతను కాపాడుకుందాం! సేంద్రియ ఎరువు పంటతో దేశ
ఆరోగ్య సంపదను సంరక్షించుకుందాం!’’
దృఢచిత్తంతో అంటూ… గోడుకున్న గోవిందుడి చెంతనున్న గోమాత పటానికి దండం పెట్టాడు ప్రకాశరావు!
అదంతా గమనించిన వరుణ్, శంకర్ ఆనందంతో కేరింతలు కొట్టగా…. ఆ శబ్దం విన్న గోవు గౌరి… అందుకు జవాబుగా
‘‘అంబా’’
అని అరవటంతో, ఆవు ఆశీర్వాదం పలికినట్టనిపించింది అక్కడున్న అందరికీ!
-కె.వీణారెడ్డి,
రచయిత్రి – కవయిత్రి
కథా సంపుటులు: కథావిపంచి-1, జీవన్మణులు,
కథావిపంచి-2, నిశాంత కాంతులు!
బిరుదులు: సాహితీ సామాజిక వేత్త,
మహిళా సేవారత్న!
+91-7337058025