Home కథలు అన్వేషణ

అన్వేషణ

by Madhavapeddi Usha

“ఈసారి ఏమని వ్రాసారండి పెళ్లివారు?” జానకమ్మగారి గొంతులో ఆరాటం.

“ఏముందిలే మళ్లి మామూలే! పెద్దమ్మాయి నచ్చలేదట.  చిన్నమ్మాయిని యిస్తే చేసుకుంటామని వ్రాశారు.

చిన్నమ్మాయయితే కట్నం కూడా వద్దట. అందుకే పెళ్లివారికి సునితని చూపించవద్దంటే విన్నావు కాదు. నేను చెప్పేది నువ్వు తలకెక్కించుకోనంత కాలం ఇదిగో ఇలాగే ఏడుస్తాయి వ్యవహారాలు” అనానడు మూర్తి. తనలో కలిగిన నిరాశ, నిస్పృహను భార్యమీద చిరాకు రూపంలో ప్రదర్శిస్తూ.
 “నేనే చేయనండి మధ్యన… అమ్మాయి నా మాట వింటేనా అలా చెల్లిని దాచిపెట్టి చేసే పెళ్ళి నాకొద్దు అని మొండికేస్తేనూ…. పెళ్ళైనాక ఎలాగూ తెలుస్తుంది. అప్పుడు చెల్లెలిని చేసుకుంటే బాగుండేది అని అనుకునేందుకే ఆస్కారం ఇవ్వకూడదని మీ కూతురు పట్టు పట్టిందాయే మరి” అంది జానకమ్మ సంజాయిషీ ధోరణిలో! అప్పుడే పోస్టుమేన్ ఇచ్చి వెళ్లిన ఉత్తరం తాలూకు చర్చ అది.

లోపల గదిలో ఏదో పుస్తకం చదువుతూ ఈ సంభాషణ అంతా వింటున్న సుజాత విసురుగా హాల్లో కూర్చున్న తల్లిదండ్రి దగ్గరకి వచ్చింది. “నాన్న నేనొక మాట చెప్తాను వింటారా?” అంది తీవ్రంగా. “చెప్పమ్మా ఏమిటది? సబబుగానూ, సమంజసంగానూ ఉంటే తప్పక వింటాను” అన్నాడు మూర్తి.  కూతురు చెప్పబోయేదేంటో అంచనా వేయటానికి ప్రయత్నిస్తూ.

“అయితే వినండి. మొదటిది ఈ రోజుతో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మానేయండి. రెండు ఈ సంబంధం అన్ని విధాల మంచిది అని తోస్తే చెల్లెలు ఇష్టపడితే దానికి పెళ్ళి చేసేయండి” అంది నిశ్చలంగా.

ఒక్క క్షణం మాటలు రానివారిలా వుండిపోయారా దంపతులు. వెంటనే మూర్తే తేరుకొని “అదెలా కుదురుతుందమ్మా అక్కకు పెళ్లి కాకుండా చెల్లెలికి పెళ్ళ చేయటమనేది మన సంప్రదాయంలో లేదమ్మా! ఒకవేళ చేసినా ఆ తరువాత నీకు పెళ్లి చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఏదో లోపం ఉండబట్టే అక్కకు పెళ్లి కాలేదని ఏవో అవాకులు చవాకులు

వాగుతారు.  అసలే లోకులు కాకులు. నీకు పెళ్ళికాకపోవడానికి లక్ష కారణాలు సృష్టిస్తారు.  ఆ తరువాత మనలను తలెత్తుకు తిరగనీయకుండా చేసి ఆనందిస్తుంది సమాజం.”

అదంతా ట్రాష్ నాన్నా! ఈ సమాజానికి భయపడి ఇప్పుడు మన జీవితాలను ఎందుకు నాశనం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అంతెందుకు ఇప్పుడు నువ్వు చెప్పావే చెల్లెలికి ముందు పెళ్లి చేయటం మన సంప్రదాయంలోనే లేదని, మరి ఈ విషయం తెలిసే చిన్నమ్మాయినిస్తే చేసుకుంటామని ఎలా అడుగుతున్నారంటావు? పెద్దమ్మాయిని ఏం చేద్దామని వాళ్ల ఉద్దేశం?  పోనీ పెద్దమ్మాయికి కూడా ఓ పెళ్లి కొడుకును వెతికి పెడతారేమో కనుక్కోండి…. అప్పుడు ఇద్దరి పెళ్ళిళ్లూ ఒక్కసారే చేసేయచ్చు. కానీ అది సాధ్యఁ కాదు. ఎందుకంటావా? వాళ్ళు వెతికి పెట్టబోయే పెళ్ళి కొడుకు మాత్రం అందమైన చెల్లెలిని వొదిలిపెట్టి అక్కని చేసుకోవడానికి ఎందుకు వస్తాడు? మన పిచ్చిగానీ. అందుకే నేను ఇప్పట్లో పెళ్ళి చేసుకోదలచుకోలేదు. బి.ఇడికి అప్లై చేశాను. నా కాళ్ల మీద నేను నిలబడాలి ముందు. ఆ తరువాత నేను నా వ్యక్తిత్వం పూర్తిగా పూర్తిగా నచిచనవాడు తారసపడితే వెళ్ళాడు తాను. లేదా అలాగే ఉండిపోతాను. మీరేమన్నా సరే నా నిర్ణయం మారదు.” ఏమంటారానన్నట్లు తండ్రి వంక చూసింది. తన కళ్లముందే కూతురు ఇంతగా ఎదిగిపోవడం చూసిన ఆ తండ్రి మాత్రం ఏమనగలడు? అందుకే మౌనంగా ఉండిపోయారు. మూర్తిగారు అంగీకారాన్ని సూచిస్తూ.

సునీత, సుధాకర్ పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. పెళ్ళి పనుల్లో ఎంతో సరదాగా ఉత్సాహంగా పాల్గొంది సుజాత. ఆమెను చూసి చుట్టాలు ఆశ్చర్యపోయారు. అదేంటి తనకు పెళ్లవకుండా చెల్లెలికి పెళ్లవుతుంటే ఈ పిల్లకి కొంచెం అయినా బాధగా లేదా? పైగా సంతోషంగా ఉందే అనుకున్నారు. ఈ కామెంట్స్ విన్న సుజాత మనసులోనే నవ్వుకుంది వాళ్ళ అమాయకత్వానికి. మరికొంతమంది అక్కకి పెళ్లి కాకపోవడానికి వేరే ఏదైనా కారణం ఉండి ఉండొచ్చుగా అని లా పాయింట్ తీసి మరీ చెవులు కొరుక్కున్నారు.

తోటి మనిషిలో లేని చెడును ఊహించుకొని ఆనందపడటం మనిషి బలహీనత. అందుకే పెళ్ళిలో చుట్టాల కామెంట్స్ ను అస్సలు పట్టించుకోలేదామె. సునీత భర్తతో అత్తవారింటికి వెళ్ళిపోయింది.

చూస్తూ ఉండగానే ఐదేళ్ళు గిర్రున తిరిగాయి. సునీత బి.ఇడి పూర్తిచేసి స్కూల్ లో టీచర్ గా చేరింది. సునీతకి మూడేళ్ళ బాబు, ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంటం. ఈసారి పురుడు అక్కడే పోస్తామని వాళ్ల అత్తగారు కబురు పెట్టారు. సునీతకి నెలలు నిండాయి. రేపో మాపో శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు మూర్తి జానకమ్మ. ఇంతలో పిడుగులాంటి వార్త! కాన్పు కష్టం అయి ఆపరేషను చేసి బిడ్డను బయటకు తీశారు. కానీ తల్లిని కాపాడలేకపోయారట డాక్టర్లు. మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయారు ఆ తల్లిదండ్రులు. ఈ షాక్ నుంచి సుజాతే ముందు తేరుకొని తల్లిదండ్రిని ఊరడించింది.

అంతా బయలుదేరి సునీత అత్తవారి ఊరు వెళ్ళారు. జరగవలసిన తతంగమంతా అయిపోయినాక బరువెక్కిన హృదయాలతో జీవచ్ఛవాలలా తిరిగి వచ్చారు.రోజులు భారంగా దొర్లస గాయి. పిల్లా పాపలతో కళకళ లాడవలసిన చెట్టంత కూతురి జీవితం అర్థాంతరంగా ముగియడంతో మూర్తిగారు జానకమ్మ పూర్తిగా కృంగిపోయారు.

ఆరునెలలు గడిచాయి ఏ మార్పు లేకుండా.

ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సుజాత తల్లిదండ్రీ చెప్పిన విషయం విని ముందు విస్తుపోయింది. ఆ తరువాత ఛీ… మనుష్యులలో ఇంత స్వార్థం కూడా ఉంటుందా? అని ఏవగించుకొని తన చెల్లెలి మామగారు వ్రాసిన ఉత్తరం చదివింది.

 వెంటనే బట్టలైనా మార్చుకోకుండా తన గదిలోకి వెళ్లి ప్రక్కమీద వాలిపోయింది. ఆలోచనలు మెదడును తొలిచేస్తున్నాయి. ఇప్పుడేం చేయటం… భగవంతుడు తన కిటువంటి విషమ పరీక్ష పెడతాడని తనెన్నడూ ఊహించలేదు. చీకూ చింతాలేని జీవితం గడపాల్సిన లేత వయస్సులోనే అతి విలువైన తల్లి ప్రేమకు దూరం అయిన ఆ పసివాళ్ల మీద జాలి చూపేదా, లేక ఒక్కప్పుడు తనను నిరాకరిఁచిన సుధాకర్ ని తృణీకరిఁచి తన కక్ష తీర్చుకొనాలా? ఏమిటిప్పుడు తన కర్తవ్యం? ఎటూ తేల్చుకోలేకపోతున్నదామె మనస్సు.

సరిగ్గా ఆమె ఆలోచనలు ఒక నిర్ణయంగా రూపుదిద్దుకుంటున్న సమయంలోనే మూర్తి ఆమె గదిలోకి వచ్చి ఆమె దగ్గరగా కూర్చొని, చేత్తో తలని నిమురుతూ అడిగారు వాత్సల్యం తొణికిసలాడే స్వరంతో “ఏమ్మా ఏమాలోచించావు సుధాకరం విషయం?”

“ఆత్మాభిమానం కల ఏ ఆడపిల్లయినా ఇందుకు ఒప్పుకుంటుందనే అనుకుంటున్నావా?” ఆమె గొంతులో నిష్ఠూరం.

“అది కాదమ్మా. ఈ పంతాలు పట్టింపులూ మీ వయస్సులో సహజమే. కానీ ఈ వయస్సు కాస్తా దాటిపోయిన తరువాత నీ నిర్ణయం నీకే తప్పుగా అనిపించవచ్చు. ఎన్నాళ్ళని ఒంటరిగా వుంటావు.

ఒంటరితనాన్ని మించిన శత్రువు మరొకటి లేదని అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. తీరా తెలుసుకున్నాక సమయం మించిపోవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం?

అదేకాదు సుధాకర్ని పెళ్ళి చేసుకుంటే ఆ పసివాళ్ళకు తల్లిలేని లోటు తీర్చిన దానివవుతావు. జీవితంలో ఇంతకన్నా ఏం పరమార్థం సాధించదలచుకున్నావమ్మా!”

“నేను బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను నాన్నా! ఆ పసివాళ్ళను తలచుకుంటే నాకు జూలిగానే ఉంది. కానీ ఈ పెళ్లితో నేను  పిల్లలకి తల్లి కాగలనేమోగాని అతనికి భార్యను మాత్రం కాలేను.  ఆ పిల్లలకు నా అవసరం కొన్నాళ్ళే. ఆ తరువాత వాళ్ళు రెక్కలు వచ్చి ఎగిరిపోతారు. అప్పుడు నాకు మిగిలేది ఒంటరితనం కాక మరేమిటి నాన్నా?”

కూతురి మొహంలోని గాంభీర్యతని చూశాక ఆమె నిర్ణయం మారదని అర్థం చేసుకున్న మూర్తి ఒక నిట్టూర్పు విడిచారు.

వారం రోజుల అనంతరం సునీత భర్త సుధాకర్ ఓ లేఖ అందుకున్నాడు. ఫ్రం అడ్రస్ సుజాత అని ఉంది. ఆత్రంగా విప్పి చదివాడు. “సుధాకర్ గారికి”, మీ ఉద్దేశం తెలుసుకున్నాను. కానీ ఈ ప్రపోజల్ తేవడానికి మీకు మనస్సెలా ఒప్పుకుందో నాకు అర్థం కావటం లేదు.  ఒక్కప్పుడు నేను మీ భార్య కావటానికి అనర్హురాలినని నిర్ణయించింది మీరే! కాని ఇప్పుడు పిల్లల కోసం నన్ను పెళ్ళాడతానంటున్నారు. అంటే మీ అవసరాలనుబట్టి మీ యిష్టాయిష్టాలు కూడా మారిపోతుంటాయన్న మాట. ఆ ఎదుటి అమ్మయి ఏం కోరుకుంటుందో మీకు అవసరం అని స్పష్టంగా తెలుస్తున్నది. ఇది ఈనాడు కొత్తగా వచ్చిన విషయమేమి కాదు. అనాదిగా వస్తున్న పురుషాధిక్యతే. అందులో ఏమీ మార్పురాలేదు. కానీ ఈనాటి ఆడపిల్లల దృక్పథంలోనే మీరూహించని మార్పు వచ్చేసిందని మీరు తెలుసుకుంటే మంచిది.

పైగా పిల్లల కోసం అంటూ, ఆడదానిలోని సహజ మాతృత్వాన్ని ఎక్ల్సాయిట్ చేయటం మానలేదు మీ మగవారు. అప్పుడూ ఇప్పుడూ కూడా!! చెల్లెలి పిల్లల మీద నేను జాలిపడాలని మీరాశించే బదులు, మీ కన్న పిల్లల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరసలు పెళ్ళే చేసుకోరు.

ఇకపోతే మీరు పెళ్ళి చేసుకొంటననగానే ఎగరి గంతేసి ఒప్పుకుంటాననుకొని ఉంటారు. స్త్రీకీ పెళ్ళే పరమావధి కాదు. నా దృష్టిలో వివాహం జీవితానికొక కొత్తమలుపు మాత్రమే. అదే గమ్యం కాదు. కాకూడదనేది నా దృఢాభిప్రాయం. ఈ ప్రపంచం సువిశాలం. అందులో నా వ్యక్తిత్వానికి విలువనిచ్చి, నన్ను నన్నుగా స్వీకరించి, నా హృదయసౌందర్యాన్ని చూడగలిగిన ఒకే ఒక వ్యక్తి తప్పక లభిస్తారనే నమ్మకం, ఆత్మవిశ్వాసం నాకున్నాయి. అటువంటి వ్యక్తి తారసపడేవరకు నా ఈ అన్వేషణ ఇలా కొనసాగిస్తూనే ఉంటాను.

కానీ మీ హృదయంలో స్థానం లభించకుండా మీ జీవిత భాగస్వామిని మాత్రం కాలేను.  చెల్లెలి పిల్లలమీద నాకెప్పుడూ ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళ కోసం నా జీవితాన్నే త్యాగం చేసేంతటి స్థాయికి ఎదగమంటే మారతం… నో థాంక్స్. అంతటి విశాల హృదయం నాకు లేదు… సారి ఉంటాను

                                                                              – సుజాత

You may also like

Leave a Comment