ముఖం ఎప్పుడూ చూసినట్టు లేదు
మాట మాత్రం
తెలిసిందేనని మనసు చెప్తుంది
కనులకూ మనసుకూ మధ్యన
కొంత తేడా ఉన్నది
అభిప్రాయం భిన్నంగా ఉంది
ఒకవేళ నా చూపు మసకైందేమో
ఒకప్పుడులా చూస్తలేదేమో
మనసు అద్దం అందంగా ముస్తాబై
చురుగ్గా ఉందేమో
జ్ఞాపకాలను తొందరగా పసిగట్టొచ్చు
కానీ మనిషింకా తేరుకోలేదు
గందరగోళ అయోమయంలోంచి
ఆనవాళ్లు వెతుకులాటలో
సవాళ్ళు ఎదురొచ్చాయి చూపుకు
పరిచితుడే అక్కడుంది
మరి అపరిచితుని ఎలా కనిపించె?
బహుశా మెదడు పొర మందమైందేమో
సున్నిత గుణం శూన్యమైందా
గుర్తుపట్టలేని యవ్వనం వెళ్ళంగనే
కాల మహిమ కాకపోతే
ఏందిది
దశాబ్దాల స్నేహ మాధుర్యం
అపరిచిత రూపంలోకి మారింది
కలిసి తిని తాగిన అన్నపానీయాలు
ఇంకా అరగనేలేదు మొత్తంగా
కడుపులో గొప్పగా మాట్లాడుతున్నై
ఐతే…ఇప్పుడైతే…
అక్కడున్నది అపరిచితుడు కాదు
మరి పరిచితుడేనని
మరిచిన మనిషి ఇదమిత్థంగా
నిజంగా ఏమీ చెప్పలేడు..
రుచి చూసిన జిహ్వ అనుభూతో
అనుభవించిన క్లేశంలోని
సంతోషాల యాది నదియో
గతం గడిపిన బాటల్లోని
గుండె సడీ సప్పుడో
ఏ మాలిన్యం అంటుకోని
మనసు పాదరసమో తప్ప…