అప్పు అనే పదం వింటేనే చిరాకు పడే చిన్నారావు కి అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది .
అదీ అర్జెంట్ గా చేయవలసిన సందర్భం ఎదురయింది.
చేసేదేమీ లేక తన బాస్ పరాంకుశం గారి దగ్గరికి వెళ్ళాడు !
“రావోయ్ చిన్నారావు ! ఏంటి విషయం? అలా దిగాలుగా వున్నావేం”ఆప్యాయంగా అడిగాడు.
“సార్ అదీ..అదీ..” అంటున్నాడే కాని విషయం చెప్పలేక తల వాల్చేశాడు.
“సిగ్గు పడ్డది చాల్లే సంగతేంటో చెప్పు ” అన్నాడు చనువుగా.
పెళ్ళై రెండు నెలలే అవడంతో కుర్రాడికి సెలవేమైనా కావాలేమో ఇచ్చేద్దాం అనుకున్నాడు పరాంకుశం..అలియాస్ జి.ఎం అంకుశం !
అసలైతే ఆయన దగ్గర నిలబడాలంటే కాళ్ళు వణికి పోతాయి ..
చిన్నారావు కే కాదు మిగిలిన స్టాఫ్ అందరికీ !
అలాంటిది ..ఆయన ప్రమోషన్ వచ్చిన ఊపులో ఉత్సాహంగా ఉండడం తో ..
ధైర్యంగా ఆయన వద్దకు వెళ్ళాడు చిన్నారావు పనెలాగైనా అవుతుందనే నమ్మకం తో !
“సార్ అది..అదీ..”
“ఏంటది..”
“…”
“ఏంటోయ్..ఆది?”
“సార్ నాకో లక్ష అప్పు కావాలి?” గబుక్కున అడిగాడు.
“ఏంటి?లక్ష..నేను ఇటీవలే ఇల్లుకట్టాకదా? నా దగ్గర డబ్బుల్లేవు..పైగా నేనే అప్పుల్లో ఉన్నాను ” నిర్మొహమాటంగా చెప్పాడు ఆయన.
దిగాలుగా బయటకు వచ్చిన చిన్నారావు వైపు అందరూ జాలిగా చూస్తున్నారు.
బాస్ సంగతి తెలిసి చివాట్లేమైనా పెట్టాడేమో ..
తమకెందుకు వచ్చిన చిక్కులే అనుకుంటూ అందరూ మౌనంగా ఉన్నారు .
“రేయ్! రామ్మోహన్ నువ్వే నన్ను ఈ సమస్య నుండి గట్టెక్కించాలి రా ..”
అంటూ స్నేహితుడి చేతులు పట్టుకున్నాడు అవే కాళ్ళనుకోమంటూ ..
“రేయ్ ! ఊరుకోరా..కాళ్ళని పట్టుకుని చేతులంటున్నావు..నీకు మతి గాని పోయిందా?” అంటూ పైకి లేపాడు రామ్మోహన్.
“అర్రే..సారీరా” అంటూ గబుక్కున లేచి .. చేతులని పట్టుకున్నాడు ప్రాధేయ పూర్వకంగా బ్రతిమిలాడు తూ !
“ఇంతకీ నీకు కావలసిన సహాయం ఏంటో చెప్పరా ముందు” అడిగాడతను ఆందోళనగా .
ఆలస్యం చేయకుండా వెంటనే అడిగాడు..
“నాకో లక్ష అప్పు గా కావాలి రా?”అన్నాడు చిన్నారావు.
“ముందు చేతులు వదలరా?”
“ఆహా వదలను ..”
“వదులుతావా లేదా?”
“వదిలితే నువ్వు తప్పించుకుంటావు”
“వదలకపోయినా తప్పించుకుంటాను ” చేతులు విడిపించుకుని పారిపోయాడు రామ్మోహన్ .
‘అయినా ..తాను ఎప్పుడూ ఎవరికీ అప్పు ఇవ్వలేదు .
ఎవరి దగ్గర తీసుకోలేదు .అందుకే అప్పు అడిగే పద్దతేంటో తెలియడం లేదు ‘ అనుకున్నాడు .
ఆరోజు తెలిసిన వాళ్ళందరినీ అడిగాడు.
పనవ్వలేదు.
వచ్చే జీతం ఇరవై వేలు ..డిగ్రీ చదివాడు చిన్నారావు !
ఓ చిన్న ఆఫీస్ లో క్లర్క్ గా పని చేస్తున్నాడు !
తనకి ఇద్దరు చెల్లెళ్లు !
ఒకరికి పెళ్ళయి రెండేళ్ళవుతుంది.
మరో చెల్లికి ఇటీవలే సంబంధం కుదిరింది .
పెళ్ళివాళ్ళు కట్నం భారీగా అడగకపోయినా పెళ్లి మాత్రం ఘనంగా చేయాలని షరతు పెట్టారు ..
తన వద్ద వున్న డబ్బులకి తోడుగా కనీసం ఒక లక్ష అయినా కావాలి ..
అలాగైతేనే చెల్లి పెళ్లి అవుతుంది .
ఆలోచిస్తుంటే మనసంతా దిగులు మేఘాలు కమ్ముకున్నాయి !
రాత్రి పడుకోబోయే ముందు ..అన్యమనస్కంగా ఉన్న భర్తతో ..
“ఏంటండి అలా వున్నారు !?” అడిగింది జానకి .
నిరాశగా నవ్వి ఊరుకున్నాడు సమాధానం చెప్పలేదు .
భర్త అలా మౌనంగా ఎందుకున్నాడో అర్థం కాలేదు జానకి కి !
అతడే చెబుతాడు లే అనుకుని ఊరుకుండిపోయింది.
* * *
రెండు రోజులు గడిచాయి .
“నేను ఊరు వెళ్ళి రెండు రోజుల్లో వస్తాను ” అన్నాడు భార్య తో ..
“సరే” అంది భర్త మాటలు విని .
సూరయ్య మామయ్య ఏమైనా డబ్బులు సర్దుతాడేమోనని సంబరంగా ఊరు వెళ్ళాడు చిన్నారావు.
అతడి చిన్నతనంలోనే తండ్రి దూరం కాగా తల్లి చేసిన కష్టం..తన చిన్ని సంపాదనతో ఇంతకాలం అప్పు చేయకుండా ఇల్లు ఎలాగోలా నెట్టుకొచ్చాడు !
ఇప్పుడు మాత్రం ఇక అప్పు చేయకుండా పెళ్లి అసాధ్యం ..నిర్ణయానికి వచ్చాడు !
సూరయ్య మామయ్య హ్యాండ్ ఇవ్వడంతో ..నిరాశగా వట్టి చేతులతో ఇంటికి వచ్చాడు.
భార్య ఎంత అడుగుతున్నా తన సమస్య మాత్రం చెప్పలేదు.
“ఏంటండి!? వారం రోజులుగా అదోలా వున్నారు ?నాకు కూడా చెప్పలేనంత సీకేట్ సమస్యా ?” అడిగింది జానకి అనునయంగా .
జరిగిందంతా సింపుల్ గా వివరించాడు.
“ఓ నాకు అర్థమయింది మీ సమస్య .మీకు ఒక లక్ష రూపాయలు కావాలి .అది అర్జెంటుగా !
మరి నాకు ఈ సమస్య ముందుగా చెప్పినట్లయితే నేనే పరిష్కరించే దాన్ని కదా?”
“ఏంటి నువ్వంటుంది?”
“మీరు వింటున్నది నిజమే !”
భార్య వైపు చూశాడు విస్మయంగా .
“నేను మీకు ఇదివరకే చెప్పాను కదా .పెళ్ళికి ముందు నేను ఉద్యోగం చేశానని .
అప్పట్లో నేను సంపాదించిన డబ్బులు మా నాన్న వాళ్ళు నా దగ్గర నుండి తీసుకోకుండా పెళ్లి చేశారు.
ఆ డబ్బులు నా దగ్గర అలాగే వున్నాయి. అవి తీసుకుని ముందు అవసరం గడవనీయండి.
తరువాత మనం ఎలాగూ డబ్బులు సంపాదించుకోవచ్చు .
అడపడుచు ఆనందంగా ఉంటే మనకు అంతా మంచే జరుగుతుందని నా నమ్మకం “
అంది భర్తతో.
జానకి మాటలు వింటుంటే అతడి మది సంబరం తో నిండిపోయింది.
“శ్రీవారు ! నేను చెబుతున్న ఈ మాటలు గుర్తుపెట్టుకోండి.అవసరానికి డబ్బులు అప్పు చేయవచ్చు.
అదేం తప్పు కాదు .నేరం అంతకంటే కాదు.కానీ మనం కూడా ఎవరైనా అవసరం అని అడిగితే ఇవ్వాలి ..తీసుకుంటుండాలి !
ఆర్థిక విషయాల పట్ల అప్రమత్తత ఎంత అవసరమో ఇలాంటి సంఘటనలే నిదర్శనాలు ..
డిగ్రీ చదువు కున్నాను కదా.. ఖాళీగా ఇంటి దగ్గర ఏం కూర్చుంటాను !?
దగ్గరలో ఉన్న స్కూల్ లో టీచర్ గా జాయిన్ అవుతాను .
ఏదో వేడి నీళ్లకు చన్నీళ్లు గా నా సంపాదన కూడా కలిసి వస్తుంది కదా!?”
అడుగుతున్న శ్రీమతి వైపు సంతోషంగా చూశాడు !
చిరునవ్వు నవ్వింది జానకి.
తెలివైన భార్య తోడుగా వున్న తన జీవితం పూలబాట కాబోతుందన్న నమ్మకం తో ..
హాయిగా నవ్వుతూ “అలాగే ” అన్నాడు చిన్నారావు !