Home కవితలు అమ్మ నన్ను మన్నించు

అమ్మ నన్ను మన్నించు

by Madhukar Vaidyula

నీ చీకటి గర్భంలో నవమాసాలు మోసి
నీ రక్తధారలను పాలుగా పంచి
కని పెంచి పెద్ద చేసినా నీ జీవితాన్ని
చీకటిమయం చేసిన రాక్షసత్వాన్ని
నీ పెద్ద మనసుతో మన్నించు…..

కొడుకు పుట్టాడని ఆనందంతో మురిసి
తన చివరి మజిలీలో గుండెల్లో పెట్టుకొని
అమ్మ రుణం తీర్చుకుంటాడనుకున్నవాడు
మృగంగా మారుతాడనుకోని ఆ తల్లి
మాతృ హృదయాన్ని మన్నించు…

అమ్మవై, అక్కవై, చెల్లివై, అర్ధాంగివై
సర్వ దేవతల ప్రతిరూపమైన నిన్ను
నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి
పశువాంఛను తీర్చుకున్న
మగజాతి మృగత్వాన్ని మన్నించు…

ఎక్కడ ఏం జరిగినా నాకెందుకులే
నేను, నా వాళ్ళు, నా సుఖం అంటూ
కళ్ళు మూసుకుని కదిలిపోయే
చైతన్యం లేని చేతకాని సమాజ
నపుంసకత్వాన్ని మన్నించు…

జన్మనిచ్చిన తల్లి రుణాన్ని
రాఖీ కట్టిన చెల్లి శీలాన్ని
పక్క పంచిన సతీ ప్రాణాన్ని
రక్షించుకోలేని మా మగజాతి
ప‌రికిత‌నాన్నిమన్నించు…

You may also like

Leave a Comment