Home కథలు అవసరం

అవసరం

by Rama Devi Nellutla

ఆమె మళ్ళీ రావడం కనిపించింది .
ఎప్పట్లాగే భుజానికో బ్యాగు తగిలించుకుని , కుడి చేత్తో ఆ పెద్దావిడ చేయి పట్టుకుని నడిపిస్తూ నెమ్మదిగా లోపలికి వచ్చింది .చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఆ ముసలామెను కస్టమర్స్ లాంజ్ లోని కుర్చీలో కూర్చోబెట్టింది .
ఆవిడ కూర్చున్నాక తన భుజానికున్న బాగ్ లోనించి నీళ్ల సీసా బయటికి తీసి మూత తీసి పదిలంగా ఆమె నోటికి అందించింది . పెద్దావిడ వద్దన్నట్టుగా తల తిప్పింది . అయినా వదలకుండా బుజ్జగిస్తున్నట్టుగా ముసలామెతో కొన్ని మంచినీళ్లు తాగించింది .
ఆ తరువాత స్టాండ్ దగ్గరికి వెళ్లి ఒక విత్ డ్రా ఫామ్ తీసుకుని ఏదో రాసింది . పెద్దావిడ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పి ఆవిడతో పెన్ను పట్టించి చిన్న పిల్లలతో అక్షరాలు దిద్దించినట్టుగా జాగ్రత్తగా సంతకం చేయించింది . మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్లి పాస్ బుక్ తో బాటు వోచర్ ఇచ్చి పెద్దావిడను చూపిస్తూ ఏదో చెప్పింది .
వాళ్ళూ నవ్వుతూ పలకరించి ఏదో అంటున్నారు . టోకెన్ తీసుకుని కాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది . క్యాషియర్ నవ్వుతూ డబ్బులు లెక్కబెట్టి ఇచ్చాడు . ఆమె కూడా చిరునవ్వుతో మాట్లాడుతోంది .
నేను ఈ బ్రాంచ్ కి మేనేజర్ గా వచ్చిన గత అయిదు నెలలుగా చూస్తున్నాను , ప్రతీ నెలా ఆఖరి వారం లోనే ఆమె బ్యాంక్ కి వస్తుంది . అది కూడా ఉదయం బ్యాంకు తెరచిన అయిదు నిముషాల్లోపే వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్తుంది . ఆ రోజుల్లో .. అందునా ఆ టైం లో అయితే రష్ ఉండదని కాబోలు !
ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది . ఎందుకో తెలీదు గానీ ఆమెను చూస్తూంటే ఎంతో ఆత్మీయురాలనిపిస్తుంది . సౌమ్యంగా , నెమ్మదిగా తన పని చేసుకువెళ్తుంది . ఆమె రాగానే మా స్టాఫ్ కూడా ఎంతో బాగా పలకరించడం , గబగబా ఆమెకు పనులు చేసి పెట్టడం నేను గమనించాను .’ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు ‘ , ఇదే కాబోలు !
ఇవాళ రిలీజ్ చేయాల్సిన ఒక లోన్ గురించి ఫీల్డ్ ఆఫీసర్ తో చెబుదామని నా కేబిన్ లోంచి బయటికి వస్తూంటే ఆమె తన చేత్తో ఆ ముసలావిడను పట్టుకుని నడిపించుకుని వెళ్తూ కనపడింది .
” నమస్తే మేడమ్ !” చక్కటి చిరునవ్వుతో కుడి అరచేయి ఛాతీకి ఆనించి తల కొద్దిగా వంచి విష్ చేసింది .
” నమస్తే ! మీ అమ్మగారా ?” పెద్దావిడ వైపు చూస్తూ అడిగాను . చిన్న పిల్లను పట్టుకుని నడిపించినట్టు ఆమె ఎంతో అపురూపంగా ఎడమ చేత్తో ఆమెను పొదివి పట్టుకుని తీసుకువెళ్తూంది .
” లేదండీ , మా అత్తగారు !” అంది ఆమె అదే వినయంతో .
ఆశ్చర్యపోవడం నా వంతయింది .
వాళ్ళు నెమ్మదిగా బయటికి వెళ్ళగానే , ఓ ఆటో వచ్చి ఆగింది . ముందే ఆటో అతన్ని పోనూ రానూ మాట్లాడుకున్నట్టున్నారు . ముందు జాగ్రత్తగా అత్తగారిని ఎక్కించి ఆ తరువాత తాను వెనకాల నుండి తిరిగి వచ్చి అటుపక్కనుండి ఎక్కిందామె . ఆటో కదిలింది . ‘ ఎంత జాగ్రత్త !’ అనుకుంటూ అటే చూస్తూ ఉండిపోయాను .
********
ఎట్టకేలకు ఆ ఇల్లు దొరకపట్టగలిగాను . అతని కోసం దాదాపు నెల రోజుల్నించి తిరుగుతున్నాను. కుమార్ అనే అతను వీడియో కెమెరాకు లోన్ తీసుకున్నాడు బ్యాంక్ నుండి . పెళ్లిళ్లకు, పుట్టిన్రోజులకు , ఇతర ఫంక్షన్లకు వెళ్తూ సంపాదించుకుని తక్కువ మొత్తంతో ఎక్కువ ఇన్ స్టాల్ మెంట్స్ లో మూడేళ్ళలో కట్టుకునేలాగా ఏర్పాటు చేశారు మా బ్యాంకు వాళ్ళు .
మొదట్లో ఒకట్రెండు నెలలు సరిగానే కట్టినట్టున్నాడు . ఆ తరువాత నుండీ ఏమీ చెల్లింపులు లేవు . నేను ఈ బ్రాంచ్ లో మేనేజర్ గా చేరిన కొద్ది రోజులకే అతని లోన్ ఖాతా మొండి బకాయిగా సిస్టమ్ లో కనపడుతోంది .
సహజంగా నేను చిన్నదైనా , పెద్దదైనా లోన్ రికవరీ కోసం ఒకట్రెండు సార్లు ఫోన్ చేసినా ఫలితం ఉండకపోతేనే ఇంటికో , పని చేసే చోటికో , షాపుకో వెళ్తాను . పైగా లోన్ ఇచ్చినప్పుడు మధ్య మధ్య యూనిట్ చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది .
ఈ కుమార్ అనే అతను అస్సలు దొరకలేదు . ఇప్పటికి మూడిళ్లు మార్చాడు . ఎలాగో ఆచూకీ తీసి దొరకపట్టాను . తీరా చూస్తే ఇంట్లో ఘోరమైన పరిస్థితి ! అతడు ఇంట్లో లేడు , ఏ రాత్రికో బాగా తాగి వస్తాడట . మొదట్లో ఎవరో వీడియో గ్రాఫర్స్ దగ్గర పనిచేసినప్పుడు బాగానే డబ్బులు వచ్చేవట . అయితే తాగుడు ఎక్కువై ఇంట్లోకి డబ్బులేమీ ఇవ్వకపోగా రెండు లక్షల విలువైన ఆ వీడియో కెమెరా కూడా కుదువబెట్టి మరీ తాగేవాడట .
ఇప్పుడు ఆ కెమెరా కూడా ఉందో అమ్మేశాడో తెలీదు , ఎక్కడా పెద్దగా షూటింగ్స్ కూడా ఉన్నట్టు లేదని అతని భార్య ఏడుస్తూ చెప్పింది . ఆమె షిఫ్ట్ పద్ధతిలో ఏదో మాల్ లో పని చేసి తెచ్చే డబ్బులే ఇంటికి ఆధారమట . తల్లికి వచ్చే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా బెదిరించి తీసుకుంటాడట . లోన్ కట్టమని అతని భార్యని అడగలేక పోయినా , అతను ఇంట్లో ఉండే టైంకు వస్తానని ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని బయటికి వచ్చాను .
” నమస్తే మేడమ్ ! ఏంటి ఇలా వచ్చారు ?” పలుకరింపుతో స్కూటీ స్టార్ట్ చేస్తున్న నేను అటు చూసాను . రెగ్యులర్ గా వాళ్ళ అత్తగారిని తీసుకుని బ్యాంక్ కి వచ్చే ఆమె నవ్వుతూ పలుకరిస్తోంది .
” ఓ ! మీ ఇల్లు ఇక్కడేనా ?” అడిగాను . కూరగాయల బండి దగ్గర కూరలు కొన్నట్టుంది , చేతిలోని బుట్టలో కూరగాయలున్నాయి .
” ఆ రెండో ఇల్లే , మీకు ..ఇక్కడ తెలిసినవాళ్లున్నారా ?”
” కస్టమర్లందరూ మా చుట్టాలూ , ఫ్రెండ్సే కదా ! ఒక లోన్ రికవరీ కోసం వచ్చా !” చెప్పాను .
” మీరు కూడా తిరగాల్సిందేనా మేడమ్ ! మీ ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళరా ?” అడిగిందామె .
” వెళ్తారు , నేను కూడా రావాల్సి ఉంటుంది ”
” ఇంత దూరం వచ్చారు కదా , మా ఇంటికి రండి మేడమ్ , ఆ కన్పించేదే ”
” అయ్యయ్యో , వద్దు లెండి ” అన్నానే కానీ .. ఆమె ద్వారా ఈ కుమార్ ఉన్నప్పుడు తెల్సుకుని రావచ్చనీ , ఈమెతో టచ్ లో ఉంటే మంచిదనీ వెళ్లాను .
చిన్న ఇల్లే కానీ శుభ్రంగా బావుంది . ” అత్తయ్యా ‘ ఇదిగో , మనింటికి బాంక్ మేనేజర్ గారొచ్చారు ” అంటూనే ముందు రూమ్ లో ఆగిపోయిన నన్ను చూసి ” లోపలికి రండి !” అంటూ తీసుకెళ్లింది . పెద్దావిడ అప్పటి దాకా టీవీ చూస్తున్నట్టుంది , నన్ను చూడగానే ఆఫ్ చేసింది .
“ మీ కోసం రెండు రకాల ఆకు కూరలు తీసుకున్నాను . మీకిష్టమని మునక్కాయలు కొన్నాను . ” అంటూనే ” అయ్యో , ఇదేంటీ , ఈ పళ్ళ ముక్కల్ని ఇలా వదిలేశారు ?” అంటూ అత్తగారిని అడిగిందామె .
” చాలా ఇచ్చావు , కొన్ని తిన్నానులే .. అవన్నీ నేను తినలేను ” అంది పెద్దావిడ .
” ఈ మాత్రం తినకపోతే ఎలా ? పళ్ళు బాగా తినాలని డాక్టర్ చెప్పలేదూ ! ” అంటూ ప్రేమగా మందలిస్తూనే కాస్త పైకి పోయిన పెద్దామె చీరను కిందికి జరిపి కాళ్ళు కన్పించకుండా సవరించడం నా దృష్టిని దాటి పోలేదు .
” నీ ఆరాటం గానీ , పోయిన వయసూ , ఆరోగ్యం మళ్ళీ వస్తాయా ? సరే గానీ వారికి కాఫీ ఇవ్వు !” అంది అత్తగారు .
” అయ్యయ్యో ! ఇప్పుడేమీ వద్దండీ ! నేను మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళాలి ” అన్నాను .
ఆమె అప్పటికే కిచెన్ లోకి వెళ్లనే వెళ్ళింది .
” మీ ఆరోగ్యం బాగుందా ?” అన్నాను నేను ఏం మాట్లాడాలో తెలీక .
” నా కోడలుండగా నాకేం లోటమ్మా ! నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది . నా కన్న తల్లి కన్నా ఎక్కువ . నా కూతురు కూడా ఇంత బాగా చూసుకునేదో లేదో ! అయినా వయసై పోయాక ఏముందమ్మా , ఆ పై వాడి పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్లిపోవడమే !” అంది .
” అదిగో ! హాస్యానికైనా ఆ మాట అనొద్దన్నానా !” ఎప్పుడు వచ్చిందో కోడలు .. కాఫీ తీసుకొచ్చింది .
” మీకు కాఫీ ఇవ్వనా ?” అత్తగారిని అడిగింది .
” ఇప్పుడొద్దు లేమ్మా , ఇందాకేగా తాగాను ” అంది పెద్దావిడ .
కాఫీ బాగుంది , మంచి రిలీఫ్ ఇచ్చింది . దానికన్నా ముందు ఆ అత్తా కోడళ్ల అనుబంధం నచ్చింది .
ఏ మాత్రం తెచ్చిపెట్టుకున్నట్టుగా లేకుండా , చాలా సహజంగా .. నటనేమీ లేకుండా , ప్రేమగా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడ ముచ్చటగా ఉంది .
నేను బయల్దేరి వస్తుంటే ఆమె మర్యాద కోసం బయటి దాకా వచ్చింది .
” నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తూంటే ! నిజంగా ఈ రోజుల్లో ఇంత అన్యోన్యంగా ఉండే అత్తా కోడళ్ళు అరుదు . ముఖ్యంగా ఆవిడ్ని కన్న తల్లిలా చూసుకుంటున్నందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి ” అన్నాను మనస్ఫూర్తిగా .
” చూసుకోవాలి , తప్పదు .. అవసరం !” అందామె అదో రకంగా .
” అదేంటీ ?” అన్నాను నేను ఆశ్చర్యపోతూ .
” అదంతే ! మా మామగారు స్వాతంత్ర్య సమర యోధులు , ఆయన పెన్షన్ ముప్పై వేలు మా అత్తయ్యకు వస్తుంది .”
” అది సహజమే కదా !” అన్నాను అయోమయంగా .
” అదే మాకు ఇల్లు గడవడానికి ఆధారం . ఆ పెన్షన్ ఆవిడ ఉన్నన్నాళ్ళేగా వచ్చేది . అందుకని ఆమె ఆరోగ్యంగా , ఆనందంగా చాలా ఏళ్ల పాటు ఉండడం మాకు తప్పనిసరి .”
” అది సరే ! బెదిరించో , బ్లాక్ మెయిల్ చేసో పెద్దవాళ్ళ పెన్షన్ లాక్కునే వాళ్ళున్న రోజుల్లో మీరు చాలా ప్రేమగా చూసుకోవడం గొప్ప విషయమే కదా !”
” నాకు మొదట్నుంచీ ఆవిడంటే గౌరవమే , ఇష్టమే ! అత్తయ్య కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు . రానురానూ నాక్కూడా ఆమెను వదిలి ఎటూ వెళ్లాలనిపించదు . నా అమ్మ కన్నా ఆమెనే ఎక్కువ ఇష్టపడ్తాను . కాకపోతే హైదరాబాద్ లో ఉన్న మా ఆడపడుచు అడపా దడపా తీసుకెళ్లి రెండు మూడు నెలలు ఉంచుకుని పంపిస్తూండేది . తను కూడా మా అత్తయ్యను బాగా చూసుకుంటుంది ”
” మరి .. సమస్యేమిటి ?” నాకు అవసరమా కాదా అని ఆలోచించకుండా కుతూహలంతో అడిగాను , మనుషులు ఇంత ప్రేమల్తో ఉన్నా ఇబ్బందేమిటో అనుకుంటూ .
” మధ్య తరగతి మనుషుల సంగతి మీకు తెలియనిదేముంది ? మా అత్తయ్య అక్కడున్నన్నాళ్ళూ పెన్షన్ డ్రా చేయడానికి కుదరదు . మేము వెళ్లి అడగలేము .ఆ డబ్బు లేకపోతే ఇల్లు గడవదు . అందుకే తాను అక్కడికి వెళ్లకుండా ..ఎప్పుడైనా కూతురే వచ్చి నాల్రోజులు ఉండి వెళ్తే సరి .. అని మా అత్తయ్యకే అనిపించేలా చూసుకుంటాను ” శుష్క హాసం ఆమె పెదవులపై !
” మరి మీ వారు ?” ఏం చేస్తారు అని అడగలేక సగం లో వదిలేసాను .
” డిగ్రీ దాకా చదివారు . ఏ పనీ స్థిరంగా చేయరు . కుదురు ఉండదు , బద్ధకం ఎక్కువ . గొప్పలకు పోయి అప్పులు చేస్తారు . ప్రైవేట్ జాబ్స్ ఎన్నో చేసి మానేశారు . దేంట్లోనూ మూడ్నెల్లకు మించి పని చేయరు . అసలు ఎప్పుడు మానేసింది కూడా ఇంట్లో చెప్పరు . పూర్తిగా చెడ్డవాడని కాదు కానీ .. ఆ మనిషి మీద ఆధారపడి బతకలేం ”
“మా మామగారికి ఫ్రీడమ్ ఫైటర్ కోటా లో ఐదెకరాల భూమి ఇచ్చారు . సిటీ శివార్లలో ఉన్న ఆ భూమికి ఇప్పుడైతే మంచి రేటు వచ్చేది . కానీ ఎనిమిదేళ్ల క్రితమే ఆ భూమిని అమ్మి అడ్వాన్స్ తీసుకున్నారు మా ఆయన . ఇక కొడుక్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ దగ్గర పరువు పోతుందని మా అత్తయ్య సంతకం పెట్టారు . నేనూ ఆవిడా కల్సి మిగతా డబ్బులు మేమే తీసుకుని ఆవిడ పేరుతో ఈ ఇల్లు కొన్నాం . మాకు ఒక్కర్తే అమ్మాయి. మిగిలిన డబ్బుల్తో మా అమ్మాయి పెళ్లి చేసాం . ”
” మరి ..మీరు …ఏదైనా చేయొచ్చు కదా !”
ఆమె ఓ క్షణం ఆగింది . ” నేను ఎమ్మే బీ ఎడ్ చేసి జాబ్ వెతుక్కుంటుండగా పెళ్లి అయి ఇక్కడికి వచ్చాను . చాలా ఏళ్ళు ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేసాను . మా అమ్మాయి పెళ్లి ముందు నాకు కాన్సర్ వచ్చింది .మాస్ట్రక్టమీ చేశారు . ఆ తరువాత మా అత్తయ్య , మా ఆయనా ..నన్ను జాబ్ చేయనివ్వట్లేదు .”
” మీరు ప్రతి సారీ బ్యాంక్ కి వచ్చే బదులు ఏటీఎం కార్డు తీసుకోవచ్చుగా !”
” అదీ అయింది . మా అత్తయ్య కొచ్చే ముప్పై వేల పెన్షన్ లో పదిహేను వేలతో ఇల్లు గడుపుతాను . ఏవన్నా పండుగలూ , పబ్బాలో , చుట్టాలు రావడమో జరిగితే మరో అయిదు వేలు .అంతే ! మిగతా డబ్బులు అలా ఖాతాలోనే ఉన్నాయనుకునే వాళ్ళం . ఈయన ఏటీఎం కార్డు తో ఎప్పటికప్పుడు మొత్తం డ్రా చేసాడని ఓ సారి లైఫ్ సర్టిఫికెట్ కోసం బ్యాంకు కు వెళితే తెలిసింది .ఇక కార్డ్ సరండర్ చేసి మేమే వెళ్లి తెచ్చుకుంటున్నాం . మిగతా డబ్బులు మూడు , నాలుగు నెలలు కాగానే మా అత్తయ్య పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ చేస్తాం . నామినేషన్ నా పేరిటే ఉంటుంది . ఆవిడ తదనంతరం మాకు కావాలిగా !” గొంతు వణికినట్లనిపించింది .
లోపలికి చూసాను , పెద్దావిడ ఏదో చదువుకుంటోంది . ఆమె ముఖంలో నిశ్చిoత , సంతృప్తి !
” ఏదేమైనా … మీరు ఆవిడ్ని ఇంత అపురూపంగా చూసుకోవడం చాలా సంతోషం ! మిమ్మల్ని మెచ్చుకోవాలి ” మనస్ఫూర్తిగా అన్నాను .
” మీరలా అనకండి . నాకు చాలా గిల్టీగా ఉంటుంది . నేను చేసేది త్యాగమూ కాదు , చూపేది అనురాగమూ కాదు . కేవలం స్వార్థం , అవసరం అనాలి ! ఆవిడ లేని రోజున మేము వీధిలో పడతాం . నా మందులకు కూడా డబ్బులుండవు . ఆవిడ జీవితం చాలా ఏళ్ళు పొడిగించాలి , అందుకోసం ఆవిడ ఆరోగ్యంగా , ఆనందంగా ఉండాలి . మా అత్తయ్యని కాపాడుకోవడమే నా ఉద్యోగం అని అర్థం చేసుకున్నాను గనకే ఆవిడని బాగా చూసుకుంటున్నాను . ప్రేమ , గౌరవం లేవని కాదు . ఈ డబ్బులే లేకపోతే మాకు ఎంత ప్రేముంటే ఏముంది చెప్పండి ?” నీటితో నిండిన ఆమె కళ్ళు మరెన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాయి .
“మీ ఆరోగ్యం జాగ్రత్త ! మీ అవసరం ఆవిడకు చాలా ఉంది .” అని వచ్చేసాను .

You may also like

Leave a Comment