కవితైనా కథైనా
ఎక్కడి నుంచి పుడుతుందసలు?
నీ చుట్టూ వెచ్చగా పరుచుకున్న
నిశ్శబ్దం చిట్లి
నువ్వో కవితవుతావు
గుండెల మీద
ప్రేమగా చెక్కుకున్న పేరొకటి
చీకట్లోకి ఎగిరిపోయాక
నేనొక పాటవుతాను
కన్నీటిమంటల్లో దగ్ధమవుతూ
ఎవరో ఒక కథవుతారు
అందమైన చెట్ల మీద
అక్షరాలు వాలవు
నిజానికి అవి
చెల్లాచెదురైన లోయల్లో మొలకెత్తుతాయి
నలిగిన కాలిబాట పక్కన
సగం చితికిన గడ్డిమొక్కలకు పూస్తాయి
రంపాలతో తలలను కోసి
దుంగలుగా తరలించుకుపోయిన
చెట్ల పాదాలకు కాస్తాయి
ఏ ఎండుకొమ్మలకో చిక్కుకుని
మనసు గాలిపటం చిరిగిపోతుంది
గాలి వీచినపుడల్లా సలపరించే గాయాలు
కొన్నాళ్ళకు అక్షరాలవుతాయి
కెరటాలు తలలు బాదుకునే
రాళ్లన్నీ
శిల్పాలు కావు
ఎగిరే రంగులన్నీ
సీతాకోకచిలుకలనుకోవడానికి లేదు
ముట్టుకొని చూస్తే తప్ప
అసలు గుట్టు తెలీదు
చూపు విస్తరిస్తున్నకొద్దీ
నీ మరుగుజ్జుతనం నీకు తెలిసొస్తుంది
ఒక దిగంతం తర్వాత
మళ్ళీ ఒక బూడిద రంగు ఆకాశం
దానికిందొక నీడరంగు నేలా
కమిలిన చర్మంరంగు జీవితాలూ వుంటాయి
చూసిందే రాసుకుంటూపోతే కుదరదు
ఆవలివైపు నుండి చూస్తేనే
ప్రపంచం అసలు రంగు తెలుస్తుంది