మనసు గదులు మూసుకుపోయాక
ఒంటరిగా గదిలో బందీ కావడమే బాగుంటుందా?
హృదయం తో పనిలేకుండా నామ్ కె వాస్తే గా జమీన్ ఆస్మా ఫరక్ తో సాగిపోతున్న దైనందికావసరాలు దేహ ప్రాణాల్ని నిలుపుతూనే ఉంటాయి
ప్రేమ పాశం తో మనసు గెల్చుకోవడమన్న యుద్ధనీతి
ఇప్పుడు పాతదై పనికి రాకుండా పోవడం విషాదం కాదా ?
ఎల్లలు దాటిన స్వార్థాన్నోదిలి ఒక్కసారైనా తనవైపు
దృష్టి సారించమంటూ పోరుతోంది ధర్మం …
అంతుపట్టని అంతర్ముఖీనత తో
అంతేలేని అహంభావం తో దగ్ధం కావడం …
సెగలు పొగల్ని పంచడం కాదు జీవితమంటే ..!
శతాబ్దాలుగా రగిలిపోతూ …
ఇంకా మిగిలిన అహం శకలాల మధ్య
కమ్ముకున్న పొగచూరిన భావజాల గోడలు
మరింత భ్రష్టుపట్టి పోకముందే వెల్లవేసుకొని
తెల్లబరుచు కోవాల్సిన సమయం ఆసన్నమైందిక..!
-డాక్టర్ వాణీ దేవులపల్లి
9866962414