ఎందరో పుడుతున్నరు
కాలంలో కలిసిపోతున్నరు
కొందరు మాత్రం
చెరిగిపోనంత ప్రభావంతో
చెరపలేనంత ప్రజ్ఞానంతో
కాలం పై తమ ముద్రని
మిగిల్చి పోతరు….
తామే ఓ చరిత్ర అయి
చరిత్రలో నిల్చిపోతరు
కొందరికి పుట్టుకే పండగ
కొందరికి చావే పండగ
రెండింటి మధ్యలోని
సార్థక జీవనమే నిన్నైనా
నన్నైనా చరిత్రలో నిలబెట్టేది
రాముడు దేవుడయ్యాడు
ధర్మ జీవనం వల్లనే
రాణా ప్రతాప్ వీరుడయ్యాడు
కర్మ జీవనం వల్లనే
ఓ శివాజీ… ఓ భగత్ సింగ్
ఒక్కొక్కరిది ఓ త్యాగమయం
ఒక్కొక్కరిది ఒక్కో జీవనముద్ర
చరిత్రలో నిలిచిపోయారు
వారి వారసత్వమే మనదీ
వారి ఆత్మతత్వమే మనదీ
ఆ అమరుల ఆత్మలన్ని
140 కోట్ల నా దేశవాసుల్ని
ఆవహించుగాక..