ఎప్పుడేం చేయాలో
ఎవరికేం జరగాలో నీకె తెలుసు
ఎక్కడో నువ్వుంటావు
తలరాతలు రాస్తుంటావు
తలరాతలు మారుస్తుంటావు
అందలాలు ఎక్కిస్తావూ
అంతలోనే పడదోస్తావూ
ఎక్కడుంటావో….
ఎలా ఉంటావో…
ఏమై ఉంటావో…..
ఎవరో నువ్వు…
నీకు దేవుడని పేరా….
ఊహాతీత శక్తివో…
ఎరుగలేము కదా…..
ఆనందలోకాల్లో విహరింపజేస్తావు
కల్లోల దుఃఖసాగరంలో ముంచేస్తావు
అనుబంధాల బంధాలలో
స్వేచ్చ నీదేనంటావు
బాధ్యతల జాడలలో బందీని చేస్తావు
ఒకే మనిషిలో….
మానవతను..దానవతను
ఒకే నాణేనికి బొమ్మా బొరుసుల్లా
ఎలా చిత్రిస్తావో
తరాలు మారుస్తావు
అంతరాల చింత పేర్చుతావు
‘నేను’ అనే
అహంకారం రగిలిస్తావు
అధికుడనని శాసించేలా
గర్వాన్ని ఎగదోస్తావు
క్షణంలో…
అహాన్ని… గర్వాన్ని అణగద్రొక్కుతావు….
నిన్ను మించిన ‘నియంత’ ఎవరు?
నియంత్రకుడెవరు?
అందాల నందనవనాలు…
మురికికూపాలు
అందమైన ఆకాశాన్నంటే కోటలు
విలాసాల మునిగితేలే జీవితాలు
బిత్తరచూపులు చూసె పూరిగుడిసెల బతుకులు
పక్కపక్కనే ఉండేలా అమరుస్తావు
నువ్వెంత ‘నిర్మాణచతురడవో’
కొన ఊపిరితో కొట్టుమిట్టాడే మనిషిని బతికిస్తావ్
అన్నీ బాగున్నా…అంతా బాగున్నా
మరో మనిషి ఉసురులు అర్థాంతరంగా
ఎక్కడకో కానరాని లోకాలకు తరలిస్తావు
నీవెంత గొప్ప దర్శకుడివో….
అందరితో..అన్ని పాత్రలతో
నీకు నచ్చినట్లు ఆడిస్తావు .. ఆడుకుంటావు
జీవితరంగస్థలిలో…
ప్రతి ఒక్కరూ
నీ చేతిలో కీలుబొమ్మలు
మరబొమ్మలు
ఎవరు నువ్వు?
ఏమై ఉంటావు?
ఎక్కడుంటావు?
ఎప్పుడూ కనిపించలేదు?
మందిరంలో ఉంటావా?
మసీదులో ఉంటావా?
ప్రార్థనాలయంలోనా?
ఆరామాల్లోనా?
ఎక్కడ నీ నెలవు?