పల్లవి: ఎవరు పాడుతారీపాటనీ
బాలుపై చెక్కిన ఈ గీతికనీ
బాలు… చిన్న బాలు… పెద్ద బాలు
పాటల చక్రవర్తే మన బాలు
చరణం 1: ఏ పాటలో ఇమడని మనిషి
సాకీలక్కరలేని సాయుధుడు
పల్లవీలతో పనిలేని గాయకుడు
చరణాల ఆభరణాలు లేనివాడు -పల్లవి
చరణం 2: వేల పల్లవులకి ప్రాణం పోసాడు
లక్షలని మించి చరణాల్నికదిపాడు
ఏకదాటి శ్వాసలో… బహుశ్వాసలతో
మన చెవుల్లోకి అమృతమూదాడు -పల్లవి
చరణం 3: నిద్రపోని బాలు స్వరం
నిత్యమూ పాడుతూనే ఉంటుంది
ఇళ్ళల్లో… మురికివాడల్లో…
దేశ సరిహద్దుల్లో… విదేశాల్లో
రాత్రనకా… పగలనకా… -పల్లవి
చరణం 4: మర్యాద రామన్నతో తొలి అడుగు
పదహారు భాషల్లో బహురూపి
పాడుతా తీయగాతో పరమాన్నం
స్వరాభిషేకంతో పాట సర్వస్వం -పల్లవి
చరణం 5: తడబడే పెదిమలతో పలికిన
సరిగమపదనిసల ఎక్స్ రే తీసాడు
సర్జరీలు చేసి చిన్నారులతో పలికించాడు
వారసత్వ సంపదలని మనకు వదిలాడు -పల్లవి
చరణం 6: చితిమంటలు తాకని శరీరం
కళ్ళముందే కరిగిపోవడాన్ని తట్టుకోం
మూడు మజిలీలతో అందరికీ కనిపించి
మట్టివస్త్రాలని కప్పుకొంటూ
భూమాత ఒడిలోకి ఒదిగిపోయాడు
మన కళ్ళముందే కనుమరుగైయ్యాడు -పల్లవి
చరణం 7: తొమ్మిదినెలలు శకుంతలమ్మ గర్భంలో
భూమిపై ఉన్నంతకాలం “బాలు”గానే
పాటలప్రియులని మురిపించాడు
సులోచనాలతో సుధీర్గ నిద్రలోకి
మరో తల్లి ఒడిలోకి ఒదిగిపోయాడు -పల్లవి
చరణం 8: పాటలో ఇమడని పండితారాధ్యుడు
పల్లవిలో పట్టని గంధర్వుడు
చరణాలు సరిపోని చతురుడు
భౌతికంగా కనబడని విద్వాంసుడు
పాటలని మాకు వదిలివెళ్ళిన పరమాత్ముడు -పల్లవి
ఈ పాట బాలుగారికి అంకితం. పాట నచ్చిన సంగీత దర్శకులెవరైనా ప్రాణంపోస్తే బాలుగారు తప్పక వింటారేమో!