1 — సరిగమ పరిమళము నెరిగి
సరిసరి నటనలకు తగిన
సరసత పెంచెన్
నిరతము సుస్వర మధురిమ
పరిపరి విధముల పంచిన
బాలున్ దలతున్
2 — గళమున మధు స్వరాళిని
గలిగి చిలికి నవరసాల
కమ్మగ నొలికెన్
ఇలలో పాడుత-తీయగ
ఎలమిని నేర్పిన మెలపులు
యేపుగ మెరిసెన్
3 — మరిమరి ముసిముసి నగవుల
సరి జేయుచును దొసగులను
సౌమ్యత దిద్దెన్
అర విరిసిన సరిగమలను
పసి గళముల పరచినట్టి
బాలున్ దలతున్
4 — సరిగమ పదనిస గమ్యము
నెరుగుచు సుగీత నినదము
నిటు నటు తేల్చెన్
సురుచిర మృదుపద సంపద
మెరుపుల రస భావఝరి
దుమికి భువి తరలెన్
5 — సరిసరి పదముల గలగల
ఝరి సరి గతులను గళమున
జలజల రాల్చెన్
పరిపరి విధముల జనములు
మరిమరి మురిసిరి యెదలను
మరతురె బాలున్
———-×——–
3 comments
శ్రీ యుగంధర్ గారు బాలు గారిని లలతలఘుపదములతో ఆత్మీయంగా మాకందరసవంతంగా స్మరింపజేశారు. అభినందనలు.
సర్వ లఘు కందాలను అందంగా తీర్చిదిద్దిన బొబ్బిలి యుగంధర్ గారికి అభినందనలు. ప్రశంసలు.
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగు వీనుల విందుకు పొందిన పేరు. తన గానపరిమళ వీచికలతో సినీ యువజంటల దేహ హావభావాలను మరింతగా మోహనపరిష్వంగంలో నిలిపి రెస్ట్ ను అరెస్ట్ చేసిన గిలిగింతల పులకింతల పుంతల శకుంతగాన పుంస్కోకిల. “పాడుతా తీయగా” కార్యక్రమం ద్వారా ఎందరినో ప్రోత్సాహపరచి బ్రతుకుదెరువుకు ఊతమిచ్చిన మహోపకార శీలి. కను మరుగయ్యేనాటి వరకు నిలువెల్లా గానమధురిమతో తొలగి కులికి శ్రోతల తలలూపించి పరవశింపజేసిన మన ఘన అందాల నిండుబొజ్జ మధుర మృదుహౕసాల మగపాటగాడు. గాన పుంస్కోకిల. గాన గంధర్వ బిరుదాంకితుడు. వారి గాన నైపుణ్యాన్ని గురించి పంచప్రాణాల వంటి పంచరత్నాలను సర్వ లఘు కందాలుగా రచించి అందించిన బొబ్బిలి యుగంధర్ గారు అభినందనీయుడు.ప్రశంసనీయుడు.