Home కవితలు ఒకరి ఆకలికిమరోకరి ఇష్టమే ఆహారంగా

ఒకరి ఆకలికిమరోకరి ఇష్టమే ఆహారంగా

by Chandaluri Narayana Rao

రాత్రయింది అంటే
ఓ రోజు బతుకు ఖాతాలో
జమైనట్లే…

రెండు జతల
గాజుకళ్ళు, ఓటికాళ్ళు
వయసును భుజానవేసుకుని

మంచం కొండనెక్కుతూ
రేపు ఉదయం ఇద్దరిదో?
ఇద్దరిలో ఏ ఒక్కరిదో?

అన్న నడుము వంగిన ప్రశ్న
దిగులు భయంతో
బిక్కు బిక్కుమంటూ

అవకాశం దొరికనప్పుడల్లా
దేహాన్ని తట్టే బాధకు
చులకనయ్యే ఓపికతో

పండిన అనుభవంలో
ఒకరి ఆకలికి
మరోకరి ఇష్టమే ఆహారంగా

బతుకులో
ఒంటరితనం లేకుండా
ఏకాంతానందం సొంతమైనా

వృద్దాప్యంలో ఏదో ఒక రోజు
ఒకరి మరణం
మరొకరికి నరకమనే

సత్యానికి రెపరెపలాడే జీవులు
ఆఖరిరోజుకూ
ప్రేమతో ప్రాణంపోసే ధన్యులు.

( తొంభై ఏళ్లకు దగ్గరౌతున్న ప్రేమ అనే ఔషధంతో ఉత్తమదంపతులైన
నా వృద్ధ తల్లిదండ్రుల జీవితాన్ని చూస్తూ, వారి  పాదాలకు కవితను అంకితం చేస్తూ…..)

You may also like

Leave a Comment