Home కవితలు ఒక్క సంతకం

ఒక్క సంతకం

by Gortivani Srinivas

ఆ వలపు నావలెందుకోమరి
గెలుపు తీరం చేరకున్నాయి!
స్వాభిమానాలతో
సజల నయనాలతో
ఓటమి దీవులకేసి
వెను తిరుగుతున్నాయి!
అనుబంధాల తెరచాప చిరిగి
ఆత్మగౌరవ చుక్కాని విరిగి !

అహం త్రాసులో
తూగుతూ నిరాశా నిస్పృహలు!
అపార్ధాల గాలి వానకు
తునాతునకలై మనోకుసుమాలు!

కన్న పేగుల్ని కానివాళ్లుగా
నిలబెట్టిన కఠిన నిర్ణయాలు
న్యాయస్థానాలు నివ్వెరపోయే
బంధ విమోచన సంతకాలు !

ఎప్పుడో ఎద గోపురంపై వాలిన
ప్రేమ పావురాళ్ళకిప్పుడు
ఆ చల్లని గూడే
నిప్పులగుండమైతే?!

నిర్ణయలోపమైతేనేమి
నిస్సహాయతైతేనేమి
కాలం కాటుకు పచ్చని చెట్లకు
ఆకులే బరువైన చందం
శిశిరాన్ని మోస్తున్న బంధం!

సంసార గోడల్ని బీటలు వారనీక
ఒకరుండి ఇంకొకరులేని లోటు
పాపం పసివాళ్ళకు
సంక్రమింపచేసేది
ఆ ఒక్కసంతకమే అయితే..!?

మరొక్కమారు
సమస్యల కోణాల్ని తరచి
సహృదయ ద్వారాల్ని తెరచి
సానుకూలతో యోచించితే
సహనంతో గమించితే

సమాజ వేదికపై
సగర్వమై చాటదా వివాహవ్యవస్థ !
తాను  విచ్ఛిన్న బంధం  కాదనీ
పచ్చని సంప్రదాయానికి
మూలకందమని…!

You may also like

Leave a Comment