నింగి అంచులదాకా అంచెలంచెలుగా…
ఆకాశపు చేలాంచలాన్నే అందుకోవాలని,
ముద్దు ముద్దుగా తన పాదముద్రలనే..
సముద్రపులోతుల్లోన ముద్రించాలని,
తనకన్నా ముందేవున్న అవనీతలాన్నంతా..
తన కబంద హస్తాల్లో బంధించాలని,
గగనచర, భూచర, వనచర,జలచరాలన్నీ..
తన అదుపాజ్ఞల్లో చరించాలని,
సృష్టిలోని పంచభూతాలన్నీ..
తన దృష్టిని దాటి పోకూడదని,
విశ్వమందలి అణురేణువునంతా..
మేథో మంత్రంతో, ధనతంత్రంతో…
తన వశవర్తిగా చేసుకోవాలని,
తన దురాశాదురాక్రమణలనెరవేసి…
స్వార్ధపు గాలంతో సాంకేతిక వల విసిరి,
తన వలలోనే పడాలి విశ్వవలయమంతా..
అనుకొంటూ, గొప్ప కలగంటున్నాడు..
కనిపించేది మాత్రమే సత్యమని,
కనిపించనిదంతా అసత్యమని
భావించిన నరుడు.. అతి తెలివిపరుడు..
అన్నీ తెలుసనుకొంటున్న నేటి మానవుడు!
కాలక్రమేణా.. తన ఊహకందని విధివిధానా..
తను పరచిన వలయే తన చుట్టూ వలయమై,
తను వేసిన గాలమే కాలమై తనను లాగినపుడు..
లాగి లెంపకాయ వేసి బోర్లా పడేసినపుడు,
అపుడుగానీ అర్థంకాదీ మేథావికి..
అనంత ప్రకృతిముందు తానెంత?
మృత్యువు కబళించగల తన బ్రతుకెంత?
మహా సముద్రంలో ఓ నీటి బొట్టంతైనా,
ఇసుక రాశిలో ఓ చిన్న రేణువంతైనా,
ప్రళయ ప్రభంజనంలో గడ్డిపోచంతైనా,
కానివాడనని.. అస్వతంత్రుడనని…
ఏ అజ్ఞాతశక్తి చేతిలోనో ఇమిడివున్న వాడనని..
అర్థమయ్యేనాటికే.. అంతా మించిపోయేనని..
మనిషిలోని అజ్ఞానం.. అహంకారం,
మేథోమదం.. ఐశ్వర్యగర్వం,
అధికార దర్పం.. అవినీతి బలం,
కీర్తి కాంక్షలు.. పొగడ్తల వాంఛలు
తనలోని తప్పులన్నీ తననే కాలమై కాటేశాయని,
కాలాతీతమైపోయిందన్న కలవరంతో…
ఆ మనిషి ఆఖరి శ్వాస ఇలా అంటున్నది…
మంచీ మానవత, నీతి నిజాయితి, శాంతీ సహనం,
ప్రేమా త్యాగం వంటి మానవీయ గుణాలే..
అశాశ్వతమైన మానవ జీవితానికవే
శాశ్వతమైన వెలుగునిచ్చే కాంతిమణులని!
నిజమేనంటూ నిష్క్రమించింది మనిషి నిశ్వాస.