అనువాద కథలు
మూలం : నరేంద్ర లాహ (హిందీ) అనువాదం : డా॥ లక్ష్మణాచార్యులు, మరింగంటి
- దొరికితేనే దొంగలు
ఓ పెద్ద మనిషి తన కొడుకుని పిలచి ‘హితోపదేశం’ చేస్తూ ` ఒరేయ్! జీవితంలో ఏదైనా సాధించి గొప్పవాడివి కావడానికి ప్రయత్నించు. అవిగో! ఆ భవనాలు చూసావా? వాటి యజమానుల్లా నువ్వు కూడా ఏదో ఒకటి చేసి గొప్పవాడివి అవ్వు. సరేనా?’’ అని అడిగాడు.
ఆ కొడుకు తన జులపాల జుట్టు పైకెగరేస్తూ ` ఏం చేయమంటావ్?’’ అని అడిగాడు మెల్లగా.
ఆ పెద్దమనిషి వేదాంత ధోరణిలో ` ‘‘కష్టపడు. వీళ్ళంతా రేయింబవళ్ళు కష్టపడ్డారు. ఆఖరి చెమట చుక్కనూ కార్చి, శ్రమచేయడం వల్లనే అంత పెద్ద పెద్ద భవనాలు నిర్మించగలిగారు. నువ్వూ అలాగే కష్టించి పనిచేసి, పెద్ద ఇల్లు ఒకటి నిర్మించు. దానిలో నివసిస్తున్నట్టుగా కలకంటూ ఉండు’’ అని అన్నాడు.
ఆ కొడుకు ఏదో ఆలోచిస్తూ దృఢస్వరంతో ` ‘‘అలాగే నాన్నా!’’ అని అన్నాడు.
అదే రాత్రి ఆ కుర్రాడు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. పోలీసులు వాణ్ణి పట్టుకొని జైల్లో పెట్టారు.
ఈ సంగతి తెలిసి, ఆ పెద్ద మనిషి కంగారుగా వచ్చి పలకరించాడు. ‘‘నాన్నా! నేనైతే సరైన మార్గమే ఎంచుకున్నా కాని నాటైం బాగా లేదు. పట్టుబడి పోయా పెద్ద పెద్ద భవనాల్లో ఉండే బడా బాబులు కూడా ఇదే మార్గం పడతారు. దొరకనివాళ్ళు పెద్ద పెద్ద భవనాల్లో ఉంటే, దొరికినవాళ్లిలా ఊచల వెనక ఉంటారు. దొరికితే దొంగ దొరక్కపోతే దొర! అంతే!!
- మసాలా
శ్రీ బాబూలాల్గారు నగరానికి చెందిన పెద్ద విమర్శకుల్లో ఒకరు. ఏ అంశమైనా, ఏ సమస్య ఎదురైనా దాన్ని విమర్శిచడంలో వెనుకాడడు. తప్పులు పట్టడంలో ఎవరైనా సరే, ఆయన తర్వాతే.
ఈ మధ్యనే జరిగిన ఒక సంగతి తీసుకుందాం. ఓ రోజు బాబూలాల్గారు తన ఇంటివరండాలో కూర్చుని తీరికగా ‘టీ’ త్రాగుతూ ఉన్నారు. వారితోబాటుగా ఇంకొంతమంది ఇలాంటి విమర్శకులు అక్కడ కూర్చొని ఉన్నారు.
ఇంతలో పక్కింటి హరిగారు అటుగా వచ్చారు పాపం! ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలా ఆందోళనగా, విచారంగా ఉన్నారు. మన బాబుగారు ఆయన్ని గమనించి ` ‘ఏమైంది! హరిగారూ? ఏంటలా ఉన్నారు?’ అడిగారు ఆదుర్దాగా.
హరిగారు ఒక్క క్షణం ఆగి, ఆయన ఆదుర్దా పడుతూనే ` ‘ఏం చెప్పమంటారు బాబుగారూ! ఇందాక అలా బజారుకు వెళ్ళా. అక్కడ నా సైకిల్ని దొంగలెత్తుకుపోయారు’’ అని అన్నారు.
ఇంకేముంది? మన బాబుగారికి ‘మసాలా’ దొరికింది. ఆయనలోని విమర్శకుడు నిద్రలేచాడు ` ‘‘ఏమిటో! ఈ మధ్య మనుషుల్లో హడావుడి, నిర్లక్ష్యం, అజాగ్రత్తలు ఎక్కువైపోయినయ్. అసలు బజార్లో సైకిల్ ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టగూడదో తెలీదు. పైగా సైకిల్‌కి తాళం కూడా వేయరు’’ అని అక్షింతల జల్లు కురిపించాడు. ఆయనేమన్నా అనుకుంటాడేమోనని హరిగారు అలాగే తలొంచుకుని నిలబడ్డాడు.
ఇంతలో ఆ దేవుడు ఆయన బాధ గమనించినట్టున్నాడు. ఇంట్లోంచి బాబుగారి శ్రీమతి గట్టిగా అరిచింది `
‘‘ఇదిగో! అలా బజారుకెళ్ళి కొంచెం కూరగాయలు తీసుకురండి’’ అని అన్నది.
బాబుగారు తన సుపుత్రుణ్ణి చూచి ` అరే! బాబూ! కొంచెం వెళ్ళి నా సైకిల్ తీసుకురా!’’ అని అన్నారు.
ఐదు నిముషాలు గడిచాక, ఆయన కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చి, కంగారుగా ` ‘‘నాన్నగారూ! మన సైకిల్ ఇంట్లో కనబడడం లేదు. మీరు సరిగ్గా తాళం వేసినట్టు లేదు. ఎవడో దొంగ వచ్చి ఎత్తుకపోయాడు.’’
- పాపం! బ్రహ్మానందం!
బ్రహ్మానందానికి చాలాకాలం తర్వాత బస్సు ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. పాపం! దురదృష్టవశాత్తూ మళ్ళీ మధ్యలోనే సీటు దొరికింది. కిటికీ ప్రక్క రెండు సీట్లు మాత్రమే ఉండే అదృష్టం మాత్రం ఎప్పట్నించో దొరకడం లేదు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ తన సీట్లో కెళ్ళి కూర్చున్నాడాయన.
‘‘హు! ఏమిటీ! ఆ దేవుడికెందుకో నా మీద కోపం. బెండకాయలా తాను ముదిరిపోతున్నా జీవితయాత్రలో తనకెలాగూ ఒకతోడు ఇవ్వలేదు. ఇక బస్సులోనూ ‘మంచితోడు’ ప్రక్కనే కూర్చునే అదృష్టమూ కలిగించడం లేదు’’ అని అనుకున్నాడు దిగులుగా, దిగాలుగా బ్రహ్మానందం అలా గొణుక్కుంటూనే ఉండగా… ఎప్పుడు పట్టిందో…. అలా నిద్రపట్టింది. పూర్తిగా నిద్రలో కూరుకుపోకముందే….
‘‘నేనిక్కడ కూర్చోవచ్చా?’’ అన్న ఓ మధురమైన స్వరం వినబడగానే దిగ్గున లేచి కూర్చున్నాడు బ్రహ్మానందం.
తనేదో అప్సరసల లోకంలో ఉన్నట్టుగా అనిపించిందతనికి చప్పన కళ్ళు తెరచి చూచాడు.అలా అతన్ని అడిగిన మహిళ గొప్ప అందగత్తె అయితే కాకపోయినా బ్రహ్మానందానికైతే ఎంతో అందంగా కనబడిరది. జీవిత సహచరి కోసం తన అన్వేషణ ఈ బస్సు ప్రయాణంవల్ల పూర్తి అయినట్టనిపించింది. ఉబ్బితబ్బిబ్బై….
అరె… ఎందుక్కూచోకూడదు? ఇది మీ కోసమే…. రండి…. తప్పక కూర్చోండి’’ అని అన్నాడు.
బ్రహ్మానందం ప్రక్కన సీటు ఖాళీగా ఉంది. ఏ కారణంచేతనో దాన్ని రిజర్వ్ చేసుకున్నవాడు రాలేదు.
ఆ మహిళ ఆ సీట్లో కూర్చుని ‘హమ్మయ్య’ అని అనుకుంది.
‘అవునూ! ఎక్కడిదాకా మీ ప్రయాణం మేడం?’ అడిగాడు మన బ్రహ్మానందం.
‘గుంటూరు’ సర్!’’
‘అరె, ఎంత ఆశ్చర్యం!! నేనూ గుంటూరుకే వెళ్తున్నా!!’
నిజానికి బ్రహ్మానందం వెళ్ళాల్సింది అక్కడికి కాదు, ఇంకా పై ఊరికి.
మెల్లమెల్లగా మనవాడు ఆమెను మాటల్లోకి దింపి, తనను పరిచయం చేసుకుంటూ… ‘‘నా పేరు ఆనందం, బ్రహ్మానందం. మీరు నన్ను బ్రహ్మ లేదా ఆనంద్ అని కూడా పిలవవచ్చు.
‘బై ద బై మీ పేరు?’ అడిగాడు బ్రహ్మానందం.
‘సార్! నా పేరు మోహిని. కాని మీ పేరులా రెండు ముక్కలు చేసి, ఏదో ఒక ముక్కతో మాత్రం పిలవకండి’’.
బ్రహ్మానందం బ్రహ్మాండంగా నవ్వాడు, పడి పడి నవ్వాడు. పరిచయం పెరిగింది. ఆమె చనువుతో మాటలు కొనసాగించింది. బ్రహ్మానందం మనసు గాలిలో తేలిపోసాగింది. తన జీవన సహచరి ఇక ఈమేనని అనిపించింది. అంతే, గాల్లో తేలిపోసాగాడు. తనకో చిన్న, అందమైన ఇల్లు, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు…ఇలా, ఇలా…నా పేరు ప్రక్క ఆమె పేరు ఎంతో ‘మ్యాచ్’ కూడా అయింది.
బస్సు ఒక్క ఉదుటున ఆగింది. మనవాడి ఊహల దారం పుటుక్కున తెగింది.
శ్రీమతి మోహిని తీయని స్వరంతో `
‘గుంటూరు వచ్చేసిందన్నయ్యా! మీరేంటి? దిగదల్చుకోలేదా? నేనైతే దిగిపోతున్నా. ‘మా వారు’ క్రింద నా కోసం వెయిట్ చేస్తున్నారు. బై బై…’’
- దయచేసి వెళ్ళిపోండి!
ఆ దుర్ఘటన అందరి గుండెల్నీ పిండేసింది. అలాంటి ప్రమాదాన్ని బహుశా ఎవ్వరూ ఇంతకముందు చూసి ఉండరు. ఒక అరవై సంవత్సరాల మహిళ కారు ప్రమాదంలో తన ప్రాణాలు కోల్పోయింది.
మల్లయ్య సేఠ్‌గారి పుత్ర రత్నం దుందుడుకు స్వభావి. తన కారు అత్యంత వేగంగా నడుపుతాడని పేరు. ఆ రోజు కూడా అలాగే జరిగింది. వాడి వేగానికి ఆ వృద్ధ మహిళ బలైపోయింది.
ఆ సమయంలో అక్కడికి చేరినవారిలో ఆవేశం కట్టలు తెంచుకున్నా, సేఠ్‌గారి కుమారుడి కారుని ఎవరూ ఆపలేకపోయారు. వాడు కారు ఆపకుండా అలాగే వెళ్ళిపోయాడు. వాళ్ళందరికీ వాడిల్లు తెలుసు కాబట్టి అంతా వెళ్ళి ఆ ఇంటి బయట గుమికూడి సేఠ్ కొడుక్కి వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు.
అక్కడ వరండాలో సేఠ్‌గారు తన గుమాస్తాతో ఏవో లెక్క పద్దుల గురించి చర్చిస్తున్నారు. ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. అందరికన్నా ముందున్న యువకుడి రెండు చేతుల్లో ఆ వృద్ధురాలి శవం ఉంది.
‘‘చూడండి సేఠ్! మీ కొడుకు నిర్వాకం! అతి వేగంగా వచ్చి ఈ వృద్ధురాలిని పొట్టన పెట్టుకున్నాడు’’ అని అన్నాడతను.
ఆ గొడవేదో చూడమని సేఠ్ ఇంట్లోకి గబగబా వెళ్ళిపోగా, ఆ గుమాస్తా బయటకొచ్చి, ఆ వృద్దురాలి శవాన్ని చూసాడు. చూసి అవాక్కైపోయాడు. ఇంతకీ ఆమె అతని భార్యే. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు. ఏమనుకున్నాడో ఏమో… ఆ గుంపులోని వారిని చూస్తూ `
‘‘చూడండి! ఈ విషయంలో మీరెవరూ సేఠ్‌ని ఏమీ అనొద్దు. ఏమన్నా అన్నారో నా మీదొట్టే. ఎందుకంటే మీరు గట్టిగా పోట్లాడిన మరుక్షణమే నా ఉద్యోగం కాస్తా ఊడిపోతుంది. ఈ ముసలితనంలో నేను తిండిలేక మలమల మాడిపోతాను. పైగా నాకు పెళ్లికాని ముగ్గురమ్మాయిలున్నారు. ప్రమాదంలో చనిపోయినామె నా భార్యే. కాని ఈ విషయంలో నేను ఈ వయసులో సేఠ్‌తో గొడవపడి, నన్ను, నా కుటుంబ సభ్యుల్ని ఎందుకు బాధ పెట్టాలి? మీ అందరికీ ఓ నమస్కారం. దయచేసి వెళ్ళిపోండి.’’
- అవసరార్థం
డాక్టర్ రఘుకి ఇవాళ తప్పనిసరై కార్లో రాంగ్‌సైడ్‌లో వెళ్ళాల్సి వచ్చింది. కారణం ఒకరోగి పరిస్థితి చాలా విషమించింది. ఆ రోగి ఇల్లు రోడ్‌కి అటు ప్రక్కన ఉంది. సరైన దారిలో వెళ్తే గనక అరగంట కన్నా ఎక్కువ సమయమే పడుతుంది.
ఇంతలో ఆయన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపేసాడు. కాని అంత తేలికగా కూడా వెంటనే వదిలేసాడు ఓ శాల్యూట్ కొట్టి. పైగా, అతన్ని ఎందుకలా వదిలేసావ్? అని అడిగిన వ్యక్తితో ` ‘‘చూడు! డాక్టర్ అంటే నడిచే దేవుడు’’ అని డాక్టరు రఘుతో కూడా ‘‘మీరు దైవ స్వరూపం సార్! మీరు చెప్పే కారణం తప్పక నిజమే అయి ఉంటుంది’’ అని ఆయనకూ విష్ చేసాడు.
తర్వాత డాక్టర్ రఘుకి దగ్గరగా వచ్చి మెల్లగా ` ‘‘డాక్టర్! మా అబ్బాయికి ట్రీట్మెంట్ మీ హాస్పిటల్లోనే మీ పర్యవేక్షణలోనే జరుగుతున్నది. కొంచెం వాడిమీద శ్రద్ధ పెట్టండి’’! అని అన్నాడు.
ఇది జరిగిన ఏడు రోజుల తర్వాత కూడా తిరిగి ఇలాగే జరిగింది. డాక్టర్ రఘు మళ్ళీ రాంగ్‌సైడ్‌లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. అదే ట్రాఫిక్ పోలీసు ఆయన్ని మళ్ళీ పట్టుకున్నాడు. అయితే ఈసారి మాత్రం ఆయన డాక్టర్గారిని వదల్లేదు. డాక్టర్గారిపై చలానా వేసాడు.
‘‘ఆ రోజు సంగతి వేరు. మా అబాయి మీ ‘కేర్’లో ఉన్నాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మావాడు వేరొక డాక్టర్గారి ‘కేర్’లో ఉన్నాడు. ఇప్పుడిక మీతో నాకేంటి అవసరం? నేను మీకెందుకు సేవ చేస్తాను సార్!’’ అని లౌక్యంగా అన్నాడు.