Home అనువాద సాహిత్యం కథా పంచకం (చిన్న కథలు)

కథా పంచకం (చిన్న కథలు)

by Dr. Lakshmanacharyulu M

అనువాద కథలు

మూలం : నరేంద్ర లాహ (హిందీ)                                                  అనువాదం : డా॥ లక్ష్మణాచార్యులు, మరింగంటి

1. కారణం

గోపాలరావు వంటి భావుకుడైన రచయిత ఎందుకని ఆత్మహత్య         చేసుకున్నాడో, అసలు కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే, తెలుస్తే ఆ కారణం అనేది అతనికే తెలియాలి, లేదా నాకు తెలియాలి లేదా ప్రసిద్ధ ప్రచురణకర్త రూప కిశోర్ గారికి తెలియాలి. బ్యాంక్ లోని ఆయన ఖాతాలో ఒక లక్ష రూపాయల పెద్ద మొత్తం ఉండగా కూడా మరి ఆయనెందుకని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఎవ్వరి ఊహకీ అందడం లేదు. ఇదేదో ఆ రచయిత పిచ్చితనమే అనే నిర్ధారణకి వచ్చిన జనం ఈ విషయాన్ని ప్రక్కన పడేశారు.

ఈ సంఘటన మొత్తం నా కళ్ళముందే జరిగింది. నేను రూపకిశోర్ గారి కార్యదర్శిని. గోపాలరావుగారు ఒక రచయితగా గొప్ప పేరు సంపాదించాడు. ఆయన వద్ద డబ్బు లేదు, కాని తను వ్రాసిన సాహిత్యం చాలానే ఉంది. అయితే రూపకిశోర్ గారి ఆఫీసులో ఏదో విషయమే వారిద్దరి మధ్య గొడవ జరిగింది.

“మిమ్మల్ని మీరేమనుకుంటున్నారసలు? డబ్బుకి ప్రతిఫలంగా పనులు కూడా చేయించుకుంటున్నారు కదా! అసలు రచయితే గనక లేకపోతే, ప్రచురణకర్తల భవనాలు నిలబడలేవు” అంటూ గోపాలరావు వాదించాడు.

రూపకిశోర్ ఒక జిత్తులమారి వ్యక్తి కద! మొహంపై నవ్వు పులుముకుంటూ, అప్పుడేర్పడిన పరిస్థితిలో గాంభీర్యతను తేలికగా కొట్టేస్తూ-

“ఆరే! మీరు అలా ఊరికే కోపం తెచ్చుకుంటున్నారు. సరే, మనం ఓ ఒప్పందం చేసుకుందాం. మేము మీరు రాసిన సాహిత్యం అంతా కొనేసి మీకో లక్ష రూపాయలకి చెక్కు ఇస్తాం సరేనా!” అని అన్నాడు.

గోపాలరావు దీన్ని తనకు లభించిన గౌరవంగా భావించాడు. సరే, కోటీశ్వరుడైన రూపకిశోర్ గారి కార్యాలయంలో గోపాలరావు మొత్తం సాహిత్యాన్ని ఆయన ఎదురుగానే తగలబెట్టటం జరిగింది. దీన్ని ఆపాలని కోరుకున్నా, గోపాలరావు దాన్ని నిరోధించలేకపోయాడు. పైగా వెళ్ళిపోతూ ఉండగా – “నీలాంటి చౌకబారు రచయితలు వస్తారు, పోతారు. మా దృష్టిలో నీ సాహిత్యం విలువ ఇంతేనని తెలుసుకోండి” అనే మాటలు ఆయన చెవిలో కూడా పడ్డాయి.

అంతే! అదే రాత్రి గోపాలరావు ఆత్మహత్య చేసుకున్నాడు.

2. వ్యాపారం 

ఎందుకోగాని ఆ రాజకీయ నాయకుడి మొహం గంభీరంగా తయారైంది ఎంతో దిగులుగా, దిగాలుపడి, తన ఇంటిపెరట్లో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు.  ఏదో పెద్ద సమస్య తనని చుట్టుముట్టినట్టుగా అనిపించింది నాకు.

వెంటనే దగ్గరకు వెళ్ళి సహానుభూతి ప్రదర్శించి, భుజంపై చేయివేసి కారణం ఏమిటని మెల్లగా అడిగా – దానికాయన ఎంతో బాధపడిపోతున్నట్లుగా నాతో ఇలా అన్నాడు –

అవును తమ్ముడూ, చాలా పెద్ద చిక్కే వచ్చిపడింది. ఆర్నెల్లు గడచిపోయాయ్, ఒక్క హర్తాళ్ గాని, ఉద్యమంగాని, గొడవగాని ఏదీ జరగలా? నాకేంటో చాలా బాధగా ఉందోయ్!        ఇలాగే ఇంకో నెల గడుస్తుందనుకో. ఇక నా వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది” అని అన్నాడు.  అంతే, ఆ మాటలు విన్న నా తల గిర్రున తిరిగిపోయింది.

3. ఎంపిక

అతనికి హఠాత్తుగా యమధర్మరాజు దర్శనం అయింది. ఒక్కసారిగా కంగారు పడినా వెంటనే స్థిమితపడి – “అయ్యా! ఏమిటీ అకాల ఆగమనం? నాకేమీ పోయే కాలం రాలేదే!” అని ప్రశ్నించాడు.

“నేనొచ్చింది, నీ కోసం కాదురా మూర్ఖుడా! నీకింకా భూమ్మీద నూకలున్నాయ్ అయినా నీ ఖర్మ ఎప్పుడు, ఎలా కాల్తుందో చెప్పలేను”, అద్సరే! ప్రస్తుతం నీకో పరీక్ష. నీకు అమ్మ కావాలో, భార్య కావాలో, ఇరువురిలో ఎవరు కావాలో, అక్కర్లేదో తేల్చుకో. ఇద్దరిలో ఒక్కరిని ఇవాళ నేను పట్టుకపోవడాని వచ్చాను” అని అన్నాడాయన.

మనవాడు ఒక్క క్షణం ఆలోచించి, అయ్యా! యమ ధర్మరాజా! అలా అయితే మీరు మా అమ్మనే పట్టుకుపోండి.  ఆమెతో నాకెలాంటి ప్రయోజనం లేదు. భార్య ఇంకా కొంతకాలం నాకు పనికొస్తుంది. ముందు ముందు ఈమె కూడా పనికి రాకుండాపోతే, అప్పుడు ఈమెను కూడా మీకు నేను అప్పగిస్తా” అని అన్నాడు. అది విన్న యమధర్మరాజు అవాక్కైపోయాడు.

4 . సానుభూతి

శ్రేష్ఠిగారి మరణంతో నగరమంతా శోక సాగరంలో మునిగిపోయింది. ఆయనకెంతో పేరు – ప్రఖ్యాతులుండడం వల్ల ప్రతి ఒక్కరూ అంతిమ దర్శనం చేసుకోడానికని ఆయన ఇంటికి వచ్చి భౌతిక కాయం చుట్టూ చేరారు.

అలా సానుభూతి ప్రకటించి, రెండు కన్నీటి బొట్లు రాల్చడానికి వచ్చినవారిలో నేను కూడా ఉన్నాను. ఆయన పార్థివ శరీరంపై పూలు జల్లి రెండు నిముషాలు మౌనంగా నిలబడి ముందుకు జరిగాను.

ఇంతలో నాకు ఇద్దరి వ్యక్తులం గుసగుసలు స్పష్టంగా వినబడ్డాయి. వారికి నేను వింటున్నట్టు తెలీదు.

“అరే! ఇవాళ మనకి మంచి అవకాశం దొరికిందిరా! ఎంత వీలైతే అంత ఎంత అందితే అంత, నీ ఇష్టం. జనం చాలామందే ఉన్నారు, పనికానిచ్చెయ్! కాని జాగ్రత్త రోయ్!”

ఇంతలో ఇంకో గొంతు వినబడింది –

“మరేం ఇబ్బంది లేదురా! కొన్ని పూలు దోసిళ్ళలో నింపుకుని కొంతసేపు దిగులు, దిగాలు మొహంపైనా…. పులుముకుంటే… మనకిక… డబ్బులే డబ్బులు – ఉదయం నుండి సాయంత్రంవరకు మనం ఆ శవం చుట్టూతా తిరిగే గుంపులో వీలైనన్ని ఎక్కువసార్లు కలసి తిరుగుదాం, మనం పూలు చల్లుకుంటూ నడుద్దాం, అలాగే ‘మన పని’ కానిచ్చేద్దాం. ఓ నాలుగైదు జేబులు అలా… అలా కత్తరించేద్దాం…. కాని ఓ సంగతి మాత్రం మరచిపోకు! మొహం మీద నవ్వనేదే రాకూడదు. అప్పుడప్పుడు కళ్లు తుడుచుకుంటూ ఉందాం. పూలు అలా చల్లుకుంటూ పోదాం…. మనం సానుభూతి, శోకం ప్రకటించేందుకు గద వచ్చింది, ఏమంటావ్….”

అంతే! నా మొహంలో నెత్తురు చుక్కలేదు.

5. హర్తాళ్ 

అమ్మ అలా నడుస్తూ నడుస్తూ ‘బ్యాట్’ చేత పట్టకుని వంటింట్లోకి విసవిసా వెళ్ళింది.

అమ్మ అలా తన బ్యాట్ తీసుకుని వెళ్ళడం సంజయ్ కంటపడింది. వాడు కంగారు పడ్డాడు. ‘అమ్మా! అంటూ ఆమెని ఆపి, “ఏంటిది? నా బ్యాట్ తో నీకేం పని? ఎందుకలా పట్టుకెళ్తున్నావ్ వంటింట్లోకి?” అని అడిగాడు ఆశ్చర్యంతో.

అమ్మ వాణ్ణి అలా చూస్తూ “మరేం లేదురా? ఇంట్లో వంట చెరకు అయిపోయింది. ఈ బ్యాట్ తోనే ఇవాళ వంట!’’       అంది.

“ఏంటీ! వంటా! నా బ్యాట్ తోనా? ఏంటమ్మా? నీకు నా బ్యాటే దొరికిందా?” అడిగాడు ఆందోళన పడుతూ –

అమ్మ వాడి కళ్ళల్లోకి చూస్తూ – “అరే! నువ్వే కదరా ఇలా చెయ్యడం నేర్పింది? మీ కుర్రాళ్ళంతా హర్తాళ్ తో బస్ తగలబెట్టి మన సంపదని, మన వస్తువుల్ని మనమే తగలబెట్టుకోవాలన్నది నాకు నేర్పారు కదరా?

సంజయ్ కి విషయం అంతా అర్థమైంది. కళ్ళు తెరుచుకున్నాయ్. ఇక నుంచి ‘దేశానికి’ నష్టం కలిగించే ఏ పనీ చెయ్యను చెయ్యనివ్వనని నిర్ణయం తీసుకున్నాడు.

 

You may also like

1 comment

N.manikanta September 17, 2021 - 3:36 pm

Publisher name, prakriya, how much book
rate

Reply

Leave a Comment