రాత్రి మనసును నిలదీసింది
మొన్నటి కల ఎక్కడని?
ఖాళీ ముఖంతో
నిజం తలదించుకుంది.
ఇష్టం ఒట్టిచేతులతో
అక్షరానికి ఇంకేదో బలం కావాలని
నిజానికి ఇంకెంతో మర్యాద కావాలని
తప్పుపడుతూ పట్టుపట్టింది.
కన్నార్పని కల వాలిన ముఖంతో
రాత్రిని తలుపు కొట్టి
లోపలికి వెళ్ళిన ప్రతిసారీ
చప్పుడు లేని మర్యాదతో గదిది నిరాశే.
కునుకుపై అలిగిన కళ్ళు
రాల్చిన కన్నీటిలో
తొంగిచూసే పొరపాట్లకు
లొంగిన నిజాయితీతో
ఆకలి దప్పిక మానేసిన ఆలోచన
ఒంటరితనంతో ఉరిపోసుకుంది.
అక్షరం మౌనంగా రోధిస్తుంది.
కవిత దిక్కులు పిక్కటిల్లెలా మ్రోగుతుంది.