దశాబ్దాలుగా వాడి చుట్టూ వుంటూనే
వాణ్ని తప్పించుకు తిరుగుతున్నాను
నా వోడేనని తెలుస్తున్నా, పోవోయ్ అంటూ
దారి మార్చి తిరుగుతున్నా
అయినా వాడు నాలో
ఎక్కడో తిష్ట వేసుకు కూర్చున్నాడు
అకస్మాత్తుగా ఒక రోజు
నా దేహం పై కత్తి పడింది
శరీరం తో పాటు మనసూ గాయ పడింది
వాడు లేచి గాయాల్ని తడిమాడు
కళ్ళల్లోకి చూసి కన్నీటి పర్యంతమయ్యాడు
హృదయం లోకి దూరి
బాధలకు మలాం రాసాడు
నా చేయందుకుని అక్షరమై
తెల్ల కాగితం పై వాలాడు
వేదనంతా దూదిపింజై
గాల్లోకి ఎగిరింది
ఇన్నేళ్ళూ నేను తప్పించుకు తిరిగినా
ఇవ్వాళ తప్పించుకోలేని స్థితికితెచ్చాడు
అవును
ఈ కవిగాడూ నేనూ కవలలం
అమ్మ గర్భం లోంచి ఒకేసారి పుట్టాం
అక్షరాలమై కలవడానికి ఇన్నేళ్ళు పట్టింది
నేరం నాదా…కవి దా….
2 comments
శ్రీ వారాల ఆనంద్ గారిలో కవి కవలలో ఒకడుగా చక్కని భావన.
బాగుంది.