సమీక్ష వ్యాసాలు
దుకూరి శ్రీరాములు “నన్ను గన్న నా నేల” కవిత్వం — ఓ విశ్లేషణ
ప్రముఖ కవి,కందుకూరి శ్రీరాములు కలం నుండి జాలువారిన ‘నన్ను గన్న నా నేల’ కవిత పై విశ్లేషణా వ్యాసం.నన్ను గన్న నా నేల కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.శ్రీరాములు రావురూకుల గ్రామం,సిద్దిపేట జిల్లాకు చెందినవాడు.కన్నతల్లి జన్మభూమి అయిన తెలంగాణ ప్రాంతాన్ని అంటే శ్రీరాములు ప్రాణప్రదంగా ప్రేమిస్తాడు.కవి శ్రీరాములు తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొన్న వివక్షను కష్టాలను కన్నీళ్లను చూసి హృదయం ద్రవించి కవితకు అక్షర రూపం ఇచ్చాడు.నన్ను గన్న నా నేల కవిత తెలంగాణ చరిత్ర అని తోస్తుంది.తెలంగాణ చరిత్రను కవిత రూపంలో వ్యక్తీకరించడం సామాన్యమైన విషయం కాదు.కవి శ్రీ రాములు ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రాంతం ప్రజలు ఎదుర్కొన్న వివక్షను తన పదునైన భావాల ద్వారా చక్కగా వ్యక్తీకరించారు.
“ పది చేతులు ఒక్కటైతే ఊరేగింపు
“ పది అలలు ఒక్కటైతే ఉప్పెన
“ నీటి బిందువులు చల్లబడితే
“ మంచుగడ్డ
“ కొలిమిలో బొగ్గు రాజుకుంటే
“ నిప్పు కణిక
“ ఇది తెలంగాణా.
“ పది చేతులు ఒక్కటైతే ఊరేగింపు.
ఊరేగింపును ఆంగ్లంలో Procession అని అంటారు.వీధులలో తిరుగుతూ చేసే ఉత్సవం. ఊరేగింపు అంటే ఊరిలోని జనులకు తెలియపరుస్తూ ప్రదర్శించుట.ప్రజలు ఊరేగింపు ఎందుకు చేస్తారు? మతపరమైనవి,పెండ్లి మొదలైన వేడుకలకు,రాజకీయపరమైనవి,ప్రజలు తమ హక్కుల సాధన కోసం నినాదాలు ఇస్తూ వీధులలో తిరుగుతూ చేసే ఉత్సవం ఊరేగింపు అని చెప్పవచ్చు.ప్రజలంతా ఏకమై పిడికిలి ఎత్తి నినదిస్తూ ఊరేగడం తెలంగాణ ప్రాంతంలో మనం చూడవచ్చు.
“ పది అలలు ఒక్కటైతే ఉప్పెన.
తెలంగాణ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు? సవాలక్ష సందేహాలు మనలో పొడసూపుతాయి. సముద్ర తీరం నుండి వచ్చిన ఉప్పెన సృష్టించిన ఆటుపోట్ల తాకిడికి తెలంగాణ ప్రాంతమునకు సంబంధం లేదు.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వాతావరణంలో వచ్చే అల్పపీడనం ప్రభావం ఉప్పెనలు ఉత్పాతాలు వంటి అలజడుల హోరు రగులుతున్న కాష్టంలాగా తెలంగాణ ప్రాంతంలో ఉంది అని చెప్పిన తీరు అద్భుతం.
“ నీటి బిందువులు చల్లబడితే మంచు గడ్డ.
హిమాలయ పర్వత సానువుల్లో మంచు కురిసి మంచు గడ్డలు ఏర్పడినట్లుగా తెలంగాణ ప్రాంతంలో నీటి బిందువులు చల్లబడితే మంచు గడ్డలు ఏర్పడినట్లు చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ కొలిమిలో బొగ్గు రాజుకుంటే నిప్పు కణిక.
కమ్మరి వాళ్లు కత్తులు,కొడవళ్ళు,నాగటి కర్రులు, గొడ్డళ్లు,గడ్డపారలు మొదలైన వాటిని కొలిమిలో బొగ్గులు వేసి బాగా ఎర్రగా కాలిన తర్వాత వాటిని పదును పెడతారు.తెలంగాణ ప్రాంతంలో కొలిమిలో బొగ్గులు రాజు కొనకుండానే నిప్పు కణికలు గాలి దుమారం చెలరేగకుండానే ఎగసి ఎగసి పడుతున్నాయి.తెలంగాణలో నివసించే జనాలు తమ హక్కుల కొరకు ఉద్యమిస్తూ ఊరేగింపులు చేస్తున్నారు.తెలంగాణలో జనాలు తుఫానులు రాకుండానే ఉప్పెనలై ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ ప్రజలు నీటి బిందువులు చల్లబడకుండానే మంచు గడ్డలు అవుతున్నారు. తెలంగాణ ప్రాంతం ప్రజలు కొలిమిలో బొగ్గు రాజు కొనకుండానే నిప్పు కణికలుగా మారి పోరు బాటలో సాగుతున్నారు.
“ శ్రమకు ప్రతిరూపం
“ శక్తికి మరో పేరు
“ ఇటు మెదక్ నుండి అటు ఖమ్మం
“ అటు ఆదిలాబాద్ నుండి ఇటు మహబూబ్ నగర్
“ చాచి ఎత్తిన రెండు అర చేతులు. కష్టపడటం వల్ల కలిగేది శ్రమ.తెలంగాణ ప్రజలు శ్రమకు ప్రతిరూపం అని చెబుతున్నాడు.మానవ నాగరికత విస్తరించడానికి శక్తి అవసరం.శక్తి అనేది నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.శక్తిని ఉపయోగించి మనిషి పనులు చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు శక్తికి మరో పేరు అని చెప్తున్నాడు. తెలంగాణలో మెదక్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా వరకు ఆదిలాబాద్ నుండి మహబూబ్ నగర్ జిల్లా వరకు ఇక్కడ ప్రజలు శ్రమనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.శ్రమైక జీవన సౌందర్యానికి ఏది సాటి రాదని మహాకవి శ్రీశ్రీ చెప్పాడు.తెలంగాణ పల్లె జనాలు ఎత్తిన రెండు అర చేతులు చాచి ఉంచడం ఆత్మ విశ్వాసాన్ని ఆత్మ నిర్భరతను ఆత్మ గౌరవాన్ని తెలియ జేస్తుంది.
“ మహబూబ్ నగర్ లో ఆకలి చావులు.
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు జిల్లా అని పిలిచేవారు.ఇక్కడి ప్రజలు తీవ్రమైన పేదరికం,బానిసత్వం చెరలో మగ్గి ఉన్నప్పటికి పాలకులు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపలేదు.ఇప్పటికి ఈ ప్రాంతంలో అధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు. మహబూబ్ నగర్ ప్రాంతంలో నివసించే ప్రజలు జీవనం భారమై వలసలు కొనసాగుతున్నాయి.వలస వెళ్లని జనాలు పేదరికం వల్ల ఆకలి చావులకు లోనవుతున్నారు.చాలా మంది ప్రజలు జీవనోపాధి కరువై ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పాలమూరు లేబర్లుగా అన్ని జిల్లాలలో పనిచేస్తున్నారు. మహబూబ్ నగర్ కరువు జిల్లాగా పేరుపొంది ఆకలి చావులకు కూడా నిలయంగా మారింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
“ ఆదిలాబాద్ లో అత్యాచారాలు.
ఆదిలాబాద్ జిల్లా అత్యాచారాలకు పేరుగాంచింది. ఆదిలాబాద్ లో నివసిస్తున్న మహిళలు దుండగుల దారుణమైన దురంతాల వల్ల అత్యాచారాలకు బలి అవుతున్నారు.అమాయక మహిళలు అత్యాచారాలకు బలి కావడం తీవ్రమైన వేదనకు గురిచేస్తుంది.
“ కరీంనగర్ లో చేనేత కార్మికుల హత్యలు.
కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో చేనేత కార్మికులు పేదరికంలో మగ్గుతు దీనస్థితిని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఇవి చేనేత కార్మికుల ఆత్మహత్యలు కావు.రాజ్యంలోని పాలకుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న చేనేత కార్మికుల హత్యలు అని కవి శ్రీరాములు వ్యక్తం చేయడం చక్కగా ఉంది.
“ వరంగల్ లో పత్తి రైతుల ఆత్మహత్యలు.
వరంగల్ లో తీవ్రమైన కరువు ఏర్పడ్డది.వర్షాలు లేక నీటి ఎద్దడి ఏర్పడి తాగునీరు,సాగు నీరు లేక ప్రజలు కరువు కోరల్లో చిక్కినారు.పత్తి చేలల్లో పంటలు ఎండిపోయిన దీనస్థితిలో రైతులు ఏం చేయాలో దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడడం వాస్తవం అని చెప్పవచ్చు.
“ మెదక్ లో ఎదురు కాల్పులు.
మెదక్ లో ఎదురుకాల్పులు ఎందుకు జరిగాయి. పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు తప్పించుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారన్నది బూటకపు సమాచారం అని చెప్పవచ్చు. పోలీసులు తప్పించుకున్న మావోయిస్టుల కొరకు వేట కొనసాగిస్తున్నారు అని చెప్పడం సిగ్గు చేటుగా చెప్పవచ్చు.మావోయిస్టులు ప్రజల మౌలిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. మావోయిస్టులను ప్రభుత్వం పోలీసుల ద్వారా మట్టు పెట్టుతున్నది.మావోయిస్టులపై ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఆగాలి.బూటకపు ఎదురుకాల్పులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి.అప్పుడు ప్రజల కోసం ప్రభుత్వం అనే పేరు సంపాదించుకోవచ్చు.
“ నిజామాబాదులో ఎన్ కౌంటర్లు
నిజామాబాద్ జిల్లాలో ఎన్ కౌంటర్లు ఎందుకు జరిగాయి? ప్రజలు ఎన్నుకున్న పరిపాలకులు మానవతా దృష్టితో ఆలోచించాల్సిన తక్షణ కర్తవ్యం ఉంది.ఆత్మ రక్షణ కోసం కరుడుగట్టిన నేరస్తులను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నం చేస్తుండగా ఆ ప్రయత్నంలో పోలీసులు ఆత్మ రక్షణ కోసం నేరస్తులను ఎన్ కౌంటర్ చేశారు అని ప్రకటిస్తారు. కట్టుకతలు అల్లడం వల్ల పోలీసుల విశ్వసనీయతను ప్రజలు శంఖించాల్సిన పరిస్థితులకు అవకాశం కల్పించే విధంగా ఉన్నాయి. బాధను కలిగిస్తుంది.
“ నల్లగొండలో నరకటం చంపటం.
నల్లగొండ జిల్లాలో నివసిస్తున్న ప్రజలు కక్షలతో పరువు హత్యల పేరిట చేతబడి పేరిట ఒకరిని ఒకరు నరకటం చంపడం మానవతకు మచ్చలుగా చెప్పవచ్చు.ఇలాంటి అమానుష ఘటనలు సమాజానికి కీడును కలిగిస్తున్నాయి.నరకటం చంపటం అనే జాడ్యం జోలికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి.కవి శ్రీరాములు వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ ఖమ్మంలో అరాచకం అన్యాయం.
ఖమ్మం జిల్లాలో ప్రజలు అరాచకానికి అన్యాయానికి బలి అవుతున్నారు.ప్రభుత్వాలు చెలరేగుతున్నా అరాచకం,అన్యాయం యొక్క మూలాలు ఎక్కడ ఉన్నా వాటిని తీవ్రంగా పరిగణిస్తూ అణచి వేయాల్సిన ఆవశ్యకత,అవసరం ఉంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రంగారెడ్డిలో కుల పోరాటాలు.
రంగారెడ్డి జిల్లాలో రగులుతున్న కుల పోరాటాలు మనస్థాపం కలిగిస్తున్నాయి.రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న ప్రజలు నా కులం గొప్ప నీ కులం తక్కువ అంటూ ఒకరినొకరు నిందించుకుంటూ హత్యలకు పాల్పడటం ఆవేదన కలిగిస్తుంది.
“ హైదరాబాదులో మత కలహాలు.
హైదరాబాదు జిల్లాలో నివసిస్తున్న ప్రజలు హిందూ ముస్లింలు తమ మతం గొప్పదని ఇతర మతాలు తక్కువ అని భావన కలిగి ఉన్నారు.మతం పేరిట హైదరాబాద్ పాతబస్తీలో హిందూ ముస్లింలు కొట్లాడుతూ ఉండడం తీవ్రమైన ఆవేదన కలిగిస్తుంది.భారతదేశం లౌకిక దేశం అని పిలుస్తారు. అన్ని మతాలను సమానంగా చూడాలి.సర్వమత సౌభాతృత్వం కొనసాగాలి.హిందూ ముస్లిం భాయి భాయి అని పరస్పరం స్నేహము,సంతోషంతో కలిసిమెలిసి ఉండాలి.మత కలహాలకు ఆజ్యం పోయకూడదు.మతకలహాలు మానుకొని సోదర భావంతో ఐకమత్యంతో కలిసిమెలిసి జీవించాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడం చక్కగా ఉంది.
“ పది జిల్లాల అగ్గిపుల్లల పెట్టె
“ కదిలిస్తే కందిరీగల తుట్టె – తెలంగాణ
“ మురిపాల సంస్కృతికి ఈ గడ్డ,
“ మూడు కోట్ల ప్రజల ముద్దుబిడ్డ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన పది జిల్లాలు ఉండేవి.పల్లెలు మరియు పట్టణాలలో నివసించే జనాలతో పది జిల్లాల అగ్గి పుల్లల పెట్టె తెలంగాణ ప్రాంతం మండించకుండానే రగులుతుంది.తెలంగాణ ప్రాంతం కందిరీగల తుట్టెగా ఎలా మారింది? ఎన్నో అవకతవకలు విభేదాలతో తెలంగాణ ప్రాంతం కదిలిస్తే కందిరీగల తుట్టెగా తయారైంది.తెలంగాణ సంస్కృతిలో ఆచారాలు,వ్యవహారాలు,పండుగలు, సంక్రాంతి,దసరా,బతుకమ్మ పండుగ,సమ్మక్క సారలమ్మ జాతర,బోనాల పండుగలు విశేష మైనవిగా చెప్పుకోవచ్చు.మురిపాల సంస్కృతికి తెలంగాణ గడ్డ నిలయంగా ఉందని చెప్తున్నారు.పది జిల్లాలతో కూడిన మూడు కోట్ల ముద్దుల బిడ్డ తెలంగాణ అని గర్వంగా చెబుతున్నారు.
“ బిగబట్టిన గొంతు దాని స్వరూపం
“ ఎత్తిన జెండా దాని స్వభావం
“ దాని భాష – దాని శ్వాస
“ దానివేషం – దాని పౌరుషం.
తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో భాగం.పురాతన గోండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమిగా పిలుస్తారు.పీఠభూమి ప్రాంతం,గోదావరి బేసిన్ ప్రాంతం,కృష్ణ పర్వత పాద ప్రాంతం,తెలంగాణ స్వరూపంగా చెప్పవచ్చు.తెలంగాణ ప్రాంతంలో నివసించే జనాలు బిగబట్టిన గొంతు కలిగి అణుకువతో మెలగడం దాని సహజ స్వరూపంగా చెప్పవచ్చు.తెలంగాణ ప్రజలు ఎత్తిన జెండా పై గౌరవంగా మెలగడం దాని స్వభావంగా చెప్పవచ్చు. తెలంగాణ ప్రజలు మాట్లాడే భాష,యాస, మాండలికాలు తెలంగాణ ప్రజల శ్వాసగా చెబుతున్నారు.తెలంగాణ జనాలు ధరించే కట్టు బట్ట వేషంతో అలరిస్తారు.తెలంగాణ ప్రజలు పౌరుషం కలిగిన వారు అని పేరు తెచ్చుకున్నారు.
“ గోలకొండ నవాబులు
“ కాకతీయ చక్రవర్తులు
“ శిథిలాల కోటలు – శిల్ప విన్యాసాలూ
“ తరతరాలు నైజాం నవాబులు – రాజుల పైసా రాళ్లపాలూ
“ రజాకార్ల బీభత్సాలు – రాక్షస కృత్యాలు
“ జమ – తీసివేత లెక్కల్లో
“ ఇంకా శేషంగా మిగిలే వున్నాయి.
గోలకొండ నవాబులు తెలంగాణను కొంతకాలం పరిపాలించారు.కాకతీయ చక్రవర్తులు గోల్కొండ కోటను నిర్మించారు.గోల్కొండ నగరం కోట మొత్తం ఒక 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు.16, 17 వ శతాబ్దంలో గోల్కొండ ప్రాంతంలో కుతుబ్ షాహి రాజులు పాలించారు. గోల్కొండ కోట యొక్క శిల్పకళలు అద్భుతాలు అని చెప్పవచ్చు.గోల్కొండ కోట శిల్ప విన్యాసాలు ఇప్పటికి చూపరులను ఆకర్షిస్తున్నాయి.హైదరాబాద్ ప్రాంతమును నైజాం నవాబులు పాలించారు.నైజాం రాజులు తెలంగాణ ప్రజలను దోచుకుని అద్భుతమైన కట్టడాలు నిర్మించారు.తెలంగాణ ప్రజలను దోచుకున్న సొత్తుతో నిర్మించిన కట్టడాల వల్ల సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ప్రయోజనం కలుగలేదు.తెలంగాణ ప్రజలను హాహాకారాలతో ఏడ్పించి ఆర్జించిన నిజాం రాజుల సొమ్ము రాళ్లపాలు అయిందని చెబుతున్నారు.నిజాం నవాబు తొత్తులు రజాకార్లు చేసిన అకృత్యాలకు తెలంగాణ ప్రజలు బలి అయ్యారు.తెలంగాణ ప్రాంతంలో స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.దుర్మార్గులైన రజాకారుల దుష్ట శక్తుల చేష్టల వల్ల తెలంగాణలోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్త్రీలను బట్టలు విప్పించి బతుకమ్మలు ఆడించారు. శిస్తులు చెల్లించలేని అమాయక రైతుల నడుములపై బండలు ఎత్తించారు.గోళ్లను కత్తిరించారు.రజాకార్ల రాక్షస కృత్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతం అట్టుడికి పోయింది.రజాకార్లు చేసిన దారుణమైన ఘటనలు జమ తీసివేత లెక్కల్లో ఇంకా శేషంగా మిగిలి ఉన్నాయి అని చెబుతున్నారు.
“ తెల్లదొరల్ని వెళ్ళగొట్టామని సంబరపడ్డాం
“ స్వాతంత్ర్యం మెడకు తాళ్ళయి
“ చుడుతున్నందుకు బెంబేలెత్తుతున్నాం.
భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం కొనసాగింది.చివరకు ఆగస్టు 15,1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం.తెల్లదొరలను వాళ్ళ బ్రిటిష్ దేశానికి పంపించామని సంబరాలు జరుపుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చింది.ఇక్కడి నల్ల దొరల పాలనలో స్వాతంత్ర్యం ప్రజల మెడలకు ఉరి త్రాళ్లుగా మారింది.నల్ల దొరలు స్వాతంత్ర్యం యొక్క ఫలాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారు.నల్ల దొరల పాలనలో ప్రజల మెడలకు ఉరితాళ్లు బిగిసినాయి.ప్రజలు బెంబేలెత్తుతున్నారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ యమధర్మరాజులు అధికారులు
“ పాశం ప్రయోగించకుండానే ప్రాణాలు తీయగలరు.
యమ ధర్మరాజు నరక లోకానికి అధిపతి.
యముని పాశమును కాలపాశము అని పిలుస్తారు. యముడు ధర్మానుసారం సమయమాసన్నమైనప్పుడు జీవుల ప్రాణాలను హరిస్తాడని చెబుతారు.యముని పాలనలో ఏ విధమైన పక్షపాతానికి,అధర్మానికి స్థానం ఉండదు.యముని నియమాలు కఠోరమైనవి. యముని నగరంను యమపురి అని అంటారు. తెలంగాణలో యమధర్మరాజులు అధికారులుగా పనిచేస్తున్నారు అని చెప్తున్నారు.యమధర్మరాజు పాపం చేసిన వారిని కాలపాశం ప్రయోగించి ప్రాణాలు తీస్తాడు.తెలంగాణలో పని చేసే అధికారులు ఎలాంటి పాశం ప్రయోగించకుండానే ఏ నేరం చేయని అమాయక జనుల ప్రాణాలను బలి గొంటున్నారు.అని చెప్పిన కవితలోని భావనలు, అధికారులు తీసుకున్న చర్యలు అమానుష ఘటనలకు అద్దం పడుతుంది.తెలంగాణ ప్రాంతంలో అధికారులు చేస్తున్న రాజ్య హింస పట్ల కవి శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“బొమ్మరిల్లులా ఉన్న తెలంగాణా పల్లెల్ని
“ పుట్టమన్ను తవ్వేసినట్టు తవ్వేస్తున్నారు
“ అందుకే పాముల బుస బుస –
“ చెట్టుకూ చేమకూ జంతువులకూ జనాలకూ
“ నేల ఎంత ముఖ్యమో నీరంత ముఖ్యం.
బొమ్మలతో ఆడుకోవడానికి ఉపయోగించే ఒక చిన్న ఇల్లును బొమ్మరిల్లు అంటారు.పిల్లలు బొమ్మలు తయారు చేయడానికి పుట్టమన్ను ఉపయోగిస్తారు. పిల్లలు బొమ్మలతో ఆడుకోడానికి ఉపయోగించే బొమ్మరిల్లులా ఉన్న తెలంగాణలో ఉన్న పల్లెల్లో ఉన్న భూముల తాలూకు మట్టిని పుట్టమన్ను తవ్వేసినట్టు తవ్వుతున్నారు.అందుకే పాములు తమ నివాసములైన పుట్టల నుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి చేరి బుసలు కొడుతున్నాయి. ఏ ప్రాంతంలోనైనా చెట్టుకు చేమకు జంతువులకు జనాలకు నేల ఉంటేనే నివాసముంటుంది. జీవమున్న మనుషులకు ప్రాణి కోటిలో భాగమైన చెట్లకు జంతువులకు తాగడానికి నీరు, నివసించడానికి నేల కూడా అవసరం అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ ఇక్కడ కడలి లేదు
“ కన్నీటి సరస్సులున్నాయి
“ పేరుకు రెండు నదులు పారుతున్నా
“ ఊరూరుకు నీటికి కటకట.
కడలి అనగా సముద్రం.ఉప్పునీటితో విశాలమైన భూభాగాన్ని ఆక్రమించినవి సముద్రాలు అని చెప్పవచ్చు.తెలంగాణ ప్రాంతంలో సముద్రం లేదు. తెలంగాణ ప్రాంతంలో నివసించే జనాలు కష్టాల నావలో పయనిస్తూ బాధలు అనుభవిస్తూ ఉండడంవల్ల వారి కళ్లలో కన్నీటి సముద్రాలు వెలసినాయి.తెలంగాణ ప్రాంతంలో పేరుకు కృష్ణ గోదావరి నదులు పారుతున్నప్పటికీ ప్రతి పల్లెలో తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు విలవిలలాడుతున్నారు.
“ ఈ ప్రాంతాన
“ మేఘం అల్గిందా
“ సాగుబడి ఉండదు
“ పునాస పంటలు అమాస చీకటవుతాయి
“ పూట జరగటం కష్టమైపోతుంది.
తెలంగాణ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మరియు రుతుపవనాలు సరైన సమయానికి రాక పోవడం వల్ల మేఘం అల్గి వానలు లేకపోవడం వల్ల వ్యవసాయపు పనులు సాగుట లేదు.సమయానికి పొలాలలో నాట్లు వేయడం లేదు.వర్షాకాలంలో వానలు లేకపోవడం వల్ల పంటలు వేయకపోవడం వల్ల రైతుల బతుకులు అమావాస్యలాంటి చీకటి రోజులలా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. తెలంగాణ పల్లె ప్రజలు పూట గడవక రైతులు వారి కుటుంబ సభ్యులు పస్తులతో గడపాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ నీరు లేని నేల – ప్రాణం లేని మనిషి
“ గోడు గోడు మంటున్నాయి బీడు భూములు.
తెలంగాణ ప్రాంతంలో నీరు లేని నేలలు ఉన్నాయి.తెలంగాణ ప్రాంతంలో సరి అయిన సాగు నీరు లేక కరువు కోరల్లో చిక్కిన నేలలు నెర్రెలు బారి ఎండి పోతున్నాయి.నెర్రెలు బారిన భూమిని చూసి సాగు చేసిన రైతు ప్రాణం లేని మనిషిలా దుఃఖంతో బాధతో విలవిలలాడి పోతున్నాడు.నీరు లేని నేలను చూసి ప్రాణం లేని మనిషిని చూసి బీడు భూములు గోడు గోడు మంటున్నాయి.నేల,మనిషి బాధ పడి దుఃఖిస్తున్నాయి అని కవితలోని చరణాలు చదువుతుంటే హృదయం బాధతో విలవిలలాడి పోతుంది.ఇట్టి కవితను రాయడానికి కవి శ్రీరాములు ఎంతో వేదనను ఎదుర్కొని ఉంటాడు.
“ భూతద్దం పట్టి గాలించినా
“ మొలకలు మొలిచె గట్లు లేవు
“ చిలకలు వాలె చెట్లు లేవు.
కంటికి కనిపించని వాటిని భూతద్దం సహాయం ద్వారా చూడవచ్చు,చదవవచ్చు.తెలంగాణలో నీటి ఎద్దడి కరువు వల్ల భూతద్దం పెట్టి గాలించిన గట్లన్ని ఎండిపోయి ఉంటే మొలకలు ఎలా మొలుస్తాయి? పచ్చదనంతో కళకళలాడుతూ ఉన్న పండ్ల చెట్ల మీద,పంట చేల మీద చిలకలు వాలుతాయి.ఎండిన చెట్ల మీద చిలకలు ఎలా వాలుతాయి? చిలకలు వాలవు.భూతద్దం పెట్టి గాలించినా మొలకలు మొలిచిన గట్లు కనిపించవు.చిలుకలు వాలిన చెట్లు కూడా కనిపించవు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రహదారులూ, రైలు మార్గాలూ గుడ్డిలో మెల్ల
“ లేమి,దరిద్రం,పేదరికం,బీదరికం
“ ఇక్కడి ప్రజలు ధరించుకున్న నిలువుటద్దాలు.
తెలంగాణ ప్రాంతంలో పల్లెల్లో పట్టణాల్లో రహదారులు అభివృద్ధి జరగ లేదు.తెలంగాణలో రైలు మార్గాలు ఉన్నప్పటికీ అన్ని జిల్లాలకు, పల్లెలకు,పట్నాలకు వ్యాపించి లేవు.గుడ్డిలో మెల్లలా
అక్కడక్కడ రైలు సౌకర్యం ఉన్నవి.రైలు సౌకర్యం లేని పల్లెలు, రైలును చూడని ప్రజలు కూడా ఉన్నారు.తెలంగాణ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైన దారిద్రంలో కునారిల్లుతున్నారు.తెలంగాణ ప్రాంతంలో పల్లెలు,పట్టణాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.తెలంగాణ ప్రాంతంలో దరిద్రం,పేదరికంతో బాధపడుతున్న ప్రజలు ఎక్కడ చూసిన కళ్ళముందు ప్రత్యక్షం అవుతారు.
“తెలంగాణా అంటేనే ఆకలికి పుట్టిల్లు
“ అడుక్కుతినే బతుకులు కోకొల్లలు
“ నిన్న పత్తి రైతుల ఆకలి చావులు
“ నేడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు.
ఆకలి అంటే ఏదైనా తినాలి అనిపించే ఒక భావన. ఆకలి వేసిన వెంటనే ఏదైనా తినాలనే కోరిక మనసులో కలుగుట సహజం.తెలంగాణలో తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న జనాలు ఎక్కువగా ఉన్నారు.తెలంగాణలో పిల్లలు ఆకలితో పుడుతున్నారు.తెలంగాణలో తిండికి కరువై యాచకులుగా అడుక్కుతింటున్నారు. తెలంగాణలో కరువు వల్ల నిన్న పత్తి రైతుల ఆకలి చావులను చూశాం.తెలంగాణలో నేడు చేనేత కార్మికులు తిండికి లేక ఉపాధి కరువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఆకలి చావులు,ఆత్మహత్యల విషయాలు తలుచుకుంటేనే గుండె ద్రవిస్తోంది.
“ ఈ ప్రాంతమంతా
“ తృణప్రాయం చేసుకున్న దేహాల కథలే
“ అమాయకుల ఆక్రందన హహాకారాలు పాటలే
“ ఎటు చూసినా ప్రశాంతతలేని వాతావరణం
“ ఏ మూలకు వెళ్లినా రణగొణ ధ్వనులే
“ అక్కడక్కడ ఇంకా వెట్టి బతుకులు
“మట్టి కొట్టుకుపోతున్నాయి పల్లెలు.
తెలంగాణలో ప్రాంతంలో నివసిస్తున్న జనాలను గడ్డి పోచతో సమానంగా చూస్తారు,ఏ మాత్రం విలువ లేదు.బాధ మరియు దుఃఖం కూడినటువంటి ఏడుపును ఆక్రందనగా చెప్పవచ్చు.తెలంగాణ ప్రాంతంలో ఏ మూల చూసినా అమాయకుల ఆక్రందనలు రోదనలు మిన్ను ముట్టుతాయి. తెలంగాణ పల్లెల్లో ఎటు చూసినా ప్రశాంతత కొరవడిన వాతావరణం మనకు అగుపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని ఏ మారుమూల పల్లెకు వెళ్లిన శోకం,దుఃఖంతో కూడిన ఏడుపులు,పెడ బొబ్బలు,కేకలు వినిపిస్తాయి.తెలంగాణ ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్న వెట్టి చాకిరి అనే సాంఘిక దురాచారం కింద నలుగుతున్న బతుకులు.వెట్టి చాకిరి అనగా అప్పు తీసుకున్న వ్యక్తి ఆ అప్పును తీర్చలేక పోయినప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గర జీతం లేకుండా చాకిరీ చేయాలి.స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ పేదరికంతో జీవనం కొనసాగిస్తున్న వాళ్ల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు.ఇంకా యజమాని వద్ద పేదలు వెట్టి పనులు చేస్తూ బతుకుతున్నారు.
“ మూఢాచారాలు – మూర్ఖ విన్యాసాలు
“ వంటింటికే అంటుకుపోతున్నారు స్త్రీలు
“ అంటరానితనం – ఊరువాడా తేడాలు
“ ఇంకా చిన్న చూపునకు గురవుతున్నారు దళితులు
“ మాల మాదిగ – పల్లెకు దూరం
“ శూద్రులు దరిద్రులు – ధనికుల నౌకర్లు.
తెలంగాణ ప్రాంతాల్లో మూఢాచారాలు ఎక్కువగా చదువుకోని వారిలో గ్రామాలలో కనిపిస్తాయి. మనిషిని మనిషిలాగ చూడరు.మూర్ఖంగా ప్రవర్తిస్తారు.తెలంగాణ ప్రాంతంలో ఈనాటికి మూఢనమ్మకాలు,మూర్ఖ త్వాలు ప్రదర్శిస్తూ సాంఘికంగా ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురవుతున్నారు.తెలంగాణ ప్రాంతంలో స్త్రీలకు విద్య నేర్పించాలనే విషయంలో ప్రజలకు సరైన అవగాహన లేదు.స్త్రీలను విద్యకు దూరం చేసి కుటుంబానికి వంటింటికే పరిమితం చేస్తున్నారు. అంటరానితనం అనేది దురాచారం.తోటి మానవుని మానవునిగా చూడలేని మూఢ విశ్వాసం కొనసాగుతున్నది.అంటరానితనం అనాదిగా సమాజంలో ఈనాటికి కూడా తెలంగాణ పల్లెల్లో కొనసాగుతూ ఉంది.అంటరానితనమును అస్పృశ్యత అని కూడా అంటారు.తెలంగాణ పల్లెల్లో మాదిగవాడ,మాలవాడ అనే తేడాలు కొనసాగుతున్నాయి.అణగారిన వర్గాలను దళితులుగా పేర్కొంటారు.వారు అతి తక్కువ స్థాయి వారుగా భావించబడతారు.అంటరాని వారిని దళితులు అని పిలుస్తారు.సమాజంలో ఈ వర్గాన్ని నీచంగా చూసేవారు. దారిద్ర్యంతో పీడింపబడుతున్న వారు,తక్కువ కులానికి చెందినవారు,దళితులుగా ఇంకా చిన్న చూపునకు గురవుతున్నారు.తెలంగాణ ప్రాంతంలో మాలవాళ్లు, మాదిగ వాళ్ళ వాడలు పల్లెకు దూరంగా వెలి వేసినట్లు ఉంటాయి.తెలంగాణ ప్రాంతాల్లో శూద్రులు,దరిద్రులు సంపన్న వర్గాల వారి వద్ద నౌకర్లుగా పనిచేస్తున్నారు.
“ ఖాళీ పొట్టలు కోట్లు
“ పట్టెడన్నం దొరకదు
“ మనుషులున్నారు
“ నడుచుకునే యంత్రాలు – మర బొమ్మలు
“ చెక్క పలకలున్నాయి
“ అక్షరాలు మొలవని విత్తనాలు – చెత్త కాగితాలు.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తినడానికి తిండి లేక ఖాళీ పొట్టలతో అర్ధాకలితో జీవనం సాగిస్తున్న వారు కోట్ల మంది ఉన్నారు అని చెబుతున్నారు.తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు ఆరుగాలం కష్టించినప్పటికీ పట్టెడన్నం దొరకక పస్తులతో గడుపుతున్నారు.నడుచుకునే యంత్రాలు ఆంగ్లంలో moving machines అని అర్థం.ఒక పని చేయడానికి శక్తిని ఉపయోగించే పరికరాలను యంత్రము అంటారు.ఏ రకమైన సాధనంలోనైనా ఇలాంటి పరికరాలు ఉంటే వాటిని యంత్రాలు అంటారు.మర బొమ్మ కర్రతో తయారుచేసిన ఆటవస్తువు.తెలంగాణలో నడుచుకునే యంత్రాలు మర బొమ్మలు కూడా ఉన్నాయి.పలక అనగా చదునుగా ఉండే దృఢమైన రాయి.పిల్లలు పాఠశాలకు వెళ్లునప్పుడు మొదటిసారిగా ఉపయోగించే అలాంటి మెత్తటి రాయి మీద బలపంతో రాసుకుంటారు.మొదట మట్టి పలకలు వచ్చాయి.చెక్కపలక మీద రాసి మలుపుతు ఎన్ని సార్లు అయినా రాయవచ్చు. ఒకప్పుడు చెక్క పలకలే అభ్యాసానికి అనుకూలంగా ఉండేవి.ఇక్కడి ప్రజలు అక్షరాలు నేర్చుకోలేదు.అందుకే అక్షరాలు మొలవని విత్తనాలుగా పనికిరాని చెత్త కాగితాలు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ సొమ్ముల్ని అమ్ముకున్నట్టు పిల్లల్ని అమ్ముకోవడం
“ ఇక్కడి అమాయకత్వానికి ఆగర్భ దరిద్రానికి ప్రతీక.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు బతుకు గడవక బంగారు నగల్ని అమ్ముకున్నట్లు కన్నతల్లి పేదరికంతో పిల్లల్ని అమ్ముకోవడం జరుగుతున్నది. తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు దరిద్రాన్ని పుట్టుకతో మోస్తున్న దుస్థితిని గమనించవచ్చు.
“ ప్రజలు నిస్సహాయులు నిర్భాగ్యులు
“ చట్టాలను ఇష్టమొచ్చినట్టు మార్చి
“ రూలును తాయెత్తులా తగిలించుకోవటం
“ నిరంకుశంగా పాలించటం ఇక్కడి దక్షత.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎటువంటి సహాయం లేనివారు.అటువంటి నిస్సహాయులకు సహాయం కల్పించాల్సిన అవసరం ఉంది.తెలంగాణ ప్రాంతంలో డబ్బు లేని నిర్భాగ్యులు కోట్ల మంది ఉన్నారు.తెలంగాణలోని నిస్సహాయులకు, నిర్భాగ్యులకు సహాయం అందించవలసిన బాధ్యత పాలన చేస్తున్న పాలకులకు ఉంది.తెలంగాణలో రాజ్యం చేస్తున్న పాలకులు చట్టాలను తమ ఇష్టం వచ్చినట్లు మార్చి నీతి, నిజాయితీ,న్యాయం,ధర్మం విషయాలకు తిలోదకాలు ఇచ్చి తమ స్వప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు.ఆంధ్ర ప్రాంతానికి చెందిన పాలకులు నిరంకుశంగా ఆధిపత్యం చెలాయించడం వలన తెలంగాణలోని సామాన్యమైన ప్రజానీకానికి తీవ్రమైన నష్టం ఏర్పడుతున్నది.పాలకులు తీరు మార్చుకోవాలని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ ఇక్కడ ఖనిజ సంపదకు
“ సహజ సంపదకు కొదువ లేదు
“ అడవి,నేల బొగ్గు,భూగర్భ జలాలు
“ కొండలూ,కోనలూ,వాగులూ,వంకలూ అన్నీ ఉన్నాయి
“ దేహం ఎంత అందమైతెనేం కంటిచూపు కరువయ్యాక.
భూమి లోపల సహజసిద్ధంగా లభించే రాతి సమ్మేళనాలను,ఖనిజ వనరులు అంటారు. ఖనిజాలు పునరుత్పత్తి చేయలేని వనరులు అని చెప్పవచ్చు.సహజ వాతావరణం ప్రకృతి పరిసర ప్రాంతాలు వాటి జీవన వైరుధ్యాల్ని బట్టి సహజ వనరులను వర్ణించవచ్చు.సహజ వనరులను ప్రకృతి వనరులు అని కూడా అంటారు.భూమి,నీరు, మత్స్య సంపద, అడవులు,ఖనిజాలు, వాతావరణం,వర్షపాతం ఇవన్ని ప్రకృతిలో భాగమే.తెలంగాణలో ఖనిజ సంపద,సహజ సంపద పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణలో అడవులు, నేల,బొగ్గు,భూగర్భ జలాలు,కొండలు,కోనలు, వాగులు వంకలు అన్ని ఉన్నాయి.ఎంత అందమైన దేహం ఉన్నప్పటికి ఆతనికి కంటి చూపు లేకపోతే ప్రయోజనం ఉండదు.తెలంగాణా ప్రాంతం కంటి చూపు కోల్పోయింది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ ఇంద్ర సభ కాదు తెలంగాణా.
తెలంగాణ ప్రాంతం గురించి చెబుతూ స్వర్గ లోకానికి అధిపతి అయిన ఇంద్రుడు పాలించిన ఇంద్ర సభ కాదు తెలంగాణ అని అన్నాడు.ఇంద్ర సభలో రంభ,ఊర్వశి,మేనక,తిలోత్తమ,ఘృతాచి మొదలైన అప్సరసలు నాట్యం చేస్తూ ఇంద్ర సభలోని పరివారానికి వినోదం కలుగ చేస్తుంటారు.
“ ఇంద్రవెల్లి పోరాటం తెలంగాణా.
తేది 20 – 04 – 1981 రోజున ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి గ్రామంలో ఓ వైపు సంత అంగడి సాగుతుంది.పెద్ద సంఖ్యలో జనాలు సంత రోజు కావడం వలన సరుకులు కొనడానికి వచ్చారు.జనాలు సంతలో తమకు కావాల్సిన సరుకులు కొన్నారు.అదే రోజు ఇంద్రవెల్లిలో జరుగుతున్న గిరిజన రైతు కూలి సంఘం సమావేశానికి హాజరు అయ్యారు. పోలీసులు సభకు అనుమతి లేదని రైతు కూలి సంఘం నిర్వహిస్తున్న సమావేశాన్ని అడ్డుకున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ఆదివాసీ జనాల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. అనేకమంది జనాలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.అయితే ఆ సంఖ్య ఎంతో ఎక్కువ ఉంటుందని అని జనాలు చెబుతారు.ఇంద్రవెల్లి పోలీసు కాల్పుల ఘటనను యావద్దేశం ముక్తకంఠంతో ఖండించింది.ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి గ్రామంలో జరిగిన ఆదివాసి రైతు కూలీలు చేసిన పోరాటం గురించి తలుచుకుంటూ ఇంద్రవెల్లి పోరాటం తెలంగాణ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రంభ ఊర్వశిల నాట్యం కాదు
“ సమ్మక్క సారక్కల జాతర తెలంగాణా.
రంభ,ఊర్వశి ఇంద్ర సభలో నాట్యం చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగజేస్తారు.సమ్మక్క సారక్కల జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో దట్టమైన అడవులు,కొండకోనల మధ్య జరుగుతుంది. సమ్మక్క సారక్కలు యుద్ధంలో వీరోచితంగా పోరాటం చేసిన వీర వనితలు.అట్లాంటి వీర వనితలను కన్న భూమి తెలంగాణ అని చెబుతున్నారు.
“ పురాణ కథ పాతాళ లోకం కాదు తెలంగాణా
పురాణ కథలు చెప్పిన ప్రకారం పాతాళ లోకం భూమి కింది భాగంలో ఉంటుందని,ఇక్కడ రాక్షసులు,యక్షులు,నాగదేవతలు నివాసం ఉంటారని చెబుతారు.పురాణాలు చెప్పిన పాతాళ లోకం కాదు తెలంగాణ అని వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.
“ సింగరేణి నల్ల బంగారం తెలంగాణా.
తెలంగాణ ప్రాంతంలో సింగరేణి గనుల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును నల్ల బంగారం అని పిలుస్తారు.నల్ల బంగారం తెలంగాణకే తలమానికం అని చెప్పిన భావం అద్భుతం.
“ భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం
“ సాయుధమైన దళం – తెలంగాణా
“ వీరనారి అయిలమ్మ
“ విప్లవ వీరుడు కొమురం భీము
“ జన్మనిచ్చిన మట్టి – తెలంగాణా.
సాయుధ పోరాటం అంటే ఆయుధాలు చేపట్టి పాలకులకు వ్యతిరేకంగా చేసే పోరాటం.వెట్టి చాకిరి,భావవ్యక్తీకరణపై తీవ్రమైన ఆంక్షలు, మాతృభాషలపై అణిచివేత,మతపరమైన నిరంకుశ దోరణులపై వ్యతిరేకతను ప్రకటించడం.ఇవే కాక ప్రజలపై బలవంతులైన దొరలు,ఇతర శక్తులు ప్రజలపై దౌర్జన్యం చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడం లేదు.సాయుధ పోరాటం ద్వారా తెలుగు భాషా వ్యాప్తికి ప్రచారం చేస్తూ క్రమక్రమంగా నిజాం పాలనలో ప్రజలపై అమలవుతున్న ఆంక్షలను వ్యతిరేకించడం ప్రారంభించింది.వెట్టి చాకిరి నిర్మూలన కొరకు పోరాటం చేశారు.నిత్యం దళిత కులాలకు చెందిన వారు అధికారుల దొరల ఇళ్లల్లో వెట్టి పనిచేసి దయనీయమైన జీవితం గడపవలసి వచ్చేది. తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి 1951 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగింది.సాయిధ పోరాటంలో 4500 మంది తెలంగాణ ప్రజలు అమరులు అయ్యారు.కాశీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు,దేశముఖ్ లు జమీందారులు,దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. నిజాం ప్రభుత్వం ప్రజలపై బలవంతులైన దొరలు ఇతర శక్తులు దౌర్జన్యం చేయడాన్ని అడ్డుకోలేదు. చాకలి ఐలమ్మ తెలంగాణా ప్రాంతంకు చెందిన వీర వనిత.ఐలమ్మ 1940 – 1944 మధ్య కాలంలో విసునూరులో దేశ్ ముఖ్ దొరలు,రజాకార్ల అరాచకాలు,ఆగడాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది.ఐలమ్మ ఆంధ్ర మహాసభతో పాటు భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు.ఐలమ్మ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చురుకుగా పనిచేసింది.ఐలమ్మ అనారోగ్యంతో పాలకుర్తిలో 1985 సంవత్సరం సెప్టెంబర్ 10 రోజున మరణించింది.కొమురం బీమ్ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన ఉద్యమ నాయకుడు కొమురం చిన్నూ – సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.కొమురం భీమ్ 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అటవీ శాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి కొమరం చిన్నూ మరణించాడు.తదనంతరం కొమురం భీమ్ కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది.కొమురం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు.కొమురం భీమ్ అడవిని జీవనోపాధిగా చేసుకుని అన్ని రకాల నిజాం అధికారాలను తోసిపుచ్చాడు.కొమురం భీమ్ నిజాం నవాబు సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు.కొమురం భీమ్ పశువుల కాపర్ల పై విధించిన సుంకానికి వ్యతిరేకంగా పోరాడాడు.కొమురం భీమ్ తమ భూములలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ భూమి అడవి నీరు మాదే అనే నినాదంతో ఉద్యమించి 27 – 10 – 1948 రోజున జోడేఘాట్ అడవుల్లో జన్మనిచ్చిన మట్టి తెలంగాణలో వీర మరణం పొందాడు.
“ హక్కుల సాధన కోసం
“ మృత వీరుల త్యాగాలే
“ తెలంగాణను రణభూమిని చేశాయి
“ రక్తాన్ని పొంగించాయి – నేలను ఎరుపెక్కించాయి.
తెలంగాణ సాయుధ పోరాటంలో న్యాయమైన హక్కుల సాధన కోసం జరిగిన పోరులో వేలాది మంది బలి అయ్యారు.తెలంగాణ కొరకు పోరాడిన మృతవీరుల త్యాగాల వల్లనే ఈ ప్రాంతం రణభూమిగా మారింది.తెలంగాణ కోసం జరిగిన పోరులో రక్తం ఏరులై పారింది.తెలంగాణలో రక్తంతో తడిసిన నేల ఎరుపెక్కింది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ వీరులు ఎందుకు పుడతారు
“ పోరాటాన్ని అడుగు.
పోరాటంలో ముందు నిలబడి నాయకత్వం వహించేవాళ్ళను వీరులు అంటారు.వీరులు నీతి కోసం ధర్మం కోసం న్యాయంకోసం పుట్టిన నేలను పునీతం చేయడానికి పుడతారు.
“ పోరాటం ఎందుకు పుడుతుంది
“ ఉద్యమాన్ని అడుగు.
ప్రజలు కలిసి సమూహంగా ఒక విశేషమైన లక్ష్యం సాధించడం కోసం పోరాటం చేస్తారు.మనం నివసిస్తున్న సమాజంలో అధర్మం పేరుకుపోతుంటే ధర్మాన్ని కాపాడటానికి పోరాటం పుడుతుంది. పీడిత ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమంలో చేరుతారు.
“ ఉద్యమం ఎందుకు పుడుతుంది
“ సాహిత్యాన్నడుగు.
ఉద్యమం అనేది ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి సమూహం చేసే విధులుగా నిర్వహించబడే ప్రయత్నం అని చెప్పవచ్చు. అణగారిన జనాలు సమర్థవంతమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు శక్తివంతమైన ప్రయోజనకరమైన ఉన్నత వర్గాలను ప్రతిఘటించడానికి సాహిత్యం సహాయం చేయగలదు.ఉద్యమంలో జరిగిన సంఘటనలను గురించి యదార్థ చిత్రణలు సాహిత్యంలో చోటు చేసుకుంటాయి.
“ సాహిత్యమెందుకు పుడుతుంది
“ పీడితుల్ని అడుగు.
వేదన నుంచే సాహిత్యం పుడుతుంది అంటారు. సాహిత్యం మానవ వ్యక్తీకరణలకు రూపం ఇస్తుంది.సాహిత్యం అనేది రచనలు చేసే కళ.సాహిత్యం అనే పదానికి అర్థం హితముతో కూడినదని. మేలు కూర్చే సూచనలు హితబోధలతో ఇది కూడి ఉంటుంది.బాధలు అనుభవిస్తున్న వారినే పీడితులు అని చెప్పవచ్చు.సాహిత్యం పీడితుల వేదన నుంచే పుడుతుంది అని చెప్పిన భావం చక్కగా ఉంది.
“ పీడితులు ఎందుకవుతున్నారు
“ పీడకుల్నడుగు.
సమాజంలో ఉన్నవాడు,లేనివాడు అని రెండు వర్గాలుగా చెప్పవచ్చు.సంపన్నులు,సామాన్య ప్రజల శ్రమను విచ్చలవిడిగా దోచుకుంటూ వాళ్లను బాధల్లోకి నెట్టడం వలన పీడితులు అవుతున్నారు. పీడకులు అనగా ధనవంతులు అని చెప్పవచ్చు. పేదల శ్రమను ఎందుకు దోచుకుంటున్నారు? అని పీడకుల్ని అడగమని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పీడకులెందుకు పుడుతున్నారు
“ పాలకుల్నడుగు.
సమాజంలో ధనిక,బీద తారతమ్యాలు ఇంకా ఈనాటికి కొనసాగుతున్నాయి.ధనికులు బీదవాళ్లపై ఆధిపత్యం చెలాయిస్తూ పీడకులుగా పుడుతున్నారు.పీడకుల గురించి ప్రజలు ఎన్నుకున్న పాలకుల్ని అడుగు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పాలకులెందుకు పుడుతున్నారు
“ ప్రజల్నడుగు.
ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ వాళ్లే పాలకులుగా పుడుతున్నారు.పాలకులు ప్రజా సంక్షేమం కొరకు కృషి చేయాలి.కాని పాలకులు ప్రజా సంక్షేమం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారు. అవినీతి,అధర్మానికి పాల్పడుతున్న పాలకుల గురించి ప్రజలను అడుగు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ అదిగో ఆ ప్రజలే
“ పీడితులు – తాడితులు
“ పోట్లాట – పోరాటం
“ ఉదయం – ఉద్యమం
“ వీరులు – విప్లవం.
తెలంగాణ ప్రాంతంలో అణచివేతకు గురవుతున్న ప్రజల గురించి పేర్కొంటూ ధనికుల దౌష్ట్యానికి బలి అవుతున్న పీడితులు ఉన్నారు.అమాయకులను అకారణంగా వివాదంలోకి లాగి కొట్టబడిన తాడితులు ఉన్నారు.వ్యర్థమైన వాదనలతో ఏర్పడిన పోట్లాట.వ్యక్తుల మధ్య శత్రుత్వం వలన కలిగేది పోట్లాట.ఒక రకమైన గొడవ అందులో స్త్రీలు ఒకరినొకరు జుట్టును పట్టుకొని గొడవ పడడం పోట్లాట.ఇద్దరి మధ్య జరిగే వాదన పోట్లాట.ఇద్దరి మధ్య విరుద్ధ భావంతో చెలరేగేది పోట్లాట.ప్రజలు కలిసి సమూహంగా ఏర్పడి ఒక విశేషమైన లక్ష్యం కోసం చేసే పోరాటం. ఇక్కడ ఆందోళన చేస్తున్న ప్రజల అవసరాలను ఎవరు అర్థం చేసుకోవడం లేదు.ఉదయం వెలుతురుకు సంకేతం.సూర్యుడు ఉదయించే సమయం ఉదయం.సమస్త వర్గాల ప్రజలు సామాజిక మార్పు కొరకు హక్కుల కొరకు పోరాటం చేయడం ఉద్యమంగా చెప్పవచ్చు.వీరులు యుద్ధంలో వెన్ను చూపనివారు.నిజమైన యోధుడు సైతం యుద్ధభూమిలో పోరాడి ప్రాణాలను విడుస్తాడు.యుద్ధంలో వెనుతిరగక ధైర్యంతో సాహసంతో యుద్ధము చేయు వ్యక్తులను వీరులు అంటారు. విప్లవం ఆంగ్లంలో రెవల్యూషన్ అని అర్థం.విప్లవం అనేది ఒక దేశం యొక్క ప్రభుత్వ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ రాజ్యాంగము లేదా సామాజిక వ్యవస్థలో అసాధారణమైన మరియు ఊహించని మార్పు.సాధారణంగా రాజకీయ మార్పులని విప్లవమంటారు.కాని చరిత్రలో సామాజిక ఆర్థిక మరియు సాంస్కృతిక రంగాలలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి.విప్లవం యొక్క అర్థం విస్తృతమైనది.ఇది మానవ జీవితంలోని ఏ రంగంలోనైనా అసాధారణమైన తీవ్రమైన మార్పును సూచిస్తుంది.అణచివేత, అన్యాయమైన పాలన,లంచగొండితనం,అసమర్ధ రాజకీయ వ్యవస్థ మరియు సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న తిరుగుబాటులో నాయకుని పాత్ర చాలా ముఖ్యమైనది.విప్లవాలు ఒక భావజాలానికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఉద్యమ రూపంలో ఉంటాయి.ప్రజల మనసుల్లో భావోద్వేగాల్లో పాత ఆలోచనలకు బదులు కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం విజయవంతం అయితే అది విప్లవంగా పరిగణించబడుతుంది.
“ శ్రీకాకుళం నుండి సిరిసిల్ల దాకా
“ వైర్ లెస్ వ్యూహాలు
“ ఊహలకు ఊపిర్లు
“ గద్దరు పాట – తెలంగాణ తేజం
“ విరసం విసురు – వీరత్వానికి మెలుకువ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం శ్రీకాకుళం నుండి ప్రారంభమై సిరిసిల్ల వరకు తెలంగాణ ప్రాంతం అంతటా విస్తరించింది.తెలంగాణ ప్రాంతంలో దొరల దోపిడీకి దౌర్జన్యాలు, అత్యాచారాలు,శ్రమ దోపిడీకి,వెట్టి చాకిరి నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటాల వెల్లువ కొనసాగింది.గ్రామాల్లో చైతన్యంతో ప్రజలు ఉద్యమాల్లో చేరి తమ హక్కుల కొరకు పోరాటం చేశారు.వైర్ లెస్ వ్యూహాలు ఫోన్స్ రేడియో తరంగాల ద్వారా టెక్నాలజీ రోజు రోజుకు ముందుకు దూసుకుపోతుంది.టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్ది జనరేషన్ మారుతూ వస్తూ ఉంటుంది.వ్యూహం ఎందుకు అంటే లక్ష్యాలను సాధించడానికి చర్యలను నిర్ణయించడం,చర్యలను అమలు చేయడానికి వనరులు సమీకరించడం,వనరుల ద్వారా లక్ష్యాలు ఎలా సాధించబడతాయో వ్యూహం వివరిస్తుంది. వ్యూహం అనేది పనిని సాధించడానికి ముఖ్యం. వ్యూహంతో పని చేస్తే విజయాలను సాధించడానికి వీలవుతుంది.దొరలు వారి తాబేదారులు నుండి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రజలు స్వేచ్ఛగా మరియు విశ్వాసంతో తమ జీవితాలను గడపడానికి ప్రయత్నిస్తుంది.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న జనాల్లో ఊహలకు ఊపిర్లు పోసుకున్నాయి. ఊహను ఆలోచన అని కూడా అంటారు.ఊహలు సాధించడానికి శాస్త్రీయ పద్ధతులతో కొన్ని పరీక్షలు అవసరమవుతుంటాయి.
గద్దర్ 08 – 10 – 1949 రోజున మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో జన్మించారు.గుమ్మడి విట్టల్ రావును గద్దర్ అని పిలుస్తారు.తల్లిదండ్రులు లచ్చుమమ్మ,శేషయ్య.నక్సలైట్ మావోయిస్టు తిరుగుబాటుతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో గద్దర్ చురుకుగా పనిచేశారు.గద్దర్ పాటలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.గద్దర్ భౌతికంగా లేకపోయినా ఆయన రాసిన పాటలు వినిపిస్తూనే ఉంటాయి.గద్దరు పాట తెలంగాణ తేజం అని వాస్తవం తెలియజేశారు.విప్లవ రచయితల సంఘం విరసం మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనతో భారతదేశంలో జరుగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవ కార్యాచరణను ఎత్తిచూపుతూ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న సంస్థ అని చెప్పవచ్చు.నక్సల్బరి శ్రీకాకుళం ఆదివాసీ విప్లవ శిశువుగా విరసం విప్లవోద్యమం వెనువెంట నడుస్తూ భారత పోరాట ప్రజల చరిత్రలో విస్తరిస్తుంది. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూ ఎందరో వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు.
వీరుల అమరత్వం వీరత్వానికి మెలకువగా చెప్పవచ్చు.
“ పెట్రోలొక్కటి చేత పట్టుకొని
“ ప్రపంచాన్ని శాసిస్తున్న
“ చిన్నచిన్న రాజ్యాల్ని చూస్తున్నాం కదా!
పెట్రోలు ఉత్పత్తి చేస్తున్న చిన్న చిన్న దేశాలు కూడా ప్రపంచాన్ని శాసిస్తున్నాయి.సౌదీ అరేబియా ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశంగా పేరు పొందింది.ఆయిల్ విక్రయాల మూలంగా సౌదీ అరేబియా సమాజం మీద గొప్ప ప్రభావం చూపింది.
“ యంత్రాల మీద మేడ్ ఇన్ లు అచ్చేసి
“ పొరుగు దేశాలతో
“ పోటీ పడుతున్న కృషి కంటున్నాం కదా!
పొరుగు దేశాలు తయారుచేసిన యంత్రాల మీద మేడ్ ఇన్ చైనా మేడిన్ ఇన్ జపాన్ లేబుల్స్ సెట్ చేసి తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు పోటీ పడుతూ అమ్ముతూ అత్యధికమైన లాభాలను ఆర్జిస్తున్నారు.జపాన్ దేశస్తులు తయారుచేసిన ఉత్పత్తులు నాణ్యతతో కూడి ఉంటున్నాయి. పొరుగు దేశాల కృషికి నిదర్శనంగా తయారుచేసిన ఉత్పత్తులు నిలుస్తున్నాయి.పొరుగు దేశాలు విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.
“ ప్రపంచ జనాభాలో
“ ప్రథమ స్థానంలో ఉన్నా
“ పనితనంలో బేస్ అనిపించుకుంటున్న
“ విదేశీ విధానాన్ని వింటున్నాం కదా!
చైనా దేశం ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానంలో నిలిచింది.చైనా దేశం పనితనంలో నైపుణ్యం చూపిస్తూ తమ దేశంలో తయారైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ సంపన్న దేశంగా పేరు తెచ్చుకుంది.చైనా విదేశీ విధానం ద్వారా మేలైన ఫలితాలను అందుకుంటూ ప్రపంచ దేశాలలో ప్రశంసలు అందుకుంటోంది.
“ అగ్రరాజ్యాలను ఆశ్చర్యపరిచిన
“ సాహస దేశాల కథలు
“ చదువుతున్నాం కదా!
ప్రపంచ దేశాలన్నింటిలో అతి శక్తివంతమైన దేశాలను అగ్రరాజ్యాలు అంటారు.అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అమెరికా,సోవియట్ రష్యా, బ్రిటన్,ఫ్రాన్స్,చైనా ఐదు దేశాలు పేర్కొనదగ్గవి. సాహస దేశాలుగా కొరియా మరికొన్ని దేశాల కథలు చదువుతున్నాం.
“ పగవాడి ముందు జారిపడ్డట్టు
“ నవ్వేటి బతుకైంది ఏల
“ నను గన్న ఈ నా నేల?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంను ఆంధ్ర ప్రాంతమునకు చెందిన నాయకులు పరిపాలించారు.ఆంధ్ర ప్రాంతమునకు చెందిన నాయకులు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నాయకుల అసమర్ధత కారణంగా నీళ్లు,నిధులు, ఉద్యోగాలు,సమస్త సంపదను అప్పనంగా దోచుకున్నారు.తెలంగాణ ప్రాంతంలో జన్మించిన ప్రజలు తెలివి తెగువ చూపని కారణంగా ఆంధ్రా ప్రాంతం వాళ్ళ దోపిడీకి గురి అయి పగవాడి ముందు జారిపడ్డట్టు నవ్వుల పాలైంది బతుకు. నను గన్న ఈ నేల తెలంగాణ గురించి చెబుతూ కవి శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“ గడ్డమీద ఆరేసిన చేప పిల్లలానో
“ చర్మం తీసిన పులిలానో చేస్తున్నదెవరు?
తెలంగాణ ప్రాంతం గురించి చెబుతూ గడ్డమీద ఆరేసిన చేప పిల్లకు ప్రాణం ఉండదు.చర్మం తీసిన పులికి ప్రాణం ఉండదు.చేప పిల్ల నీటిలో ఈదుతూ తన సహజ స్వభావంతో బతుకుతుంది.అడవిలో పులి స్వేచ్ఛగా తిరుగుతూ ఆకలి అయినప్పుడు జంతువులను వేటాడుతూ గడుపుతుంది.నీటిలో తిరుగుతున్న చేప పిల్లను గడ్డమీద ఆరేసినది ఎవరు?అడవిలో స్వేచ్ఛగా సంచరించే పులిని వేటాడి చర్మం తీసింది ఎవరు? తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను గడ్డమీద ఆరేసిన చేప పిల్ల వలె చర్మం తీసిన పులి వలె చేసి దోచుకుంటున్న ఆంధ్ర ప్రాంతం నాయకుల దమన నీతిని ఎండగట్టారు.
“ ప్రాంతాన్ని వెనుకబడేయటం నీచం
“ జాతిని వెలుగొందనీయక పోవటం నికృష్టం.
తెలంగాణ ప్రాంతం యొక్క సంపదను సులువుగా దోచుకోవడం,అభివృద్ధికి ఆమడ దూరం ఉంచుతూ వెనుకబాటుతనానికి గురి చేయడం హీనమైన భావం నీచం అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న జాతిని కాంతులు విరజిమ్మకుండా చేస్తున్నారు.ఆంధ్ర ప్రాంతం వాళ్లు పాల్పడుతున్న బాగోతాన్ని రట్టు చేస్తూ హీనమైన చర్య నికృష్టం అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ కొండ్రగట్టి నాగళ్ళు దున్నిన భూమి ఉంది
“ ట్రాక్టర్లూ పంట కోసే మిషన్లూ లేవు.
తెలంగాణ ప్రాంతంలో నివసించే రైతులు సేద్యం చేయడానికి కొండ్రగట్టి నాగళ్ళకు అవసరమైన దుక్కి దున్నిన భూమి ఉంది.తెలంగాణ ప్రాంతంలో పంట పండించే రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు మరియు పంట కోసే మిషన్లు రైతుల వద్ద లేవు.ట్రాక్టర్లు పంట కోసే మిషన్లు ఎక్కడ కనిపించవు అనే వాస్తవాన్ని వ్యక్తీకరించడం చక్కగా ఉంది.
“ ఏతం వేసే వానాకాలం వాగులున్నాయి
“ మోటగొట్టిన బావులున్నాయి
“ ప్రాజెక్టులూ పంపుసెట్లు లేవు.
తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతులు పండిస్తున్న పంటలకు ఏతం వేసి పారించే వానాకాలం వాగులున్నాయి.తెలంగాణ ప్రాంతంలో రైతులు పంటలు పండించడానికి రెండు కాడి ఎడ్లతో మోటగొట్టిన బావులున్నాయి.తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతాంగం సాగు చేయడానికి ఎలాంటి ప్రాజెక్టులు లేవు.వ్యవసాయం చేసే రైతులకు వాగుల వద్ద పంపు సెట్లు లేవు.తెలంగాణ ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులకు ప్రాజెక్టులు లేకపోవడం వల్ల సరి అయిన నీటి సౌకర్యం లేకపోవడం,ట్రాక్టర్లు,పంపుసెట్లు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పడుతున్న బాధలను చూసి హృదయం ద్రవించి పల్లె వాసిగా కవి శ్రీరాములు వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది. .
“ ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రమున్నా
“ అన్నీ చీకటి కూకటి బతుకులే
“ ఇక్కడ కాగితపు పరిశ్రమలున్నా
“ అంతటా నిరక్షరాస్యత నిర్భాగ్యులే. తెలంగాణ ప్రాంతంలో గొప్పగా చెప్పుకోవడానికి థర్మల్ విద్యుత్ కేంద్రం ఉన్నది.తెలంగాణ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేసిన విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు సరైన విద్యుత్తు లభించక అంధకారంలో మగ్గుతున్నారు. వ్యవసాయం సాగు చేసే రైతులకు సరైన విద్యుత్ సౌకర్యం లభ్యం కావడం లేదు.తెలంగాణ ప్రాంతంలో పేరుకే కాగితపు పరిశ్రమలు ఉన్నాయి.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు చదువుకు నోచుకోకుండా నిరక్షరాస్యులుగా మిగిలినారు, దుర్భర దారిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ చక్కెర కర్మాగారాలున్నా
“ చేనేత పరిశ్రమలున్నా
“ పని దొరకదు – పైసా చేతిలో ఉండదు.
తెలంగాణ ప్రాంతంలో నివసించే ప్రజలకు చక్కెర కర్మాగారాలు చేనేత పరిశ్రమలు ఉన్నప్పటికీ చేయడానికి పని దొరకదు.చేతిలో పైసా ఉండదు. దుర్బర దారిద్రంతో గడుపుతున్న తెలంగాణ ప్రాంత ప్రజల దీనావస్థను వ్యక్తీకరించడం చక్కగా ఉంది.
“ కొబ్బరి చెట్లు నాటుకోలేరు
“ కూల్ డ్రింకులు కొనుక్కోలేరు
“ అంతా ఎండమావులే.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తమ భూముల్లో కొబ్బరి చెట్లు నాటుకోలేరు.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు పేదరికంతో కూల్ డ్రింకులు కొనుక్కోలేరు.కాంతి కిరణాలు ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదలాడుతున్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే నీరు ఉన్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావం.ఎండ సమయాలలో తారు రోడ్డు మీద మనం నిలబడినప్పుడు కొంత దూరంలో రోడ్డుమీద నీటిమడుగు ఉన్నట్టు కనిపిస్తుంది.కాని అక్కడ నీరు ఉండదు.ఈ విధంగా భ్రమ కలిగించే మాయా నీటిమావులను ఎండమావులు అంటారు.తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎండమావులే కనిపిస్తాయి అని చెప్పడం చక్కగా ఉంది.
“తునికాకులు చుట్టినట్లు
“ ఇక్కడ జీవితాల్ని చుడతారు
“ బీడీలకు దారాలు కట్టినట్లు
“ మెడకు ఉరి తాళ్లు బిగిస్తారు
“ పొగాకును అంటి పెట్టి తాగినట్టు
“ మనుషుల్ని మంటలో వేసి ఆనందిస్తారు.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న మనుషులు గడుపుతున్న జీవితాల్ని తునికాకులు చుట్టినట్లు చుడతారు.తునికాకులు చుట్టిన బీడీలకు దారాలు కట్టుతారు.అలాగే తెలంగాణలో మనిషి మెడకు బీడీలకులాగా ఉరి తాళ్లు వేసి బిగిస్తారు.పొగాకు కలిపిన బీడీని నిప్పుతో అంటించి తాగినట్లు మనుషుల్ని మంటలో వేసి వేడుకగా ఆనందిస్తారు. బీడీలు తాగడం అనే వ్యసనంలాగే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మనుషుల జీవితాలను ఆహుతి చేసే దుర్మార్గం కొనసాగుతుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ భయం ఇక్కడ వెన్నులా వెంటాడుతుంది
“ చీకటంటే భయం – చేతబడి అంటే భయం
“ దొంగ ఆంటే భయం – దోపిడీ అంటే భయం.
తెలంగాణ ప్రాంతంలో జీవించే మనుషులు భయంతో వణికి పోతారు.భయం ఇక్కడ మనిషి శరీరం వెనకాల ఉన్న వెన్నును కూడా వదలకుండా వెంటాడుతుంది.తెలంగాణ ప్రాంతంలో నివసించే జనులకు చీకటి అంటే చెప్పలేని భయం అని చెబుతున్నారు.పొద్దుగూకగానే చీకటి ముసురుకుంటుంది.చీకట్లో కొందరు అసాంఘిక శక్తులు చేసే దుర్మార్గపు చర్యలు తలుచుకొని చీకటి అంటే భయం గుబులుతో గడుపుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో నివసించే జనులు మూఢవిశ్వాసాల ఊబిలో కూరుకుపోయి చేతబడి చేస్తారనే భయంతో దిగులుతో జీవనాన్ని గడుపుతున్నారు.చేతబడి అంటే గిట్టని వారిని చంపటానికో హాని చేయడానికో చేతబడి చేయించే విద్య.పలానా వ్యక్తి చేతబడి చేయడం వల్ల తమకు నష్టం జరిగిందని భావించి పగతో ప్రతీకారంతో రగిలి ఒకరినొకరు చంపుకుంటున్న దీన స్థితిని చూస్తున్నాం.ఇనుప పెట్టె తాళాలు పగల కొట్టి ఇంటిలోని నగలు సామాన్లు దోచుకునే వ్యక్తిని దొంగగా చెప్పవచ్చు.తెలంగాణలో ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఆకలితో పేదరికం వల్ల బతుకు గడపక దొంగతనాలు వృత్తిగా చేసుకొని బతుకుతున్నారు.దోపిడీకి ప్రేరణ సమాజంలోని తారతమ్యాలు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ఈ దోపిడీలు శతాబ్ద కాలం నుండి జరుగుతున్నాయి. బలవంతమైన ధనిక వర్గం ప్రజలు పేదల రక్తం పీల్చి వారి వద్దనున్న సంపదను శ్రమను దోపిడీ చేసేవారు. పేదలు ధనికులు చేస్తున్న దుర్మార్గం చర్యలను ప్రతిఘటించలేక పోయేవారు.ఈ సంఘర్షణలే బలవంతంగా నైనా తమ హక్కులను సాధించాలనే వారిని పురి గొల్పాయి.తెలంగాణ ప్రాంతాల్లో దోపిడీ భయం కొనసాగుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ తెలంగాణాను ఎడారిగా ఉంచిందెవరు
“ అన్నం లేని అక్షరాలు రాని
“ అవిటి దానిలా తయారు చేసిందెవరు?
తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా ఉంచింది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు.తెలంగాణ ప్రాంతంలో ఉన్న వనరులను దోచుకుని ఎడారిగా మార్చింది ఆంధ్రా పాలకులు అని చెప్పటంలో సందేహం లేదు. తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రకాలుగా మోసంతో వంచనతో ఎందుకు పనికిరాని బంజరు ప్రాంతంగా మార్చిన దుస్థితిని ఎండగట్టారు.ఎడారి అనగా ఎటువంటి వృక్ష సంపద నీరు లేకుండా కేవలం ఇసుకతో ఉన్న విశాలమైన భూభాగం అని చెప్పవచ్చు.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న రైతులు పంటలు పండించి గిట్టుబాటు ధరలు రాక ఆకలితో అలమటిస్తూ దుర్భర దారిద్ర్యంతో జీవనాన్ని ఈడుస్తున్న దుస్థితిని కంటున్నాం. తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అక్షరాలు రాని నిరక్షరాస్యులుగా అవయవాలు పనిచేయని అవిటిదానిలా తయారు చేసింది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికీ ఈ ప్రాంతంలో చదువు రాని నిరక్షరాస్యులు ఎక్కువగా కనిపించడానికి కారణం చదువుకు దూరం చేసి అజ్ఞానంలో అంధకారంలో మునిగేటట్లు చేసింది,తెలంగాణను పాలించిన ఆంధ్ర పాలకుల కుటిల నీతి అని చెప్పవచ్చు.
“ ఓటు ఇచ్చింది ఎవరు
“ మోటు మనుషులుగా చేస్తుందెవరు?
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు లభించింది. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు పాలకుల దమన నీతి వల్ల దుర్వినియోగం అవుతుంది. తెలంగాణ ప్రాంతం ప్రజలు అజ్ఞానం వల్ల ఓటు వేసి గెలిపించడం వల్లనే ఆంధ్ర పాలకుల నాయకత్వం దోపిడీ కొనసాగింది.ఇక్కడ నివసిస్తున్న ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రావాళ్లు తెలంగాణ ప్రాంతం వారిని చదువురాని అనాగరికులుగా కళా,సాహిత్యం సినిమా రంగాలలో ఇక్కడి యాస,భాషను హీనంగా చూపిస్తూ హేలనగా చేస్తున్నది మోటు మనుషులుగా చూపిస్తున్నది ఆంధ్రావాళ్లు అని చెప్పుటలో సందేహం లేదు.
“ సంతకాలు రాని వేలిముద్రగాళ్ళుగా తీర్చిదిద్ది
“ గోళ్లను కత్తిరించి సింహాలను
“ బోనులో బంధించిందెవరు?
తెలంగాణ ప్రాంతంకు చెందిన ప్రజలను పేదరికం వల్ల చదువుకు స్వస్తి పలికి,చదువు రాని నిరక్షరాస్యులుగా తయారు చేశారు.ఇక్కడ ప్రజలు అజ్ఞానంతో అవిద్యతో అంధకారంలో మునిగినారు. చదువు రాని జనాలు సంతకాలు ఎలా చేయగలరు?సంతకం చేయ రాదు.చేతితో వేలిముద్ర వేసే వాళ్ళు.గోళ్లను కత్తిరించి తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను సింహాల వలె బోనులో బంధించి ఆంధ్ర ప్రాంతం వాళ్లు ఆటలు ఆడుతున్నారు.తెలంగాణ ప్రాంత ప్రజలపై ఆంధ్ర ప్రాంత పాలకుల నాయకత్వం కొనసాగుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ వృత్తాకారంలో తెలంగాణ
“ వృత్తి కళాకారులతో తెలంగాణ
“ భాష తెలంగాణ యాస తెలంగాణ
“ జనుల నాలుకల మీద ఓలలాడుతున్న జానపదం తెలంగాణ.
వృత్తము జ్యామితి అనే గణిత శాస్త్ర విభాగానికి చెందిన ఒక భావన.వృత్తాకారం రూపంలో తెలంగాణ ఉందని చెబుతున్నారు.తెలంగాణ ప్రాంతంలో సబ్బండ వర్ణాల ప్రజలు సకల వృత్తి కళాకారులు కూడా ఉన్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసించే జనాలు మాట్లాడే భాష,మాట్లాడే యాస తెలంగాణ ప్రాంతంకు చెందినదని గర్వంగా చెప్పవచ్చు.జానపద సంగీతం యొక్క అర్థం గ్రామీణ జనుల సంగీతం.జనులకు సంబంధించింది జానపదం.ఆంగ్లంలో Music Of Folk అని అంటారు.జానపదులు అంటే పల్లె ప్రజలు అని చెప్పవచ్చు.పల్లె ప్రజలు పాడేది జానపదం. జానపదం జనుల హృదయాల్లోంచి స్వేచ్ఛగా పుట్టినది.ఆధునిక శాస్త్రీయ సాంకేతికజ్ఞానం, అభివృద్ధి చెందని రోజుల్లో వ్యవసాయం ప్రజలకు జీవనోపాధిగా ఉండేవి.జనం రకరకాల పాటలు పాడుకుంటూ పనులు చేసుకునేవారు.అవే జానపద గీతాలు.జానపద గీతాలు పల్లె పాటలు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ గోసి గుడ్డ గొంగడి బొంత
“ ఇవే ఇక్కడి ప్రజల ఆస్తులు – అంతస్తులు.
తెలంగాణ ప్రాంతంలో నివసించే జనాలు తరతరాలుగా గోసి గుడ్డ కట్టుతో గొంగడి బొంత భుజాన వేసుకుని జీవనం సాగిస్తున్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసించే జనుల జీవితాల్లో తరాలుగా మార్పు లేదు.స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్లు అయినా పేదరికంతో గోసి గుడ్డ కట్టుకుని గొంగడి బొంత భుజాన వేసుకుని తిరుగుతున్న జనులను చూసి తెలంగాణ ప్రజల వస్త్రధారణ వారి యొక్క జీవితంలో లభించిన ఆస్తులు,అంతస్తులు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ ఇప్పటికీ
“ ఇంకా నడుముకు జకుముక రాయి – దూది
‘ తలకు రుమాలు – నోట్లో చుట్ట – చేతిలో కట్టే
“ అర్ధ నగ్న శరీరాలతో ఆకలి కడుపుల్తో
“ ఏదో గొప్ప వేషం – అదో అద్భుత సజీవ భాష
“ నేలంతా వాకిలై – ఆకాశమంత ఇల్లయి
“ రాత్రింబవళ్లు కష్టించే
“ శ్రామికులు – కార్మికులు – కర్షకులూ ఇక్కడి ప్రజలు.
తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల గురించి చెబుతూ స్వాతంత్రం వచ్చినప్పటికి ఇప్పటికి వాళ్ళ బతుకుల్లో ఎలాంటి మార్పు లేదు.తెలంగాణ ప్రజలు నడుముకు జకుముకరాయి,దూది,తలకు రుమాలు చుట్టుకొని,నోట్లో చుట్ట,చేతిలో కట్టె పట్టుకొని తిరుగుతూ అర్థనగ్న శరీరాలతో సరియైన బట్టలు లేక,తినడానికి తిండి లేక,ఆకలి కడుపులతో జీవిస్తున్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలది గొప్ప వేషం అని చెబుతూ అదో అద్భుతమైన సజీవమైన భాషగా పేర్కొనడం కవి శ్రీరాములుకు తెలంగాణ ప్రజల దుస్థితి పట్ల గల ఆవేదన అర్థమవుతున్నది.తెలంగాణ ప్రజలకు సరైన గూడు లేని స్థితిని తెలుపుతూ పూరి గుడిసెల్లో కొందరు చెట్ల కింద కొందరు నివసిస్తున్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న గూడు లేని ప్రజలకు నేలంతా వాకిలిగా ఆకాశం అంతా వారి ఇల్లు అని దీనస్థితిని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో శ్రామికులు,కార్మికులు, కర్షకులు,ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రింబవళ్లు కష్టపడతారు అని వ్యక్తం చేయడం చక్కగా ఉంది.
“ ఇది ఇక్కడి జాతి సంస్కృతి
“ తెలంగాణ ప్రజలు – కారాదెన్నడు సవతి పిల్లలు.
ఆకృతి,ధర్మము,మొదలైన వాటిలో సమాన దృష్టితో ఆలోచించే చేసే విభాగం జాతి అని అంటారు. వంశపారంపర్యంగా వచ్చే కుల సంప్రదాయం జాతి.సంస్కృతి అనగా ఆంగ్లంలో Culture అని అర్థం.మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను ఆనగా జీవనం, ఆచారాలు,వ్యవహారాలు,ప్రమాణాలు,మతం, సంబంధాలు,పాలన వంటి వాటిని సూచించే పదం. ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు,సంస్థలు తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్ని కలిపి సంస్కృతి అంటారు.సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానం ఆ సమాజపు సంస్కృతి అని చెప్ప వచ్చు.గతించిన కాలం గురించి భవిష్యత్తు తరాలకు అందించే వారధి సంస్కృతి. తెలంగాణ ప్రాంతంలో సబ్బండ వర్ణాల ప్రజలు,సకల వృత్తి కళాకారులు కూడా ఉన్నారు.తెలంగాణ ప్రాంతంలో నివసించే జనులు మాట్లాడే భాష మాట్లాడే యాస తెలంగాణకు చెందినదని గర్వంగా చెప్పవచ్చు.జానపదులు అంటే పల్లె ప్రజలు.పల్లె ప్రజలు పాడేది జానపదం.జనుల హృదయాల్లో నుంచి స్వేచ్ఛగా పుట్టినది జానపదం. ఆధునిక, శాస్త్రీయ,సాంకేతిక విజ్ఞానం,అభివృద్ధి చెందని రోజుల్లో వ్యవసాయం లాంటి శారీరక శ్రమ కలిగిన వృత్తులే జీవనోపాధిగా ఉండేది.జనం ఆ శారీరక శ్రమ నుండి ఉపశమనం కోసం రకరకాల పాటలు పాడుకుంటూ ఉల్లాసంగా పనులు చేసుకునేవారు, అవే జానపద గీతాలు.నాన్న రెండో భార్యను సవతి తల్లి అని పిలుస్తారు.జీవిత భాగస్వామి యొక్క మునుపటి భార్య నుండి కలిగిన పిల్లలను ఆమె సవతి పిల్లలు అని పిలుస్తారు.తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రావాళ్ల పాలన నిరంకుశంగా కొనసాగింది. తెలంగాణ వాళ్లు ఆంధ్ర తల్లికి పుట్టిన సవతి పిల్లలు కాదు.తెలంగాణ తల్లికి జన్మించిన శిశువులను ఏమని పిలుస్తారు? తెలంగాణ పిల్లలు అని చెప్పిన తీరు చక్కగా ఉంది. శ్రీరాములు రచించిన నన్ను గన్న నా నేల కవిత, కవ్వం కవితా సంపుటిలోని మొదటి కవిత.కవ్వం కవితా సంపుటిని 2002 సంవత్సరంలో ప్రచురించారు.2002 నాటి తెలంగాణలోని సామాజిక ఆర్థిక పరిస్థితులు జనుల జీవితాలకు నన్ను గన్న నా నేల కవిత అద్దం పడుతుంది.నన్ను గన్న నా నేల కవిత తెలంగాణ ప్రాంతం యొక్క చరిత్రకు అక్షర రూపం ఇవ్వడం అద్భుతం అని చెప్పవచ్చు.కందుకూరి శ్రీరాములు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.తెలంగాణ చరిత్రను నన్ను గన్న నా నేల కవితలో నిక్షిప్తం చేసినందుకు కవి కందుకూరి శ్రీరాములును అభినందిస్తున్నాను.
రచన : నరేంద్ర సందినేని.
కందుకూరి శ్రీరాములు తేది 20 – 10 – 1954 రోజున రావురూకుల గ్రామంలో జన్మించారు.తల్లిదండ్రులు : రత్నమ్మ, వెంకటాద్రి.తండ్రి వెంకటాద్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.తాత నరసయ్య, నాయనమ్మ కమలమ్మ.తాత నరసయ్య పూజారిగా పని చేశారు.తాత తండ్రి శేషయ్య పంతులు కవిగా ప్రసిద్ధి చెందారు.శేషయ్య పంతులు రాసిన పుస్తకాలు అలభ్యం అని చెప్పవచ్చు.ముత్తాత శేషయ్య పంతులు వల్ల శ్రీరాములుకు కూడా కవిత్వం అబ్బింది.శేషయ్య పంతులు రాసిన ఒక పద్యం దొరికితే శ్రీరాములు దానిని రావురూకుల కవితా సంపుటి లో ముద్రించారు.శ్రీరాములు 1 వ తరగతి నుండి 7వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల రావురూకుల గ్రామంలో చదివారు. శ్రీరాములు 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు జెడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ పాఠశాల, పుల్లూరు గ్రామంలో చదివారు.శ్రీరాములు ఇంటర్మీడియట్ విద్యను,డిగ్రీ విద్యను ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల,సిద్దిపేట గ్రామంలో చదివారు.శ్రీరాములు ఎం.ఏ.(తెలుగు) ఉస్మానియా విశ్వవిద్యాలయం,హైదరాబాదులో చదివారు. శ్రీరాములు ప్రభుత్వ తెలుగు భాషా పండితులుగా పనిచేసి 2009 సంవత్సరంలో రిటైర్ అయ్యారు. శ్రీరాములు విద్యార్థి దశ నుండి సాహిత్య రచన చేయడం ఆరంభించారు.శ్రీరాములు వివాహము లక్ష్మీశ్రీ తో తేది 14 – 05 – 1984 రోజున హైదరాబాదులో జరిగింది.శ్రీరాములు భార్య లక్ష్మీశ్రీ కేంద్రీయ విద్యాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.శ్రీరాములు లక్ష్మిశ్రీ దంపతులకు ఒక్కతే సంతానం.పేరు కందుకూరి హర్షిని.హర్షిని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదివింది.హర్షిని మెడిసిన్ లో పీజీ విద్యను అభ్యసించుచున్నది.
కందుకూరి శ్రీరాములు ముద్రించిన కవితా సంపుటాల వివరాలు.
1) దివిటి కవితా సంపుటి – 1974. కందుకూరి శ్రీరాములు సహ రచయితలు నందిని సిధారెడ్డి,కర్నాల బాలరాజు).
2) వయోలిన్ రాగమో వసంత మేఘమో – కవితా సంపుటి. 1993.
3) సందర్భం కవితా సంపుటి – 2001.
4) కవ్వం కవితా సంపుటి – 2002.
5) దహన కావ్యం దీర్ఘ కవిత – 2003.
6) పీఠభూమి కవితా సంపుటి – 2005.
7) వెన్నెల బలపం కవితా సంపుటి – 2008.
8) రావురూకుల కవితా సంపుటి – 2009.
9) తెలంగాణ రథం కవితా సంపుటి – 2013.
10)అలుకు పిడుచ కవితా సంపుటి – 2017.
11)Bhagiratha’s Bounty and other poems (Trans : T.S.Chandramouli) – 2020.
12). ఒక గురువుగారు నలుగురు శిష్యులు : నందిని సిధా రెడ్డి,కందుకూరి శ్రీరాములు,ఆశారాజు, నాళేశ్వరం శంకరం.
కందుకూరి శ్రీరాములు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అందుకున్న పురస్కారాలు :
1)తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాహిత్యంలో విశేష సేవలు అందించిన వారికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ లెవెల్ అవార్డు తేది 02 – 06 – 2018 రోజున రూపాయలు 1,00,116/- నగదు,ప్రశంసా పత్రం,సన్మానం అందుకున్నారు.
2) ప్రీవర్స్ ఫ్రంట్ అవార్డు సందర్భం కవితా సంపుటికి 2003.
3) తెలుగు యూనివర్సిటీ, సాహిత్య పురస్కారం సందర్భం కవితా సంపుటికి 2004.
4) సినారె కవితా పురస్కారం రావురూకుల కవితా సంపుటికి 2010.
5) ఉమ్మడిశెట్టి కవితా పురస్కారం వయోలిన్ రాగమో వసంత మేఘమో కవితా సంపుటికి 1994.
6) ఈదూరు సుబ్బయ్య సాహితీ పురస్కారం రావురూకుల కవితా సంపుటికి 2010.
7) ఆంధ్ర సారస్వత సమితి ప్రతిభా పురస్కారం వెన్నెల బలపం కవితా సంపుటికి 2009.
8) విశ్వ కళా పీఠం స్నేహ నిధి పురస్కారం. కవ్వం కవితా సంపుటికి 2003.
9) అల్లూరి సీతారామరాజు కళా పీఠం కవితా రమ పురస్కారం వెన్నెల బలపం కవితా సంపుటికి 2010.
10) శాతవాహన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ముదిగంటి నరసింహారెడ్డి సాహితీ పురస్కారం 2014.
11) స్వర్గీయ కర్పూరం మధుసూదన స్వామి సాహిత్య పురస్కారం 2016.
12)శ్రీ మనస్సంపన్ముడుంబై రంగ కృష్ణమాచార్యులు విరించి స్మారక పురస్కారం
13) కుందుర్తి రంజని సంస్థ కవితల పోటీలలో ఉత్తమోత్తమ కవితా పురస్కారం
14) పాలమూరు కవితా పురస్కారం
15) కాళోజీ పురస్కారం
16) ప్రజాభారతి సాహిత్య పురస్కారం
17) కవి శిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ ప్రోత్సాహక పురస్కారం
18) మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
19) జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మెదక్ 1995.
20) రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. 2008.
శ్రీరాములు తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.
శ్రీరాములు హైదరాబాదులోని మలక్ పేటలో నివాసం ఉంటున్నారు.శ్రీరాములువిశ్రాంత జీవితం గడుపుతున్నారు.శ్రీరాములు వివిధ సాహిత్య కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తూ వర్ధమాన కవులకు ప్రోత్సాహం అందిస్తున్నారు.