ముదిగొండ ఈశ్వర చరణ్ తొలి ఉషస్సు మెరిసింది కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాష ఉపన్యాసకుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఆదిలాబాద్,ముదిగొండ ఈశ్వర చరణ్ కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని తొలి ఉషస్సు మెరిసింది కవిత పై విశ్లేషణా వ్యాసం.స్పందన కవితా సంపుటిలో ముగ్గురు కవులు కవితలను రాశారు.అందులో మొదటి కవి ముదిగొండ ఈశ్వర చరణ్,రెండవ కవి మాదాడి నారాయణరెడ్డి,మూడవ కవి ముదిగొండ వీరేశలింగం.స్పందన కవితా సంపుటిలోని ఈశ్వర చరణ్ రాసిన మొదటి కవిత తొలి ఉషస్సు మెరిసింది.తొలి ఉషస్సు మెరిసింది కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.తొలి ఉషస్సు ఎలా మెరిసింది? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.తెలతెల వారుతుండగా ఆకాశంలో సూర్యబింబం యొక్క కాంతిని చూసి ఎందుకో తెలియదు కానీ మనసులో ఆనందిస్తాం.సూర్యునికి అర్ఘ్యమిచ్చి శక్తిని ప్రసాదించమని వేడుకుంటాం. తూర్పున ఉదయించిన సూర్య కాంతి రేఖలు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి. సూర్యోదయాన్ని చూడడం వల్ల ఒక రకమైన చైతన్యం మరియు ఉత్సాహంతో కూడిన నూతనత్వం మనిషిలో మేలుకుంటుంది.కవి ఈశ్వర చరణ్ రాసిన తొలి ఉషస్సు మెరిసింది కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“తొలి ఉషస్సు మెరిసింది
“తొలి ఊహ విరిసింది
“తరళమై సరళమై
“అరుణమై కరుణమై
“తొలి ఉషస్సు మెరిసింది
“తొలి ఊహ విరిసింది.
ఉషస్సు అనగా ఉషోదయం,ప్రభాతం,ప్రత్యూషం, ప్రాతః కాలం,తెల్లవారుటకు ముందు నాలుగు ఘడియల కాలం అని అర్థాలు ఉన్నాయి.ఉషస్సు ప్రపంచంలో ప్రతి రోజు తొలి వెలుగును ప్రసరింపజేస్తుంది.ఉషస్సు చీకటిని తరిమి కొడుతుంది.ఉషస్సు చెడును నిర్మూలిస్తుంది. ఉషస్సు మనిషి జీవితాన్ని చైతన్య పరుస్తుంది. ఉషస్సు తన కాంతితో ప్రకృతిలో కదలికలను తెస్తుంది.ఉషస్సు ప్రతి ఒక్కరిని వారి విధులను నిర్వర్తించుటకు ప్రేరేపిస్తుంది.సూర్యుడు అన్ని జీవులకు ప్రాణం,చర్య మరియు శ్వాస యొక్క ప్రేరేపకుడు.ఉదయాన ఆకాశాన వెలసిన సూర్యుని చూసి తొలి ఉషస్సు మెరిసింది అన్నాడు కవి.వర్షం పడే ముందర ఆకాశం మెరుస్తుంది.ఆకాశంలో మేఘాలు గర్జిస్తాయి.మేఘాలు మెరుపులతో ఆకాశమంతట వ్యాపిస్తాయి.ఉరుములు మెరుపులతో ఆకాశం బీభత్సంగా ఉంటుంది.వర్షం పడగానే నేల తల్లి పులకిస్తుంది.నెమలి పురి విప్పి ఆడుతుంది.తన మనసులో రెక్కలు విప్పిన ఆలోచనలను చూసి తొలి ఊహ విరిసింది అన్నాడు.సూర్య కాంతిని చూడగానే అతని మనసులో ముప్పిరిగొన్న ఆలోచనల్లో తొలి ఊహ వికసించింది.ఊహ అనగా మనసులో గోచరించే దృశ్యం.మనసులో కలిగే ఒక వ్యక్తీకరణ,సరదా ప్రేమ మరియు జీవితాన్ని సృజనాత్మకతతో ఆలోచించడం ఊహ.ఊహ పట్ల జాగరూకత కలిగి ఉండుట మంచిది.చూడని లేదా వినని మాటలను చూచినట్టు మనసులో అనుకోవడం ఊహ. జరగడానికి అవకాశం లేని ఒక ఆహ్లాదకరమైన దానిని గురించి ఆలోచిస్తూ ఆనందిస్తూ ఉంటాం. అటు వంటి విషయాల గురించి ఆలోచించే చర్య ఊహగా చెప్పవచ్చు.కొన్ని సార్లు ఊహ వాస్తవ ప్రపంచం నుండి ముఖ్యంగా మధ్య యుగాల చరిత్ర నుంచి వచ్చిన ఆలోచనలు,సంఘటనలతో కూడి ఉంటుంది.ఊహ నుంచి జనించినవే మన అరువది నాలుగు కళలు.మనిషి మనస్సు నుండి తొలి ఆలోచన వికసించింది.మనిషి మనస్సును ఆలోచనలు ప్రభావితం చేస్తుంటాయి.చెట్లపై పువ్వు విరిసింది అంటాం.కవి ఇక్కడ తొలి ఊహ విరిసింది అన్నాడు.మనిషి మనసులో పుట్టిన ఆలోచన మొగ్గగా రూపు దాల్చి ఊహ అనే పూవుగా వికసిస్తుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.తరళం అంటే ప్రకాశం.ఏదైనా అతిగా కావాలనుకోకుండా జీవించడం సరళం.మానవ జీవన శైలిలో సరళత అనేది సాధారణ జీవన శైలిని కలిగి ఉండటం అని చెప్పవచ్చు.సరళత అందం, స్వచ్ఛత లేదా స్పష్టతను సూచిస్తుంది.అరుణము అంటే ఎరుపు క్రిమ్సన్ కలర్,సంధ్యారాగము అనే అర్థాలు ఉన్నాయి.ఉదయించే సూర్యుడి వర్ణం అరుణం.కరుణ అనగా కనికరం,కృషి అనే అర్థాలు ఉన్నాయి.కరుణ అనగా దయాగుణం. దుఃఖితాత్ముల యందు పరితపించుట కరుణ. మరొకరి బాధను తగ్గించాలనే కోరిక కరుణ.ఒక మనిషి దుఃఖముతో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది కరుణ.దయా దృష్టితో ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే భావన కరుణ.కవి ఈశ్వర చరణ్ తొలి ఉషస్సు చూసిన క్షణంలో తొలి ఊహ జనించింది.మనసులో కలిగిన భావన కాంతివంతం, ప్రకాశంతో సులభం అయినదిగా,ఎరుపు రంగు దాల్చినదిగా దయాళువుగా రూపు దిద్దుకొని తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“శోకమై శ్లోకమై
“కావ్య రస హేలయై
“అంతరమ్ములను బాసి
“అంతరంగముల చూసి.
శోకం సాధారణంగా ఏడవటం అనే చర్యను సూచిస్తుంది.దుఃఖం,బాధ కలిగినప్పుడు వచ్చేది శోకం.మనసు కలత చెందడం శోకం.ఏదైనా పనిలో మనసు నిమగ్నం చేయలేకపోవుట శోకం.ఏదైనా బాధ కలిగినప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లు కార్చుతూ కుమిలిపోవడం శోకం.
మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీసమాః
యత్ క్రౌంచ మిథునాదేకమ్ అవధీః కామ మోహితమ్.ఓ బోయవాడా!కామ మోహితమై యున్నటు వంటి క్రౌంచ పక్షుల జంట నుండి ఒక దానిని ఏ కారణం చేత హతమార్చితివో,ఆ కారణము చేత నీవు ఎక్కువ సంవత్సరములు జీవించియుండుట ప్రాప్తించకుండును గాక.ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం.వేదన నుండి వచ్చిన దుఃఖం శ్లోకంగా రూపు దాల్చినది.కవి హృదయంలో చెలరేగిన సంఘర్షణ శ్లోకంగా మారింది.కావ్య రస భావ వికారముల వంటి లక్షణాలు మనుషుల మధ్య గల నీది,నాది అనే తరతమ భేదాలను రూపుమాపి,మనిషిలో వెల్లువెత్తిన విశాల దృక్పథాన్ని కలిగించి మనసులను ఏకం చేస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“గానమై తానమై
“సంగీత స్నిగ్ధ సారమై
“భాషా భేషజాలను దాటి
“జాతి మతాల గోడలను దూకి.
గానము అనగా గీతము,పాట,పలుకబడినది. తానము అనగా స్నానము,స్థానము.సంగీతం Music శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ.సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది.ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైపోయింది.సంగీతం సుప్రసిద్ధమైన చతుష్షష్టి కళలలో ఒకటి.సంగీతం ప్రాథమిక లక్షణాలైన శృతి,రాగం,తాళం పల్లవి మొదలైన లక్షణాలతో కూడి ఉంది.సంగీతం ఆ దేశ సంస్కృతి సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. శాస్త్రీయ సంగీతం ఒక నిర్దిష్టమైన సాహిత్య పరంగా రచింపబడిన రాగాలకు నిబద్దితమై ఉంటుంది. శాస్త్రీయ సంగీతంలో రాగాలు అనంతమైనవి.కొన్ని
పాడే వారిని బట్టి మారుతుంటాయి.సంగీతం సాహిత్యంలో మేళవించబడి నాట్యం,నాటకం, లలిత కళలు,సినిమా మొదలైన దృశ్య కావ్యాలుగా మలచబడ్డాయి.సంగీతం అనేది శాస్త్రీయ సంగీతం,జానపద సంగీతం,భక్తి సంగీతం మరియు సమకాలీన సంగీతంతో సహా వివిధ రకాల సంగీత రూపాలను కలిగి ఉంటుంది.ఇది ధ్వని మరియు లయ కళను సూచిస్తుంది.సంగీతం తెలుగు సంస్కృతి సంప్రదాయంలో అంతర్భాగంగా ఉంది.పాట రూపంలో లయాత్మకంగా సంగీతంతో తడిసిన సారం మరియు భాషల పట్టింపుల భేషజాలను దాటి,జాతి మతాలు అనే అడ్డుగోడలు తొలగిపోయి తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వరచరణ్ వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“లోకమై నాకమై
“నాక ధునీ పూతమై
“మనిషి లోగుట్టు దాటి.
లోకం విశాల విశ్వంలో భాగం.జీవులు నివసించే ప్రదేశం.పురాణాలను అనుసరించి మొత్తం పదు నాలుగు లోకాలు ఉన్నాయి.నాకము అనగా నక్షత్రాలు,చంద్రుడు,సూర్యుడు మొదలైనవి ఉండే శూన్య ప్రదేశం.అకం అంటే దుఃఖం.అకం లేనిది నాకం పూర్తిగా ఆనందమయమైనది.నాకం అంటే స్వర్గం.ఇహ లోకంలో ఉండే శారీరక బాధలు, జరాదులు లేనిది నాకం.లోకం స్వర్గమై,గంగా నదితో పవిత్రతను పొంది మనిషి హృదయాల అట్టడుగున దాగి ఉన్న రహస్యాలను,మనసుల లోతులలో అణగి ఉన్న భావాలను స్పందింప జేయడం ద్వారా తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ చెప్పిన తీరు చక్కగా ఉంది.
“క్రాంతమై శాంతమై
“సౌమనస్యపు క్రాంతియై
“విషదంష్ట్రలను పూడ్చి
“సర్ప దష్టులను గూర్చి.
క్రాంతి అంటే క్రమణం,కాంతి,విప్లవం,వెలుగు, తిరుగుబాటు.రత్నాల నుండి వెలువడే వెలుగు క్రాంతి.శాంతం ఒక రసం,శాంతి పొందినది. నూతనత్వాన్ని కలిగినది.శాంతితో కూడినది.స్నేహ కాంతుల వెదజల్లినది.విషపూరిత కోరలను కనుమరుగు చేసినది.బాధాసర్ప బాధితులను గూర్చి వివరించినది అయి తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వరచరణ్ చెప్పిన భావం చక్కగా ఉంది.
“చాపమై శాపమై
“క్రోధారుణతా క్రాంతమై
“దానవతకు సమాధి కట్టి
“మానవతకు విలువ కట్టి.
చాపము అనగా ధనుస్సు,విల్లు బాణాలను విసరటానికి ఉపయోగించే ఒక రకమైన ఆయుధం.విల్లు మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన ఆయుధాలలో ఒకటి.విల్లు వేల సంవత్సరాల నాటిది.విల్లులు వివిధ సంస్కృతులలో,వివిధ కాలాలలో వేట, యుద్ధం, క్రీడల కోసం ఉపయోగించబడ్డవి.వేటగాడు పక్షులను జంతువులను వేటాడడానికి బాణాలను ఎక్కుపెట్టే సాధనం విల్లు లేదా చాపం.శాపము అనగా తిట్టు ఒట్టు అని అర్థాలు. ధనుస్సుగా రూపొంది దుష్టుల పాలిటి శాపం అయి,కోపపు ఎరుపుదనమును పొంది, రాక్షసత్వానికి గోరీ కట్టి మానవత్వపు విలువను పెంచడానికి తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“రుచియై శుచియై
“సర్వ జనాస్వాద్యమై
“మమతకు పందిరి వేసి
“సమతకు ప్రాణం పోసి.
రుచి మనం భుజించే ఆహార పదార్థాల ముఖ్య లక్షణం.రుచిని నాలుక గుర్తిస్తుంది.రుచులు ఆరు. వీటిని షడ్రుచులు అంటారు.అవి మధురం తీపి, ఆమ్లం పులుపు,లవణం ఉప్పు,కటువు కారం, తిక్తము చేదు,కషాయము ఒగరు.శుచి అంటే పాపహీనమయ్యే స్థితి లేక భావం.మమత అనగా అనురాగం,ప్రేమ,అభిమానం,అప్యాయత,ప్రీతి, మాతృ ప్రేమ,లోతైన బంధం.సమత కావ్య గుణములలో ఒకటి.సమత అంటే సమానత్వం. ఇంపు అయినది,శుభ్రం అయినది,ప్రజలందరికీ అనుభవ యోగ్యమై,ప్రేమ,అనురాగాలకు పందిరి వేసినది.సర్వ మానవాళి సౌభ్రాతృత్వం, సమానత్వానికి ప్రాణం పోస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం గొప్పగా ఉంది.
“రౌద్రమై భద్రమై
“విశ్వ కళ్యాణ హేతూద్భవమై
“చైతన్య స్మృతులను రేపి
“కళ్యాణ శ్రుతులను చూపి.
రౌద్రం నవరసములలో ఒకటి.రౌద్రం అంటే భయంకరమైనది,కల్యాణప్రదమైనట్టి,విశ్వ మానవ శ్రేయస్సుకు కారణమై తొలి ఉషస్సు పుట్టినది. చైతన్యంతో కూడిన జ్ఞాపకాలను రేకెత్తించినది. మంగళప్రదం,ప్రబోధాత్మకం అయిన భావాలను ప్రకటిస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ చెప్పిన తీరు చక్కగా ఉంది.
“తరతరాలు యుగయుగాలు
“పరిఢవించ పరిప్లవించ
“తొలి ఉషస్సు మెరిసింది
“తొలి ఊహ విరిసింది.
ప్రజలు తరతరాల నుండి అన్ని యుగాలలో అభివృద్ధి పథంలో పురోగమించునట్లు ప్రేరేపిస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది. ముదిగొండ ఈశ్వర చరణ్ తేది 29 – 09 – 1937 రోజున సిద్దిపేట జిల్లాలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు రాజేశ్వరి దేవి,నందికేశ్వర చరణ్.వీరు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినారు.వీరు అమ్మమ్మ మరియు మేనమామ ఇంట పెరిగారు.వీరి వివాహం పదహారు సంవత్సరాల వయస్సులో
ఇందిరా చరణ్ తో జరిగింది.వీరికి ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు కలరు.పెద్ద కుమారుడు రాజా మల్లికార్జున చరణ్ భార్య శైలజ.రాజా మల్లిఖార్జున చరణ్ కిరణ్ ప్రింటర్స్ నడిపించే వారు.వీరు అనారోగ్యంతో తేది 17 – 01 – 2020 రోజున ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు.రాజా మల్లిఖార్జున చరణ్ శైలజ దంపతులకు ఒక్కడే సంతానం శ్రీహర్ష.
చిన్న కుమారుడు శ్రీకాంత్ చరణ్ భార్య సంగీత. వీరికి ఇద్దరు పిల్లలు హిమాంశు,ప్రత్యూష.శ్రీకాంత్ చరణ్ మేనేజింగ్ డైరెక్టర్ గా Good Health insurance Company TPA Ltd. లో ప్రస్తుతం పని చేస్తున్నారు.
పెద్ద కుమార్తె గట్టెపల్లి అపర్ణ భర్త కుమార స్వామి. కుమార స్వామి తెలుగు భాషా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సర్వీస్ లో ఉండగానే అనారోగ్యంతో తేది 01 – 07 – 1992 రోజున ఈ లోకాన్ని వీడి పోయారు.వీరికి ఇద్దరు పిల్లలు.కుమార్తె దీప్తి, కుమారుడు ధీరజ్ కుమార్.అపర్ణ కొండపాక,సిద్దిపేట జిల్లా ఎం.పి.డి.ఓ.గా పని చేసి తేది 31 – 08 – 2019 రోజున రిటైర్ అయ్యారు.
చిన్న కుమార్తె శాస్త్రుల కిరణ్మయి భర్త విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఆంధ్రా బ్యాంక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ co-ordinator గా పని చేసి రిటైర్ అయ్యారు.వీరు ప్రస్తుతం అందులో ఎగ్జామినర్ గా Part-time job చేస్తున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు,కుమార్తె హిమజ,కుమారుడు మనోజ్ కుమార్. కిరణ్మయి ప్రభుత్వ పాఠశాల,దుద్దెడ గ్రామంలో ఆంగ్ల భాషా ఉపాధ్యాయిని స్కూలు అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.ఈశ్వర చరణ్ భార్య ఇందిరా చరణ్ తేది 04 – 03 – 2018 రోజున ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.ఈశ్వర చరణ్ సిద్దిపేటలో పి.యు.సి. వరకు చదివి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు.వీరు ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి చదువు మీద ఉన్న ఆసక్తితో ప్రభుత్వ డిగ్రీ కళాశాల,సిద్దిపేటలో చేరి బి.ఏ. డిగ్రీ పూర్తి చేశారు.వీరు ట్యూటర్ గా పని చేస్తునే ఎం.ఏ. తెలుగు చదివారు.వీరు సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ట్యూటర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి వివిధ హోదాలలో పని చేస్తూ లెక్చరర్ గా పదోన్నతి పొందారు.వీరు 1972లో ఆదిలాబాద్ జిల్లా డిగ్రీ కళాశాలకు బదిలీపై వెళ్లారు.వీరి సహ అధ్యాపకులు మాదాడి నారాయణరెడ్డి,ముదిగొండ వీరేశలింగం. వీరు ఆదిలాబాద్ జిల్లా గ్రామ నామాలపై ఉస్మానియా యూనివర్సిటీలో పి.హెచ్.డిలో ప్రవేశం పొంది కొన్ని అనివార్య కారణాలవల్ల పూర్తి చేయ లేక పోయారు.ఈశ్వర చరణ్ విద్యా గురువులు డాక్టర్ కోవెల సంపత్కుమారాచార్య గారు,ఆచార్య పరాంకుశం గోపాలకృష్ణ మూర్తి గారు.వీరి అభిరుచులు చదవడం,వ్రాయడం,విమర్శన.
ఈశ్వరచరణ్ ముద్రిత రచనలు:
విశ్వనాథ తారావళి,శరభేశ్వర తారావళి,శ్రీగిరి శతకం,వివేక వాణి,శైవలిని,వెలుతురు (వచన కవితలు),నవమి వ్యాస సంపుటి,వ్యాసపీఠం వ్యాస సంపుటి,ఈ రెండు కాకతీయ విశ్వవిద్యాలయం వారిచే పాఠ్య గ్రంధాలుగా ఎంపిక చేయబడినవి. ఎఱ్ఱన జన జీవితము – సమాలోచన పక్ష పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది.
వీరి అముద్రిత రచనలు :
వ్యాస కాశి – ధార్మిక వ్యాసాలు,జాతి – జాతీయత, దీనదయాళ్ ఉపాధ్యాయ గారి హిందీ వ్యాసాల తెలుగు సేత.తిష్య రక్షిత (నవల) ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురితం.
భారతి సాహిత్య మాస పత్రికలో ప్రచురింపబడిన వీరి వ్యాసాలు.
1)ఉదంకుని కథ వ్యాసం – 1984.
2) మినీ కవిత వ్యాసం – 1985.
3) పాత రోతయేనా వ్యాసం -1986.
వేయి పడగలు కథా నాయకత్వం వ్యాసం – 1984లో సాధన సాహితీ పక్షపత్రికలో ప్రచురింపబడినది.
సమాలోచన సాహితీ పక్ష పత్రికలో ప్రచురింపబడినవి.
1) తెలుగు సాహిత్యంలో గాంధీ వ్యాసం – 1985.
2) కవిద్వయం ద్రౌపది వ్యాసం – 1985.
3) వేయి పడగలు సామాజిక దృక్పథం వ్యాసం –
1985.
4) అచ్చ తెనుగన్న – పొన్నగంటి తెలుగన్న వ్యాసం – 1986.
స్రవంతి మాసపత్రికలో ప్రచురింపబడినవి.
1) వేయి పడగలు అంకిత పద్యం వ్యాసం – 1985.
2) వేయి పడగలు ధర్మారావు వ్యాసం – 1985.
వీరు చేసిన సాహిత్య సేవ.
సిద్దిపేట సాహితీ వికాస మండలికి వేముగంటి నరసింహచార్యులు అధ్యక్షులుగా,ఈశ్వర చరణ్ ప్రధాన కార్యదర్శిగా ఉండి సాహితీ సేవలు అందించారు.ఈశ్వర చరణ్ ఆదిలాబాద్ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్నప్పుడు అవధాని గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ అవధాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఈశ్వర చరణ్ పృచ్ఛకుడిగా వ్యవహరించారు.శ్రీ నటరాజ రామకృష్ణ గారిచే సిద్దిపేటలో పేరిణి శివతాండవం,ఆంధ్ర నాట్యం ప్రదర్శనలు ఇప్పించారు.వీరు తెలుగు సాహిత్యానికి ఇతోధిక సేవలు అందించారు.వీరు పలు సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు.వీరు 54 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో 1992 నవంబర్ 16వ తేదీ నాడు పర లోక గతులు కావడంతో తెలుగు సాహితీ లోకం ఒక గొప్ప సాహిత్యకారుడిని కోల్పోయింది.
కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు
previous post
3 comments
Fantastic beat I would like to apprentice while you amend your web site how could i subscribe for a blog site The account helped me a acceptable deal I had been a little bit acquainted of this your broadcast offered bright clear concept
ఈశ్వర్ చరణ్ గారు మాకు ఒక తెలుగు లెక్చరర్ గానే తెలుసు, కాని మీ వ్యాసము ద్వార వారి కవిత ‘తొలి ఉషస్సు మెరిసింది’ తో పాటు వారి గురించి యెన్నో విషయాలు తెలిసాయి. అంతగా గుర్తుకు నోచుకొని ప్రతిభాషాలీ…నేను ఇంటర్మీడియట్ (1976-78)లో ఉన్నపుడు కుంతి పాత్ర తో షాడో షో చేసారు ,అప్పట్లో అది హైలెట్…ఆదిలాబాద్లో అష్టావదానంలో పృచ్ఛకునిగా వ్యవహారించారు, నేను ఆ కార్యక్రమానికి హాజరైన..ఒక గొప్ప కవి రచయితను మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
మీ వివరణ ,పదవిన్యాసం , భావాన్ని వ్యక్తం చేసిన విధానం చాలా బాగుంది.గుర్తిపు లేకుండా మరుగున పడ్డ కవి, విమర్శకుడు శ్రీ ముదిగొండ ఈశ్వర చరణ్ గారికి నివాళి అర్పించినట్టు గా వుంది.ధన్యవాదములు.