Home కథలు ” కాల మహిమ ! ” కథ  

” కాల మహిమ ! ” కథ  

కొన్నిసార్లు అంతే..
కాలం మాత్రమే సమాధానాలు చెప్పగలిగే ప్రశ్నలకి మనం మౌనంగా తలొంచాలి తప్పితే ..

మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న ఫలితాలని పొందలేము !
మన మధ్య ఉత్పన్నమైన ప్రశ్నల తాలూకు సమాధానాలు ఎప్పుడో తెలుస్తుంటాయి !
అవి మదిని వెంటాడుతూ మనం కాలం మహిమ ని  తెలుసుకునేలా  చేస్తుంటాయి !
*                                  *                            *
నా స్నేహితుడు నాగేంద్ర ,నేను దాదాపుగా పద్నాలుగేళ్ల తరువాత కలిశాము.
మొదట వాడ్ని గుర్తించలేదు నేను.
తను నాగేంద్ర అని తనను తాను పరిచయం చేసుకుంటుంటే..
అప్పుడుగానీ గ్రహించలేదు నేను.
అంతగా మారిపోయాడు.!
ఇద్దరం కలిసి ఓ ఆఫీస్ లో ఐదేళ్ల పని చేశాము.
వాడ్ని అంత కాలం తరువాత చూడగానే  గతం లోని మా పరిచయం తాలూకు అనుభవాలు ఒక్కసారిగా నా కళ్ళ ముందు కదిలాయి.
వాడు కొత్త ఉద్యోగం లో చేరడానికి చెన్నై వెళ్ళడంతో మా మధ్య  దూరం ఏర్పడింది.
ఎప్పుడో ఒకసారి కాల్ చేసి మాట్లాడేవాడు.
*                           *                            *
నాగేంద్ర నాకు పరిచయమయ్యే నాటికే మా ఆఫీస్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు.
నేను వాడు ‘రేయ్ ‘ అని పిలుచుకునేంత చనువు ఉంది మా ఇద్దరి మధ్య.నాగేంద్ర ఓ రోజు నాతో..
“రెండు రోజులు నేను ఊరు వెళ్ళి వస్తాను రా.. ” అన్నాడు.
నేను పనేంటి అని అడిగే లోపుగా..”ఓ రెండెకరాల పొలం ఊరి దగ్గర కొంటున్నానురా!” అన్నాడు .”మొన్నెప్పుడో అన్నావు కదా .మీ నాన్న గారికి ఒంట్లో బాగోలేదని !

ఇప్పుడెలా వుందిరా..వూరు వెళిన్నప్పుడు మీ నాన్న గారిని,అమ్మగారిని అడిగానని చెప్పరా” అన్నాను.
“సరే ! చెప్తాను లే .కాని ఆయన ఆరోగ్యం ఇప్పుడు కూడా బాగాలేదు, మా నాన్న ఆరోగ్యం గా వుండగానే పొలం కొనాలని నా కోరిక రా.. “అన్నాడు వాడు.

ఆ సమయంలో వాడి మాటలను బట్టి ఒక సంగతి అర్థమయింది.
‘తన తండ్రి వుండ గానే తమ వూళ్ళో పొలం కొనాలని  వాడి ఆశ.
కాని తన తండ్రి కి ఆరోగ్యం బాగాలేదు..సిటీ కి తీసుకువచ్చి వైద్యం చేయించాలని వాడికి ఎంత మాత్రం ఆలోచన లేదని ‘ ఎందుకో నా మనసుకు అనిపించింది.అదే మాట అంటే వాడు బాధ పడతాడని తెలుసు.

అయినా మిత్రుడిగా వాడికి మంచి సలహా ఇవ్వాలని నా అభిలాష.!

స్నేహమంటే అదే కదా !

మాట మాత్రం గా నైనా వాడికి మంచి చెప్పాలని ప్రయత్నించాను.

“ప్రతాప్ !
ఊరుకోరా..నువ్వూ నీ చాదస్తం !
మా నాన్న ఎప్పుడైనా నా మాట విన్నాడని.చిన్నప్పుడు అంతా ఆయనకి భయపడుతూనే పెరిగాం. ఇప్పటికి ఆయనంటే మాకు భయం.ఆయన మాటే నెగ్గాలని ఎప్పుడూ తాపత్రయ పడుతుంటాడు.మన మాట విన్నట్లుగానే వుంటాడు కానీ ఆయన ధోరణి ఆయనదే.
నేను ఆ ఊరు వదిలి హైదరాబాద్ వచ్చేయమని ఎన్నోసార్లు చెప్పాను,ఉన్న ఊరిని వదిలి రావడం కష్టం అంటాడు.

నీకీ విషయం తెలుసా..నా పెళ్ళైన ఈ పదేళ్ల కాలంలో ఆయన ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాడో తెలుసా..కేవలం నాలుగు సార్లే ! అదీ మనవడు అడిగాడని.”

“అదంతా ఓ.కే నాగేంద్ర ! ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు కదా కనీసం వైద్యం చేపించుకోడానికైనా వస్తాడు .నువ్వు అడిగి చూడు .ఎలాగు నీ శ్రీమతి ఇ.ఎస్.ఐ లో సూపరెండెంట్ గా పని చేస్తుంది కదా .అలాగైతే తనకి మంచి వైద్యం సకాలంలో అందుతుంది. ” అన్నాను.

నవ్వాడు..”సర్లే రా చూద్దాం !” అన్నాడు.

రెండు రోజుల కోసం లీవ్ అప్లై చేసుకుని ఊరు వెళ్ళాడు.

పొలం బేరం కుదిరిందని సంబరంగా చెప్పాడు.

నా మనసులో  వాళ్ళ నాన్న గారికి ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆత్రుత.

నేను అడగకుండానే చెప్పాడు .

“నాన్న కి సీరియస్ గా వుంది రా.మరో రెండు రోజులు ఆగి వస్తాను. ” అంటూ చెబుతూ నేనింకేదో అడగబోతుంటే కాల్ కట్ చేశాడు.

వాడేమైనా ఫోన్ చేస్తాడేమో నని ఎదురు చూశాను.

రెండు రోజుల తరువాత వాడి నుండి మెసేజ్ వచ్చింది “నాన్నిక లేరు” అని.

ఆ మెసేజ్ చూడగానే చాలా బాధగా అనిపించింది.

వీడు కాస్త శ్రద్ధ తీసుకుని తండ్రి కి వైద్యం చేపించినట్లయితే ఆయన తప్పకుండా కోలుకునే వాడు.

ఆ పెద్దాయన రెండు మూడు సార్లు తాను హైదరాబాద్ వస్తానని వైద్యం చేయించుకుంటానని వీడితో అనడం విన్నాను నేను,కానీ వీడు ఆ అవకాశం వాళ్ళకి ఇస్తే కదా !?
పైగా తన తండ్రి ఊరు వదిలి రాడని ప్రచారం !ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా లోకం లో అనుకున్నాను ఇంత కాలం.

కాని నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాను.

మా పరిచయం అయి నాలుగైదేళ్లు అవుతుంది.

మొదట్లో ఎంతో అభిమానంగా మాట్లాడాడు.
క్రమక్రమంగా వీడి మనస్తత్వం బోధ పడసాగింది.
కాని నేనెప్పుడు వాడికి మంచి సలహాలే ఇచ్చేవాడిని..
వాడు స్వార్థాన్ని వీడి మంచిగా మారాలని ,ఆ దిశగా వాడిని మరల్చాలని ప్రయత్నించే వాడిని !
*                                           *                                          *

పిడుగురాళ్ళ బస్టాండ్ లో బస్ కోసం ఎదురు చూస్తున్న నాకు వాడు హఠాత్తుగా ఎదురయ్యాడు.

కుశల ప్రశ్నలు వేశాను.

అన్యమనస్సుతో సమాధానాలు చెప్పాడు.

“ఏమయిందిరా!?” నా మనసేదో కీడు శంకిస్తుంటే సంశయంగానే అడిగాను.

“అది.అదీ..”

“చెప్పరా.మరేం పర్లేదు ” అన్నాను.

“నీకు తెలుసు కదా ఎంతో కష్టపడి ,రాత్రనక పగలనక శ్రమించి..

ఊళ్ళ వెంట తిరుగుతూ ఉద్యోగాలు చేసి ఆస్తులు కూడ బెట్టాను.
 ప్రతి రూపాయి పట్ల అప్రమత్తత తో వుంటూ చివరికి సరియిన బట్టలు కూడా కొనుక్కోకుండా వున్న వాటితోనే సర్దుకుంటూ బ్రతికాను.
నాతో పాటు నా భార్య కి  కూడా అలాగే అలవాటు చేశాను.
కాదు అలా ఒప్పించాను అనే చెప్పవచ్చు.
ఎదైనా.. ఎన్నో ఆస్తులు కూడ బెట్టాను.
కాని పిల్లలకి ఆస్తులు పంచడం కంటే..
ప్రేమ ఆప్యాయత ను పంచాలని,

వాళ్ళకి స్వతహాగా ధైర్యంగా బ్రతికే ఆత్మస్తైర్యాన్ని అందిచాలని గ్రహించలేక పోయాను.

మావాడు ..నా ఒక్కగానొక్క కొడుకు ని ఎంతో గారాబంగా పెంచాను.

వాడేం చేశాడో తెలుసా పెళ్లవగానే నా ఆస్తులన్ని కావాలని అడిగాడు.

ఇవ్వడం కుదరదని నేను నా భార్య తెగేసి చెప్పేశాము.

వాడి కి ..మా దగ్గర వున్న ఆస్తులన్ని ఊడ్చేసి ఇస్తే మేమెలా బ్రతకాలి.!?

అంతగా కావాలంటే బ్యాంకులో వున్న డబ్బులు ఇస్తామన్నాము.

వాడు,వాడి భార్య అందుకు ఒప్పుకోలేదు.

ఎప్పటి కైనా ఈ ఆస్తులన్ని తనవే అన్నాడు.

ఇవన్నీ అమ్మేసి వాడు సిటీ లో బిల్డింగ్ కట్టుకుంటాడట,

ఆ అమ్మాయి కూడా భర్త నే సమర్థిస్తూ మాట్లాడింది.

మాకు ఉండటానికి వాడే ఏదో ఒక ఇల్లు చూస్తాడట ..అదీ తాత్కాలికంగా !

తరువాత తన దగ్గర కే వచ్చేయాలంటూ ఒకటే గొడవ !

ప్రేమతో పిలిస్తే వెళతాం కాని ..

ఇలా ఆస్తులు అమ్ముకుని పూర్తిగా వాళ్ళ పైనే  ఆధారపడాలని ఎలా వెళతాం !? ”

అన్నాడు వస్తున్న కన్నీళ్ళని దిగమింగుకుంటూ !

“తప్పంతా నాదే ! చేసుకున్నవాళ్ళ కి చేసుకున్నాంత .
నేను నా తల్లిదండ్రుల విషయంలో ఇలాగే ప్రవర్తించాను.
నా పాపం ఊరికే పోతుందా?
ఇప్పుడు ఏమయ్యిందో తెలుసా..
మా రాకేష్ మమ్మల్ని అసలు పలకరించడం లేదు.
ఇంటికి వచ్చి ఎంతో కాలం అయ్యింది.
మేమిద్దరం కొడుకు ఉండి కూడా అనాధ ల్లా బ్రతుకుతున్నాం.
కనీసం మా చివరి చూపు కైనా వస్తాడో లేదో తెలీదు. “
కన్నీళ్ళ పర్యంతం అవుతూ అంటున్న నాగేంద్ర ని ఓదార్చడం నా వల్లకాలేదు.
                                                    – గొర్రెపాటి శ్రీను  

You may also like

Leave a Comment