Home కథలు కొకతట్టి చాంద్ బీ

కొకతట్టి చాంద్ బీ

by Veera valli

ఇది నిజంగా జరిగిన 1960 ప్రాంతంలోని కథ. నా చిన్నప్పుడు, సీతారాం బాగ్ లో ఉన్న మా ఇంటికి ఈ ముస్లిం ఆవిడ, మంగళ్ ఘాట్ లో ఉన్న గోడే ఖబర్ నుండి వచ్చేది. మా అమ్మ లక్ష్మి నరసమ్మగారు ఆవిడకు నరసింహ స్వామి పూజ చేసి తీర్థ ప్రసాదాలు ఇస్తే, ఆవిడ ఎంతో భక్తితో పూజ చేయించి వాటిని స్వీకరించే ది. మొహర్రం పీర్ల పండగ రోజు మా అమ్మ ఆమెకి దట్టి, బట్టలు పంపేది. ఆమె మాకు ఊదు ప్రసాదంగా తెచ్చి ఇచ్చేది. మాకు ఏ జబ్బు చేసిన దర్గాలకు తీసుకెళ్ళి ప్రార్థనలు చేసేది మా అమ్మ.

చుట్టు పక్కల వారు, కులం వారు ఆక్షేపిస్తున్నా ఎదురించి ముస్లిం మహిళకు నరసింహ జయంతి రోజు ఆమె తరపున మా అమ్మ పూజ చేయటం అయితే,

వాళ్ళ బంధువులు అభ్యంతర పెట్టినా, మోహల్లా (వీధి) వాళ్ళు గర్హించినా, ముస్లిం వనిత ధైర్యంగా పూజ చేయించటమే కాక మా అమ్మ ఇచ్చిన దట్టిని పీర్ల కు సమర్పించి మొక్కులు మొక్కి మా కుటుంబం కోసం ప్రార్థనలు చేయటం గొప్ప కదా. ఆరోజుల్లో నిజంగా అభినందనీయమే.

ఆ రోజుల్లో మడి ఆచారాలు సంప్రదాయాలు ఎక్కువగా ఆచరించే మా కుటుంబాలు ఈ విధమైన సఖ్యత చూపడం నిజంగా నాకు అద్భుతమే అనిపిస్తిస్తుంది ఇప్పటికీ. ఏమీ చదువుకొని మా అమ్మ, పేదరికానికి మతంఉంటుందా? అని అడిగిన ప్రశ్న గొప్పది.

అందుకే మనసు లో ముద్ర వేసుకుని పోయిన ఈ సంఘటనని కథగా రాయాలని పించింది. ఈ ఇద్దరి స్త్రీ లను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

మా అమ్మ లక్ష్మి నరసమ్మ

‘అమ్మా‘ అంటూ పరుగున అమ్మ దగ్గరికి వెళ్ళాను.

మడి చీరలో ఉన్న లక్ష్మమ్మ, అదేమా అమ్మ.. ‘ఏమిటే ఆ ఉరుకులు. దగ్గరికి రాకు, ముట్టుకోకు, దూరం దూరం.. మడిలో ఉన్నా..‘ అని దూరంగా జరిగింది.

‘సరేలే ముట్టుకోను గానీ, ఆవిడ వొచ్చింది. అదే బురఖా ఆవిడ‘ అప్పటిదాకా తాడాట ఆడుతూ, చాంద్ బీ రావటం వల్ల అమ్మకి చెబుతామని అలాగే వచ్చేసాను.

‘మళ్లీ తాడట ఆడుతున్నావా, ఎలా దమ్ము తీస్తున్నావో చూడు. ఎన్ని సార్లు చెప్పినా వినవు. ఆ తాడు అవతల పడేయి. ఆవిడని కూచోమని చెప్పి, మంచినీళ్ళివ్వు వచేస్తున్నా‘ అంటూ అమ్మ హడావిడిగా వంట పూర్తి చేయటానికి వెళ్ళింది.

‘సరే కానీ, ఆవిడ ఎండలో వచ్చింది. నువ్వే అంటావు కదా ఎండలో నుంచి వచ్చి నీళ్ళు తాగొద్దని. మరి ఇవ్వమంటావా నీళ్ళు.‘ అంటూ నా సందేహాన్ని అడిగాను. ‘సరేలే, ప్రశ్నలు మొదలుపెట్టావా… చెప్పింది చేయి. ఎవరొచ్చినా ముందు వారిని కూచో పెట్టీ మంచి నీళ్ళు ఇవ్వటం పద్దతని ఎన్ని సార్లు చెప్పాను. ఆమె ఇష్టం, తాగాలను కుంటే తాగుతుంది.‘ విసుక్కుంటూ తనపనిలో పడింది.

ఏమిటో అమ్మ ఒక్కోసారి ఒక్కొలాగా మాట్లాడుతుంది. ఆడే స్కిప్పింగ్ రోప్ పక్కన పెట్టి, వంటింటి లోకి వెళ్ళాను. చల్లటి మంచినీళ్ళు రాగి చెంబుతో తీసుకెళ్ళి, గ్లాసులో పోసి ఆవిడ ముందు పెట్టాను. మోసుకొచ్చిన సంచిని అరుగు మీద పెట్టి బరువును మోసిన చేతిని మరో చేత్తో నొక్కుకుంటూ అరుగు మీద నీరసంగా కూచుని ఉంది చాంద్ బీ. ఎండలో నడిచి వచ్చిందేమో ఎక్కడలేని అలసట కనిపిస్తోంది ఆమె ముఖంలో. నేను చెంబుతో నీళ్ళు తేవటం చూసి తల మించి బురఖా తీసి, ఇంటి ముందున్న చింత చెట్టు మొదట్లో కెళ్ళి అక్కడున్న బకెట్ లోని నీళ్ళతో మొహం కడుగుకుంది. ఎవరొచ్చినా కాళ్ళు కడుక్కుని లోపలికిరావాలి. అందుకే నీళ్ళబకెట్ ని ఇంటి ఎదురుగా పెట్టడం మా ఇండ్లలో పద్దతి.

కాస్త ప్రాణం కుదుట పడి, ఇంటి వాకిట్లోని అరుగు మీద కూచుని బురఖాతో ముఖం తుడుచుకుంది. మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని గట గట మని తాగి, ఇంకా నీళ్ళు పొయ్యమని గ్లాస్ చూపింది. ఆమెకి చాలా దాహంగా ఉంది కాబోలు మాట్లాడలేక పోతోంది. రెండో గ్లాసు కూడా తాగేసింది. ప్రతి సారి పూజ కోసం తల స్నానం చేసి వస్తుంది. ఇంకా జుట్టు ఆరలేదులా ఉంది, ఆమె వోత్తైన తడి జుట్టుతో వెనకాల బురఖా అంతా తడిసి పోయింది. ఆమెనే చూస్తూ నిలుచుండి పోయాను.

నీళ్ళ చెంబు లోపల పెట్టటానికి వెళ్లి అమ్మ హడావిడి పడటం చూశాను. ఆవిడ ఇవాళ వస్తుందని వంట తొందరగా చెయ్యాలని పొద్దుట్నుంచి అంటూనే ఉంది అమ్మ. దాదాపుగా వంట పూర్తి అయింది.

వంట అవటమే ఆలస్యం కట్టెలు ఆర్పీ, కాలినంత భాగం తీసేసి మిగిలిన కట్టెలని, ఆర్పిన కట్టె ముక్కలను ఎండలో పెట్టీ బొగ్గులుగా తెల్లారి మళ్లీ వంటకు ఉపయోగిస్తుంది. ఎందుకమ్మా అలాగ అంటే. మొత్తం కట్టెలు కాలిపోతే బూడిద అవుతుంది. అందుకే అర్పేయాలి. అప్పుడు కాలిన కట్టే బొగ్గు అవుతుంది. అవి మళ్లీ వంటకు పనికొస్తాయి కదా‘ అనేది అమ్మ. ఏంటో తను చేసేవి అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ అది ఆమెకి పేదరికం నేర్పిన కొన్ని పాఠాలలో ఇదొకటని తరువాత రోజుల్లో అర్థమయింది. పాపం ఆవిడ ఎంతో పొదుపుగా సంసారాన్ని లాక్కొ చ్చింది కదా అనిపిస్తుంది.

పొయ్యిపైన చట్టిలోని పప్పుచారుని స్టీలు గిన్నెలోకి వోమ్పేసి మూత పెట్టింది. మట్టిచట్టిలో పప్పుచారు చేయటం ఆమె అలవాటు. పక్క పొయ్యి పై ఉడుకుతున్న అన్నం ఒకసారి గరిటతో తిప్పి, అన్నం గంజి వార్చటానికి తప్పాలామూతికి తట్టు (అదే బియ్యం సంచి) ముక్కని కట్టి పక్కనే ఉన్న అరుగు మీద వొంపింది. ఆ గోనె పట్టాకి రంద్రాలు ఉంటాయి కదా అన్నం పడిపోకుండా గంజి మాత్రమే బయటకు పోతుందన్నమాట. పొయ్యిలోని మంటతీసేసింది కానీ పూర్తిగా అర్పలేదు. మళ్లీ పులిహోర తాలింపు పెట్టాలికదా. ఈలోపు గిన్నెలో నీళ్ళుపోసి శక్కర, టీ పొడివేసి పోయి మీద పెట్టింది. పక్క పొయ్యి లోని నిప్పుని ఆర్పేసి, పొయ్యిదగ్గర అంతా సర్దేసింది. గంజి వార్చిన అన్నం గిన్నెకి మూత పెట్టీ మళ్లీ ఆర్పిన పొయ్యి మీద పెట్టేసింది. ఆ వేడికి అన్నం పొడి పొడిగా అవుతుందన్న మాట.

అప్పటికి గ్యాస్ పొయ్యి రాలేదు మా వరకు. వచ్చినా భరించలేని మధ్యతరగతి శ్రీవైష్ణవ కుటుంభం మాది. మట్టి పొయ్యి మీదే వంట చేయాలి. ఆ పొయ్యిని ఆమే తయారు చేస్తుంది. ఒక మంచి రోజు చూసుకుని, తానే వెళ్లి పుట్టమన్ను తవ్వుకొచ్చి నీళ్ళతో తడిపి, బాగా పిసికి, ఆ మట్టితో గుండ్రటి పొయ్యి తయారు చేస్తుంది. మధ్యలో ఇనుప చువ్వ లు పెడుతుంది. దాని వల్ల బొగ్గులు వేయటానికి వీలవుతుంది. ఇంపచువ్వల కిందిభాగంలోకి చేయిదూరెంతగా కన్నంచేస్తుంది. అక్కడ పిడకపై కిరోసినేసి వెలిగించటానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే రెండు కట్టెలని కుడా పెట్టి కట్టెల పొయ్యిలగా కుడా వాడుకోవచ్చు. కొన్ని సార్లు అక్కడే ఆలుగడ్డలని, మొగరం గడ్డల్నిఅదేనండి చిలగడదుంపలు, ఇంకా లేత బెండకాయలను, లేత బీరకాయలను కాల్చి మాకుఅన్నం లోకి ఇచ్చేది. కూరల బదులుగా వాటితో భోజనం కానిచ్చేవాళ్ళం. అప్పుడప్పుడు అమ్మ పక్కన కూచుని చిన్న పోయ్యిని చేసేదాన్ని. ఏంటో మరి ఎండగానేవిరిగిపోయేది.

అలాగే మరో చిన్న పొయ్యి చేస్తుంది. దాన్ని కట్టెలు మాత్రమే పెట్టీ వాడుకోవచ్చు. వాటిని నీడలో ఆరాక వంటింట్లో ఓపక్కన గట్టులాగ చేసి పెర్మినేంట్ గా దానిపై పెట్టేస్తుంది. రోజు వంట అయ్యాక ఎర్రమట్టి, పేడ కలిపి పోయ్యిలని అలికి వాటిపై ముగ్గు వేయటంతో అవి శుద్ధి అయి తిరిగి మరునాడు మడి వంటకి పనికి వస్తుందన్నమాట. ఆమెకి ప్రతిరోజూ సంధ్యవేళ పొయ్యిలు అలకడం తప్పనిసరి పని. వంటంత ఒకపూటే చేసేస్తుంది. రాత్రికి రొట్తెల్ని, తక్కువపడే అన్నాన్ని కిరోసిన్ పంపు స్టవ్ పై వండేస్తుంది. మళ్లీ ఈ స్టౌ పొద్దుట వంటకి పనికి రాదుట. ఆ వంటలతో దేవుడికి ఆరగింపు చేసేది కాదు అమ్మ.

మా నాన్న దేశికాచార్యులు గుళ్ళో పూజలు చేసి తెచ్చే చాలీచాలని సంపాదనతో ఇల్లు వెళ్ళదీస్తోంది. నలుగురు సంతానoలో మా పెద్దన్నయ్య ఉద్యోగంలో చేరి కాస్త సంపాదిస్తున్నాడు.. అక్క చూడామణికి చిన్నప్పుడే పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. పెద్దకుటుంబంలోకి వెళ్ళటంతో పుట్టింటిని ఆమె పూర్తిగా మరిచి పోయేలా చేసింది. అమ్మ, అన్నయ్య అప్పుడప్పుడు వెళ్లి పండ్లో పూలో, వీలైతే ఎవైన పిండివంటలు చేస్తే అవి ఇచ్చి బాగోగులు అడిగి వస్తుంటారు. ఒకందుకు అమ్మాయి ఒకతి ఉందని కుడా గమనించే స్థితిలో లేని పేద కుటుంభం మాది. రెండు గదుల చిన్న పెంకుటిల్లు. ఆ గుడిప్రక్కవీధి అంతా అలాంటి వారే నివసిస్తున్నారు. అన్నయ్య స్కూలు ఫైనల్ పాసవంగానే చిన్న ఉద్యోగం చూసుకున్నాడు. చిన్నన్నయ్య పదవ తరగతిలో ఉన్నాడు. నాన్న, గుడికి జీయంగార్ వచ్చినప్పుడు సామూహిక ఉపనయన కార్యక్రమాల్లో అన్నయ్యలిద్దరికి చిన్నప్పుడే ఉపనయనం చేయించాడు. అప్పుడప్పుడు ఇద్దరూ ఆయనతో పాటు పూజలకు వెళుతుంటారు. తరువాత నేను.. విజయ లక్ష్మి ..సెవెంత్క్లాస్ అండి. అమ్మ మాత్రం ఆడపిల్లకి చదువు వద్దని మొత్తుకున్నా అన్నయ్యలు వినకుండా నన్ను చదివిస్తున్నారు. గవర్నమెంటు స్కూల్లో ఫీజు లేదు కాబట్టి చదువు సాగుతుంది. పదమూడు నిండకుండానే నాపెళ్లి చేయాలని మానాన్న వెంట పడుతుంది మా అమ్మ.

అమ్మ పని అయినట్టుంది. రెండు గ్లాసుల్లో చాయి తీసుకుని వాకిట్లో కొచ్చింది. “బాగున్నావా చాంద్ బీ. అమ్మాయి నీళ్ళిచ్చిందా? ఎండ మండి పోతుంది. మొహం చూడు ఎలా అయిందో. పొద్దున్నుంచి నీవేమి తినవు కదా, కాస్త చాయి తాగు నీరసం తగ్గుతుంది.” అంటూ ఒక గ్లాస్ ను ఆమె ముందు పెట్టీ, తాను ఓ గ్లాస్ తీసుకుని కడప లోపల కూచుంది. అయ్యో వద్దులేమ్మ, మీకే పని ఎక్కువ అయింది.” అని మొహమాట పడింది. “కష్టమేముంది నీ పేరుచెప్పుకుని నేనూ తాగుతాలే. నా మడి వంట ఇప్పుడే అయింది. నీకోసమే ఎదురుచూస్తున్న, ఇద్దరం కలిసి తాగుదామని నేనూ చాయ్ తాగలేదు‘. అంది.

చాయి తాగటం అంటే పెద్ద ఇత్తడి గిలసులో సగానికి పైగా పోసుకుని చీరచెంగుతో పట్టుకుని తాపీగా ‘ఉఫ్ ఉఫ్’ అని ఊదుకుంటూ తాగటం ఎంతో ఇష్టం. అంతా పనయ్యాక టీ తాగి అలసట తీర్చుకుని మడి వదలడం ఆమె రోజువారీ అలవాటు.

“తాగు, కాస్త నీరసం తగ్గుతుంది. పులిహోరకి అన్నంచేశాను. తాలింపు పెట్టేస్తే అయిపోతుందిలే”

“షుక్రియ అమ్మా ఇంత పనిలో కూడా ఎప్పుడూ నాకోసం చాయి ఇస్తావు” అంటూ వేడి గ్లాస్ని బురఖాతో పట్టుకుని ఊదుకుంటూ తాగుతూ “మీ అందరు ఎలా ఉన్నారు అమ్మా” అంది. “ఏదో కాలం వెళ్ళ దీస్తున్నాము” అంటూ తమ తమ కుటుంబాల విషయాలు మాట్లాడు కున్నారు. చాంద్ బీ ప్రొద్దున్నే తలరా స్నానం చేసి ఏమి తినకుండా నరసింహ స్వామి పూజ కోసం ఇక్కడికి సాయిత్యం (ప్రసాదానికి కావలసిన సరుకులు) తీసుకుని వస్తుంది. ఈ ప్రసాదమే తింటుంది. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే.

‘పూజ సామాన్లు తెచ్చిన‘ అంటూ చేతిలోని సంచిని ముందుకు జరిపింది. “మీ ఆయన, పిల్లలు ఎట్లా ఉన్నారు?”. టీ తాగుతూ అడిగింది అమ్మ. “ఏం బాగమ్మ, పిలగాడు జిద్ చేస్తే పాన్షాప్ పెట్టించినం. పిల్లేమో ఈడు కొచ్చింది. దానికి

షాది చెయాల కదమ్మ. ఆయన కమాయించిన దాన్లో ఇల్లు గడవడమే ముష్కిల్ అవుతుంది” అంటూ తనగోడు వెళ్ళ బోసుకుంది.

అమ్మ వెనకాలే వచ్చిన నేను, లోని కెళ్లి చేట తీసుకుని వచ్చి ఆవిడ ముందుపెట్టాను. ప్రతి సంవత్సరం ఆవిడ రావడం, సంచిలో వంట సాయిత్యం తేవటం నాకు తెలుసు. మళ్లీ అమ్మ చెప్పాల్సిన పని లేకుండానే లోనుంచి చేట తెచ్చేసాను. “అమ్మో బాగానే తెలిసిపోయిందే బేటీకీ “చాంద్ బీ నవ్వుతూ సంచీలోని బియ్యం, పప్పు, బెల్లం, చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మొదలైన సాయిత్య సామాన్లు చేటలో ఉంచింది. కొబ్బరికాయ, పూలు, అగర్బత్తులున్న కవరును వేరుగా చేట పక్కన పెట్టింది.

“చాంద్ బీ, అందరికీ ఏదో ఒకరకంగా ఈ కష్టాలన్ని ఉంటూనే ఉంటాయి. ఏంచేస్తాం మన కర్మ, నుదుట రాసింది అనుభవించక తప్పుతుందా. ధైర్యంగా సంసారాన్ని ఈదటమే మన పని. అన్ని బాగవుతాయి. బాధపడకు.‘ అంది అమ్మలేస్తూ. ” ఉండు నిముషంలో వస్తా. భోగం వంట చేయాలిగా త్వరగానే అయిపోతుందిలే” అంటూ చాయి తాగటం ముగించి సామాన్లున్న చేట, పూజ కవరుని తీసుకుని లోపలికెళ్ళి పనిలో పడింది. గూట్లోని గచ్చకాయల్ని తీసుకుని ఆడుకోవటానికి బయటకొచ్చాను. అప్పుడు నాతో ఆడటానికి ఎవరూలేరు. ఒక్కదాన్నే ఆడుకుంటూ తలెత్తి చాంద్ బీ వైపు చూసాను. బకేట్లోని నీళ్ళ తో టీ గ్లాస్ కడిగి తాను కూచున్న అరుగు మీద బోర్లిచ్చింది. కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం మొదలెట్టింది.

ప్రతి నరసింహజయంతి నాడు తప్పకుండా గోడేఖబర్, కోకతట్టి నుండి వచ్చి, అమ్మతో పూజ చేయించుకుని వెళ్ళటం ఆమె ఎన్నో ఏళ్లుగా నిష్టగా చేస్తున్న పని. వీళ్ళిద్దరి స్నేహితం ఆవీధిలోని వారికి వింతగా ఉంటుంది. పక్క వాళ్ళు, చాల సార్లు అమ్మతో నిష్టూరంగా మాట్లాడేవారుకుడా. ‘భక్తి, శ్రద్ధతో చేసే పూజని ఎవరినైనా ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. మతమేదైన ఆయన కే పక్ష్టపాతం లేదు. ఆదేవుడికేలేని అభ్యంతరం పూజ చేసే నాకేమిటి’’ అని ఘాటుగానే జవాబు చెప్పేది.

అమ్మ మడి, ఆచారాలతో మధ్యాహ్నం రెండైన మడిచీర విప్పదు. వంట, పూజ దేవుడి ఆరగింపు అయి ఆవిడ భోజనం చేసేసరికి ముడైనావుతుంది.

చాంద్ బీ ముస్లిం, బురఖా వేసుకునిగాని బయటకి వెళ్ళదు. ఇక్కడికి వచ్చినప్పుడు ముఖం మించి బురఖా తొలగిస్తుంది. వచ్చిరాని తెలుగులో మాట్లాడుతుంది. అమ్మ ఆవిడని అందరిలా లోపలి పిలవదు బయట అరుగు మీదే కూచోమంటుంది. మంచినీళ్ళు గ్లాసులో ఇస్తే ఆవిడ తాగాక కడిగి బోర్లిస్తుంది. దానిపై నీళ్ళుచల్లి లోపలి తీసుకెళ్ల మంటుంది. కాని ఆమెని మాత్రం చాల ఆప్యాయంగా ఆదరించేది. కుటుంబ విషయాలు అడిగి మరి తెలుసుకొని సలహాలిచ్చేది. అదే ఆవిడని అడిగాను చాలాసార్లు. ‘నీకు అర్థంకాదులే మన మడిఆచారాలు మనవి. ఆమె మత ఆచారాలు ఆమెవి. తరతరాలుగా వచ్చే వాళ్ళ ఆచారలని పాటిస్తుంది. మనమూ అంతే. కాని నాకు తెలిసిందంతా ఒకటే ఇద్దరం మా కష్ట సుఖాలను చెప్పుకుంటాం. ఆమెదోరకం నాదోరకం. కానీ మా మతాలేవైనా ఇద్దరమూ బీదవాళ్ళమే.

పేద తనానికి మతం లేదు కదా ఏమిటో…ఎంచేయగలం, ఒకరికొకరం నాలుగు ఓదార్పుమాటలు చెప్పుకోవటం తప్పా.’ అని చెప్పేది. కొంత ఆకళింపు చేసుకునే దాన్ని కొంత అర్థం కాకపోయేది.

ఎప్పట్నుంచో పొల్లుపోకుండా ఇలాగే జరుగుతున్నా నాకు మాత్రం కొత్తగానే ఉంటుంది. ఆవిడ బురఖా వేసుకునే వస్తుంది. అలా ఎందుకు వేసుకుంటారని ఓ సారి అడిగాను. “బిడ్డా ఇది మా ఆచారం మా ఇండ్లల్లో గిట్లనే వేసుకోవాలి.” ఆమె రెండు చెవులకి కనీసం ఆరేసి దుద్దులైన ఉన్నాయి. చెవి చుట్టుతా కుట్టించుకుంది. నాకు విచిత్రంగా అనిపించి. ‘ఎందుకలా అన్నీ కుట్టిన్చుకున్నావు నొప్పి వేయలేదా‘ అని అడిగింది. ‘‘మాకిలా చిన్నప్పుడే కుట్టిస్తరు. మా అమ్మిజాన్ నాకు మూడు ఎండ్లకే కుట్టించింది. నొప్పి గిప్పి ఎంతెలుస్తది అప్పుడు ‘‘ అంది.

అమ్మ బయటికి వచ్చి కూచుంటూ “అయిపోవచ్చింది. ఆరగింపు చేసి ప్రసాదం కట్టిస్తాను. అన్నట్టు మీ పాన్ షాప్ ఎలా ఉంది. మా అబ్బాయి చూసాడట మీ వాడ్ని. కొత్తగా పెట్టామని చప్పాడట బాగా నడుస్తుందా”అడిగింది.

“ఏం దుక్నమో అమ్మా. మా ఆయన సైకిల్ షాప్ లో పంచేజేయమంటే ఆడ చేయ నన్నాడు.వాళ్ళ దోస్తుల మాటలు విని పాన్ దుక్నం పెట్పిచ్చిన్డు. ఆడ బాగా పైసలు వస్తయని చెబుతుండు. అది పెట్టటానికి మల్ల అప్పు అయింది. ఇప్పటికైతే బాగానే షాప్లో కూచుంటున్నాడు. రెండునెలలు అయింది. అప్పుకూడా కొంచం కొంచం వాపసు చేసిండు. సామి దయవల్ల గిట్లనే కమాయిస్తే చాలు. ఈయన, సైకిల్ దుక్నంల దినమంతా కష్టం చేసినా ఆమ్దని గంతనే. ఇయ్యాల రేపు అందరూ కార్లు, స్కూటర్ కొంటున్రు కదా సైకిల్ ఎవ్వరు తొక్తలేరు. వచ్చిన పైసల్ దాదాగాల్లకి, దుక్నం కిరాయి ఇయ్యంగ తిండికి సరిపోదు.” తన బాధ చెప్పుకుంది చాంద్ బీ.

“అవును చాంద్ బీ, అన్నీపిర్యమై పోయినై. మనం ఎంత సంపాదించినా తిండికే సరిపోవటం లేదు. మీ పిల్ల కూడా పెండ్లికి వచ్చిందిగా సంబంధాలు చూస్తున్నారా?” “అవునమ్మా గదే పరిశాన్ గుంది మొన్న దుబాయ్ నుంచి ఒక సంబంధం వచ్చింది కాని పిల్లగాడి ఈడు పెద్దగుంది. పిల్లేమో 17 ఏడ్లు, వచ్చే రిస్తలేమో 30, 40 ఎడ్లవాళ్ళు వస్తున్నై. నాకేమో ఇష్టం లే. మా ఇంటాయనేమో వాళ్ళు పైసల్ అడగరని గసొంటి రిస్తలే చూస్తుండు. ఏమో అమ్మా రాత్రికి కంటికి నిద్ర రాదు పరిషాన్ అవుతున్న.” అంటూ కళ్ళు తుడుచు కుంది. “ఊరుకో చాంద్ ఆ భగవంతుడున్నాడు నీ కష్టాలన్నీ గట్టేక్కిస్తాడులే. చూడు పిల్లగాడు బాగుపడుతున్నాడు కదా. అలాగే పిల్లకి కూడా మంచి రిస్త వొస్తది లే దిగులు పడకు. మీ ఆయనకి చెప్పు పిల్ల గొంతు కొయొద్దని. అంత ఈడు ఉన్నోడికి కట్టబెట్టకండి. అసలే రోజులు బాగాలేవు ఆ దుబాయ్ తీసుకపోయి ఎలా చూస్తాడో మనకి తెలియదుకదా. మళ్ళీ మనం చూడగలమా. ఇక్కడి పిలగాడైతే, పిల్ల మన కండ్ల ముందుంటది. మంచీ చెడు చూడవచ్చు. మా వాడు మొన్న పేపర్ల చదివి చెప్పిండు పెళ్లి చేసుకొని దుబాయ్ తీసుకుపోయి అమ్మేస్తరట. మీ పాత బస్తీలో ఇవన్నీ బాగా జరుగు తున్నాయని అన్నాడు. జాగర్త ఒకటికి రెండుసార్లు వాళ్ళగురించి అందరిని అడిగి తెలుసుకొని పెళ్లి చేయండి.” తనకు తెలిసిన విషయం చెప్పింది.

“అవునమ్మా నేనూ అదే అని బయట రిస్తలని హర్కిస్ వద్దంటున్న. మా బస్తీల చాల పిల్లలకి గట్లనే అయ్యింది. ఒకసారి పిల్ల పెండ్లి అయి ఆడకి పోయిందంటే ఇక అన్తనే, మళ్ళి మనకి కనబడదు. ఏ ఖబర్ ఉండదు. ఆడ అమ్మేస్తరో, ఇంట్లనే

ఉంచు తరో తెల్వదాయే. అందుకనే నేను ఈడనే చూస్తున్న. మొన్న మా తోడికోడలు చిన్నమ్మ ఒక రిస్త తెచ్చింది. పిల్లగాడు ఎక్కువ సదువ లేదు. కూరగాయల దుక్నం పెట్టుకున్నడు. కాని చాల పైసల్ అడుగుతున్నరు. మనకాడ అంత లేదు. ఇప్పుడున్న ఇల్లు అమ్మితే గిరివి పైసల్ పోను పెళ్లి చేసి పంపొచ్చు కాని గిరివి పెట్టిన సేటు అమ్మనిస్త లేడు. వాడికే అమ్మాలంట. అట్లైతే ఇల్లు అగ్వకు పోయి పైసల్ సరిపోవు. అన్ని తెల్సినంక కూడా సోనా ఏం పెడతవ్ అంటుంది మా తోడికోడలు. మా అమ్మిజాన్ పెట్టిన గీ చెవి కమ్మలు ఇస్తనన్న. గవి సాలవంట. ఏమ్చేయాలో సంజవుతలేదు.”

“చాంద్ బీ, బాధ పడకు, ఆ అల్లా మీద, నరసింహస్వామి మీద భరోస పెట్టు అంతా బాగైతది. ఉండు ఆరగింపు చేసి ప్రసాదం తెస్తా” అంటూ లేచి లోని కెళ్ళింది. దేవుడికి ఆరగింపు చేసి ఇస్తరాకులో పులిహోర ప్యాక్ చేసి. వడపప్పు శీతలం, కొబ్బరికాయ చిప్పలు, అరటిపళ్ళు వేరు వేరుగా కట్టి సంచిలో పెట్టి. పళ్ళెంలో హారతి, తీర్థ ప్రసాదలతో బయటికి వచ్చింది. “చాంద్ ఇదో తీర్థం తీసుకో” అంది. ఆమె లేచి బయటనించే దేవుడికి దండం పెట్టి, హారతి కళ్ళకద్దుకుని తీర్థం తీసుకుంది. అరటి పళ్ళు ఆమె ముందుంచి “ఇదిగో సంచిలో అన్నీ పెట్టాను. నీవు ఈ పళ్ళు తిను ఇదిగో మంచినీళ్ళు తాగు. ఇంటిదాకా వెళ్ళటానికి కాస్త ఊపిరి వొస్తుంది. ఇంటికెళ్ళి అందరు కలిసి ఈ ప్రసాదం తినండి.” అలాగే నమ్మా నరసిమ్హసామికి మామీద ఎప్పుడు దయ వస్తదో ఏమో. సామి నా బిడ్డా పెండ్లి మంచిగా అయ్యేట్టు చూడు సామీ.” అంటూ. పళ్ళు తిని నీళ్ళు తాగి సంచి తీసుకుని లేచింది. “వస్తానమ్మా పనికి పోవాలె… వస్తాను విజయమ్మ చల్లన్గుండు ” అంటూ మరో సారి దేముడికి దండం పెట్టి బయలు దేరింది. “మంచిది చాంద్ బీ అంతా బాగైతది దిగులు పడకు. ఆ.. అలాగే మరచి పోకు పీర్ల పండక్కి రా దట్టి తీస్క పోదుగాని” అంటూ సాగనంపింది. ఆడుతున్న ఆట ఆపి “మంచిది అంటీ”అన్నాను ఆమె వెళుతున్న వైపు చూస్తూ.

కోకతట్టి నుంచి వచ్చే ముస్లిం చాంద్ బీ, నరసింహ స్వామి కి భోగం చేయిస్తే … గుడి పూజారి భార్య అయిన మా అమ్మేమో ప్రతీ మొహర్రం పీర్ల పండక్కి దట్టి, చాదర్, వస్త్రాలు పంపుతుంది. ఆవిడ ఊదు ప్రసాదంగా తెచ్చి ఇస్తుంది. నాకు బుద్ది తెలిసినప్పటినుంచీ ఇలాగే సాగుతోంది. మొదట్లో అర్థం అవక అమ్మని అడిగి అడిగి విసిగించేదాన్ని. తరువాత అలవాటయి పోయింది.

సాంప్రదాయ కుటుంభం లోని అమ్మ పీర్ల పండగ మానలేదు

ముస్లిం అయిన చాంద్ బీ నరసింహ జయంతికి భోగం చేయించటంమూ మానలేదు.

తమ వాడకట్టు అగ్రహారం మాత్రమే తెలిసిన అమ్మ,

ఆమె మోహల్లానే తెలిసిన చాంద్ బీ వాళ్ళ ప్రపంచమే వాళ్ళది.

ఇద్దరికి ఎలాంటి చదువు సంధ్యలు లేవు, ప్రపంచ జ్ఞానమూ లేదు.

వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలను పాటిస్తూ, ఇతర దేవుళ్ళనీ, వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించి, నమ్మి పూజలు చేసేవీళ్ళకి హిందూ ముస్లిం మత కలహాలు అసలు తెలీదు. కొన్ని శతాబ్దాల క్రితం ముస్లింలు ఎక్కడనుంచి వచ్చారో తెలియదు. తెలిసిం దంతా ఒక్కటే అంతా పేదరిక బాధితులమని. వీళ్ళ సంస్కారం ముందు, ఎంతో చదువుకుని, సో

కాల్డ్ సంస్కారాన్ని పులుముకొని సంఘంలో తిరిగే మహానుభావులు తమ మతమే గొప్పదని రొమ్ము విరుచుకుని ప్రచారాలు చేస్తున్నారు. మరి వాళ్ళు చదివిన చదువు విజ్ఞత నేర్పలేదా! వాళ్ళు గుడ్డిగా పాటిస్తున్నదంతా రాజకీయ మత్రాంగమని తెలుసుకోలేక పోతున్నారా. దేశంలో తలెత్తుతున్న సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు స్వార్థ రాజకీయాల కోసం మత వైషమ్యాలను పెంచుతూ, మనుషుల మధ్య అడ్డుగొడల్ని నిలిపి, మనల్ని పావుల్లా వాడుకుంటున్నారని ఈ స్కాలర్స్ కి తెలియదా?

ఆ రోజుల్లోనే, అంటే 1960 ప్రాంతం లోనే మతసామరస్యానికి ప్రతీకలుగా ఉండే వాళ్ళు వీళ్ళిద్దరూ.

ఇప్పుడే ఇలాగుంది. రానున్న కాలంలో మన దేశం ఇంకెంత మారుతుందో కులాలు మతాలు లేకుండా అందరూ బాగుంట రెమో నని అనుకునే దాన్ని. కానీ మారుతున్న కాలంతో మనుషులు వింత పోకడలు తప్ప విచక్షణ కనబడటం లేదు. తమ తమ మతాలే గొప్ప వని అనడం కంటే ఇతర మతాల వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ ప్రచారాలు చేస్తున్న వారిని చూస్తే మన సంస్కృతి ఏమై పోతుందో అనిపిస్తుంది.

You may also like

Leave a Comment