Home వ్యాసాలు గళమెత్తిన మహిళా పత్రికలు

గళమెత్తిన మహిళా పత్రికలు

         ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం వలసలు పోయి జీవించడం వాటివల్ల ఆయా ప్రదేశాల స్థానిక ప్రజలు, విద్య- ఉద్యోగావకాశాలు కోల్పోయి, భాష -ఆచార వ్యవహారాల అస్తిత్వం కోల్పోయి, అవమానింపబడి ఎంతో హీనమైన జీవితం గడుపుతూ… మళ్ళీ  ఆ అవకాశాలు తమ స్వంతం చేసుకుని మెరుగైన జీవితం జీవించాలన్న కోరిక ఉండడం సహజమే కదా!

     ఆ కోవలోనే మహిళలు వారి ప్రతిభలను ఎక్కడా ప్రదర్శించుకునే అవకాశాలే లేక  వివక్షకు గురైన సంఘటనలెన్నెన్నో…  అవకాశాలు లేవు కానీ ప్రతిభకు లోటులేదని చెప్పడానికి ఆ కాలంలోనే పత్రికలలో మహిళలకు ప్రత్యేక కాలమ్స్ నడిపారు.

    ఇటీవల ఒక మహిళ తమ సంతానం అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్న వారి ఆశలు అక్కడి ప్రభుత్వ పాలనా విధానాలు  అడియాసలుచేస్తే.. తమ పిల్లలు తిరిగి మన దేశం

 రావడం చాలా బాధాకరమని చెప్పి బాధపడింది.

   ఈ సంఘటన విన్నాక మా నాన్నగారు చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చింది. “ఎప్పుడైనా అవసరం ఒక మార్గాన్ని ఎన్నుకుంటుందని అది  అణచివేతలో తమ ఉనికిని చాటుకునేందుకు చేసే చర్య రచనా రూపంలో కానీ, తిరుగుబాటు రూపంలోనైనా కానీ వారిలోని అసహనం వెళ్లగక్కవచ్చు, సాధించవచ్చు” అని, ఒక పత్రిక స్థాపనకు దారితీసిన వైనం చెప్పారు.

   1901 లో మద్రాసులో కమలా సత్యనాథన్ అనే  ఒక మహిళ *ఇండియన్ లేడీస్ మ్యాగ్జిన్* అనే ఆంగ్ల పత్రికను స్థాపించి సంపాదకీయం చేసిన మొట్టమొదటి భారతీయ మహిళా పాత్రికేయురాలు అనీ,  ఈ పత్రికలో ఆమె చర్చించని విషయం అంటూ లేదనీ, మా సోదరి దయామతీ దేవి కూడా చెప్పేవారు.

  ఉత్తేజపూరితమైన సంపాదకీయాలు రాస్తూ, స్త్రీలకు ప్రేరణ కలిగించేదనీ, అంతవరకూ వారు ఇల్లే సర్వస్వం అనుకున్నవారు ఓహో! ఇలా కూడా తమ ప్రతిభను చాటుకోవచ్చా? అనే

ఆలోచన కలిగించే విధంగా ఆయా సంపాదకీయాలుండేవట. అంటే మహిళల అస్తిత్వం కోసం, సంస్కృతి సంప్రదాయాలను రక్షించడం కోసం  మహిళలకు ఆ పత్రికలో పెద్దపీటనే వేసింది కమలా సత్యనాథన్.

       ఎందుకంటే? తరతరాలుగా సంస్కృతీ వారధులు మహిళలే కనుక ముఖ్యంగా ఆనాడు  వలసరాజ్య నిబంధనల వల్ల ఎక్కువ నష్టపోయింది కూడా స్త్రీలే కావడం! పితృ స్వామ్య వ్యవస్థలో అణగారి పోతున్న  అతివల పక్షాన వారి హక్కులు- బాధ్యతలు తెలుపుతూ సమాజంలో ఎదగాలన్న ఆశను కలిగించింది ఆ పత్రిక.

   అందుకోసం స్త్రీలకు  విద్య యొక్క ఆవశ్యకతను తెలుపుతూ, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ, తోటల పెంపకం, కుటీర పరిశ్రమలు, కుట్లు- అల్లికలు, ఇలా స్త్రీ సంబంధమైన అన్ని అంశాల్లో నిష్ణాతులను పరిచయం చేస్తూ, ప్రేరణా మూర్తులను సామాన్య గృహిణులకు పరిచయం చేస్తూ  జ్ఞాన ప్రసరణలు చేసిన మాన్వి కమలా

సత్యనాథన్.

   ఆ కాలంలో ఆడవారు మంచి భావకులై  రచనలు చేసే సత్తా ఉన్నా… ఏ పత్రికలోనైనా  ప్రచురించుకోవాలంటే… ఎవరేమనుకుంటారో?? అని సంఘంలో ఒక బెరుకు- బిడియంతో ఉన్న కాలంలో మహిళలతో నాటకాలు, కథలు, పనులలో శ్రమను మరచిపోయే పాటలను, సీరియళ్లు రాయించి, ప్రచురించి సంపాదకత్వం వహించిన కమలా సత్యనాథన్ అభినందనీయురాలు.

    ఆ కాలంలోనే కాదు! ఏ కాలంలో నైనా కుటుంబాలు యావత్తు ఆడవారి సేవల మీద ఆధారపడి నడిచేవే… కనుక సక్రమంగా పనులు చేయాలంటే ఆడవారికి ఆరోగ్యం ముఖ్యమని భావించి, ఆరోగ్య సంబంధ రచనలు అచ్చు వేసేవారు.

   పత్రికలో  ఒకటి రెండు కాలమ్స్ కేవలం  మానవీయ విలువల ప్రచురణకే కేటాయించేవారు. ఆ కాలంలో సాధికారత సాధించిన మహిళామణులు రమాబాయి,

సొరాబ్జీ,  జోసెఫ్ లాంటి గొప్ప మహిళలు చేపట్టిన పనులను- అందులో వారు సాధించిన విజయాలను  వరుసగా ఆ పత్రికలో  ప్రచురించేవారు.

     అయితే పత్రిక  ఆర్థిక ఇబ్బందులతో పాటు ఎన్నో కారణాలు వల్ల కొంతకాలం పత్రికను ఆపాల్సి వచ్చింది. ఇంకొందరు ఏమంటారంటే?  అప్పుడప్పుడే జాతీయ ఉద్యమాలు ఊపందుకుంటున్న ఆ తరుణంలో ఆ ఉద్యమాలను ప్రోత్సహిస్తూ పత్రికలో ఏ రచనలు రాలేదనీ, అందుకే పాఠకులు ఆదరణ చూపలేదని అంటారు. కానీ దేనికైనా ఒక పరిధి ఉంటుంది కదా?  ఆ కాలంలో రాజకీయాల జోలికి వెళ్లేంత సాహసం స్త్రీలకు లేదేమో? అని నేను అనుకుంటాను.

   అంతే కాదు రాజకీయాలలో ప్రవేశించమని మహిళలకు పిలుపు ఇవ్వలేదని ఒక అపవాదు కూడా ఉన్నది. ఆమె మహిళలను కుటుంబ పరిధి దాటిపోనివ్వని సనాతన వాదురాలనే ఒక అపప్రథను ఎదుర్కొంది. అందుకు ఆమె

సంపాదకీయాలు అలానే ఉండేవని మా సోదరి చెప్పేది.

ఏదేమైనా ఆర్థిక ఒడి దొడుకులతో పాటు ఇతర కారణాలతో కష్టమైనప్పుడు ఆమె  వ్యాపార ప్రకటనలు ఆయా పారిశ్రామిక వేత్తల దగ్గర సేకరించి పత్రికలో  ప్రచురించి ఆ విధంగా ఆర్థికంగా ఆసరా తీసుకున్నారు.

    1901 లో స్థాపించిన పత్రిక 1918 వరకు మాసపత్రికగాను,  1927 నుండి 1938 వరకు ద్వైమాసిక పత్రిక గాను నడిపారు. తర్వాత ఆమె కూతురు పద్మినీ సత్యనాథన్ పత్రిక పగ్గాలు చేతబట్టి, సహసంపాదకురాలిగా సేన్ గుప్తాను నియమించి; తాను ప్రచురణ నిర్వహణ చేస్తూ పత్రిక ను నడిపింది.

  ఇక్కడ పత్రిక ఎందుకు ఆగిపోయిందన్న ప్రస్తావన కాదు ముఖ్యం… వలసవాదుల వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడల్లా ప్రజల పక్షాన పత్రికలు గొంతెత్తేవి  అనేది ముఖ్య విషయం. అలా వెనక్కి వెనక్కి పయనిస్తే ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.

  గుజరాత్ లోనూ జాతీయోద్యమం ( అప్పటికా పేరు లేదు ) కానీ వలసవాదుల అణచివేతను తట్టుకోలేక  స్త్రీలను చైతన్య పరచాలనే ఉద్దేశ్యంతో  *స్త్రీ బోధ్* మహిళా పత్రిక 1857లో స్థాపించటం జరిగింది.

    అలాగే కేరళలోనూ మలయాళ పత్రిక

*కేరళ సుగుణ బోధిని* అని తిరువనంతపురం నుండి మరో పత్రిక వెలువడింది.

1992 లో *తూర్పు పనోరమా* అనే పత్రిక మహిళాసారధ్యంలో స్థాపించబడింది. ఇది మొట్టమొదటి ఈశాన్య భారతదేశం నుండి వెలువడిన ఆంగ్ల పత్రిక. ఆ కాలంలో ఆ ప్రాంతంలో విధి వంచితులైన , క్రూర వైధవ్య దుఃఖ పీడితులైన, వారిని తొక్కివేసే సామాజిక నిర్బంధాలు, ఇక్కడ పేదనా, బడుగు వర్గాలా? అనే తేడాలేదు… వివిధ వర్గాలలోని స్త్రీలు జీవితపు సుడిగుండంలో చిక్కుకుని, అర్ధాంతరంగా అసువులు బాసిన అతివల  యధార్థ గాథలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వారి ఆక్రోశమూ, తీరని కోరికల నేపథ్యమూ, ఆస్తి

హక్కులు లేక దీనావస్థలో పడిన వైనమూ, ఇలా ఎన్నెన్నో సమస్యలను చర్చించిందా పత్రిక.

  ఎవరు ఏ పత్రిక స్థాపించినా స్త్రీలను సంతోషంగా ఉంచడమని, సమాన హక్కులతో జీవించమని చెప్పడమే…. ధ్యేయం… అలాగే అదే సమయంలో వారిని ఉత్తమ గృహిణులుగా ఉండాలనే సమాజ దృష్టి… ఎవరైనా కాస్త వారి హక్కుల కోసం పోరాడితే వారిని తెగించిన ఆడవారిగానే ఆ కాలంలో పరిగణించారు. అది దాదాపు 1930 వరకు నడిచింది. స్త్రీలకు బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నదని తెలియకుండా పురుష సంపాదకత్వంలో వచ్చిన పత్రికలు కొంచెం జాగ్రత్త పడ్డారనే చెప్పవచ్చు. అందుకే ఈ మహిళా పత్రికల స్థాపన జరిగిందేమో?

  తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు మహిళల పక్షాన నిలిచిన పత్రికలు మహిళా సంపాదకీయం  చేస్తూ విలువైన సందేశాలను ఇచ్చి, ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా… స్వతంత్రంగా మన భావాలు వెలిబుచ్చుకొనే తోవ చూపిన మహిళ పత్రిక స్థాపకులకు, మహిళా సంపాదకులకు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ…           

You may also like

Leave a Comment