Home కవితలు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్
సముద్రం పైన ఉంది కదా
దాని ఠీవి దానిది.

మొదటిసారి
ఆ వంతెన మీదుగా వెళ్తున్నప్పుడు
చప్పట్లు కొడుతున్నట్టుగా
అలల చప్పుడు.

మూడు కిలోమీటర్లు మించని వెడల్పు
పావు కిలోమీటరు మించని పొడుగు
అయినా
అది పసిఫిక్ పడతి మెడలో
నిగ నిగల నారింజ తొడుగు.

తూర్పు నుండి పడమరకి
పరుగెత్తే సూర్యునికి
ఇదే ఫినిష్ లైన్‌గా కనిపిస్తుంది.

అక్కడి విస్టా వ్యూ పాయింట్ నుండి చూస్తే
విస్తారమైన సముద్రం
సహస్ర కోటి బాహువులను
సారించి పిలుస్తుంది.

అది కేవలం
ఇనుప కడ్డీల సేతువు కాదు
సాయం చేసే నేస్తమంత మృదువు.

ఎన్ని సంవత్సరాల చరిత్ర దానిది!
శాన్ ఫ్రాన్సిస్కో, మెరైన్ కౌంటీల మధ్య వారధి
సిలికాన్ వ్యాలీ గుర్రాలను నడిపే సారథి.

ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా
క్లైమాక్స్‌లో రణక్షేత్రంగా
మీరూ దీనిని చూసే ఉంటారు
అదంతా ఓ ఫాంటసీ!
నిజానికి అక్కడికి వెళ్లి
ముట్టుకుంటేనే అసలు ఇంటిమసీ.

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అందమైన దృశ్యాలు
శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞాపకాలు
దాని ఇనుప దేహం మీద
నేనొక కవిత రాసి పెట్టాను
మీకు కనిపిస్తే
చదువుకోండి.

[ఉద్యోగరీత్యా 2014-2016 మధ్య కాలంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నొవాటో నగరంలో ఉన్నప్పడు పలుమార్లు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వెళ్ళే అవకాశం కలిగింది. ఆ అనుభూతికి అక్షరరూపం ఈ కవిత.]

You may also like

1 comment

Kudikala Vamshidhar December 31, 2021 - 1:39 pm

నేను రాసిన “గోల్డెన్ గేట్ బ్రిడ్జ్” కవితను మయూఖ అంతర్జాల మాస పత్రికలో ప్రచురించిన డా॥ కొండపల్లి నీహారిణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

Reply

Leave a Comment