ఏం చేసాననీ..
ఏం చేయగలననీ…
ఏం చేస్తూ
వచ్చాననీ…..
ఇన్ని సంవత్సరాలుగా
ఎన్నో అద్భుత
సూర్యోదయాలను
భూస్థాపితం చేసాను….
ఎన్ని సాయంకాలాలు
రాలిపోతున్న సంధ్య
పొద్దుల్లో గడిపాను…
ఎన్నో చీకట్లను
వెలుగనుకొని
భ్రమ పడ్డాను…
ఎన్నో దారుల్లో దారి తప్పి
గమ్యం వెతుక్కునే
పనిలో తిరిగాను…
ఏం అడిగానని ..
ఎవరిని వంచించానని..
ఇంకెవరినీ మోసం
చేసాననీ….
ఏదో ఒక బాధ నుంచి
పదం పుట్టి ఆ పదం
వాక్యమై వియోగ
కవితలుగా
అవతరించాయి తప్ప…
వివరించినా అర్థం కాని
వారంతా పిచ్చివాడన్నారు..
లోకమంతా పిచ్చిని నా ఇంటి
పేరు చేసింది!
ఏం కావాలనీ ….
ఏం కోరాననీ…
చచ్చిపోతే…
మెడలో వేయడానికి
ఆరు మూరల పూల దండ…
చచ్చిపోతే…
మీద కప్పడానికి…
కొన్ని పుస్తకాలు…
నేను రాసుకున్న
కొన్ని పిచ్చి కవితల
కాగితాలు…
చచ్చిపోతే…
పూడ్చడానికి
ఆరు అడుగుల నేల తప్ప…