Home కథలు చిన్న కుటుంబం,చింత లేని కుటుంబం

చిన్న కుటుంబం,చింత లేని కుటుంబం

by Pratyusha Itikyala

నేను గజిని లెక్క. ఒకసారి చూసిన మొహం, విన్న పేరు అంత బాగా గుర్తుండవు. నాతో కాసేపు మాట్లాడి, మీ పేరు మీరే చెప్తే అప్పుడు మీ గొంతులో మీ పేరు, ఆ పేరుకి ఒక మొహం నా బుర్రలో ఫీడ్ అవుతాయి.

అలాంటి నాకు నా పెళ్ళికి ముందు పెద్దగా పెళ్లిళ్లకు వెళ్ళే అలవాటు అవసరం, అవకాశం కూడా లేవు. ఇంటరు వరకు చదువు చదువు అని హోం అరెస్ట్. ఆ తరువాత చదువు ఉద్యోగం కోసం రాష్ట్రం బహిష్కరణ.

కట్ చేస్తే నా పెళ్లికి పదిహేను వందల మంది అతిథులు. అందులో నాకు తెలిసింది తిప్పి తిప్పి కొడితే వంద మంది. ఏదో ప్లాస్టిక్ నవ్వుతో పెళ్లి అయిపోయింది.

ఆ తరువాత చూస్కోండి ఇంటికి ఏ పెళ్లి శుభలేఖ వచ్చినా ఇదే తంతు.

“వీళ్లు నాకు తెలియదు. నేను పెళ్లికి వచ్చి ఏం చేస్తాను అత్తమ్మా? పైగా సెలవు కూడా లేదు.”

“దగ్గరి వాళ్ళేనే. మా చిన్నమ్మ ఆడిబిడ్డ మేనల్లుడికి మరదలు. ఆళ్ళ మొగుడు మా మారక్క మనుమరాలు అత్త ఏరాలి తమ్ముడే. రెండు దిక్కుల దగ్గరే కదా. సెలవు పెట్టు. వెళ్లక పోతే బాగుండదు.”

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి ఆట మొదలు. ఆ చిన్నమ్మ ఆడిబిడ్డ దగ్గరే నా బుర్ర వాళ్ళ మొహాలు, పేర్లు వెతుక్కుంటూ “Error 404 Not Found” అని తెల్ల మొహం వేస్తుంది.

అలా హాజరు అయిన పెళ్లిళ్ల సాక్షిగా ఆ పెళ్ళిళ్ళలో మరో సీన్ రిపీట్

“ఈమెను గుర్తు పట్టినవా?

ఆరోజు చెప్పిన గదా. మా పెద్దాడిబిడ్డ వాళ్ళ అత్త తల్లిగారు వీళ్ళ ఊరే. చిన్నప్పుడు ఒకసారి వెళ్లి వాళ్ళ ఇంట్లో తిన్నం. మంచి మనుషులు.”

ఈలోపు నా బుర్ర మీ పేరెంత.. సారీ..పేరేంటి, మాకు ఏమవుతారు అని అడగాలని ప్రయత్నిస్తూ ఆ వరసల పురాణం ఎప్పుడు తెగేను అని స్విచ్ ఆఫ్ అయిపోతుంది.

ఇహ ఎంతో పరిచయం ఉన్నవాళ్ళ లాగా వాళ్ళే దగ్గరికి వచ్చి మనం నమస్కారం చేశాక “హే నన్ను గుర్తు పట్టావా, నా పేరేంటి చెప్పుకో చూద్దాం” అన్నప్పుడు వెయ్యి ఓల్టుల కరెంటు షాక్ కొట్టి మెదడు మొత్తం కొయ్యబారిపోయినట్టు ఉంటుంది..

అదండీ నా అశక్తతకు అంచనాలకు మధ్య యుధ్ధాలు నా సహనాన్ని అలా పరీక్షిస్తూ ఉంటాయి. ఎవరైనా పూనుకుని ఎదుటి వాళ్ళ మొహం స్కాన్ చేసి మన ఫోన్ మీద వాళ్ల పేరు, ఊరు, మనకు ఏమవుతారు లాంటి వివరాలు వచ్చేలా ఒక యాప్ చేస్తే బాగుండు.

You may also like

Leave a Comment