మన స్నేహం ఎంత మధురం
చక్కలి గిలి పెట్టినంతగా
నవ్వు ల పువ్వులు పూయించిన
దారులేమయినాయో
ఇంట్లో బాధలు గుండెలు పిండినా
ఈటెల మాటలు మంటలు మండి నా
మన చిరు.నవ్వు పరదాల వెనుక
వాటిని దాచి దాచి చందామమలా
సాగిపోయిన వెన్నెలేది
కళాశాల పూదోటలో
సీతాకోక చిలుకల్లా
విహరించిన స్నేహబృందాలేవి
ఒగరు ఒగరు గా
మనను కసురు కున్న
అధ్యాపక తోటమాలులేరి
మన ముఖ చంద్ర బింబాల
వెన్నెల కోసం
మన కలువ రేకు కాటుక కన్నుల కోసం
పోటీ పడే చకోర పక్షుల
రెక్కల సవ్వడిలో
తుమ్మెద ఝంకార అల్లరిలో
నీవో కథానాయిక నేనో కథానాయిక
ఒక్క మార్కు తేడాతో
అలకలు అలజడులు
మూతి విరుపులు మనస్పర్ధలు
రెండు రోజుల నిశ్శబ్ద నిడివిలో
బెంగతీరగా కలిసిన కలయికలో
కలల పాటలెన్నో
సఖీ
మనతియ్యని స్నేహాన్ని
వివాహం విడదీసింది
బాధ్యత ల పేరుతో
బాసిగాలు కట్టి
పచ్చగాజుల సంకెళ్లు వేసి
నీవాళ్ళు నిన్ను
నా వాళ్ళు నన్ను
శాశ్వత బందీలుగా చేసు
కున్నారు
అయితేనేం
పసిపాపాల నవ్వుల్లో
వికసించిన పువ్వుల్లో
నిన్ను చూసుకుంటానునే
చెలీ