మాది ఉత్తర తెలంగాణలో ఓ పట్టణం. బతుకు కోసం దుబాయ్ సూరత్ బొంబాయి పోయే బతుకులు మావి. చుట్టూ చెరువులే.. వానలు లేవు. పంటలు లేవు . వలస పోవుడే బతుకు బాగు కోసం..అందరి లాగే మా నాన్న వలస దుబాయ్ కి . మేము ముస్లింలం. ప్రతి రోజు నమాజు వేళలో అలికిడి. మా వీధిలో అంతా ముస్లింలమే. అందరూ పరదా చాటునే.. ప్రశ్న తలెత్తని మహిళా సమాజం. తలాక్ లకు ఎన్నో జీవితాలు బలి. ఎచ్చోటనైనా పితృస్వామ్య దురాక్రమణ యే – ఏ మతమైనా…
నేను పుట్టాను ఓ మధ్య తరగతి కుటుంబంలో…. పుట్టాను ఎందుకో అనుకోలే నా తల్లిదండ్రులు. నా కంటే ముందు ఇద్దరూ అమ్మాయిలే.. ఐనా పుట్టుక ఆడో మగో తమ చేతుల్లో ఉండదనే విజ్ఞత గల తల్లి దండ్రులు. అబ్బాయినైనా అమ్మాయినైనా పెంచే తీరులో వ్యత్యాసాలు కనబరచని తల్లి దండ్రులు నా అదృష్టం.అల్లారు ముద్దుగా పెంచారు ఆడపిల్లనయినా… నాన్న జమీల్ ఫుట్ బాల్, క్రికెట్ ఆటగాడు. అమ్మ పర్వీన్ విద్యార్థి దశలో కబడ్డీ ఆడేది. సిర్నాపల్లి కోట చుట్టూ ఎన్ని సార్లు ఉరికానో ఆలిసాగర్ కట్ట మీద ఎన్నిసార్లు అటూ ఇటూ పరిగెత్తానో మల్లారం అడవి లో పక్షి పలుకులు నా మాటలకు పదును పెట్టాయేమో.. రెక్కలొచ్చిన పక్షుల జూచి నేను నేర్చుకున్నా ఎలా ఎదగాలో…. వివక్షను ఎరుగను ఇంట్లో.. వీధిలో చూచే చూపులు.. విరిసే సూటిపోటి మాటలు.. మామూలే.. అడ్డంకులు ఈ సమాజంలో.
అక్కలిద్దరూ పుస్తకాల పురుగులు. ప్రాథమిక విద్య నుండి చదువులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా అమ్మ నాన్న మమ్మల్ని పెంచారు. నాకు చదువుతో పాటు ఆటపాటలంటే ఇష్టం. మా ఇంటికి దగ్గరే వుండే కలెక్టరేట్ మైదానంలో పరుగు పందేల సాధన చేసే దాన్ని. అనుకోకుండా అక్కడ మగపిల్లలు ఆడే ఆటల పై నా దృష్టి పడింది. నేనెందుకు బాక్సర్ కాకూడదనే మీమాంస నాలో మొదలైంది . పట్టుమని పదేళ్లు నిండని నాకు నాడే నా లక్ష్యం కళ్ళల్లో మెదిలింది. రోజూ పరుగు కోసం పోవటం బాక్సింగ్ వైపు చూడటం లోలోన మథన పడటం నా వంతయింది. నాన్న కి చెబితే ఏమంటాడో అమ్మకి చెబితే ఏమంటుందో అనే బెంగ లోలోన.
నాన్న సంవత్సరాంతర సెలవులకి మా ఇంటికి వచ్చారు. ఒక రోజు నాన్న జమీల్ తో పాటు మైదానానికి వెళ్ళాను. ముందే ఒక ప్రణాళిక ప్రకారం నా మనసులో మాట చెప్పాలనే నాన్న నీ తీసుకెళ్ళాను. రన్నింగ్ ప్రాక్టీసు అయిపోగానే నేనూ నాన్న ఓ వేప చెట్టు కింద కూర్చున్నాం. ఇంతలో నాన్న స్నేహితుడు గౌస్ వచ్చాడు సలాం వా లేకూం అనుకుంటూ. ఆలింగనం చేసుకుంటూ చిన్న నాటి ముచ్చట్లు, గల్ఫ్ ముచ్చట్ల లో వారిద్దరూ. నా చూపులు మాత్రం దూరంగా జరుగు తున్న బాక్సింగ్ ప్రాక్టీసు వైపు.. నాన్న కి ఎలా చెప్పాలనే ఆలోచనల్లో నా పదకొండేళ్ల బుర్ర అస్తవ్యస్తం. ఏదైతే అదైందని నా మనసులో మాటను అబ్బా! మై బాక్సర్ బనూంగి,! అని చెప్పేసాను. ఒక్కసారి గా నాన్న నివ్వెర పోయారు . ఏమడుగుతున్నావ్! నీకేమైనా మతి పోయిందా! ఆడపిల్లవు బాక్సింగ్ ఎలా చేస్తావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. పక్కనే కూర్చుని మా సంభాషణ చూస్తున్న గౌస్ మామ కలుగ చేసుకుని నీకు నిజంగా ఆసక్తి పట్టుదల ఉంటే నేను నిన్ను బాక్సర్ ను చేస్తా అన్నారు. ఇదేంటి గౌస్ మామ ఇలా అంటున్నారు ఈయనకి బాక్సింగ్ కి ఏం సంబంధం అనుకుంటుంటే ఏం ఆలోచిస్తున్నావు నేను బాక్సింగ్ కోచింగ్ ఇస్తున్నాను అని తనకు తాను పరిచయం చేసుకున్నాడు. అప్పటిదాకా గౌస్ మామ బాక్సర్ అనే విషయం నాకు తెలియదు .
నిజామాబాద్ డిచ్ పల్లి మీదుగా వెళ్లాల్సిన మన్మాడ్ రైలు మార్గం సిర్నాపల్లి మీదుగా వెళ్లినట్లు అథ్లెట్ కావాల్సిన నేను బాక్సింగ్ వైపు వెళ్ళాను. రైలు మార్గం మళ్ళింపు వెనుక సిర్నాపల్లి రాణి సీలం జానకి బాయి ప్రోద్బలం వుంటే నా వెనుక నా ఆత్మ విశ్వాసం మాత్రమే వుంది. ఆరంభంలో బాక్సింగ్ దుస్తుల ను వీధిలోని వారు చూచి పెదవి విరిచారు. ఆడపిల్ల కి బాక్సింగ్ ఏమిటి పెళ్ళి చేసి అత్తారింటికి పంపక అని గుసగుసలు. గౌస్ మామ సలహాలు సూచనలు తుచ తప్పకుండా పాటిస్తూ బాక్సింగ్ ప్రాక్టీసు మొదలెట్టాను. మహబూబ్ గంజ్ గడియారం నాకు సమయపాలన నేర్పింది. నా విశాల దృక్పథం వ్యక్తిత్వం కోచ్ ల సలహాలు సూచనల మేళవింపు తో ముందుకు కదిలాను.
రోజూ ఉదయాన్నే లేచి టీ షర్ట్ పొట్టి నిక్కర్ వేసుకుని బైటికి వెళ్తుంటే నా మతస్తులే నన్ను అవహేళన చేసేది. ముస్లింలలో చెడ బుట్టింది. సంప్రదాయాన్ని మంట గలుపుతుందని దాడి చేసినంత పని చేసేది. వేళకి నమాజ్ చేసుకుని పరదా మాటున వుండాల్సిన పిల్లని బాక్సింగ్ అంటూ జనాల్లో తిప్పుతున్నావని నాన్నని మసీదులో పెద్దలు హెచ్చరించే వారు. ఒక చెవిన విని మరో చెవిన వదిలి పెట్టే వారు నాన్న. అమ్మ కి చుట్టుపక్కల అమ్మలక్కల చెవి కొరుకుడు ఎక్కేది కాదు. ఇంట్లో మంచి రుచి గల వంటలు మాంసాహారం బిర్యానీ లు వండినా నా కోసం నా డైట్ యే వండి పెట్టేది. నా ముఖం పై పంచ్ లతో గాయాలయితే కన్న తల్లి మనసు తల్లడిల్లి పోయేది.. ముఖం వాస్తే అందం సన్నగిల్లితే పెళ్ళి కాదేమో ననే ఆదుర్దా అమ్మలో. ఒక్కసారి బాక్సింగ్ ఛాంపియన్ అయితే వరుసలో మగపిల్లలు స్వయంవరం ప్రకటనలా ఇంటికే వస్తారంటే అమ్మ గలగల పారుతున్న గోదావరిలా నవ్వేది. నాలో నా నేల ఆత్మ స్థైర్యం ఎక్కువని నాన్న కితాబు ఇచ్చేవారు.
బాక్సింగ్ లో తొలి మెళకువలు నేర్చుకున్నాక మంచి కోచింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చాము. షేక్ పేట్ లో ఇల్లు. డాబా పైకి ఎక్కితే ఎత్తైన గోల్కొండ కోట నాలో ఉత్తేజాన్ని నింపేది. నేను పుట్టిన పట్టణానికి గోల్కొండ రాజు నిజాం ఉల్ హక్ పేరు మీద పెట్టిందే. నిజామాబాద్ నుండి హైదరాబాద్ ప్రయాణం ఒక ప్రయాణం గా కాక ఓ చరిత్ర సృష్టించాలి గోల్కొండ లా అని మనసులో అనుకున్నా. పోరాడు చదువుతూ పోరాడు లక్ష్యం కోసమని తలంచి డిగ్రీ లో చేరాను. బాక్సర్ స్లగ్గర్ స్వార్మర్ శైలులు నేర్చుకునే పనిలో నా శారీరక మానసిక లక్షణాలను బట్టి నాలో పరిపూర్ణత సాధించుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఈ శైలులు ఒక దాని పై ఒక ప్రయోజనం ప్రతికూలత వుంటుంది. అది అర్ధం చేసుకునే రీతిలో నా కోచ్ లు బాగా తర్ఫీదు ఇచ్చారు. అక్కలిద్దరూ ఫిజియో థెరపిస్టులు గా స్థిర పడ్డారు. చెల్లెలు బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకునేది. దుబాయ్ కి తన కుటుంబాన్ని వదిలి వెళ్ళి నాన్న సంపాదించిన సొమ్ము తో నా శిక్షణ సజావుగానే సాగేది. పద్నాలుగు సంవత్సరాల ప్రాయంలో జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెలవడంతో నాలో ఆత్మ విశ్వాసం రెట్టింపైంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఒలింపిక్స్ కి వెళ్ళాలనే తాపత్రయం నాలో కలిగింది. భుజం గాయంతో బాధ పడినా శస్త్ర చికిత్స తో కోలుకుని సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రాక్టీసు మొదలెట్టాను. కరోనా లాక్ డౌన్ లో మా యింటి టెర్రస్ పై ప్రాక్టీస్ చేస్తుంటే తారామతి బారాదరి నృత్య కళా వేదిక స్ఫూర్తి ని కలిగించేది. గోల్కొండ టోంబ్స్ నిర్మాణ శైలి తరాలు గా నిలిచి పోయినట్లే నా ఆట తీరు మన్ననలు అందుకోవాలనే ఆరాటం నాలో తన్నుకు వచ్చేది. గోల్కొండ నలు దిక్కుల నాలుగు దర్వాజలు ఏ దర్వాజ గుండా వెళ్ళినా కోట దగ్గరి కెళ్ళినట్టే నేను ఎటునుండి వెళ్ళినా గెలుపు తీరాన్ని చేరాలనుకునే దాన్ని.
రోజూ బాక్సింగ్ వీడియో లు చూస్తూ నాలోని తప్పొప్పులను దిద్దుకునే దాన్ని. నేను ఆత్మ రక్షణ లో వున్నా ఎదుటి వారిని అంచనా వేయటం లో వారి మానసిక లక్షణాలను పసిగట్టి వారి రిథం ను గ్రహించటం అలవాటు చేసుకున్నాను. నా స్ట్రెయిట్ పంచ్ లను బలంగా వేస్తూ కోచ్ ల ప్లాన్ ఎ బి సి డి లను తప్పక అనుసరించే దాన్ని. నేను ఎడమ వైపు నుండి బాగా దాడి చేయగలను. హుక్ లు తక్కువే అయినా స్ట్రెయిట్ షాట్ లతో గెలిచే వ్యూహాన్ని పన్నుతాను. నాలోని సాంకేతికత క్లీన్ పంచ్ లు ఫేడ్ అవే మూవ్ లు ఫుట్ వర్క్ నా బలం. ప్లాన్ సి నుండి డి కి క్షణాల్లో మారే చైతన్యం నా సొంతం. కంఫర్ట్ జోన్ లో చిక్కుకోకుండా సిల్హౌట్ లు సంధించే నేర్పరితనం నన్ను రింగ్ లో ఎదురు లేకుండా చేసేది. నా వేగవంతమైన మెదడు తీసుకునే చర్య ప్రతిచర్య ల మేళవింపు నన్ను సాన బట్టింది.
నా లోని పోరాట పటిమ ఎవరినైనా ఎదిరించగలదనే ధృడ సంకల్పం లక్ష్యం దిశగా నడుస్తుంటే వివక్షల నెదుర్కున్నాను. ప్రాంతం కులం మతం భాష యాస రాజ్యమేలుతున్న వ్యవస్థ లో ఎదురీదాలని తెలిసే అడుగులు బలంగా వేస్తూ కదిలాను. అంచెలంచెలుగా ఎదిగి నేను నేడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా బంగారు పతకాన్ని సాధించాను. నేనెవరిని అని ప్రశ్నించి అవహేళన చేసిన వారికి ఈ బంగారు పతకమే జవాబు నేనే నిఖత్ జరీన్.