Home కథలు జన్మదినం

జన్మదినం

       ఆరోజు భరత్ భర్త్ డే!
  “గుడ్ మార్నింగ్ అండ్ హాపీ భర్త్ డే డాడీ” అంటూ పిల్లలు వరుణ్, పవన్ ,
  “మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే” అంటూ అతడి భార్య దివిజ అభినందనలు తెలిపారు.
  “థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ”అంటూ  ఆనందంగా అందరినీ హగ్ చేసుకున్నాడు భరత్.
  భర్త్ డే ఆదివారం కావడంతో ఇంట్లో అందరూ ఎంతో ఉత్సాహంగా వున్నారు.
  “ఈరోజు నా భర్త్ డే సందర్భంగా..ఇంట్లో అమ్మకు వంటపని లేకుండా కేక్ తో పాటు ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాము ఓకేనా?”
  “ఓకే డాడీ.. అలాగే చేద్దాం” అంటూ సంబరంతో ఎవరికేది ఇష్టమో ఆ లిస్ట్ మెన్షన్ చేశారు పిల్లలు!
  టిఫిన్ కార్యక్రమం తర్వాత, ముందురోజు ఆల్టరేషన్ కని ఇచ్చిన తన కొత్త డ్రస్ తెచ్చుకుందామని వెళ్లి తిరిగొచ్చేటపుడు, గేటుదాకా వచ్చిన భరత్ వర్షం చినుకుల కారణంగా ర్యాంప్ మీద కాలు జారి కింద పడిపోయాడు!
  “అయ్యో డాడీ” అంటూ ఆందోళనగా తండ్రిని పట్టుకొన్న పిల్లలు “మమ్మీ.. డాడీ కింద పడ్డాడు” అంటూ కేకేశారు. ఆదుర్దాగా అటువచ్చిన దివిజ పిల్లల సాయంతో భర్తను లేవనెత్తింది. కుడికాలికి గేటు దిమ్మె తగిలి  బాగా నొప్పి కావడంతో,  భార్య భుజంపై వేసి, పిల్లల ఆసరాతో  ఇంట్లోకి నడిచివచ్చి మంచంపై వాలిపోయాడు భరత్. కదలనీయని కాలిబాధతో “అమ్మా..అబ్బా” అంటూ తల్లడిల్లిపోతున్న భరత్ ను, పక్కింటాయన సాయంతో క్యాబ్ లో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. స్కానింగ్ చేసి, కాలి మడమ దగ్గర హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పి కాలికి బ్యాండేజ్ వేశారు హాస్పిటల్లో!
                       *********
  “ఎలా వుంది భరత్ ? నీవు కిందపడ్డావని, కాలికి  లైట్ ఫ్రాక్చర్ అని తెలిసి వచ్చాను. డాక్టర్ ఏమన్నాడు?” అని అడిగింది పక్క కాలనీలో వున్న, అప్పుడే అక్కడికొచ్చిన భరత్ మేనత్త మీనాక్షి.
  “రెండు నెలలు రెస్టు తీసుకొమ్మని చెప్పి, క్యాల్షియం టాబ్ లెట్స్ , పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఇంటికి  పంపించారత్తమ్మా” అన్నాడు భరత్ నీరసంగా.
“కాలు బాగా బాధ పెడుతోందా?” ఆర్తిగా అడిగింది మీనాక్షి.
  “బాగానే బాధపెడుతోంది.. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తప్ప నిన్నటినుండీ నిదురకూడా పట్టడంలేదు!” మూలుగుతూనే అన్నాడు భరత్.
  “పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం అంత మంచిదికాదు కదా.. నొప్పికలవాటుపడుతూ మెల్లమెల్లగానూ సహజంగానూ కంట్రోల్ కావడమే కరేక్టేమో కదా”
  “అమ్మో అత్తమ్మా అది నావల్ల కావడం లేదు.. పెయిన్ కిల్లర్ వేసుకోకుంటే పెయిన్ నన్ను కిల్ చేసేలా వుంది!”                                              
  బాధగా మూలుగుతూనే అన్నాడు భరత్ .
  “అయ్యో భరత్ నీ భర్త్ డే నాడే ఇలా జరగడం బాధగా అనిపిస్తుందిరా!”
  ” నా సగం అదనపు బాధంతా అదేకదా అత్తమ్మా.. ఎంతో ఉత్సాహంగా వున్న ఇంట్లోని వాళ్లనంతా నిరుత్సాహపరిచిన ఫీలింగ్ నన్ను అంత తొందరగా హీలింగ్ కానివ్వదేమోననిపిస్తుంది!”
  “బాధపడకు భరత్..  వాళ్లు నీ ఫ్యామిలీ మేంబర్సేగా.. కష్టం సుఖం కలిసి పంచుకోవలసిన వాళ్లేకదా! అవునూ ఇంతకూ నీ పుట్టినరోజుకు ఎవరెవరిని ఆహ్వానించివుండిన్నవు?”
  “ఎవరినీ లేదు.. ఓన్లీ ఫ్యామిలీమెంబర్స్ అంతే!”
  మూలుగుతూనే అప్సెట్ మూడ్ తోనే అన్నాడు
  ” అన్నట్టు నేనోమాటడుగుతాను బాధపడవుగా భరత్ ?”
  “బాధెందుకత్తమ్మా.. మొదటినుండీ నువ్వు నాకు ఎన్నో చెప్పేదానివి.. వెల్ విషర్ వే కాదు నాకు రోల్ మోడల్ వి కూడా! నువ్వంటే నాకెంతో గౌరవం అభిమానం!”
  “థ్యాంక్యూ భరత్.. అదే చనువుతో అడుగుతున్నాను.. నిన్నటి నీ జన్మదిన సందర్భం లో పాల్గొనేది ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అన్నావు.. ఎవరెవరి గురించి అన్నావు?”
  “ఇంకెవరు ఫ్యామిలీ అంటే భార్య దివిజ, పిల్లలు వరుణ్ పవన్ లు.. అంతేకదా అత్తమ్మా!”
  ” అంతేనా భరత్.. నీ జన్మదిన పర్వంలో ప్రధానంగా పాల్గొనవలసినవాళ్లింకెవరూ లేరా?”
  “అంతకన్నా ముఖ్యమైనవాళ్లింకెవరుంటారు?”
  “వుంటారు.. వున్నారు భరత్.. నీ జన్మదినవేడుకల్లో పాల్గొనవలసిన వాళ్లలో అందరికన్నా అతిముఖ్యమైన వ్యక్తి  ఎవరంటే.. నీకు జన్మనిచ్చి, నీకోపుట్టినరోజును కల్పించిన మీ అమ్మ శాంతమ్మ!”
  “అత్తమ్మా” ఆశ్చర్యం కలవరం కలగలిసిన స్వరంతో అన్నాడు భరత్ .
  ” అవును భరత్ ఆలోచించు.. నీవు కడుపున పడిననాటినుండీ తొమ్మిది నెలలు గర్భవికారాలను భరించిమరీ నీబరువును మోసిన భూమాతకాదా నీ జన్మదాతగా మీ అమ్మ?”
  అవును అన్నట్టు తలాడించాడు అంతలోనే కదిలిన కాలి బాధతో “అమ్మా” అని మూలిగాడు భరత్.
  “చూడు భరత్ నీ కాలికి అయిన చిన్న హెయిర్ లైన్ క్రాక్ కే ఇంతలా ఇబ్బంది పడుతున్నావ్.. కానీ..  కానీ.. నీ తల్లి తన ప్రసవవేదన సమయంలో ఎంతబాధ భరించివుంటుందో ఊహించనైనా ఊహించివుంటావా?” అంటున్న మీనాక్షి కంఠం వణికింది. వింటున్న భరత్  భారంగా బాధ వ్యక్తపరుస్తూనే అయోమయంగా చూశాడు.
  “భరత్.. నేనీమధ్యే ఒకలేడీ డాక్టర్.. అందునా ప్రసవానుభవంవున్న గైనకాలజిస్ట్ చెప్పగా విన్నాను.. ప్రసవ సమయంలోని నొప్పి స్థాయిని అంచనావేసేది, జీరో టు టెన్ పాయింట్ ఫైవ్ దాకా వుండేది డోల్ స్కేల్ అనేదాని మెజర్ మెంట్ ప్రకారం.. దాదాపు దాని చివరి సంఖ్య దాకా తాకే బాధ ప్రసవవేదనేనట! అలాగే మరో అంచనా ప్రకారం, సగటున మానవశరీరం భరించగలిగేది 45యూనిట్ల బాధ మాత్రమేనట! కానీ.. కానీ.. పురిటినొప్పుల్లో మాత్రం ఆ మాతృమూర్తి భరించే బాధస్థాయి 57యూనిట్లదాకా వుంటుందట.. అంటే అది మామూలు బాధకాదుకదా భరత్ ?”
  “అత్తమ్మా” చిన్నగా భరత్ కంఠం కంపించింది.
  “అవును భరత్.. బాధయొక్క ఆఖరి అంచుకు చేరిన ఆపురిటినొప్పి స్థాయిని అంచనావేయగలమా? ఒకేసారి 20 ఎముకలు విరుగుతున్నంత బాధ వుంటుందట! చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కే నీవింత హైరానా పడుతున్నావ్ .. కానీ.. నీకు జన్మనిచ్చిన, నీ జన్మదినానికి కారణమైన నీతల్లి నీకు జన్మనిచ్చేవేళ, అంతటి ఆ పురిటినొప్పులనెలా భరించి నిన్నీలోకంలోకి తీసుకొచ్చిందో అర్థంచేసుకోగలవా?”
“అమ్మా” అప్రయత్నంగా భరత్ కంటివెంట నీటితోపాటు నోటివెంట ఆమాట వచ్చింది.
  “భరత్ దీన్నిబట్టి నీకింకా ఏమర్థమవుతుంది.. ప్రసవ సమయంలోని మరణావస్థను దాటి నీకు జన్మనిచ్చిన తల్లికూడా మరోజన్మ ఎత్తిందన్న సత్యం అందులో వెల్లడి కావడం లేదా? నీ పుట్టినరోజు నీ ఒక్కడిదేకాదు, అది నీతల్లి మళ్లీ పుట్టినరోజు అని గుర్తించలేకున్నావా?”
   భారమైన, సంచలనాత్మకమైన భావాలతో క్షణం కళ్లు మూసుకున్నాడు భరత్.
  “నీ పుట్టుకకు ఆధారమైన, నీ పుట్టినరోజు వేడుకకు కారణమైన, అందరికన్నా ముందు నువ్వు నీ తల్లిని తలచుకోవలసిన రోజు.. నీ తల్లితో కలిసి నీ జన్మదినాన్ని నీ జనని జన్మదినంగా కూడా జరుపుకోవలసిన దినం.. అలా ఎలా మరిచిపోయావు మీ అమ్మ శాంతమ్మను?”
  హితవైన మందలింపుతో కూడిన ఆ ప్రశ్నతో , ఎంతో ఆవేదన, అంతులేని ఆర్ద్రతా భావం కలిగింది భరత్ లో!
“అమ్మా.. నన్ను మన్నించమ్మా” అంటూ అమ్మను తలుచుకుని, అమ్మ యొక్క తనజన్మ భారాన్ని తెలుసుకొన్న ఆ వేదనాస్పందన అనేది తన హెయిర్ లైన్ ఫ్రాక్చర్ బాధను తేలికపరిచినట్టనిపించి, పెయిన్ కిల్లర్స్ తో పనిలేదనిపించింది భరత్ కు!
  తన తల్లికి కొత్త జన్మనిచ్చిన తన జన్మదినం.. తన జనని జన్మదినం అనికూడా అనిపించి తన మాతృమూర్తి పట్ల ఒక అమృత భావన కలిగిందతడిలో!
“అత్తమ్మా.. అమ్మను మరిచి జరుపుకున్న ఇన్నేళ్ల నా జన్మదినాలన్నీ నిరర్థకమైనవే! ప్రసవవేదన అనే మరణావస్థను కూడా మధురబాధగా భరించి నాకు జన్మనిచ్చి తాను మళ్లీ జన్మించిన నాతల్లితోనే ఇకపైన నా జన్మదినాలన్నీ! కొత్తగా నాకు మాతృదర్శనం కలిగించి, సత్య సందర్శనం గావించిన నీకు వేనవేల ధన్యవాదాలత్తమ్మా!” అంటూ మేనత్త చేతుల్ని  తన చెమరించిన కళ్లకద్దుకున్నాడు భరత్!
                   *********
                                          కె. వీణారెడ్డి,
                                          హైదరాబాద్.
                                        7337058025

You may also like

Leave a Comment