ఆనందు తీసుకున్న నిర్ణయం అతని తల్లికి ఏమాత్రం మింగుడుపడడంలేదు. అతని భార్య సరోజ అతని నిర్నయాన్ని అస్సలు జీర్ణించుకోలేక పోతుంది. అతని అబిప్రాయంతో ఏకీబవించకుండా కాసేపు మౌనవ్రతం దాల్చింది ఆమె. అతని తల్లి కోడలికి బాసటగా నిల్సి ‘‘ఒరే ఆనందు ఏందిరా నువు సేసేది, ఈడ బతికేది బతుకు కాదా,నువ్వు మమ్ముల ఇడిసి దూరంగా పోతంటే ఎట్టా, సర్కారు నౌకరి వొచ్చిందంటే సంబురపడ్డాం గని మిలటరీ నౌకరంటే ఒప్పుతాంరా అయ్యా, ఉన్నొక్కనివి ఇడ్సిపోతే ఎట్టరా ఆనందూ, మయ్యగాని నెత్తినోరుకొట్కోని చెబుతున్న ఇనరా అయ్యా, నారెక్కలిర్గలే రెక్కలిర్గిందాంక సాకుతా , అటెంక ఏదన్న పనిసూసుకో బిడ్డా కోడలుపిల్ల వుత్తమనిషి కూడా కాదాయె, ఈ సమయముల్ల పిల్లకు నువు తోడుగుండాలే. అసలే పెద్దింటిపిల్ల ప్రేమించి మరి పెండ్లాడ్త్వి,ఇప్పుడు పచ్చిని చేసి ఇడ్సిపోతె ఎట్టా. దానిబతుకేంగాను, పిల్ల బాగోగులెవరు సూస్తరు.’’ అంటూ కంతలబోయిన కండ్ల నీళ్ళు రాలుస్తూ అరవసాగింది.అప్పటికే ఆమె మూడుకాళ్ళ ముదిమికొచ్చింది.
దుఖ్ఖాన్ని కళ్ళలో అదిమిపట్టిన సరోజ మౌనంతో సూటిగా ఆనందు కళ్ళలోకి చూసింది. అతను తన బట్టలను బ్యాగులోకి సర్దుకొంటూ ‘‘సరూ మనకోసమే నేను ఈ పని చేస్తున్నా. ఈరోజుల్లో గవర్నమెంట్ జాబ్ దొరకడం అంత ఈజీ కాదని నీకు తెల్సు, మనం హయిగ బతకాలంటే ఏదోపని చేయాల్సిందే, ఆప్ట్రాల్ ప్యూన్ పోస్ట్‌కు పి.ఎచ్.డి చేసిన వారు అప్లై చేస్తున్నారు. మనమెంత పైగా ఒకే ప్రయత్నంలోనే మిలటరీలో జాబ్ వచ్చింది. ఆనందించాల్సింది పోయి అమ్మ, నువ్వు నాపై అక్కసు ఎల్లగక్కితే ఎలా, నా ఆశయం దేశసేవ చేయడం. అందివచ్చిన అవకాశం వదులుకోలేను.’’ అంటూ తడుముకోకుండా పలాకాడు ఆనంద్.
‘‘ఆనంద్ సేవే పరమావది అయితే ఈ దేశంలో, మన రాష్ట్రంలో వివిధ రంగాలలో జాబ్ చేసేవారిది సేవకాదా.’’అంటూ గాటుగానే బదులు పలికింది సరోజ అతనివైపు కటినంగా కోపంతో చూస్తూ
‘‘చూడు మైడియర్ సరూ అలా ఉరుమురిమి చూడకు, నేను తట్టుకోలేను ప్రేమామృత ధారలు కురిపించే నీకళ్ళు నిప్పులవాన కురిపించి నన్ను దహించివేయకు’’అంటూనే దీనవదనంతో ప్రాదేయపడుతున్నట్టుగా ఆమెవైపు లీలగా చూస్తూ తన చేతితో ఆమె గదుమను తడిమాడు.
‘‘ఓయబ్బో లేనిప్రేమవొలికించకు, ఆనంద్ నిన్ను నేను ఎంత ఆరాదించానో అది నీకు తెలుసు, ఐనా బాడర్ లో జవాన్ జాబ్ మంచిదే కాని నీ తెలివికి ఇక్కడే ఏ ప్రయివేట్‌లో చూసుకున్నా చాలినంత జీతమిస్తారు, నువ్వే ఓ నెట్‌సెంటర్ పెడితే నలుగురికి ఉపాదికల్పిస్తావు. ి ఆనంద్ నీవు బాడర్‌లో అష్టకష్టాలు పడటం నాకు సుతారమూ ఇష్టంలేదు. ఇప్పటి పరిస్థితుల్లో నువ్వు వెళ్లితే నన్నేవరూ చూసుకుంటారు. మీ అమ్మ అసలే మతిమరుపు మనిషి, నేనో వుత్తమనిషిని కాను నెలలు నిండిన గర్బినిని, నీ తొందరపాటు నిర్ణయాలతో విసిగించకురా..’’అంటూ తన పొట్టపై చేయితో నిమురుకొంటూ అతనివైపు దీనాతిదీనంగా చూసింది.
‘‘సరూ అన్ని ఏర్పాట్లు చేస్తా, నువ్ ఫికర్ చేయకు కొన్ని రోజులు ఓపిక పట్టు అంతా సర్దుకుంటుంది. నేను ఈ నేలపై పుట్టినందుకు దేశ సేవ చేసేబాగ్యం నాకు లభించింది. ఆనందపడు, ఎందరికొస్తుంది ఈ అవకాశం. తినడంకోసమే అయితే ఏదోపనిచేసి బతకొచ్చు. మనిషన్నాక ఏదో సాధించాలి. అందరిలా మనముంటే ఎలా కాస్తా భిన్నంగుండాలి,నేనలావుండడం నీకిష్టంలేదా. నీకు గుర్తుందా సరూ నువ్వే అనేదానివి మనం అందరికంటే డిపరెంట్‌గా ఆలోచించాలి అని అందుకే సైన్యంలో చేరా.’’ అంటూ సరూ తలనిమురుతూ మాటలతో మరిపించాడు.
‘‘ఏమో బాబు మీరెన్నైనా చెబుతారు. సరే మళ్ళి తమరి రాక ఎప్పుడో’’ జీరబోయిన గొతుంకతో అడిగింది.
‘‘పోన్ చేస్తుంటా,కుదిరితే లెటర్ రాస్తా’’అంటూ ఆమెను చివరగా ఆలింగనం చేసుకొని నుదురుపై ముద్దుపెట్టి అటునుంచి కదిలాడు. ఆక్షణంలో అతనికి తెలియకుండానే కన్నుల్లో నిద్రానమైన కడలి ఉద్వేగంతో పొంగి కంటిరెప్పలనుండి తన్నుకొచ్చి కన్నీటి వరద పారింది. అతను కళ్ళు తుడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు. అతనినే చూస్తూ నిలబడిపోయింది సరోజ.
ఆమె మతి యాదుల్లోకి మల్లింది ‘‘ఈ నేలపై తలుకుబెలుకు కాంతులీనె నవజాతశిశువు పుడమీన పాదం మోపె గడియ కోసం ఎదురుచూస్తాను, నీ మది తలపులు తెరచుకొని నీ గుండె గది పడకలో నీ పక్కనే నేను కొలువు దిరుగుతాను ఆనందు కలతపడకు కలలు కను వీరుని కల కను దేశభక్తుల గాదలు విను అవి నాకు నీ జాబుతో సంతకం చేసి పంపు నేను వాటిని చదువుతున్నప్పుడు నాలో నూతనత్తేజం నిండాలి. నీకుమల్లె నేను మాతృభూమిపైన మమకారం పెంచుకోవాలి.’’ అని తనలో తాను అనుకోసాగింది. అతను దూరమౌతున్నకొద్ది అతనిపై ఆమె చూపు దుర్బినిలా నిలబెట్టి చూడసాగింది. అతను మాయమయ్యాడు…. ఆమె కళ్ళలో అతని రూపు నిలిచిపోయింది.
అతను సరిహద్దులో కాపలా కాస్తున్నప్పుడు కోడెతాచుల బుసలుకొట్టె చీకటిలో కంచె ఆవలి కాలాంతకుని పసిగట్టె పనిలో అతని కనురెప్పలు మూయక తెరచుకొని ఉంటాయి. శత్రువు నిశ్శబ్ద పాదాల అలికిడి పసిగడుతూ కారుచీకటి కమురువాసనలో కనురెప్పలు తెరిచి రెటినా దుర్బినిగా మారుస్తాడు. అతని చెవిలో కర్నబేరి రిక్కపొడుచుకొని అగంతకుని అలికిడి సవ్వడిని వినసాగుతుంది. భూతలస్వర్గం కాశ్మీరపు అందచందాలలో హిమపాతపు మంచులోయలో ముసురులా ఎడతెరుగక మంచు కురుస్తుంది. కర్కశత్వం నిండిన కఠినశిలా హృదయంలో డమరుక నాథం దేశభక్తి గేయాలాపన. లోయలో జలపాతం సడిచేస్తూ సైనికుల కవాత్తును కీర్తిస్తూ గానం చేస్తుంది. డేరాలలో కొందరు యోదులు విశ్రమిస్తుంటారు అలసిసొలసి. కార్పెట్ బూట్ల పహారా కాస్తూ అతను, ఆనందు లాంటి యోదులు ఎందరో. ఇక్కడ సూర్యోదయాలు, చంద్రోదయాలు, అమావాస్య నిశి చీకటి రాత్రులు వారికి ఒక్కతీరే, వారి మనసులో సంతోషపు ఆనందగడియల్ని వెదికేందుకు క్షణం తీరిక ఉండదు. వారి కవాత్తు, మార్చ్ ఫస్ట్ మంచులోయలో దూకే జలపాతంలా సాగుతుంది. గగన సీమలో సాగిపోతున్న వలసపక్షుల క్రమశిక్షణకు ఏ మాత్రం తీసిపోని తీరున వారు సరిహద్దు కంచె ముందు సాగుతారు, కఠోర సాధనతో సాయుదులై అకస్మిక యుద్దంలో ముందుకు దూకుతారు. కంచె ఆవల మాటువేసే శత్రువు దుశ్చర్యను పసిగడతారు, తిప్పికొడతారు. వారు భారత సైనికులు, కార్గిల్ వీరులు. అయినా వారు అప్పుడప్పుడు అంతర్గత శత్రువు నుండి ,అలాగే సరిహద్దు కంచెదాటిన శత్రువు చేతులో ఎదురుదెబ్బలు తింటుంటారు. అవి పటాన్‌కోట్, యూరిసెక్టార్ లాంటివి. కాని వారి మనోధైర్యం ఈసమంత చెదరదు వారి గుండె నిబ్బరం శత్రువు ఎదురుదెబ్బలతో రెట్టింపు చేస్తాయి. తూర్పున సూర్యుడు ఉదయించి పడమర అస్తమించడం మళ్ళీ ఉదయించడం ఎంత వాస్తవమో భారతమాత స్వేచ్చగా ఉండాలని తపన పడుతూ ఎదురొడ్డి పోరాడి సడలని అచెంచల ఆత్మ విశ్వాసంతో అసేతు హిమాచలం కాపలా కాయడం అంతే వాస్తవం.
‘‘హలో ఆనంద్ ఎలా ఉన్నావు నీకోసం నీరాకకోసం కళ్ళ ఒత్తులు పెట్టుకొని నేను, మీ అమ్మ, మన బిడ్డ ఎదురుచూస్తున్నాం వేయి కళ్ళతో నీవు ఎప్పుడొస్తావా నన్ను మళ్ళీ తన్మయత్వంతో ఆలింగనం చేస్కుంటావా అని ఎదురుచూస్తున్నా’’ అంటు ఆతృతతో పలకరించింది సరోజ.
‘‘సరూ మాకు విజయాలు, అపజయాలు మామూలే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కంటికి రెప్ప వాల్చకుండ, కునుకు తీయకుండ గస్తీ కాయడం మా డ్యూటీ. ఇది ఒకరోజుతో ముగిసేది కాదు ఏటి ప్రవాహంలా నిరంతర నిఘా ఆదమరిస్తిమా శత్రువు చేతికి మేం చిక్కినట్టె గస్తీ పెంచితిమా వాడు మాకు చిక్కినట్టే ఇక్కడ మాకు మరణం వీరత్వం వెన్నుచూపడం పిరికితనం చావడమో చంపడమో ఇదే మా డ్యూటీ నిరంతర నిఘాలో అలుపులేకుంటా ఉన్నా నువెలా ఉన్నావు.’’ అంటూ ఉద్వేగంతో ప్రవాహంలా అతని పలకరింపు సాగింది.
భయాందోళనకు గురైన సరోజ అతనితో మాట్లాడుతూ ‘‘నేను రోజు పూజలు చేస్తూనే ఉన్నా కన్పించిన చెట్టును, పుట్టను, కొండను, కోనను మొక్కుతూనే ఉన్నా ,నువ్వు క్షేమంగా ఉండాలని మా దరి చేరాలని’’ అంటూ ఆమె గద్గద స్వరంతో పలకరిస్తుంటె అతనూ నిట్టూర్చాడు ఇద్దరూ ఫోన్‌లో పిచ్చాపాటి కబుర్లాడుకున్నారు. అమ్మ గురించి, అమ్మగల్లాడుతున్న చిన్నోడి గురించి ఆమె చెబుతావుంటే అతను మురిసిపోయాడు.
మురిసిపోతూనే ‘‘సరూ సరిహద్దు కంచెలు మా చరిత్ర చెప్పడమే కాదు మా గురించి స్వర్ణాక్షరాలతో లిఖిస్తాయి. యావత్ భారతదేశానికి మా కీర్తిని, మా త్యాగాలను వివరిస్తాయి. దేశానికే కాదు ప్రపంచానికి చాటుతాయి. ఇంతటి గొప్ప గణకీర్తి ఏ పౌరునికి, ఏ ఉద్యోగికి లబిస్తుంది’’ అంటూ అతను వారి ఉన్నతిని స్తుతిస్తుంటే సరోజ ఒంటిలో ఒకవైపు ఒనుకు పుడుతూనే, మరో వైపు తన పెనిమిటిలోని పౌరుషత్త్వము ఆమెలో రాజుకుంది. కాని ఆమెలో తెలీని ఆందోళన జరగకూడనిది ఏదైన జరుగుతుందేమోనని మదిలో ఆందోళన ‘‘ఏమండీ జాగ్రత నేను రోజు పేపరు తిరగేస్తూనే ఉన్నా సరిహద్దులో జరుగుతున్న సంఘటనలను చదువుతూనే ఉన్నా. సినిమాల్లో మాదిరి కసాయి ముష్కరలు మీ పట్ల కర్కశత్వం ప్రదర్శిస్తారట కదా అదే నా బెంగ అది వింటుంటే, చదువుతుంటే ఒళ్లు గగ్గురు పొడుస్తుంది జాగర్త సుమా.’’ అంటూ దీనంగా విలపించ సాగింది సరోజ. కళ్ళలో సుడులు తిరిగిన కన్నీటిని తుడుచుకొంటూ…
‘‘సరూ యుద్దంలోకి దిగాక విజయమో వీరమరణమో మిగతావాటి గురించి ఆలోచిస్తామా’’ అంటూ గర్వంతో పలికాడు ఆనంద్. అలా చెబుతూనే ‘‘సరూ సరిహద్దుల్లో ఈ మద్య మాలో ఒక జవాన్ దారితప్పి కసాయి ముష్కర మూకకు చిక్కాడు దేహమంతా విషం నింపుకున్న కసాయి ఉగ్రమూక అతడి దేహానికున్న శిరస్సును ఖండిరచి మొండాన్ని గరుడలకు ఆహారంగా పారవేసి తలతో బంతులాడుకున్నారట. అంతకుముందు వీర సైనికుని కాల్లుచేతులు కట్టివేసి హింసిస్తూ ఈడ్చుకెళ్లి ఆనందపడసాగారు. దేహంనుంచి కారుతున్న ఒక్కొక్క రక్తపు బొట్టును చూసి పకపకనవ్వుతూ ఈలలు వేసారు చేతులలో గుండుసూదులు గుచ్చారు. చేతిగోర్లు పీకి కాటాలు గుచ్చారు కీల్లు విరగొట్టి మేకులు దించారు. పళ్లూడగొట్టి కనుగుడ్లు పెరికి వేశారు. దేహమంతా రగతాలు కారుతుంటే ఎరట్రి కారాన్ని దేహమంతా పులిమి అతడు ఆహాకారాలు చేస్తుంటే వారు ఆనందతాండవం చేశారు వారి ఉన్మాద వికృత క్రీడకు చచ్చి పడున్న దేహం మౌన సాక్షిగా నిలుస్తుంది అయినా వారి కసి తీరదు ఎక్కడో గుర్తుతెలియని చోట మొండం ఒకచోట, తలొకచోట మంచులోయలో రాబందులకు ఆహారంగా విసిరేసి రాక్షసానందం పొందుతారు అయితేనేం అతను అమరుడు అతని కీర్తి అజరామరం మువ్వన్నెల జెండై రెపరెపలాడుతుంది’’ అంటూ అతను చెపుతావుంటే సరళ వెన్నుల్లో ఒనుకు పుట్టింది. గుండె వేగం పెరిగింది అతని మాటలు వింటున్నంత సేపు ఆమెలో ఉద్ద్వేగం కట్టలు తెంచుకుంది కసితో ఆమె మతి రగిలింది ‘‘ఆనంద్ అలాంటి కసాయి ముష్కరుల మట్టికర్పించు నీకండగా నేనే కాదు ఈ దేశమంతా వెన్నంటే ఉంది’’ అంటూ భావోద్వేగంతో పలకగానే ఆనంద్ మది ఆనందతాండవం చేసింది ఆమె మాటలకు. ‘‘సరూ ఈ భూతల స్వర్గంలో కొన్ని రోజుల్లో మేం కొత్తచోటుకు వెళ్తున్నాం’’ అంటూ చివరి మాటగా పలుకుతూ ‘‘మన బాబుకు, నీకు నా ముద్దులు’’అని పోన్ పెట్టేశాడు. నెలలు గడుస్తున్నాయి, తన బాబుగూర్చిన ఆనందగడియలను అప్పుడప్పుడు ఆనందు, సరోజలు పోనులో మాటలాడుకుంటూనేవున్నరు, ఒకరినొకరు పలకరించుకొంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూనేవున్నరు, వారి బాబు వచ్చిరాని మాటలతో ఆనందును పలకరిస్తుంలే అతనిలో సంతోషం వికసించి విప్పారేది.
ఒకనాటి సాయంత్రం టీవి ముందు వాలి టివి ఆన్ చేసింది. అన్ని న్యూయస్ చానల్లలో స్క్రోలింగ్ హెడ్‌లైన్‌లతో కాశ్మీర్‌లోయ రక్తసిక్తం, పుల్వామా సెక్టార్‌లో నలబైమంది జవాన్లు ఉగ్రదాడిలో వీరమరణం పొంది అమరులైయ్యారు. ఆ వార్త దావానంలా భారతావని వ్యాపించింది. టీవీలముందు కూర్చున్నవారు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. సరోజలో వణుకు మొదలైంది, గుండె వేగంగా కొట్టుకోసాగింది, ఆమెలో ఏదో తెలియని ఆందోళన ఆమెని ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. తనదేహం తన ఆదీనంలో లేకుండా పోయింది. ‘‘ఆనంద్, ఆనంద్ ’’అంటూ కలవరిస్తూ తదేకంగా రెప్పవాల్చకుండా ఆ ఘటననే చూడసాగింది. టీవిలో వచ్చె దృశ్యాలు చూపరుల గుండెల్నిపిండెసేలావున్నాయి, ఆదృశ్యం భీతావాహ భయానకం సైనికుల బస్సు తుక్కుతుక్కైంది,ఆబస్సులో వున్న అరవైమందిలో నలబైమంది అక్కడికక్కడే వీరమరణం పొందారు.సైనికుల శరీరాలు ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయాయి,ఉగ్రవాది ఒక్కడు ముందుగా బస్సును డీకొట్టి ఆపై తనను తాను పేల్చేసుకొని సృష్టించిన విద్వంసం అది. అప్పుడే వీరమరణం పొందిన సైనికుల పొటోలు టివీలో రాసాగాయి,అందులో ఆనందు పొటో వుండడంతో సరోజ తట్టుకోలేక స్పృహకోల్పోయింది,ఆ ఘటన చూపరులకు ఊరిజనాలకు ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది, రోమాలు నిక్కపొడుచుకుంటున్నయి. జనం నరనరాల్లో ఆవేశం కట్టలుతెంచుకొని , మరుగుతున్న రక్తాన్ని అనుచుకోలేక దాయాది దేశంపై తలోతీర్గ దుమ్మెత్తిపోయసాగారు. దిక్కులుపిక్కటిల్లేలా ‘‘ఆనందూ అమర్‌రహే’’అంటూనే అంతకంతకూ ప్రతీకారం బదలా తీర్చుకోవాలని ముక్తకంఠంతో చాటుతున్నారు…
ఆయల్ల పనికెళ్లిన బాలమ్మ పనిముగిసింది. పొద్దుకూకింది, సందలవడ్డది, ఊరపసులు ఇంటిబాట పట్టినయ్.వాటి ఎనకాలె పనికెళ్లిన కూలీలందరూ కొండ ఆవలిగట్టునుంచి కొండెక్కిదిగి ఎగుడుదిగుడు గుంతల బెట్టెరాళ్ల బాటలో నడిచినడిచి వారికాళ్లు అలిసిఅలిసి మెత్తబడ్డాయి అయినా తిన్నగా అడుగులోఅడుగేస్తూ ఇంటిబాటపట్టారు. పొద్దుమునిగి చీకటిపరుచుకొంటుంది ‘‘ఇంటికెళ్లి గింత చాయసుక్క కడుపులేసుకుంటే కడుపులాకలి సల్లబడుద్ది’’అని తనమదిలో అనుకొంటూ ఇంటినిసమీపించింది. ఇంటిముందు జనం గుమ్మిగూడివున్నరు, ఇసుకపోస్తే రాలనట్టుగ. ‘‘ఏందల్లా ఏంది మా ఇంటిముంగల గుమ్మిగూడిరడ్రు,కశ సందిడువుర్రి ఇంట్లకుపోవాలే, ఏందే సరోజా ఏంది జనం’’అంటూ అందరివైపు ఎగాదిగా చూసింది సరోజా టీవిముంగల కూలవడివోయింది పోరడు తల్లిమీన తారాడ్తుండు జనం వార్తలు ఇనసాగిండ్రు. సరోజ ఏడుస్తుంది, ఎన్నడూ కడవాడకట్టుకు రాని జనం ఇంటిముంగల గుమ్మిగూడటం చూసి ‘‘ఏంజరిగిందర్రా ఏంది సంగతి’’ అంటూనే వారివైపు ఎగాదిగాచూసింది. ‘‘ఓ బాలమ్మా గుండేదైర్నం చేసుకో అటకూలవడు,నీ కొడుకు ఆనందు…. ఆనందూ’’ అని గుంపులో ఓవ్యక్తి అనేలోపే ‘‘ఏమయిందయా నా ఆనందుకూ…’’అని సూటిగా వారివైపుచూస్తూ అడిగింది. అమ్మా ఇంకెక్కడి ఆనందూ నీకొడుకు ఉగ్రదాడిలో వీరమరణం పొందిండు, సైన్యంలో వుండి దేశానికి సేవచేస్తూ, అసువులుబాసి అమరుడైండు తల్లి నీ ఎంట ఊరుంది, ఊరెకాదు ఈ దేశమే మీయెంటవుంది.’’ అనేసరికి ‘‘అయ్యో ఓరి దేవుడో ఎంతపనిచేశావురో, నాఇల్లు ముంచితివా.. నా ఆనందూ ఓయమ్మా, ఓ దేవుడా.. ఎట్టబతికేది సరోజా.. నా తల్లి ఏమి శెరలొచ్చెరా బగవంతా, ఎవనికేం పాపంచేస్తిమి సామి నాయిల్లు ముంచితివీ, మమ్ముల మగదిక్కులేనోళ్ల జేస్త్వి ఓయమ్మా…ఓ అయ్యా… నా ఆనందూ ఏడకానొస్తడే, మల్లెప్పుడొస్తడే, అమ్మో,అయ్యో, మా తండ్రి.. ఆనందా..’’ అంటూ తలబాదుకుంటూ, జుట్టుపీకుంటూ వల్లవల్ల ఏడుస్తూ కూలవడిపోయింది టీవిముందు. ఆమెకు కొడుకు లేడన్న వాస్తవం జీర్ణించుకోలేకపొయింది. ఆమెలో ఆవేశం దుఖ్ఖమై ఉప్పొంగింది,కంతలవోయిన కండ్లలో ఇంకిన కన్నీరు ఊటలా ఉబికి వరదలైపారుతూ చెంపలపై జాలువారుతూ కొంగుతడిసి ముద్దయ్యింది చీకటి ఆ ఇంటిని కాలసర్పమై మింగింది. నిశిచీకటి కమ్మింది ఊరిపెద్ద ఒకరు ఆ యింటిలో క్యాండిల్ జ్యోతులను వెలిగించాడు, బైట జనం అమర జవానుకు జేజేలు పలుకుతూ ఆ ఊరంతా జ్యోతులతో దిక్కులు పిక్కటిల్లేలా జోహార్లు అర్పిస్తూ ర్యాలితీసి ఊరంతా ఆ ఇంటికి బాసటగా నిలిచిండ్రు….
భూతం ముత్యాలు, కథారచయిత
9490437978