Home కథలు డియర్ ఫ్రెండ్

డియర్ ఫ్రెండ్

by Nandiraju padmalata


“హాయ్ అప్పూ…!”
“ఏంటే దివ్యా? గుర్తున్నానా అసలు? ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? పదిసార్లు ఫోన్లు, వాట్సాప్ మెస్సేజీలు. ఊహూ…! ఒక్కదానికీ జవాబివ్వలేదు. రెండేళ్లయింది! ఏమయ్యావే నువ్వూ ?”
“తీరిగ్గా మాట్లాడదామని ఊరుకున్నా…! ఇన్నాళ్ళకి దొరికింది తీరిక. గుర్గావ్ లో ఉన్నానే! నువ్వు?”
“నీకేమ్మా? ఎం టెక్ పూర్తి కాకుండానే క్యాంపస్ లో వచ్చింది, ఆ తర్వాత మంచి ఎమ్మెన్సీలోనూ కొట్టావు జాబ్. మేమేముందీ…? ఉన్న ఊళ్ళోనే చిన్న ఉద్యోగం. చెప్పు. చెప్పు…! కొత్త వార్తలేంటే?”
“అప్పూ…అది చెబుదామని ఫోన్ చేసానే! జాబ్ చాలా బావుంది. డేటా సైన్స్ మీద. మంచి హైక్ కూడా ఇచ్చారు. నేనో విషయం చెప్తానే అప్పూ….ఎవరికీ చెప్పకు! గుర్గావ్ లో నేను లివిన్ రిలేషన్లో … అదేనే, సహజీవనం. నా డేట్ సంజయ్ అని, జార్ఖండ్ అబ్బాయి. మంచోడు. పడి చస్తాడు నేనంటే…!”
“అమ్మో….! మీ ఇంట్లో తెలుసా దివ్యా?”
“నీ మొహం! ‘నీ ఒక్కదానికే చెప్తున్నా’ అన్నాను కదే…! మా ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో లేదో తేలనీ….అప్పుడు చెప్తా ఇంట్లో…! అయినా మా అమ్మా నాన్న ఒట్టి పాతకాలపు మనుషులు. ఒప్పుకోరు.. అఫ్ కోర్స్ ! నేను నా ఇష్టప్రకారమే చేసుకుంటాననుకో!”
“అయ్యో…! ఇదేంటే బాబూ..? ఖర్మ కాలి, కొంప మునుగుతే?”
“.నువ్వెక్కడ దొరికావే అప్పూ? ఏ కాలంలో ఉన్నావ్? జాగ్రత్త పడుతున్నాలే ..! ఊ…..నీ సంగతేంటి? “
“నాకేముంటాయ్ విషయాలు? పెళ్ళికొడుకు హంట్ లో ఉన్నారు అమ్మానాన్నా..”
“ఏంటి? ఇంకా ఎవరూ ప్రొపోజ్ చేయలేదా అప్పూ….? నిజం చెప్పు!”
“అంత సీన్ లేదులే ఈ జన్మకి . ‘ఏమంత అందాలు కలవనీ? వస్తాడు నిన్ను వలచీ? ఏమంత సిరి ఉంది నీకనీ వచ్చేను నిన్ను తలచీ? చదువా! పదవా! ఏముంది నీకు? సడి చేయకే వెర్రి మనసా?’ వేటూరి సుందర్రామ్మూర్తి గారు నా గురించే రాసుంటారనుకుంటా! చెప్పు..చెప్పు…! నువ్వే చెప్పవే సంజయ్ గురించి!“
“హి ఈజ్ ఏ గుడ్ గై…పాపం! ఈ కరోనా గోలతో, తన జాబ్ పోయింది. ఏడాది నుంచీ, నా జీతంతోనే బ్రతుకుతున్నాం. . వాడు ఆర్కిటెక్ట్ లే! జీతాలు బాగానే వస్తాయి కానీ, పోస్ట్స్ తక్కువగా ఉంటాయి. చాలా ట్రై చేస్తున్నాడు జాబ్ కోసం.”
‘మరి! వాళ్ళ వాళ్లకి తెలుసా దివ్యా? వాళ్ళొప్పుకుంటారా మీ పెళ్ళికి?”
“ఛస్తే ఒప్పుకోరు. ఇంకా, పాత కాలంలాగా మాట్లాడతావేంటి అప్పూ…వి ఆర్ మేజర్స్. చదువుకుని, ఇండిపెండెంట్ గా ఉద్యోగాలు చేసి సంపాదిస్తూ కూడా, అమ్మకి నాన్నకీ, తాతలకీ, అవ్వలకీ భయపడుతూ కూర్చోవడమేంటే…? రబ్బిష్. మా ఇద్దరికీ ఆ భయమేం లేదులే! అందుకే, ముందు మేం ఒకళ్ళకి ఒకళ్ళం సెట్ అయితే, అప్పుడు, పెళ్లి చేసుకుని చెప్పేస్తాం ఇద్దరి వైపు పెద్దవాళ్ళకి.”
“సెట్ అవకపోతే?”
“కోయీ ధిక్కత్ నై ! బ్రేకప్ …! అంతే….! లోకం చాలా పెద్దది…వీడు కాకపొతే మరోడు….!”
“అలా ఎన్నాళ్ళు?”
” తగిన వాడు దొరికేదాకా…..! నాకేం తక్కువే? అందం, చదువు, ఉద్యోగం, ఎట్రాక్టివ్ ఫిజిక్…తోక ఊపుకుంటూ వస్తాడెవడైనా…. హ…హ…హా…!”
“దివ్యా….! అలా నవ్వకే బాబూ…! నాకు భయమేస్తోంది. జీవితంలో ఎన్నిసార్లని ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తావు? మగాడికేం? దులిపేసుకుని వెళ్ళిపోతాడు. మనం అలా కాదు కదే సిరీ…..! మన శరీరమేమైనా డబుల్ కాట్ బెడ్డో, సోఫా సెట్టో కాదు కదా, పాతది మార్చి కొత్తది కొనడానికి? అసలు పెళ్ళీ వద్దు, పిల్లలూ వద్దు అనుకుంటే సరే గానీ, కావాలి అనుకుంటే అప్పుడెలా? నీలాగే లివిన్లు, బ్రేకప్స్ అయినవాడే దొరికి, తీరా పెళ్లి చేసుకున్నాక వాడు నిన్నొదిలేసి వెళ్ళిపోతే? నీకు పిల్లల్ని కనే వయసు దాటిపోతే?”
“పోనీ….!”
” అప్పటికే పిల్లలు పుట్టి ఉంటే?”
“పుట్టరు.”
“ఒకవేళ పుడితే? అదే……. పొరపాటో, గ్రహపాటో కావచ్చు…అప్పుడెలాగే?”
“ఏ పాటు పడో వదుల్చుకుంటాను. అయినా, అలా జరగదు!”
“ఏమో…? నీకే…అమ్మనవాలని ఆశ పుట్టిందనుకో! నువ్వే అనేదానివి కదా, ‘ఒపీనియన్స్ వుడ్ ఆల్వేస్ ఛేoజ్’ అని. అలా జరిగితేనో?”
“అబ్బా….! అప్పూ డార్లింగ్….! నా పిల్లలు కదా వాళ్ళు…! నా లాగే లిబరేటెడ్ సోల్స్ లాగా బ్రతుకుతారు. సరేనా…సతీ సావిత్రీ ?”
” కానీ….వాళ్ళు బ్రతకబోయే ప్రపంచం లిబరేట్ అవలేదు దివ్యా! నీ అంత ఇంటెలిజెంట్ని కాదు గానీ, పెళ్లి అనేది మన ఆడవాళ్ళకి పెద్ద భద్రత. చాలా బాధ్యతలని మనం భర్త మీద పెట్టేయొచ్చు. పెళ్లయిన ఆడవాళ్ళ మీద సొసైటీ కి గౌరవం, నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు. వాళ్ళు ఏ ఒత్తిడి లేకుండా పెరుగుతారు. నువ్వు అనొచ్చు, ‘పెళ్లి ఒక కాంట్రాక్టు, సర్దుకుపోయి బ్రతకాలి’ అని. కానీ, ఆలోచించవే! ఈ సంజయ్ గానీ, మరోడు కానీ నీకు సంపాదన లేని రోజున, నీ ఆరోగ్యం పాడైన రోజున నీకు తోడుంటాడని చెప్పగలవా? ఇప్పుడున్న అందం, వయసు పెరిగాక ఉండదు కదే…? మరో విషయం కూడా కూల్ గా ఆలోచించవే! ఈ సంజయ్ తో బ్రేక్ అప్ అయిపోయాక మరో అజయో, విజయో దొరక్కపోడు నీకు. కానీ, అతగాడికి నీలాంటి దివ్యలతో అప్పటికే బ్రేకప్ అయిపోయి, ఒకటో, రెండో ఇష్యూస్ ఉండి వుంటే, అది మరో తలనొప్పి కదే! కట్టుకోక పోయినా, తన బిడ్డల తల్లి పట్ల అతనికి బాధ్యత ఉంటుంది కదా! అప్పుడెలా? అప్పుడెలాగే దివ్యా? నీ స్టేటస్ ఎప్పటికీ మిస్ట్రెసే! చూడు…! పెళ్లి అనేది ఒక బంధం. నువ్వు బంధనం అన్నా నాకేం బాధ లేదనుకో. నూరు శాతం సుఖం ఉంటుందనను, కానీ, ఎక్కడో తప్ప, అభద్రత ఉండదు. మనకి మన తల్లిదండ్రులు, అత్తమామలు తోడుగా ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరికీ ఒక కమిట్మెంట్ ఉంటుంది. అసలు, పెళ్లి అంటూ ఒకటయిపోతే, ‘అమ్మయ్య ఓ పనయిపోయింది బాబూ’ అనుకోవచ్చు.!……. ఏయ్ దివ్యా? ఏంటి మాట్లాడట్లేదు…?ఉన్నావా!.సుత్తి కొడుతున్నానని ఫోను పెట్టేశావా? .”
“నో…వింటున్నా….! ఆలోచిస్తున్నానే అపూర్వా!”
” సారీ దివ్యా …! బాధపెట్టినట్లున్నా….!”
“కాదు…! ఆలోచనలోకి నెట్టావు. నిజానికి నేను నీకు ఫోన్ చేసింది, ‘నేను హైదరాబాద్ కి రిలొకేట్ అవుతున్నాను, ఒక ఫ్లాట్ చూసి పెట్టు’ అని అడుగుదామని. నీ మాటల వలన నన్ను నేను రివైవ్ చేసుకోవాలేమో అనిపిస్తోంది. భయపడడం లేదులే గానీ, జాగ్రత్త పడాలేమో! ఏమోనే! అయామ్ కన్ఫ్యూజ్డ్ నౌ .”
” నిన్ను అలజడికి గురి చేసినందుకు ‘సారీ’ మరో సారి! నీ కోసం తప్పకుండా మా కమ్యూనిటీ లోనే ఫ్లాట్ చూస్తానే! నిన్ను బాధ పెట్టానేమో!”
” కాదులే….! నేనంటే ఏంటో, నాకేం కావాలో నిర్ణయించుకోవాలని, త్వరగా సంజయ్ తో కొన్ని విషయాలు క్లియర్ చేసుకోవాలని అనిపిస్తోందిప్పుడు. థాంక్ యు అప్పూ …! మళ్ళీ చేస్తా నీకు ఫోన్.”
***

” హల్లో…!అమ్మా….!అపూర్వా…! మా దివ్య..మాట్లాడిందామ్మా? నీ మీద చాలా పెద్ద భారం పెట్టానమ్మా!”

“అంకుల్…ఒక ఫాదర్ గా మీ భయం తెలుసు నాకు. దాని టెన్త్ క్లాస్ నుంచీ అమ్మా, నాన్నా మీరే అయి దివ్యని ఎంత గారాబంగా పెంచారో కూడా నాకు తెలియనిది కాదు. కానీ మీ నుంచి తాను దాచిన ఇంత ముఖ్యమైన విషయాన్ని, అదే …. తన ఎఫైర్ గురించి మీకు తెలిసినా , తనతో నేరుగా మాట్లాడకుండా, నాతో డిస్కస్ చేసిన కారణం అర్థమయింది. తన మనసు బాధ పడడం మీరు భరించలేరు. తొందరపడి తప్పటడుగు వేయకుండా మనసుకు నచ్చిన వ్యక్తితో మీ అమ్మాయి సుఖంగా వైవాహిక జీవితం గడపాలన్న మీ ఆరాటమూ తెలిసింది. నా ప్రయత్నం నేను చేశాను అంకుల్. దివ్య చాలా తెలివైనది. ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనే నా నమ్మకం. “
” నా ఆశ అదే…! దివ్యమ్మ బావుండాలి. సంతోషంగా ఉండాలి. యోగ్యుడైన వాడిని తనే ఎంచుకుని ‘నాన్నా! నేనితన్ని ప్రేమించాన’ని అంటే నిరభ్యంతరంగా పెళ్లి చేస్తాను. కల్లబొల్లి మాటలకు లొంగిపోయే అమ్మాయిల్ని సర్వ నాశనం చేస్తున్న కిరాతకుల్ని, చూస్తున్నాం కదా మీడియా లో..! అందుకే…!భయమేస్తోంది. థాంక్యూ తల్లీ…!గాడ్ బ్లెస్ యు!”
“ థాంక్యూ అంకుల్ . నేను దివ్యతో టచ్ లోనే ఉంటాను. మీరు దిగులు పడొద్దు. బై అంకుల్…”

సరిగ్గా పదిహేను రోజుల తర్వాత, అపూర్వ కి దివ్య నుంచీ వచ్చిన ఫోన్ కాల్,
“ అప్పూ…!డియర్ ఫ్రెండ్….!శుభవార్త. సంజయ్ కి కూడా హైదరాబాద్ లో ప్లేస్ మెంట్ వచ్చింది. మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మేం చర్చించుకున్నాం. తర్వాత ఇద్దరం జంషెడ్ పూర్ వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించాం. ఇంక మా నాన్నతో మాట్లాడాలి. విష్ మీ ఆల్ ద బెస్ట్.”
“ అంతా మంచే జరుగుతుంది…అప్పూ…! మరో వసతి అవసరమేమిటి నీకు? మీ నాన్నగారు నీకోసం బుక్ చేసిన అపార్ట్ మెంట్ సిద్ధంగా ఉండగా….? తొరగా వచ్చెయ్యి….ఆల్ ది వెరీ వెరీ బెస్ట్!”

You may also like

Leave a Comment