Home కవితలు తవ్వకం

తవ్వకం

by హిమజ

ఇప్పుడంతా తవ్వకాలు
జరుగుతున్నాయి
లోలోకి-లోలోతుల్లోకి

యోగం క్షేమం
కనుక్కుంటున్నారు
జ్ఞాపకాల చిత్తర్వులని
మనసు తెరపై వెతికి వెతికి
అతికించుకుంటున్నారు

మారుతున్న ప్రాధాన్యాలు
అవసరార్థ మిత్రుత్వాలు
వెలిసిపోతున్న ప్రేమలు
మనసు నింపని స్నేహాలతో
ఎవరి వలయాల్లో వారు
నిమిషాల ముళ్ళపై పరిగెడుతూ….

ఉప్పెనలై విరుచుకుపడుతున్న విద్వేషాలు
పొగలు గక్కుతున్న ప్రపంచం
మనిషి చుట్టూ హింస
మరెంత రక్తపాతం
ఇంకెంతో నిర్దయ
ఈ భూమి పైని
ఏ పుణ్యజలాలతో శుభ్రపడతాయో
తెలియని ….
ఎడతెగని యుద్ధాలు

కరాళకాలపు కుదుపుకు
ప్రాణాలు క్షణాల్లో వాయులీనమై
బంధాలు అకస్మాత్ నిష్క్రమణలై
సప్తవర్ణాల జీవితం
ఒకే దు:ఖవర్ణంగా మారిపోయి
నిర్వేదపు పెను నిశ్శబ్దం
ఫెటిల్మని పేలిన
ఈ కాలాన….

మరపు మడతల్లో మడిచి
ఉపేక్షించిన అపేక్షలను
ఆర్తిగా తిరగదోడుకుంటున్నారు
మరణం పిదప మనతో
వచ్చేదేమిటన్న ఎరుకతో

దయగా మన్నించి
దరి చేర్చుకోవడంతో
మానవజీవితాల్లో కొంతైనా
కొత్తదారులు వెలుగుతున్నాయి
మనిషి మనిషికి మధ్య

You may also like

2 comments

కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 5:57 am

బాగుందమ్మా. అభినందనలు.

Reply
గురిజాల రామశేషయ్య November 6, 2021 - 2:02 pm

వచన కవితా రచనకు కావల్సిన ఒడుపు మీకు వశపడిపోయింది. ఇక మంచి దీర్ఘ కవితకు ప్లాన్ చేసుకోండి.

సప్తవర్ణాల జీవితం
ఒకే దుఃఖ వివర్ణంగా మారిపోయి

సందర్భానికి తగిన అభావ భావ చిత్రంగా బాగుంది.

అభినందనలు…ప్రశంసలు.

Reply

Leave a Comment