Home కథలు తాత మనవడు

తాత మనవడు

by Dr. Dhuta Rama Koteshwara rao

మీ మనవడికి జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది, కానీ ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలి, తన తలకి బలంగా దెబ్బ తగలడం వలన, ఏక్షణమైన తను అతిగా బాధపడితే ప్రమాదం వెన్నంటే ఉన్నట్లుగా మీరు భావించాలి, అతడు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకోవాలి, తను అడిగింది కాదనకూడదు, తనకు మతిమరుపు కూడా రావచ్చు, ఇంకొకటి తన తలలో రక్తం గడ్డ కట్టుకొని ఉన్నది, దానివలన మీరు  చెప్పింది వింటాడని నమ్మకం కూడా లేదు, ప్రేమతోనే తన పక్కనే ఉంటూ చూసుకోవాలి, నేను ఇచ్చిన ఈ టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వాడాలి.

డాక్టర్ ఒకవేళ్ళ తను మీరు ఇచ్చిన టాబ్లెట్స్ వెయ్యడానికి ప్రయత్నం చేస్తే, తను వేసుకోకపోతే అప్పుడు ఎలా?

మీరు చెప్పింది నిజమే ఎందుకంటే తనకు ఏమీ జరగలేదు అని, తనకు ఎటువంటి సమస్య లేదని, మొండికేసి కూర్చుంటారడు, ఒక్కోసారి ఎదుటిమనిషి వేసుకుంటే వీళ్ళు కూడా వేసుకుంటారు, అలా గాని మీ మనవడు నువ్వు వేసుకుంటే నేను వేసుకుంటా అనికూడా అనగలడు!

అలా అంటే సమస్య లేదు డాక్టర్, నా మనవడు కోసం కచ్చితంగా నేను మాత్రలు వేసుకుంటాను, అందులో సందేహం లేదు.

ఐతే మాకు ఎటువంటి సమస్య లేదు, మీరు ఖచ్చితంగా మీ మనవడితో ఈ టాబ్లెట్స్ వేయించాలి, మీరు పనిలో పడి మరచిపోకూడదు, మీరు మరచిపోతే చాలా కష్టం.

నేను అసలు మరచిపోను డాక్టర్.

ఇతడితో ఒకమనిషి ఎప్పుడూ ఉండాలి, ఇతని తల్లిదండ్రులు ఉంటారా ప్రక్కన.

లేదు డాక్టర్, వాళ్ళు పనిలో పడి మరచిపోతే కష్టం, ఇద్దరు ఆఫీసుకి వెల్లుతారు, కనుక నేను నా మనవడికి తోడుగా ఉంటాను. ఇంకొక సందేహం ఒకవెళ్ళ కాలేజీకి వెల్లుతా అంటే అప్పుడు ఎలా డాక్టర్.

ఇప్పుడే అనకపోవచ్చు, ఒకవేళ్ళ  అంటే మాత్రం, మీ మనవడుని తొందరగా కొలుకుంటాడు అని మాత్రం చెప్పగలను.

డాక్టర్ గారికి దణ్ణం పెట్టి, మనవడుని తీసుకొని ఇంటికి బయలుదేరినాడు కోటయ్య.

అసలే వయసు మళ్ళిన వాడిని, ఒకపక్క తల్లిదండ్రులు కూడా దగ్గరలో లేరు, నాకు గుర్తుండటమే అంతంత మాత్రం, అలాంటిది ఇప్పుడు నా మనవడు ఇలా ఉంటే, నేను వాడికి సరైన సమయంలో ఈ టాబ్లెట్స్ ఎలా వెయ్యాలి, వాడిని ఆనందంగా ఎలా ఉంచాలి, తల అంతా ఆలోచనలతో పిచ్చేక్కిపోతుంది, చిన్నతనం నుండే కష్టాలు కన్నీళ్లు అలవాటు అయ్యినాయి కనుక, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా, చుట్టూ జనం ఉన్నా సరే, ఒంటరిగా బ్రతికినా, ఏ రోజు కన్నీరు రాలేదు, తాత చనిపోయే క్షణాల్లోనే అత్తయ్య కూతురుతో తాత కోసం, నాన్న పెళ్లి చేయడం, అసలు పెళ్లంటే ఏమిటో తెలియని వయసులోనే పెళ్లి చేయడం, తాతయ్య కంటే ముందే అమ్మానాన్నలు మరణించడం, ఆ దిగులుతో తాత కూడా మరణించడం, నాయనమ్మ అన్నీ తానై చూసుకుంది, కొద్దిరోజులకు ఆమె కాలం చెయ్యడంతో, ఇద్దరమే జీవితంతో పోరాటం మొదలుపెట్టినాము, ఆ రోజు నుండి ఏ రోజు కూడా నాకు ఇది కావాలి అని అడగలేదు, నేను ఏది చెబితే అదే కరెక్ట్ అనేది, ఆవేశంగా మాట్లాడితే శాంతంగా సమాధానం చెప్పేది, కోపంలో కొట్టితే చిరునవ్వు నవ్వేది, అలిగితే బ్రతిమిలాడేది, ఎన్నో కష్టాలు ఓర్చుకొని జీవితాన్ని సరైన మార్గంలో నడిపించిన దేవత నా భార్య, కొడుకు పుట్టాడు, వాడి భవిష్యత్ కోసం పాకులాటలు, వాడి జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టేటందుకు ఎన్నో సమస్యలు, ఐనా వాడిని ఉన్నత చదువులు చదివించి, ఓ మంచి కుటుంబంలో అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేయించడం జరిగింది, తరువాత వీడు పుట్టాడు, వీడిని చూసిన తర్వాత నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, నన్ను భర్తలా కంటే కన్న బిడ్డలా చూసుకున్న నా ఇంటి దేవత నన్ను వదిలివెళ్లిపోయిన తరువాత నేను ఒంటరిగా మిగిలిపోయాను, అప్పుడు నా బాధను తొలిగించింది నా మనవడు, వీడు నన్ను తాత అని పిలవడం కంటే ఎప్పుడూ బ్రో అంటూ పిలిచేవాడు, వాడు నన్ను బ్రో అంటూ, నాకు ప్యాంటు షర్ట్, తలకు రంగు వేసేవాడు, బ్రో అలా బయటకు వెల్లుదాం అనేవాడు, అలా నన్ను ఎప్పుడూ నవ్వించే నా చిట్టి తండ్రి, ఈ రోజు ఇలా ఉండటం ఎంతో బాధగా ఉంది, ఇంతలో సార్ ఇంటికి వచ్చాము అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చాడు కోటయ్య, తన మనవడుని తీసుకొని లోపలికి వెళ్ళాడు.

వయసు రీత్యా మతిమరుపు రావడం సహజం, కనుక తన మనవడికి టాబ్లెట్స్ టైంకి వెయ్యాలి కనుక, బయటకు వెళ్లి ఎలక్ట్రిక్ షాపులో ఒక పరికరాన్ని తీసుకొచ్చాడు, దానికి ఒక సమయం కేటాయిస్తే, ఆ సమయానికి టాబ్లెట్ వేయాలి, టాబ్లెట్ వేయాలి అని చెప్పుతుంది, అప్పుడు టాబ్లెట్ వేయవచ్చు అని ఆ పరికరాన్ని తీసుకొచ్చి పెట్టాడు కోటయ్య, తన మనవడి పేరు రాము.

డాక్టర్ చెప్పినట్లుగానే రాము నువ్వు వేసుకుంటేనే నేను వేసుకుంటాను అని చెప్పడంతో కోటయ్య కూడా టాబ్లెట్స్ వేసుకోవడం చేస్తూ ఉన్నాడు, రాము ఏది చేయమంటే కోటయ్య అది చేస్తూ ఉండేవాడు, కొద్దిగా కోలుకున్న రాము బ్రో కాలేజీకి పోదామా అన్నాడు ఒకరోజు, సరే రెండు రోజుల్లో వెల్లుదాం అని చెప్పాడు. అదే రోజు డాక్టర్ ని కలిసి డాక్టర్ రాము నన్ను కాలేజీకి రమ్మంటున్నాడు ఎలా అని అడగడంతో ఆలోచనలో పడ్డాడు డాక్టర్ గారు.

కొద్దీ సేపటికి ఫోన్లో ఎవరితోనో మాట్లాడి, చూడండి కోటయ్యగారు నేను రాము వెళ్లే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినాను, మీరు కూడా కాలేజీకి వెళ్ళవచ్చు అన్నాడు.

డాక్టర్ నేను ఈ వయసులో కాలేజీకి వెళ్లడం ఏమిటి ఆశ్చర్యంతో అన్నాడు.

తప్పు ఏముంది, మీ మనవడికి తోడుగా వెళుతున్నారు అనుకోండి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఒకవేళ్ళ తను ఒక్కడే కాలేజీకి వెళ్ళితే, మధ్యలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అప్పుడు బాధపడేది ఎవరు ఒక్కసారి ఆలోచించండి?

మీరు చెప్పింది నిజమే కానీ, ఇంట్లో అంటే ఎదో అలా నెట్టుకొని వస్తున్నాను, ఇప్పుడు కాలేజీకి అంటేనే కొంచెం ఆలోచించవలసి వస్తుంది దిగులుగా అన్నాడు.

ఇక్కడ ఆలోచించవలసింది ఒక్కటే, నీ మనవడు కోసం నువ్వు ఏమి చెయ్యగలవో అవి చెయ్యండి, ఆలోచనతో మీరు ఆందోళన పడి, మీ మనవడ్ని ఆందోళనకు గురిచేయకండి. మీరు ఎంత సంతోషంగా ఉంటారో, మీ మనవడు అంతే సంతోషంగా ఉంటాడు మీరు కొంచెం ఆందోళన చెందినా, మీ ముఖంలో కొంచెం విచారణ కనిపించినా మీ మనవడు ఎంతో బాధ అనుభవించవలసి రావచ్చు. ఒక డాక్టర్ గా కాదు, సాటి మనిషిగా చెబుతున్నా, మీరు ఇప్పటివరకు చూపిన శ్రద్ధ వల్లనే తాను మాములు మనిషి అవ్వుతున్నాడు అర్ధం చేసుకో అన్నాడు.

క్షమించండి డాక్టర్ నా మనవడు కోసం నేను ప్రాణాలు అయినా ఇస్తాను, నేను వెల్లుతాను కాలేజీకి అన్నాడు.

హాయ్ బ్రో ఎక్కడికి వెళ్లావు, ఈ రోజు మనం షాపింగ్ చెయ్యాలి, అంతే కాకుండా స్మార్టుగా తయారు అవ్వాలి, రేపటి నుండి కాలేజీకి వెళ్ళాలి అన్నాడు రాము.

అలాగే రాము వెల్లుదాం అన్నాడు కోటయ్య.

షాపింగ్ చేశారు, హెయిర్ కటింగ్ చేయించుకున్నారు ఇద్దరు, హెయిర్ కి ఇద్దరు ఒకే విధంగా కలర్ వేయించుకున్నారు, మంచి మంచి డ్రెస్సులు తీసుకున్నారు, అలా హోటల్ లో భోజనం చేసి ఇంటికి సాయంత్రం వచ్చారు.

ఇద్దరు ప్యాంటు షర్ట్స్ వేసుకొని, బైక్ మీద కాలేజీకి వెళ్లినారు, ఇక రోజూ కాలేజ్, వారం వారం సినిమాలు, ఒక్కటే ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్లినా మై బ్రదర్ అని పరిచయం చేయడం మొదలుపెట్టాడు రాము, కోటయ్య కూడా మౌనంగా తలఊపేవాడు. కోటయ్య పేరుని రాకీ గా మార్చివేశాడు. రాము ఎప్పుడూ నవ్వుతూ ఉండటంతో, రాకీ కూడా అంతే నవ్వుతూ ఉండేవాడు, కాలేజీలో అల్లరి బాగా చేసేవాడు రాకీ, రాము కూడా సపోర్ట్ చేసేవాడు, ఒక్కోసారి వాళ్ళ ఇద్దరిని చూస్తుంటే కవలపిల్లలుగా ఉండేవారు, ఏ విషయానైన చాలా తేలికగా తీసుకునేవాడు రాకీ.

అలా రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి..

ఒకరోజు రాము వాళ్ళ అమ్మానాన్నలు వచ్చారు, ఇంట్లో రాము లేడు, రాకీ ఒక్కడే ఉన్నాడు, రాకీ వాళ్ళను చూసి కొంచెం సంశయించినాడు, చూడు బాబు మా అబ్బాయి రాము ఎక్కడా అని ఆడిగినాడు,

రాము బయటకు వెళ్ళాడు అని చెప్పాడు..

ఇంతకీ నువ్వు ఎవరు? సందేహంతో అడిగింది రాము అమ్మ.

నేను రాము స్నేహితుడిని అని చెప్పినాడు రాకీ, తల పక్కకు తిప్పుకోని.

అనుమానంతో రాము తండ్రి వచ్చి రాకీ ముఖంలోకి చూశాడు, అంతే పట్టరాని కోపంతో ఊగిపోయాడు.

నాకు తెలుసు రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పులేదని, వాడికి ముందునుండే చెబుతున్నాను, ఈ ముసలోడిని ఇంట్లోకి రానివ్వవద్దు అని, ఫోన్ చేసి మాట్లాడిన ప్రతిసారి నా దగ్గరలేడు, నేను తాతను చూడక చాలారోజుల అయ్యింది అని చెప్పేవాడు, ఈయన గారిని ఏకంగా ఇంట్లోనే పెట్టాడు, ఐనా మనం అన్ని సార్లు వచ్చినా కనిపించలేదు అంటే, మనం వస్తున్నాము అని తెలుసుకొని ఆ సమయానికి ఎక్కడో ఉంచేవాడు అనుకుంటా! ఏమి బ్రతుకు మీది సిగ్గు శరం ఏమీ లేదా, మీ వయస్సు ఎక్కడ, వాడి వయస్సు ఎక్కడ, మీరు వాడి బట్టలు వేసుకొని, ఈ వయస్సులో తైతక్కలు అడుతున్నారా, మీరు వాడి స్నేహితుడు అని చెప్పుకొని తిరుగుతున్నారా, అసలు మిమ్మల్ని ఎలా తిట్టాలో కూడా అర్ధం కావడం లేదు అన్నాడు రాము తండ్రి.

అది కాదురా, రాముకి యాక్సిడెంట్ అయ్యితే, డాక్టర్ రాముకి ప్రమాదం అని చెబితే, వాడు ఏది చెబితే అది చేశానురా, నాకు ఇలా ఉండాలి ఏమీ లేదురా అన్నాడు కొడుకుతో కోటయ్య.

ఛీ నోరుముయ్యి, వాడికి యాక్సిడెంట్ జరిగింది అని ఎందుకు నాన్న అబద్దాలు మాట్లాడుతున్నావు, ఇప్పటి వరకు మిమ్మల్ని బయటకు పంపించి వెయ్యాలి అనే ఉండేది, నా కొడుకుకి యాక్సిడెంట్ అని చెప్పినప్పుడే నా దృష్టిలో మీరు చచ్చిపోయారు, ఐనా ఇంట్లో ఉన్న ఇద్దరం నువ్వు మాకు వద్దు, మా ఇంట్లో ఉండొద్దు, అని నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా, కుక్కలా ఇంట్లో ఉండటానికి సిగ్గులేదు.

వస్తున్న కన్నీరు తూడ్చుకుంటూ, మాట తడబాటులో కూడా, నిజంగా వా..డి.. కి యాక్సిడెంట్ జరిగింది, అందుకే వాడిని కాపాడుకుంటూ ఉన్నానురా!

వాడిని చూసుకోవడానికి చిటికేస్తే వెయ్యి మంది క్యూలో ఉంటారు, ముసలివాడి సేవకావలసి వచ్చిందా, ఐనా నిన్న కాదు వాడిని అనాలి, అమ్మ పోయినప్పుడే నువ్వు పోతే పోయేది, ఎదో దేశంలో ముసలివాళ్ళని కాల్చి చంపుతారు అంట, నాకు అవకాశం రాలేదు కానీ నిన్ను కూడా కాల్చి చంపేవాడిని, ఆరోజు నువ్వు నా భార్య మీద చెయ్యివేసినప్పుడే!

నీ పెళ్ళాం మాట నమ్ముతున్నావు గాని, కన్న తండ్రి మాట నమ్మడం లేదా, కోడలు కూతురితో సమానంరా, అని కోపంతో చెయ్యొ ఎత్తాడు రాము తండ్రి పైన.

నా భర్త పైనే చెయ్యొ ఎత్తుతావా అంటూ కోపంతో చెంప మీద కొట్టి గట్టిగా క్రిందకు నెట్టింది, రాము తల్లి.

క్రిందపడగానే తలకి గట్టిగా దెబ్బ తగలడం, ఇంతలో హార్ట్ ఎటాక్ రావడంతో కొట్టుకుంటున్న కోటయ్యను పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు ఇద్దరు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన పనిమనిషి జరిగింది అంతా చూసి, వెంటనే రాముకి ఫోన్ చేసి చెప్పింది, రాము అంబులెన్స్ కి ఫోన్ చేసి, ఇంటికి వచ్చి తాతయ్యను తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాడు.

కొద్దిసేపటికి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పాడు డాక్టర్ గారు.

హమ్మయ్య అనుకొంటూ ఉండగానే రాము తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చారు. రావడం రావడంతోనే ఆవేశంగా..

రాము ఏమి చేస్తున్నావు ఇక్కడ, వాడు చస్తే చావనియ్యాలసింది పోయి ఎందుకు తీసుకొచ్చావురా అన్నది కోపంతో రాము తల్లి.

చూడు మమ్మి నువ్వు మాట్లాడటానికి అసలు అనర్హురాలివి, అదీ తాతయ్య గురించి మాట్లాడే అదికారం కూడా నీకు లేదు, ఇంకొక్క మాట తాత గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు జాగ్రత్త!

ఎరా అమ్మని తిట్టే గొప్పోడివా అన్నాడు రాము తండ్రి.

కొద్దిసేపటికి రాము స్నేహితులు వచ్చారు.

ఏమైంది రాము ఏంటి ఇదంతా, రాకీ కి ఎదో జరిగింది అని తెలిసింది, అసలు రాకీ ఎవరు? మీ అమ్మానాన్నలతో ఈ గొడవలు ఏమిటి? నువ్వు అమ్మానాన్నలను తిట్టడం ఏమిటి? అసలు ఒక్కముక్క అర్ధం కావడం లేదు అసలు ఏమి జరిగింది అన్నారు స్నేహితులు.

నేను చెబుతాను అన్నాడు డాక్టర్.

రాము వాళ్ళ తాతయ్య మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రాకీ. రాకీ అసలు పేరు కోటయ్య. కోటయ్య భార్య చనిపోయిన తరువాత, కోటయ్యను కొట్టడంతో తలలో రక్తం గట్టకట్టుకొనిపోయింది, అలా దెబ్బలతో ఉన్నవాడిని రోడ్డు మీద వదిలివేశారు రాము తల్లిదండ్రులు. ఇక అప్పటి నుండి ఆ ఇంట్లో ఉండకుండా దూరంగా కిరాయికి ఉంటూ ఉన్నారు, విషయం తెలిసి తాతయ్య కోసం ఎన్నో చోట్ల తిరిగినాడు, పదిహేనురోజులు తరువాత రోడ్డు మీద ఆడుకుంటూ కనిపించిన తాతయ్యను తీసుకొని మా ఆసుపత్రిలో జాయిన్ చేయించినాడు. అప్పుడే ట్రీట్మెంట్ చేయకపోవడంతో  సమస్య పెద్దది అయ్యింది కోటయ్యకు.
రెండు నెలల తరువాత మాములుగా అయ్యాడు కోటయ్య, తాతయ్యను తీసుకొని పాత ఇంట్లో ఉంటూ, తాతను అమ్మానాన్నలకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు, అనుకోకుండా అమ్మానాన్నలు అమెరికా వెళ్లవసివచ్చింది, సుమారు ఆరునెలల అక్కడే ఉంటారు అని తెలుసుకున్నాడు, కోటయ్యకు జ్ఞాపకశక్తి లేకుండా పోతుంది, ఏదీ గుర్తు ఉండటం లేదు ఒక్క రాము తప్ప అన్నీ మరచిపోతున్నాడు. ఇదే విషయం నా దగ్గర ప్రస్తావించాడు రాము, అంతే కాకుండా టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు అని చెప్పడం, తలలో ఉన్న ఆ గడ్డ కట్టిన రక్తం వలన ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు అని తెలియడంతో, ఇక క్రొత్త ట్రీట్మెంట్ చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాను,  తాతయ్య నాకోసం ఏమైనా చేస్తాడు అని చెప్పడంతో, నాకు ఒక ఆలోచన వచ్చింది అదే రాముకి యాక్సిడెంట్ అయ్యింది అని మేము కోటయ్యకి చెప్పడం, అప్పటి నుండి రాము కోసం కోటయ్య టాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది, ఇక్కడ విషయం ఏమిటంటే తాతయ్య కోసం రాము టాబ్లెట్స్ వేసుకోవడం, రాము తాతయ్యను కాలేజీకి తీసుకెళుతా అన్నాడు, సమస్యలు వస్తాయి అంటే నేను చేసుకుంటా అని చెప్పాడు.

అనుకున్నట్లుగానే రాము కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినాడు, కోటయ్యే నాదగ్గరకు వచ్చేటట్లు చేశాడు, ఆరోజు నేను రాముతో మాట్లాడి విషయం నిర్దారణ చేసుకున్న తరువాతే, నేనే యాజమాన్యంతో మాట్లాడినాను అని చెప్పినాను, ఎక్కడ తాతయ్య దూరం అవ్వుతాడో అని అనుక్షణం తన పక్కనే ఉన్నాడు, ఈ వయసులో మనవడి కోసం తాత, తాత కోసం మనవడు, ఎంతో కష్టపడ్డారు. ఇలాంటి తాత మనవడిని ఎక్కడా చూడలేదు, మీకు నిజం చెప్పనా, తన తలలో గడ్డ కట్టిన రక్తం వల్ల, నేను ఆరునెలలు కంటే బ్రతకడు అని చెప్పాను, కానీ రెండుసంవత్సరాలుగా ఆ తాతను ఆనందంగా ఉంచి తన ఆయుస్సు పెంచాడు అని స్నేహితులకు వివరించాడు డాక్టర్.

స్నేహితులు రాముని గట్టిగా కౌగిలించుకున్నారు.

వెనుకనే కన్నీరు తుడుచుకుంటూ నిలబడ్డాడు కోటయ్య.

తాతయ్యను చూసి వెళ్లి గట్టిగా కౌగిలించుకున్నాడు రాము.

ఎందుకురా.. నాన్న నేనంటే అంత పిచ్చి అంటూ బోరున ఏడ్చాడు కోటయ్య.

తాతయ్య ఏడుస్తుంటే రాము కూడా బోరు బోరున ఏడ్చాడు.

అంతే అచేతనంగా అలా కుప్పకూలిపోయాడు కోటయ్య..

వెనువెంటనే స్పందించిన డాక్టర్, ఆపరీషన్ థియేటర్ కి తీసుకెళ్లారు, అందరూ రాముని ఓదార్చుతున్నారు.

కొన్ని గంటల తరువాత డాక్టర్ గారు బయటకు వచ్చారు, రాము ఇక తాతయ్యకి ఎటువంటి ప్రమాదం లేదు, ఆపరీషన్ సక్సెస్ అయ్యింది అన్నాడు, అంతే రాము డాక్టర్ గారి కాళ్లకు దణ్ణం పెట్టాడు, రాముని పైకి తీసుకొని కౌగిలించుకున్నాడు డాక్టర్. మీ తాతయ్య నీకోసమే బ్రతికినాడు అన్నాడు.

ఇరవై నాలుగు గంటల తరువాత.. తాతయ్యతో మాట్లాడినాడు రాము.

ఆసుపత్రిలో C C కెమెరాలో రికార్డు అయ్యిన వీడియోలు వైరల్ అయ్యినాయి, రాముని అందరూ మెచ్చుకున్నారు, రాము తల్లిదండ్రులు పనిచేసే కంపనిలో నుండి తీసివేశారు, కారణం వీడియోలు వైరల్ అయ్యినవి వారివే కావడం.

మరల రాము, మన కోటయ్య సారి సారి… రాకీ కలసి ఎంతో ఆనందంగా ఉన్నారు, త్వరలో రాముకి పెళ్లి చెయ్యాలి అని రాకీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు, ఈ విషయం తెలిసిన రాము రాకీ కి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.

వీరిద్దరూ కాలేజీకి వెళ్లడం, సినిమాలకు వెళ్లడం సర్వసాధారణం అయ్యింది. కానీ రాకీ కి సిక్స్ ప్యాక్ తీసుకొని రావాలని రాము రాకీని జిమ్ కి తీసుకెళుతున్నాడు. రోజూ రాకీ చేత బరువులు మొయిస్తూ ఉన్నాడు, రాము కోరితే జిమ్ముకే కాదు, నరకానికైనా వస్తాడు రాకీ.

రాకీకి బైకు నేర్పించాడు, చదువు నేర్పించాడు, ఒక్కటా రెండా, ఎవ్వరూ గురించలేని విధంగా మార్చి చూపించాడు రాము.

జరుగుతున్న పరిణామాలు చూస్తూ, ఈ పోటీ ప్రపంచంలో పడి పరిగెడుతూ ఉన్న వాళ్ళు, ఒక్కసారి ఇంట్లో ఉన్న మీ ముసలి తల్లిదండ్రులను కూడా చూసుకోండి, మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాము, కన్నతల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవడం కొడుకులుగా మన బాధ్యత అని గుర్తించాలి, ఇలాంటి కొడుకు కోడలిగా మీరు ఉండకూడదని నా ప్రార్ధన. అందరికీ రాములాంటి మనవడు దొరకడు కనుక పిల్లలే తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోవాలి అని, చూసుకుంటారు అని ఆశిస్తున్నాను.

ఇది నా స్వీయ రచన.. అనువాదం అనుకరణ కాదు అని హామీ ఇస్తున్నాను.

You may also like

Leave a Comment