నాటి చల్లని రాత్రి
సూర్యోదయపు గులాబి పిడికిళ్ళు విప్పుతూ
ఒక వెలుగు రేఖ పుట్టింది.
హస్త రేఖలు చూసి
ప్రాతః సమీరం చెవుల్లో గుసగుసలాడింది
చెమర్చిన హిమబిందువులని చూసి
నక్షత్రాలు నవ్వాయి
వెన్నెలతో కలిసి వీడ్కోలు చెప్పాయి
పక్కకు ఒత్తిగిలి నీరసంగా
తనకై చేసే తొలి ప్రార్ధన వినాలని
చెవులు రిక్కించిన శిశువుకి,
ఆడపిల్లా అన్న గొణుగుడు
ఆగొంతులో ఎంత విషాదం
ఓ – గాడ్ –
మొదటగా నా చెవుల్లో పడిన
అమృత వాక్కు వినా
మొదటి శ్వాసలోనే
విషాదాన్నీ, ఓటమినీ పీలుస్తూ
వింటున్నాను
ప్రతి అడుగూ ఓటమికి సన్నద్ధముకమ్మని
కాలకూట విషంతో ప్రారంభించిన
జీవన సరళి,
ఓ ఆడపిల్లా – అయితే ఈమె భవిష్యత్తుకై
ప్రార్థించు అంటున్న తొలి ప్రార్థనలు
రింగుమంటూనే ఉంటాయి జీవితాంతం
(పాకిస్తాన్ కవయిత్రి మేడం ఇస్రత్ ఆఫ్రిన్ కవిత ది ఫస్ట్ ప్రేయర్ ఆఫ్ మై ఎల్డర్స్ కు అనుసృజన)