Home కవితలు దీపం వెలిగించాలి

దీపం వెలిగించాలి

by Sangineni Ravindra

ఓ దీపం వెలిగించాలి..
నువ్వు చీకటి తలువులెంత మూసుకున్నా..
ఓ వెలుగు రేఖను పంపించాలి..

ఇంకెంతకాలం
వెలుగు చూపులపై
చీకటి రెప్పలు కప్పుతావ్..
నలుపు తెరల్లో తప్పుల కుప్పలు పేరుకుపోతుంటే
తప్పు నాది కాదని తప్పించుకోలేవ్..!

రాత్రితో మిత్రుత్వం
ఎంత విచిత్రం?
నకిలీ నిద్రలో నువ్వు
నాశనం చేస్తున్న కాలం..
ఓ త్రిశూలంగా మారి సోయి మంత్రం జపిస్తోంది..
మోడువారిన నీ మూడోనేత్రాయుధం పీడకలలు శపిస్తోంది…

వెలుగిప్పుడు అవసరం కాదు..
అనివార్యం..
చీకటంటే ఓ సోమరితంత్రం..
పంచభూతాలు పరుచుకున్న
నీ పరిసర ప్రాంతాల్లో..
నీదీ నాదీ కానీ లోకంలో
ఓ దీపం వెలిగించాలి..

మురికిగోడని అంటుకొన్న
చీకటి..
ఘడియకో రూపం సంతరించుకుంటోంది..
కళ్ళమంటల్లో.. కడుపు మంటల్లో
ఊపిరిపోసుకుంటోంది..

నులివెచ్చని స్పర్శ ఏదో
తనువంతా పాకినట్టు
చుట్టూతా కాంతి నింపాలి..
ఓ దీపం వెలిగించాలి..

బయట అనే కాదు..
నీలో.. నాలో..
మనందరిలో..!!
ఓ దీపం వెలిగించాలి..!!

You may also like

Leave a Comment