Home కవితలు దీపాలు మాట్లాడుతున్నాయి

దీపాలు మాట్లాడుతున్నాయి

by ChittiProlu Venkata Ratnam

దీపాలం దీపాలం
తిమిరాలకు శాపాలం
తమోహక ప్రతాహలం
అమవసపై కోపాల

అయినా మేం గర్వించం
అసలే ఆనందించం
బహిరంగపు చీకట్లను
ప్రహరిస్తున్నాం గానీ
అంతరంగపు చీకట్ల
నంతం చేస్తున్నామా?
అందుకే ఈషణ్మాత్రం
ఆనందించడం లేదు
అందుకే ఒక్కింతైనా
అహంకరించడం లేదు

యదార్థ కథనం చేస్తే
అసలు సిసలు దీపాలం
మేమని చెప్పుకోలేము
మా మనసులోని మాటది

మానవాళినంతటిని
ప్రాణికోటులన్నిటిని
ప్రేమించిన, సేవించిన
ధీమాన్యులు దీపాలు
జనకోటిని నడిపించిన
ఘననాయక శేఖరులు,

మన అందరికీ సుఖ జీ
వన వరమందించేందుకు
ఎన్నెన్నో కనిపెట్టిన
మిన్న లైన శాస్త్రజ్ఞులు
అసలు సిసలు దీపాలు
ఆరని దీపాలు , నూనె అవసరమొక్కింతలేని
అనశ్వర ప్రదీపాలు

కనులకు కనిపించే ఈ
ఘనతర దీపాలె కాక
ఆలోచించగలిగితే
మీలోంచే ఉదయించే
అపురూపమైన దీపా
లవి ఎన్నో ఉన్నాయి

బ్రతుకులోన తల ఎత్తే
ప్రతి అనుభవము ఒక దీపం
అది నేర్పే గుణపాఠం
ఆ దీపకాంతిపుంజం
వాటిలోనూ చేదు అనుభ
వాల వెలుగు తీక్ష తరం
ఆ అనుభవాలలోనూ
అవమానా లిడే వెలుగు
అనన్య సామాన్య వరం

మిన్నల ఘనరూపంలో
మీ అనుభవరూపంలో
వెలిగే దీపాల వెలుగు
విలువ తెలిసి వర్తిస్తే
మీ ప్రతి ఒక్కరి మనుగడ
దీపావళి కాగలదు
చరితలోన మీ పేరు
చిరస్థాయి కాగలదు
_**

You may also like

Leave a Comment