ఆకలి అంతానికి
జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు
కరువును దూరం చేసి
కడుపులు నింపేందుకు కంకణబద్ధుడయ్యాడు
వంశానుగతంగా వచ్చిన స్టెతస్కోపుకు
ఆదిలోనే మంగళం పాడి
చేనుకే జై కొట్టిన హరిత మిత్రుడు
పోలీసు సర్వీసుకు ఎంపికైనా
వ్యవసాయ పరిశోధనకే పట్టం కట్టిన ధీశాలి
ఎక్కడో తూర్పు తీరాన్నుంచి వినబడ్డ
బెంగాల్ ఆకలి కేకలకు స్పందించిన
దక్షిణాది విద్యార్థి
భిన్నత్వంలో ఏకత్వానికి ‘మెచ్చు’తునక
వ్యక్తిగత సౌఖ్యాలకంటే
సామూహిక అవసరాలనే
ముఖ్యంగా భావించిన ప్రజాప్రేమికుడు
వచ్చినవాటి కంటే
వ్యక్తిగత స్థాయిలో పోగొట్టుకున్నవే ఎక్కువ
తెల్ల కోటు
ఖాకీ పోస్టు
డాలర్ లైఫు
అన్నీ తృణీకరించి
మాతృదేశాన్ని కరువు నుండి
విముక్తి చేసేందుకు అంకితమైన ప్రతిభామూర్తి
కదిలించిన కరువుకు
పరిష్కారం చూపిన వీరుడు
కృషీవలుడికి అండగా
విత్తై వెలిశాడు
స్వయం సమృద్ధికి
ఊతమై నిలిచాడు
బోర్లాగునే
ఆశ్చర్యపరిచాడు
మెక్సికో వంగడాల విలువను గుర్తెరిగి
భారతానికి తెచ్చిన
మాన్ కొంబు సాంబశివన్ స్వామినాథన్
హరిత విప్లవానికి పితామహుడయ్యాడు
ఆకలికి పరిష్కారం చూపి
దేశప్రజకు ఆరాధ్యుడయ్యాడు
(హరిత విప్లవ పితామహుడు ఎం. ఎస్. స్వామినాథన్ మృతి నేపథ్యంలో రాసిన కవిత)
(కవి దర్పణం సాహిత్య వేదిక, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదికల అధ్యక్షులు)
1 comment
మీ కవితల కంటే మీ వ్యాసాలు నాకు చాలా ఇష్టం సార్!