నిత్యజీవన సుగంధ పరిమళాల
నిరంతరాన్వేషకుడను
నిర్దిష్ట జీవన గమనానువర్తుడను
సరళానుదాత్త కాముకుడను
జీవనగమనంలో…
నిత్యసాహితీ చర్చాంకితడనవుతూ
సమాజశ్రేయస్సుకై ఉద్దీప్తతతో
సమకాలీనతలో …
సమ్యక్ చింతనానుశీలనతో
ప్రవహించే జీవనశైలుడను
నేనొక సామాన్యుడను
మధ్యతరగతి మందహాసాన్ని
నలుగురి మధ్యలో
బతుకునీడుస్తున్న వాడిని
అయినా …
ఆధునిక రుగ్మతలకు ఎవరూ
అతీతులు కాదనిపిస్తుంది
దానికి… వయోభేదాలు
ఆర్ధిక మూలాలను పట్టించుకొనకుండా –
నా గమనంలో … అందరూ సమమే
నాకు జాతి, మతాలు లేవు
ఆలింగనము చేసుకోవడమే
ప్రపంచమును అతులాకుతలం చేస్తూ
వణికించడమే నా ధ్యేయం.
కరోనా … కరోనా … ప్రాణాలపై
ఆశలు వదిలేలా చేయడమే…
నా…కరో.. అన్నా! ఏమీ చేయలేని స్థితి
మూతికి, ముక్కుకు మాస్కే గతి
నాజీవన సౌగంధికత ఆవిరవుతున్నది
X. X X
తుమ్ము, దగ్గు, ఆయాసం
క్షణ క్షణం కుంచించుక పోతున్నాను
జీవనపోరాటంలో సతమతం
ఒకపక్క నిర్మానుష్యం
ఎవరూలేని ఏకాకితనం
ఆత్మీయులంటూ మసలిన
నా సమాజం, బంధువులెక్కడ
ఇన్నాళ్ళ నా పారదర్శకమైన గమనం
ఏమైంది? ఎవరికెవరు?
కనీసం పలకరింపుకు
నోచుకోని బతుకైనది.
ఉభయ సాహిత్యాలకోసం
గుమిగూడే వారెక్కడ!
ఆత్మీయతలను ప్రదర్శించే వారేరి…
ఈ నిండు ఏకాకితనములో
నాకొక మనిషి కావాలి
ఏ అరణ్యములోనో…నిర్జీవనప్రాంతం
వనచరాల మధ్య బతకడమే మేలేమో!
సమాజానికి ఉపయోగపడే అవసరాలు
అన్నీ బంద్ అయినట్టు
నా బంధాలు కూడా రద్దయినవి
వాత్సల్యాలూ, ప్రేమలూ లేవు
పలకరించే గళమేది?
అందుకే నాకిపుడు
స్మశానవైరాగ్యం ఆవహించింది
నన్ను నన్నుగా మన్నించే
నాకొక మనిషి కావాలి.
==##==
డా. టి.శ్రీరంగస్వామి
నాకొక మనిషి కావాలి
previous post