Home కథలు నిజమైన పండుగ

నిజమైన పండుగ

by Shuktimati Vemuganti

“వీల్లేదు పొమ్మంటుంటే శనిలా వెంట పడ్డావేంటి. చెప్పేది నీక్కాదూ…” భార్యను కసిరి కొట్టాడు విశ్వనాథం.
మళ్లీ అదే మాట.” నేను వస్తాను….. నీతో వస్తాను….” మింగేసేలా ఉన్న అతని చూపులకు నిలువెల్లా కంపించి పోయిన ఆమె దిగాలుగా నిలబడిపోయింది. ఆ మరుక్షణం కారు స్టార్ట్ చేసి బుర్రునా అతడువెళ్ళిపోయాడు.

 సాయంకాలం వరకు ఎక్కడ దాక్కుంటుందోగాని ఆకైనా కదలడం లేదు. నాలుగైదు పిచ్చుకలు రొద చేస్తూ అటూ ఇటూ ఎగురుతూ ఆడుకుంటున్నాయి. గోడ మీద పెద్ద బల్లి నిశ్శబ్దంగా ఉంటూనే ఏ చిన్న కీటకం వచ్చినా దొంగలా కదిలి మెరుపులా మీద పడి గుటుక్కుమనిపిస్తోంది. ఆమెకు కళ్ళవెంట మాటిమాటికీ నీళ్లుబుకుతున్నాయి. పక్కకు చూసేసరికి బిక్క మొహం వేసుకొని చిన్న కొడుకు. వాడికి అలవాటే .తల్లి కళ్ళనీళ్ళు తుడిచే వయసు కాదు .చూసే మనసు లేదు.

గొర్రెల మంద దుమ్ము రేపు కుంటూ కదిలిపోతుంది.పిల్లలందరూ ఆ దుమ్ములోనే పెద్దగా గోల చేసుకుంటూ ఆడుకుంటున్నారు. అప్పుడే ఊళ్ళోనుండి బస్సు వెళ్లినట్టుంది ,ఎర్రటి దుమ్ము వలయంలో ఊరంతా చిక్కుకుంది. ఊరికి మధ్యనున్న చెట్టు నీడలో కొంతమంది పేక లాడుకుంటున్నారు.
“అమ్మా.. ఎక్కడికే? చెప్పవే?….” అని అడుగుతున్న కొడుకు మాటను వినిపించుకోకుండా అతని చెయ్యి పట్టుకొని ఇంటికి తాళం వేసి బయటికి నడిచింది.
ఎప్పుడూ ఇంటినుంచి కాళ్ళు బయట పెట్టని తల్లి వీరావేశంతో అడుగులు వేస్తుంటే ఆ పిల్లవాడు అమాయకంగా అనుసరించాడు.

 ఊర్లో మనుషుల కట్టుబొట్టు అలంకరణలు మారాయి. పంచెకట్టు తో ,భుజాన తువ్వాలు తో ఉండే పాత కాలపు పెద్ద మనుషుల సంఖ్య తగ్గిపోయింది. జీన్స్, టీషర్ట్స్ తో యువతరం మారిపోయింది. దారి పొడుగునా ఒకరినొకరు పలకరించుకుంటూ వెళ్తున్నారు. బయటికి రావడం అలవాటు లేని ఆమె తప్పు చేస్తున్నట్టు నక్కినక్కి తలొంచి అడుగులు వేస్తోంది.

ముందు పోలీసులతో నిండిన రెండు మూడు వ్యాన్లు పోతున్నాయి. ఆ వెనుక కాలినడకన కొందరు పోలీసులు లాఠీలు ఝడిపిస్తూ జనాన్ని అదుపు చేస్తున్నారు.
ఆనాడు దసరా పండగ…. దేశమంతటా గొప్ప కోలాహలం సంచలనం హడావిడి. రావణాసురుడి వధ. అంటే చెడు పై మంచి గెలుపు. కాదు. మంచి పై చెడు గెలుపు. అది కూడా కాదు. అసలు ఏది మంచి.. ?ఏది చెడు..’?
రేణుక ఆలోచిస్తూ అడుగులు వేస్తుంది.
రావణాసురుడి రూపంలో ఆమెకు భర్త విశ్వనాథ్ కళ్లముందు కదిలాడు. రాక్షస క్రూరత్వం తో కనిపిస్తున్నాడు. దసరా పండగ సందర్భంగా తాగిన బృందమంతా రావణాసురుని బొమ్మను దగ్ధం చేయటానికి అక్కడ ప్రత్యక్షం. అది లేనివాళ్లంతా ఇంట్లో కుటుంబీకులతో విజయదశమి వేడుకలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఆమె ఆ గుంపులో కొడుకు తో పాటు ఒక ప్రక్కగా నిలబడింది. చెడుపై చెడుగెలుపు ఎలా ఉంటుందో అతని చూపుల్లోంచి ఆమెకు ప్రసారమవుతున్నాయి.అయినా చూడాలని ఎన్నడూ లేని తపన ఆమెకు.
అంటురోగాల కు వికటాట్ట హాసాలకు వికృత చేష్టలకు చేవ తీరినఅతడి శరీరం పొడుగ్గా సన్నగా మండుతున్నకావడాలా ఉన్నాడు. తప్పతాగి తూలుతున్న అతన్ని తనివితీరా చూసింది. అక్కడ చేరిన సంఖ్య పెరుగుతోంది.
కొందరు సర్దుకుని విశాలమైన అరుగుల మీద కూర్చుంటే మరికొందరు గోడలకు చేరగిలబడి , ఇంకొందరు గుంజలకానుకుని చూస్తూ నిలబడి ఉన్నారు.
తన భర్త. పెద్దపులి …వీధి లో వస్తుండగానే పంజా విసురుతున్న శబ్దం తరువాత వళ్ళు వాచిపోయేలా దెబ్బలు. కోపం,భయం, జుగుప్స లతో కూడిన భావన ఆమె శరీరంలో నరనరాన ప్రవహించింది. అందరిలో ప్రత్యేకంగా గౌరవించ బడాలని తలకిందుల ప్రయత్నిస్తున్న అతన్ని చూస్తే హాస్యాస్పదంగా అనిపించిందామెకు.రావణకాష్టం మండుతోంది ఆకాశాన్నంటుకుని. ఢాం…ఢాం…ఢాం.. భూ.నభోంతరాలు దద్దరిల్లే బాంబులశబ్దం. రావణాసురుని బొమ్మలో ప్రతీ అవయవం పేలిపోయి కూలిపోతున్నాయి. అతడి శరీరంలో అవయవాలు కూడా కుప్పకూలుతున్నట్టనిపించింది ఆమె కళ్ళకు. గత రెండు దశాబ్దాలు పొరలు పొరలుగా పేరుకున్న మాలిన్యపుపెంకులు వాటంతటవే పగిలి రాలి ఆ రావణ కాష్టం లో పడి తగులబడుతున్నాయి. ఆ వెకిలి నవ్వులు,కళ్ళల్లో కాఠిన్యం, మొహంలో అహంభావం, ఎదుటి మనిషి పై చూపే నిర్లక్ష్యం ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అశ్లీల భాష, మానవ ద్వేషంతో కూడుకున్న పరాచికాలు, వికృత చేష్టలు, తాగి తూలుతున్న శరీరావయవాలు ఒక్కొక్కటి …ఒక్కొక్క టి… పడిపోతున్నాయి. మంటల్లో పడి కాలి బూడిద అయిపోతున్నాయి. చివరకు అస్తిపంజరం మిగిలిపోయి ఊగిపోతుంది. ఆ ఎముకల గూడు కూడా తాగి తందనాలుఆడుతున్నట్టే నిలువలేక తూలుతూ ఆ మంటల్లో కూలిపోయింది. ఆమె కళ్ళు బైర్లు కమ్మాయ. చావు అన్నది ఒట్టి భ్రమలు తోచింది. అంతా ఉన్నట్టే .తనచుట్టూ కళ్ళకు కనిపించనంత మాత్రాన లేనట్టా .మృత్యువు తను జయించినట్లే అమరత్వంతో ప్రత్యక్షమవుతుంది ఆమె కళ్ళకు.
ఇప్పుడతడు లేడు. ఆ మంటల్లో కూలిపోయాడు. ఆ పొగలో పారిపోయాడు. పీడా పోయింది. “రా కొడకా .ఇంటికి పోదాం. మీ ..నాన్న ..చచ్చిపోయాడు .మీ నాన్న… చచ్చిపోయాడు. “నిజంగా చచ్చాడు. తన భర్త. తన భర్తే. అయినా సుఖ పడటానికి రాత ఉండాలిగా. మనిషిగా బ్రతికే గీత ఉండాలిగా. అతడు చావాలని తనకేమైనా ఇష్టమా.. ఆ మనిషి చుట్టూ ఎన్ని జీవితాలు ,అనుబంధాలు , బంధాలు ఉన్నాయో తనకు తెలియదా.. అయినా ఆయన లేడని తనెందుకు ఏడుస్తుంది ??. బతికున్నప్పుడు ఏంసుఖపడింది తను.? ఏ అనుభూతులతో నిమిత్తం లేకుండా రెండు మాంస ఖండాలు ఒకే చూరు కింద బ్రతికాయిన్నాళ్ళు.అతను ఇప్పుడు చనిపోయాడు. మరి తను.. ఎప్పుడో చనిపోయింది. రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది.
తల్లి తో పాటు వళ్ళు తెలియకుండా ఇంటికి వచ్చిన పిల్ల వాడు జరిగింది ఏది అర్థం కాక బిక్క మొహం వేసుకొని తల్లి ఒడిలో తలదూర్చి భయం భయంగా చూస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియక కొడుకు మొహం లో చూస్తున్న ఆమె ఒక్క సారి ఉలిక్కి పడి గావుకేక వేసింది. ఎదురుగా కాలిపోయాడనుకున్న రావణాసురుడు. అయితే తను చూసిందంతా భ్రమేనా..? బాగా ఉబ్బరించిన మొహం. మెడ మీది దాకా జుట్టు. ఆ మొహంలో అదే కుత్సితం. ఇవాల్టి కోసం కొనుక్కున్న కొత్త చెప్పులు స్వచ్ఛంద సేవకుడిలా తెల్లలాల్చీ, పైజామా. చాలా ఖరీదైన బట్టలే.. పండుగ కదా చెడు పైన విజయ పతాకం ఎగిరే సే ధర్మ చక్రాన్ని ధరించిన దుర్మార్గుడు కదా.
” మీరు తక్షణం బయటికి వెళ్ళండి ఇక్కడి నుండి వెళ్లిపోండి.”
అతడు వెకిలిగా నవ్వుతున్నాడు.
“వెళ్తారా? లేదా? వెళ్ళనంటే నేనే వెళ్తాను , వెళ్ళా నంటే తిరిగి రాను.”
ఆమె ఆచితూచి పలుకుతోంది. గొంతెత్తి మాట్లాడడం అలవాటు లేని ఆమెకుఇబ్బంది కలిగినా గట్టిగా అరుస్తోంది. “వెళ్ళిపోండి.వెళ్ళండి..” అదే మాట మళ్లీ మళ్లీ.
అతనికి చెంప దెబ్బ కొట్టినట్లయింది. ఇన్నేళ్ళలో ఎన్నడూ ఈ విధంగా మాట్లాడలేదామె. అతడు ఖంగు తిన్నాడు.
“ఎక్కడికి వెళ్తావో అడగొచ్చా?.నిన్ను?”
ఆమెకు కోపంతో ముఖం ఎర్రబడింది.
ఇన్ని రోజులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ తిరిగావో, ఏమేం చేయకూడని పాపాలు చేశావో నేను ఎన్నడైనా అడిగానా?.. చేసే పాపాలన్నీ కప్పిపుచ్చి అబద్ధాల మాటలు చెబుతున్నా నిన్ను ఏమీఅడగాలని, తెలుసుకోవాలని ఏనాడూ అనిపించలేదు. ఇంటిలో భార్యా పిల్లలతో గడపాల్సిన సమయాన్ని దొంగతనంగా దొంగచాటుగా ఎక్కడ గడుపుతున్నావని , ఏం చేస్తున్నావని అసహ్యం వేసే అడగలేదు. చాలా.. ఇంకేమైనా చెప్పాలా. నన్ను ఒక్క ప్రశ్న అడిగే అర్హత కూడా నీకు లేదు. నా దారిన నన్ను పోనీయ్..”
“నీకేదో పిచ్చి పట్టింది. నువ్వు గడపదాటితే ఊర్లో ఒక ముఖ్యమైన నాయకుడిగా నా పరువు ఏమి కావాలి?.”
“ఓహో నీకో పరువూ, ప్రతిష్టలు కూడానా?. ఎక్కడ …ఎక్కడుందో చూపెట్టు?. ఆ పని ఈ పని చేస్తానని అమాయకులను మోసంచేసి దోచుకొని కట్టుకున్న ఈ అద్దాలమేడలోనా. మీ బ్యాంకు బ్యాలెన్స్ లోనా.. మీ విలువైన కార్ లోనా.లేక మీ సూటూ బూటు లోనా…? ” ఆమె విరక్తిగా నవ్వింది. కట్టుకున్న నన్నే ఎన్ని హింసలు పెట్టావ్. నన్ను ఎన్నడైనా మనిషిలా చూశారా.? ఇంట్లో ఉన్నప్పుడైనా కారణం లేకుండానే పిల్లల్ని కసిరించడం. మీఅమ్మ చచ్చిఏలోకాన ఉందో. ఆమె బ్రతికున్నప్పుడు కొంచెం ధైర్యమైనా ఉండేది నాకు. ఆమె కూడా పోయి నీకు అడ్డు చెప్పే వాళ్ళు లేకుండా అయిపోయింది. ఇన్నాళ్లూ నన్ను కాల్చుకుతిన్నావు. చివరికి క్రూరమృగంలా నన్ను నా బిడ్డల్ని చావు దెబ్బలు కొట్టి చంపాలనుకున్నావు.” ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండుతున్నాయి. గొంతు వణుకుతోంది. అయినా మాట్లాడుతూనే ఉంది.
ఎన్నో ఏళ్లుగా నన్ను నేను అనుక్షణం శోధించు కుంటూ నిప్పులాంటి బాధతో ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నాను. కానీ, ఏ మేరకు బయటపడగల్గాను.??”
నా బిడ్డ లు ఇద్దరి దృష్టి నా మీదే !నాకు జబ్బు చేస్తే పిల్లలిద్దరూ ఆటపాటలు చదువుసంధ్యలు వదిలేసి నాకు పరిచర్యలు చేసేవాళ్ళు.నువ్వే రోజైనా కనీసం ఎట్లా ఉన్నావ్ అని అడిగావా?. అంటే ఇన్నాళ్ళు నేను నా పిల్లలు ఉనికిని కోల్పోయి నీ ఇంట్లో బతికాం. నా మనసులోని శూన్యతను కనిపెట్టిన నా పెద్ద కొడుకు “అమ్మా! నేను పెద్దవాడిని అయ్యాక నిన్ను ఏడవనీయను.”అని అనడం,అమాయకంగా వాడిలోని భయాన్ని అణగతొక్కుకుని నాకు ధైర్యం చెప్పాలనే వాడి ప్రయత్నం.
అంతేగానీ
పెళ్లి చేసుకున్న నాటి నుండి నువ్వు చేసిన అఘాయిత్యాలు ఒకటా.. రెండా.. వర్షం కురుస్తుంటే చూడడం ఇష్టమని కిటికీలో నుండి చూస్తే ఆ విధంగా చూడొద్దని గొంతు చించుకొనిఅరిచి కిటికీ మూసేయడం, ఇంకెంత సేపు నీళ్లు తాగుతావని ,ఇంకెంత అన్నం తింటావ్ అని ,అక్కడ ఎందుకు నిలబడ్డావని, అన్నీ నీ అదుపాజ్ఞలే. అన్నిటికీ తలవొగ్గాను. ఎందుకో… ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పటికైనా తాగుడు మానుతావని. మారుతావని.. కాని రోజురోజుకు రాక్షసుడిలా మారావు.
నా ఏడుపు చూడలేక ఏం చేయలేక నీతో మాట్లాడే ధైర్యం లేక నిస్సహాయంగా నా పెద్దకొడుకు ఇల్లు వదిలి పారిపోయాడు. ఎక్కడున్నాడో ,ఏమయ్యాడో తెలియక చిత్రవధ అనుభవిస్తుంటే ఏ అర్ధరాత్రో తప్ప తాగి వచ్చి నీ చిన్న కొడుకు ఉన్నాడా. పారిపోయాడా అని వికటాట్టహాసం చేస్తావా ?నువ్వా తండ్రివి. అసలు నువ్వు మనిషివేనా?!.
తండ్రీ కొడుకులకుండాల్సిన బంధం లో ఒక సన్నపొరైనా నీలో ఉందా? అసలు నీ కొడుకు ల తో నీకు పరిచయం ఉందా? ఆలోచించు. “మగదిక్కు లేక ఒంటరిగా కష్టపడుతున్న నా తల్లి కోటీశ్వరుడివైన నీ కొడుకుని చేరదీసి తన రెక్కల కష్టంతో వాడిని పెంచుతున్నది.అక్కడ వాడు ప్రశాంతంగా ఉన్నాడు. అసలు వాడు బతికే లేడనుకొని
హాయిగా ఊపిరి పీల్చుకునే నీలాంటి కసాయి తండ్రి లోకంలో మరొకడు లేడు.ఉండడు.

“అమ్మా.!నీకు పులి , వేటగాడు బొమ్మలున్న చీర కొని పెడతా అనే వాడు నా కొడుకు. అంటే ఆ చిన్న మనసులో నువ్వు ఒక వేటగాడివి. నీచుడివి. వాడికే కాదు నీకు తెలిసిన ప్రతి వారిలో నీపై ఇదే అభిప్రాయం. నువ్వనుకుంటున్న నీకున్న గౌరవం ఇదే.
ఇవాళ కాల్చిన ఆ రావణాసురుడి బొమ్మ తగిలేయడానికి చుట్టూ ఉన్నది నీలాంటి తాగుబోతులే. భార్యా పిల్లల్ని పీల్చిపిప్పి చేసే విలాస అసురులే. ఆనాడు సీతమ్మను తీసికెళ్ళిన రావణునికి ఈనాడు కట్టుకున్న భార్యను నట్టేట ముంచిన దుర్మార్గ రాక్షసులకు కాలే రోజు తప్ప, కాల్చే రోజు కాదిది.”
ఇంతసేపూ తను చెప్పిందంతా తలొంచుకొని కూర్చొని నిజమే అన్నట్టు వింటూవున్న అతన్ని చూస్తే ఆమెకు కొత్తగా ఉంది. మనసులో ఏమూలో ఇంకేమీ అనకూడదు అనిపించింది.వీటన్నింటికీ కారణం నీ తప్పతాగే అలవాటే. అదే నీతో ఈ పాపాలన్నీ చేయిస్తోంది. పశువుగా మార్చేస్తుంది.అది మానేస్తే మనిషి వౌతావు. అని అంటూ ఆమెకు తెలియకుండానే అలాగే మంచం మీద ఒరిగిపోయింది. కాసేపటికి కళ్లు తెరిచి చూస్తే గ్లాస్ లో మందు వంచుతున్న అతడు. ఇదే ఆఖరి డోస్ ఇక జన్మలో దీని మొహం చూడను. పలుసార్లు తనలోతను గొణుక్కుంటూ ఒక్కోసారి పెద్దగా అంటున్నాడు. ఆమె మరొక సారి కళ్ళు నలుపుకుని చూసింది. అతని మొహం లో ఏదో ప్రసన్నత. నిజమా.. ఇది కూడా భ్రమనా?.. ఆమె అతడ్నలాగే చూస్తూ కూర్చుంది అతడు తలదించుకుని నేల చూపులు చూస్తూ చేతి వేళ్ళ మధ్య ఉన్న సిగరెట్ ను వేళ్ళతో నలుపుతున్నాడు. అప్పుడప్పుడు తన వైపు చూస్తున్న అతని కళ్ళల్లో నీళ్లు. ఇప్పుడామెకు అతడు ఒక యోగిలా కనిపించాడు. ఆమె ఆలోచనలో పడింది. యుగాల చరిత్రను మననం చేసుకుంది. త్రేతాయుగంలో రాముడు అంటే మంచి. రావణాసురుడంటే చెడు. అందుకే చెడుపై మంచి విజయం. కాని కలికాలంలో ప్రతి మనిషిలో మంచి చెడు కలిసి ఉన్నాయి. అందుకే ఏ మనిషికామనిషి తనలో ఉన్న చెడుపై తనలోనేవున్న మంచి దాడి చేయాలనే పరివర్తన రావాలి. అప్పుడే వ్యవస్థ కూడా క్రమక్రమంగా మారుతుంది. అలాంటి పరివర్తన తన భర్త లో కలిగే‌లావుంది. కలిగిందనేది అతని మౌనంలో ముఖంలో కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది. లోకంలో ఎంతోమంది ఇలాంటి వ్యసనానికి బలైపోయిన వాళ్లకందరికీ ఇలాంటి పరివర్తన కలిగినప్పుడే వారి వారిఆడవాళ్ళకు నిజమైన ఆనందం. అభివృద్ధి. పండుగ దినం. భగవంతుడా! ఇప్పుడున్న వ్యవస్థ మారాలంటే ఎవడికి వాడు మారటం తప్ప ఎవరో వచ్చి ఏదో చేసేదికాదు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె తృప్తిగా ఊపిరి పీల్చింది.
కారే కన్నీళ్ళను లాల్చీ చివరతో తుడుచుకొంటూ వణికే చేతులతో సిగరెట్ నోట్లో పెట్టుకొని గబగబా వీధి లో కెళ్ళి అటు ఇటూ చూస్తూ ఒక్కసారి గుండెల నిండా పొగ పీల్చి వదిలి దాన్ని దూరంగా విసిరికొట్టి లోపలికి ఉరికినట్టుగా వచ్చాడు విశ్వనాథం. మంచం మీద ఒరిగి నీళ్ళు నిండిన కళ్ళను మూసుకున్నాడు. నిద్రలో తాను దేవుడిలా రావణుడిని హతమారుస్తున్న రాముడిలా తనలోని రాక్షసత్వానికి దుర్వ్యసనాలకు నిప్పంటిస్తున్న కల………….

You may also like

Leave a Comment