Home కవితలు నిర్జల నిధి

నిర్జల నిధి

by Ammangi Venugopal

చరిత్ర భూగోళాల మీద ప్రవహించిన నదీ!

అక్షాంశ రేఖాంశాల మీద పొంగి పొరలిన నదీ!

నిరుడు నింగనీ నేలనూ ఒకటి చేసిన నదీ!

ఊళ్ళ కూళ్ళను అష్టదిగ్బంధనం చేసిన నదీ!

ఇప్పుడు ఈ ఎండల్లో

తల్లడిల్లుతున్నావు ఎండిపోయిన డొక్కలతో

నీ దాహం తీర్చుకోవటానికి నీ నీళ్లే నీకు సరిపోవు

ఇసుక మీద ఈదలేక చీదరించుకుంటున్నై చేపలు

పెయ్యి తడుస్తలేదని తిట్టుకుంటున్నై ఊరపిచ్చుకలు

ఒక్క పుక్కలింతకు కూడా సరిపోవని

తిరిగిపోతున్నది చీనులబారు

ప్రతిబింబాలు చూసుకునేందుకు చారెడు నీళ్లులేని

బెంగళూరు నుండి వలసపోతున్నై పావురాలు

అలల హోరు నశించి

ఇసుక లారీల జోరు పెరిగిన వేళ

నెలల క్రితం తలలు ప్రదర్శించిన తాళ్లు

నేడు నిలబడ్డాయి దిసమొలతో

నిరుడు భయంతో మబ్బుల చాటున దాక్కున్న సూర్యుడు

నేడు ఉష్ణ మండల సమ్రాట్టై ఏలుతున్నాడు నేలను

ఇంకా రెండు డిగ్రీల ఎండ పెరిగితే

ఈ ఇసుక తిన్నెలు వేగి వేగి పేలాలవుతయ్

నదీ!

ఏమైంది పిల్లకాల్వలకు గిలిగింతలు పెట్టిన నీ సరసం?

ఎక్కడ పోయింది ఉపనదులతో సంగమించిన నీ పౌరుషం?

ఏది మరి కంటి సైగతో పంటకాల్వలను సారించిన రాజసం?

ఇసుక గడియారంలో కాలం స్తంభించిన వేళ

ఎండ మావులు చేసే గ్రాఫిక్స్ నమ్మకు

ఈ రోజుు నీవు భూమి గీసుకున్న దారిద్ర్యరేఖవు

పుట్టినచోట ఉత్తరీయమంతైనా లేని నీవు

ఎట్లా ప్రవహిస్తావు కడలి అంచుల దాకా?

నదీ! నిర్జల నిధీ!!

You may also like

Leave a Comment