వేలు పట్టుకుని నీతో నేను నడవాలని
నీ గొప్పతనం తెలిసినప్పటి నుంచీ కోరిక
అదేమిటో అసహనమో
ఆధిపత్యమో
ఇలా విదిలించుకుని అలా
గోడకు వేలాడే క్యాలెండర్
చెట్టువై
ఒడిసిపట్టుకుందామనుకున్న
రోజుల ఆకుల్ని విదిలిస్తూ వదిలేస్తూ
నవ్వుతూ
ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోతావు..
నేననుకుంటాను..
నీతో నేను ఆగకుండా నడిచి
జయించిన విజయాలేవో గతం సంచిలో
అపురూపంగా దాచుకుని
మురుద్దామనీ..
చేయి ఎప్పుడు వదుల్తావో తెలీదు
ఓ బద్దక నేస్తం నాతో ముచ్చటించినప్పుడో
ఓ నిర్లక్ష్యం నన్ను నీడలా వెంటాడి లోబరుచుకున్నప్పుడో…
కనీసం ఓ హెచ్చరిక అలారమైనా మోగించకుండా
నన్ను మోసగించి వెళుతూ ఉంటావని ఉక్రోషంతో..
అంతరంగం ముందు నిన్ను నిలదీయిస్తే
ప్రభాత కిరణాల సాక్షిగా
నిశీధి వెలిగే చుక్కల ముందు
చిత్రంగా నన్నే దోషిని చేస్తావు…
నాకంటూ ఓ రోజు రాకపోతుందా
ఏకాగ్రతతో నిన్నే ధ్యానిస్తే
ఏమరుపాటుగా నైనా నిన్ను వదలకుండా ఉంటే…
ఏదో ఒకటి సాధించి
రాలిపోయే రోజుపై చెరగని సంతకమొకటి చేయకపోతానా
నీవిచ్చిన ఈ తరపు కానుకనై మిగలక పోతానా..
కాలమా!…అప్పుడు నువ్వే
నా జయంతినో వర్ధంతినో
కొందరికైనా గుర్తొచ్చేలా చేస్తావు..
నీపై నాకా నమ్మకం ఉంది
1 comment
సునంద గారి కవిత కాలంతో మనిషి అనుబంధాన్ని చక్కగా స్పృశించింది. అభినందనలు.