“ఏందే మంగీ ఉరికొత్తాన్నవు, ఏమైంది” అడిగింది పక్కింటి రాజవ్వత్త.
మంగ రాజవ్వ మాటలు వినిపించుకోకుండా ఇంట్లోకి పరుగెత్తింది. రాజవ్వ మంగ వెనుకే వెళ్లింది. మంగ నేల మీద కూర్చొని ముఖాన్ని రెండు మోకాళ్ల సందులో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడవ సాగింది.
“ఏమైందే మంగీ ఎందు కేడుత్తాండవు” అంటూ రాజవ్వ మంగ తల నిమురుతూ ప్రక్కనే కూర్చుంది. మంగ అమాంతం రాజవ్వను కౌగిలించుకొని ఏడుపు ఉధృతం చేసింది.
“ఏమైందో చెప్పకుంట ఏడిత్తేం లాభం, పొలం కాడ మీ నాయిన గాని నిన్నేమైన అన్నడా?” అడిగింది రాజవ్వ.
“లేదత్తా మా నాయిన ఏమన్లేదు, పొద్దు మూకుతుందని నన్ను జల్ది ఇంటికి పొమ్మన్నడు, పన్లు చూస్కొని ఎనకెంబడి వస్తనని శెప్పిండు. నేను ఇంటి కాడికి ఒక్క దాన్నే వస్తాంటే నారాయణ మామ చల్క కాడికి రాంగనే మన ఉప సర్పంచు శంకరి గాడు నాకు అడ్డం తిరిగిండు. ‘నాతో పండుకో నిన్ను లగ్గం చేసుకుంట’ అని నా చెయ్యి పట్టుకొని గుంజిండు. నేను ఆన్ని బాగ తిట్టిన. నన్ను తోస్తే నేను కింద పడ్డ. నా మీద పండుకోనికి ప్రయత్నం చేసిండు, నేను ఆన్ని తోసేసి పోలీసులకు చెప్త అని ఉరికొస్తాంటే, ‘ఈ ముచ్చట ఎవల్లకైన చెప్పితే సంపుత’ అని బెదిరించిండు” ఏడుస్తూ చెప్పింది మంగ.
“పోనీలే బిడ్డా ధైర్నం చేసి తప్పించుకొని ఉరికొచ్చినవు. ఆడు ఆని పెండ్లాన్నే తిట్టి కొట్టి ఎల్ల గొట్టిండు, రెండేండ్ల సంది కాపురం శెయ్యట్లేదు. ఆడు మంచోడు కాడని తెలిసీ మనూరూల్లేమో ఓట్లేసి ఆన్ని ఉప సర్పంచ్ జేసిండ్రు. ఆని పాపాన ఆడే పోతడు లే బిడ్డా, అంతా మరిశిపో. మీ నాయినకు గీ ముచ్చట జెప్తే శంకరి గాని తోటి పంచాతీ పెట్టుకుంటడు , రచ్చ రచ్చ అయితది ఊళ్లె, అసలే పెండ్లి కావలసిన పిల్లవి నువ్వు” అంటూ మంగని ఓదార్చి వెళ్లింది రాజవ్వ.
*****
మంగ ఎనిమిదో ఏట తల్లి దీర్ఘ రోగంతో చనిపోయింది. చనిపోయి ఎనిమిది సంవత్సరాలైంది. ఈ ఎనిమిది సంవత్సరాలు తండ్రి నర్సింలు అన్నీ తానై మంగను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పక్కింటి రాజవ్వత్త అప్పుడప్పుడు చిన్నా చితకా సహాయం చేస్తుంది. మంగ ఐదవ తరగతితో చదువు ఆపేసింది. ఉన్న ఎకరం పొలం పనులు తండ్రి చూసుకుంటుంటే తను వంట పనులు బాగానే నేర్చుకుంది. పొలం పనుల్లో తండ్రికి సాయం కూడా చేస్తుంది. రైతుబంధు సాయం, వ్యవసాయం మీద వచ్చే కొద్ది పాటు ఆదాయం తోటి రెండు గదుల ఇంట్లో తండ్రీ కూతురు గుట్టుగా జీవనం సాగిస్తున్నారు. మంగను తన చెల్లెలి కొడుకు రవికి ఇచ్చి పెళ్లి చేయాలని నర్సింలు ఎప్పుడో నిర్ణయించుకోవటం, చెల్లె, బావ కూడా అందుకు సుముఖత వ్యక్త పరచటం జరిగింది. మంగ చామన ఛాయతో పొందికగా ఉంటుంది. మేనత్త కొడుకు రవి ఒడ్డు పొడుగు ఉండి తన ఊర్లోనే గ్రామ పంచాయితీ ఆఫీసులో చిన్న పాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరి ఊర్లకు ఇరవై కిలో మీటర్ల దూరమే.
*****
“అమ్మా మంగా అన్నం వండినవా బిడ్డా” చీకటి పడ్డాక పొలం నుండి తిరిగి వచ్చిన నర్సింలు అడిగాడు.
“లేదు నాయినా, పొయ్యి మీన అచ్చరు పెట్టిన, నువ్వు కాళ్లు మొఖం కడుక్కో, అప్పటికి అయిపోద్ది” భరోసా ఇచ్చినట్టుగా చెప్పింది మంగ.
“పొద్దటి కూర ఉందా బిడ్డా”
“లేదు నాయిన, చింతపండు పచ్చడి ఉంది” అంటుండగానే రాజవ్వ స్టీలు గిన్నెతో వచ్చింది.
“అన్నా, టమాటా ఆలుగడ్డ కలిపి కూర చేసి తెచ్చిన, ఇద్దరు తినుండ్రి” అంటూ గిన్నె కింద పెట్టింది.
రాజవ్వ మంగ దగ్గరికి పోయి “మంగీ మీ నాయినకు గాని శెప్పినవా ఏంది ముచ్చట” అని నెమ్మదిగా అడిగింది.
“లేదత్తా నాయిన ఇప్పుడే అచ్చిండు” అని అంటుండగానే అక్కడికి వచ్చిన నర్సింలు “ఏం ముచ్చట బిడ్డా” అన్నాడు.
“ఏం లేదులే అన్నా, నేను పోతున్న, నిమ్మళంగ తినురి” అంటూ వెళ్లి పోయింది రాజవ్వ.
“ఏంది బిడ్డా రాజవ్వత్త ఏందో ముచ్చట అంటాంది”
“ముందగాల నువ్వైతే అన్నం తిను” అన్నది మంగ.
మంగ వడ్డించిన అన్నం రాజవ్వ తెచ్చిన కూరతో తిని నర్సింలు చెయ్యి కడుక్కున్నాడు. మంగ కూడా ప్లేట్లో అన్నం వడ్డించుకొని తినటం ముగించింది.
“మంగీ నువ్వు, రాజవ్వత్త ఏదో ముచ్చట అనుకోబడ్తిరి, ఏంది బిడ్డా గది” అడిగాడు నర్సింలు.
“పొలం కాడి నుండి వస్తాంటే ఉప సర్పంచ్ శంకరి గాడు అడ్డం తిరిగిండు నాయినా , నా చెయ్యి పట్టుకొని గుంజితే నేను కింద పడ్డ, ఆడ్ని వదిలించుకొని వస్తాంటే ఎవళ్లకైన చెప్తే సంపేస్తనని బెదిరించిండు. నాకు మస్తు భయమైంది.” చెప్పింది మంగ.
“ఆనికి పోయే కాలం వచ్చింది, తిరుపతయ్య బిడ్డ రాణిని కూడ గిట్లనే చేసిండంట నెల రోజుల కింద. రేపు సర్పంచి శోభ కాడికి ఆన్ని పిలిపిత్త. పెద్ద మనుషులల్ల పంచాతి పెట్టిత్త” అంటూ నులక మంచం మీద నడుం వాల్చాడు నర్సింలు.
*****
మరుసటి రోజు పదకొండు గంటలకు సర్పంచ్ శోభ ఉప సర్పంచ్ శంకర్ ను పంచాయితీకి పిలిపించింది. వార్డ్ మెంబర్ కనకా చారి, మండల ప్రాదేశిక సభ్యుడు రాములు, నర్సింలు, మంగ, ఇంకా కొంత మంది ఊరి జనం హాజరయ్యారు. మంగ తనపై శంకర్ చేసిన అత్యాచార యత్నం గురించి అందరి సమక్షంలో చెప్పింది. శోభ, కనకాచారి, రాములు తనపై మంగ చేసిన ఆరోపణకు సమాధానం చెప్పాల్సిందిగా శంకర్ ను ప్రశ్నించారు.
ఆవేశంతో రెచ్చిపోయిన శంకర్ కూర్చున్న వాడల్లా అమాంతం లేచి “నేను తప్పు చేయలేదు, నన్ను పంచాతీకి పిలిచి నా మీద జూటా ఆరోపణ చేసినందుకు ఉల్టా నాకే పది లక్షల రూపాయలు నష్ట పరిహారం కింద ఇయ్యాలని కోర్టులో కేసు ఏస్తా” అంటూ విసరుగా బయటకు వెళ్ళిపోయాడు. అతన్ని ఆపడానికి కనకాచారి, రాములు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
“తప్పు చేసినోడు ఒప్పుకోకుంట ఎల్లిపోయిండు. పెద్ద మనుషులు మీరేం తీర్మానం శేస్తరో శెప్పండి” అంటూ నర్సింలు సర్పంచ్ శోభ వైపు చూస్తూ అడిగాడు.
“నర్సిములన్నా, అసలు మనిషి లేకుండ ఏమి తీర్మానం అయితది నువ్వే చెప్పు. మేమేదన్న చెప్పాలన్న శంకర్ ఉండాలే కదా.”అన్నాడు రాములు.
“నువ్వన్నది నిజమే రాములు, మంచో చెడో చెప్పాలి మనం. సర్పంచమ్మా నువ్వే ఆలోచన చెయ్యి” పంచాయితీ అయిపోయిందన్నట్టు లేచి నిల బడి అన్నాడు కనకాచారి.
“ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఊరుకుంటే మళ్లీ మళ్లీ జరగదని నమ్మకమేంది. నర్సింలూ, నువ్వు, నీ బిడ్డ పోలీసు స్టేషనుకు పొయ్యి దరఖాస్తు ఇయ్యుండ్రి, వాండ్లే తేలుస్తరు” అంటూ శోభ కూడా లేచి నిలబడింది.
“దరఖాస్తు ఇస్తం, కానీ శంకరి సంపుత అని బెదిరించిండు. మా పాణానికి ఆని దిక్కెల్లి ఆపతి ఉంది” నర్సింలు సందేహం వెలిబుచ్చాడు.
“మన జిల్లా కలెక్టరుకు, ఎస్పీకి కూడా ఒక దరఖాస్తు ఇయ్యి” సలహా ఇచ్చింది శోభ.
అదే రోజు నర్సింలు, మంగ పోలీసు స్టేషన్లో రాత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. అదే విధంగా కలెక్టరుకు, ఎస్పీకి సంఘటన వివరాలు తెలియజేస్తూ శంకర్ నుండి ప్రాణభయం ఉందంటూ దరఖాస్తు కూడా ఇచ్చారు. పోలీసు వారు వెంటనే ప్రతి స్పందించి శంకర్ పై అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు.
*******
మరుసటి రోజు పొద్దున్నే విషయం తెలిసిన నర్సింలు చెల్లెలు మణి, బావ వెంకటి మోటార్ సైకిల్ మీద నర్సింలు ఇంటికి వచ్చారు. “అన్నా, మేము ఇన్న ముచ్చట నిజమేనా?” అడిగింది మణి.
“అవును, నిన్న పొలం కాడి నుండి మంగ ఒక్కతి వత్తాంటే శంకరిగాడు అడ్డం తిరిగి శెయ్యి పట్టుకొని గుంజి మనువాడత నన్నడంట. ఆన్ని తోసేసి ఏడ్సుకుంట ఇంటికి వచ్చింది” జవాబిచ్చాడు నర్సింలు.
“నా కొడుకు రవి తోటి దాని లగ్గమని మనం దాని శిన్నప్పుడే అనుకుంటిమి. నాలుగొద్దులు ఉండే పదవిని సూస్కొని శంకరి గానికి మాయరోగం పుట్టింది.” రెండు చేతులను నొక్కుకుంటూ అన్నది మణి.
అంతలోనే శంకర్ నర్సింలు ఇంటికి వచ్చి “ఒసేయ్ మంగా, పోలీసోళ్లకు ఫిర్యాదు చేసినవని తెల్సింది. నేను భయపడేటోన్ని కాను. నిన్ను, మీ నాయన్ను లేపేస్త” అంటూ పెద్దగా అరుస్తూ బెదిరించాడు.
“శంకర్, ఇది మంచి పద్దతి కాదు. తప్పు చేస్తవు ఉల్టా మమ్మల్నే బెదిరిస్తవా.” జోక్యం చేసుకున్నాడు నర్సింలు.
“నిన్ను మామ అని పిలుస్త కదా మరి నీ బిడ్డ నాకు వరుస అయితది. నా మీద దరఖాస్తు ఇయ్యనీకి నేను చేసిన దాంట్లో తప్పేముంది” ప్రశ్నించాడు శంకర్.
“శంకర్, నీకు పెండ్లి అయింది. బిడ్డ ఉంది. ఇప్పుడు ఇట్ల మాట్లాడటం నీకు మంచిగుండది, ఎల్లిపో” జవాబిచ్చాడు నర్సింలు.
“పోలీసోళ్లు గాని నా కాడికి రావాలి అప్పుడు మిమ్మల్ని ఎవరినీ వదిలి పెట్టేది లేదు. అయినా ఉపసర్పంచ్ ను నేను, నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం వాండ్లకు లేదు, అదంతా పోనీ, కేసు వాపసు తీసుకుంటరా లేదా, ఆ ముచ్చట చెప్పు” అన్నాడు శంకర్.
“కేసు వాపసు తీసుకోనీకి నేను గాజులేసుకొని లేను, ఎట్ల అయ్యేదుంటే గట్ల అయితది” అని నర్సింలు అనటంతో “నువ్వన్న మాటకే కట్టుబడి ఉన్నవన్న మాట. నేను చూస్త ఏమైద్దో” అంటూ విసురుగా వెళ్లి పోయాడు శంకర్.
****
నర్సింలు, మంగ ఇచ్చిన దరఖాస్తు నమోదు చేసిన సబ్ ఇన్ స్పెక్టర్ తన సిబ్బందితో గ్రామానికి వచ్చి సాక్షులను విచారించి, నేరస్థల నమూనా గుర్తింపు తీసుకొని, శంకర్ ఇంటికి వెళ్ళాడు. కేసు నమోదు చేసిన విషయం చెప్పి తనను అరెస్ట్ చేయటానికి వచ్చినట్టుగా చెప్పాడు.
“సబ్ ఇన్ స్పెక్టర్ గారూ, జూటా కేసు పెడితే అరెస్ట్ చేస్తర, నేను ఉప సర్పంచ్ ను, నేను లేకుంటే గ్రామంలో పనులు ఆగి పోతయి. నన్ను అరెస్ట్ చెయ్యనీకి కలెక్టరు కాడ మీరు అనుమతి తీసుకున్నరా” మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రశ్నించాడు శంకర్. అతని మనసులో మాత్రం ఓ పక్క భయం, ఆందోళన కలుగుతుంది.
“సాక్షులను విచారించి నిర్దారణకు వచ్చాను. ఈ కేసులో నిన్ను అరెస్ట్ చేయటానికి నాకు ఎవరి పర్మిషన్ అక్కర లేదు. అరెస్ట్ చేశాక ఏమైతదో నువ్వే చూద్దుగాని.” సమాధానం చెప్తూనే శంకర్ ను కస్టడీలోకి తీసుకున్నాడు సబ్ ఇన్ స్పెక్టర్. మరుసటి రోజు అతడ్ని కోర్టు ముందు ప్రవేశ పెట్టడంతో పద్నాలుగు రోజుల కస్టడీ విధించింది కోర్టు.
సబ్ ఇన్ స్పెక్టర్ అదే రోజు శంకర్ అరెస్టు, తదుపరి కోర్టు విధించిన కస్టడీ విషయం తెలియపరుస్తూ జిల్లా కలెక్టరుకు, ఎస్పీకి నివేదిక పంపటం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టరు సర్పంచ్ శోభ నుండి కేసుకు సంబంధించిన పూర్వా పరాలపై వేరొక నివేదిక తెప్పించుకొని శంకర్ ను ఉప సర్పంచ్ పదవి నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను జైలు అధికారుల ద్వారా శంకర్ కు అందచేయటం కూడా జరిగింది.
******
నెల రోజుల జైలు జీవితం పిదప శంకర్ బెయిలుపై విడుదలయ్యాడు. భార్య లతను పుట్టింటి నుండి తెచ్చుకోవాలన్న అతని ప్రయత్నం ఫలించలేదు. అత్త, మామలు తమ ఇంటి గడప తొక్కనీయలేదు. బయటి నుండే వెళ్ల గొట్టారు. ఎంత బ్రతిమిలాడినా తన మూడు సంవత్సరాల కూతురును చూడటానికి కూడా ఒప్పుకోలేదు. తనను గృహ హింస, శారీరక, మానసిక వేధింపులకు గురి చేయటమే కాకుండా మంగ కూడా అత్యాచార ఆరోపణ చేస్తూ కేసు వేసింది కాబట్టి కాపురానికి రానని భార్య నిక్కచ్చిగా చెప్పింది. ఊర్లో ఈ విషయం అందరికీ తెలిసింది. నెలలు గడుస్తున్నాయి. ఉప సర్పంచ్ గా ఒక వెలుగు వెలిగి భవిష్యత్తులో సర్పంచ్, వీలైతే ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలనే ఆశతో ఉన్న తనను ఇప్పుడు గ్రామస్తులు ఎవరూ లెక్క చేయట్లేదు. ఎవరినైనా పలకరిస్తే మౌనంగా తప్పుకుంటున్నారు. తన పొలం పనులకు కూడా వెళ్లొద్దని కూలి వాండ్లు తీర్మానించు కున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తాను సామాజిక బహిష్కరణ చేయబడ్డాడు. పొలంలో పండిన పంట చేతికి అందలేదు. వేరే ఆదాయం లేదు. పైరవీల కొరకు జనం దగ్గర తీసుకున్న డబ్బులు పనులు కాక పోవటంతో ఒత్తిడి పెరిగింది. బాగా బతికిన రోజుల్లో మందు మత్తులో తేలిన తను ఇప్పుడు మందుకు డబ్బులు లేక, అప్పిచ్చే నాథుడు లేక సతమతమై పోతున్నాడు. జీవితం రెంటికీ చెడ్డ రేవడి అయింది. ఒంటరి జీవితం దుర్భర మనిపిస్తుంది. అచ్చోసిన ఆంబోతు లాగా తిరిగిన ఊర్లో ప్రస్తుతం ఎవరినీ ఎదిరించ లేని పరిస్థితి. నర్సింలు, మంగ పెట్టిన కేసులో నెల రోజుల విచారణ ఖైదీగా అనుభవించిన జైలు జీవితం పదే పదే గుర్తొస్తుంది. ఇక శిక్ష పడితే జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడటమే కాకుండా ఇతర ఖైదీల మనో వేదన ద్వారా విన్నాడు.
****
కాలాన్ని ఎవరూ ఆపలేరు. పగలూ రాత్రి గడచి పోతున్నాయి. శంకర్ బాగా బక్క చిక్కి పోయాడు. కోర్టులో కేసు తుది అంకానికి చేరుకుంది. మంగ, నర్సింలు, రాజవ్వ, శోభ, కనకా చారి, రాములు, మణి, వెంకటి ఇంకా కొంత మంది సాక్షులను విచారించారు. ప్రతి ఒక్కరూ శంకర్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుందర్ కనీసం ఐదేళ్లకు తగ్గకుండా శిక్ష విధించాలన్న వాదన ముందు శంకర్ నియమించుకున్న న్యాయవాది వెల వెల పోయాడు. తీర్పు వెలువరించే తేదీ ప్రకటించింది కోర్టు. తీర్పు తెలుసుకోవాలనే ఆసక్తితో కోర్టుకు నర్సింలు, మంగ మాత్రమే కాకుండా శంకర్ భార్య లత కూడా వచ్చింది. పలకరిస్తే బాగానే మాట్లాడింది. శంకర్ మనసంతా ఉద్విగ్నంగా, ఆందోళనతో ఉంది. కొన్నాళ్లుగా అతని హృదయం పశ్చాత్తాప పడుతుంది. అదే విషయం భార్యకు చెప్పాడు. కూతుర్ని ఎత్తుకున్నాడు. అతడు వేసుకున్న మాసిన దుస్తుల తీరు, మాటల్లోని ఆవేదనకు లత హృదయం ద్రవించింది. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. ఎంతైనా హిందూ ధర్మ పత్ని కదా. ఇన్నాళ్ల విడతీత ఆమెను కూడా కుంగ దీసింది.
“లతా నాకు శిక్ష పడి జైలుకు పోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకో” అనునయంగా చెప్పాడు భార్యతో. లత ఏమి సమాధానం చెప్పకుండా కళ్ళు తుడుచుకుంటూ తల అడ్డంగా తిప్పింది. కేసు పిలుస్తున్న కోర్టు అటెండర్ కూత వినిపించింది. శంకర్, అతని న్యాయవాది కోర్టు హాలులోకి వెళ్లారు. వెనుకే లత తన కూతురుతో లోనకు వెళ్లింది. ఆ వెనుకే మంగ, నర్సింలు కూడా వెళ్లారు. న్యాయమూర్తి కేసు రుజువైనట్లు తీర్పు సారాంశం చెప్పి, విధించబోయే శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా అని ప్రశ్నించాడు. బోరుమని ఏడ్చాడు శంకర్. నోటి నుండి మాట పెగల్లేదు. అవకాశం తీసుకున్న అతని భార్య మాత్రం శంకర్ లో పశ్చాత్తాపం ఉందని, క్షమించమని వణకుతున్న గొంతుతో న్యాయమూర్తికి చెప్పింది. లతను చూసిన మంగ ధైర్యం తెచ్చుకొని శంకర్ లో బాగా మార్పు వచ్చిందని, గత కొంత కాలంగా భార్యాబిడ్డలు ఎడ బాటుగా ఉంటున్నారని, మారిన మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకొమ్మని ప్రాధేయ పడుతూ భయం భయంగా తనదైన ధోరణిలో చెప్పింది. మంగ ఉదారతను న్యాయమూర్తి ప్రశంసించారు. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదని, లత, మంగల విజ్ఞాపనలు, శంకర్ కూతురు భవిష్యత్తు దృష్ట్యా ఐదు సంవత్సరాలు వేయాల్సిన శిక్షకు బదులుగా ఆరు నెలల సాధారణ శిక్ష మాత్రమే విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అడుగకున్నా కల్పించుకొని మంగ కోర్టుకు చేసిన విన్నపం శంకర్ గుండెల్లో బాగా నాటుకుంది. కోర్టు హాలు నుండి బయటకు వచ్చిన శంకర్ అమాంతం మంగ కాళ్ల మీద పడ బోయాడు. “వద్దన్నా, నువు పెద్దోనివి, నా కాళ్ల మీద పడితే నాకు ఆయుస్సు తగ్గుద్ది” అంటూ పక్కకు జరిగింది. పోలీసు అధికారులు కళ్ల నీళ్ల పర్యంతమైన శంకర్ ను జీపు ఎక్కించుకొని ఆరు నెలల శిక్ష అమలుకు తీసుక పోయారు.
1 comment
శ్రీ మురళీధర్ గారి కథలో మంగ పాత్రచిత్రణ ఆదర్శవంతంగా ఉంది. న్యాయమూర్తి గా చక్కగా చిత్రీకరించారు. నమస్కారములు.