తెలుగు సాహిత్యంలో ఏ ప్రక్రియ తీసుకున్నా దేనికదే తనదైన ప్రత్యేకతతో భాషాభిమానులకు మనోల్లాసాన్ని కలుగజేస్తుంది. పాటలు ఇష్టపడే వారికి పాటలు , పద్యాలు కోరుకునే వారికి పద్యాలు కవిత్వం కావాలనుకున్న వారికి కవితల్లో ఇలా రకరకాలుగా మన అభిరుచికి తగిన అంశాలను చూసే చదివే వినే ప్రయత్నాలు మనం చేస్తుంటాం. సరిగ్గా అటువంటి సందర్భమే నాకు ఎదురైంది… ఇటీవల ఎక్కువ సమయం మా మనవడితో గడపడం వల్ల ధ్యాసంత బాల్యం మీద వాడి ప్రతి కదలిక మీద కేంద్రీకృతమైంది. నాకు అప్పుడే పుట్టిన పసికందుల పాదాలు అరిచేతులు భలే ఇష్టం . ఆ పాదాలను చూడటం అందునా వచ్చే పోయే దారిలో ఏ పసిపిల్లలు కనిపించినా ఈ రోజు దైవ దర్శనం అయింది అనుకునే దాన్ని. ఈ క్రమంలోనే బాబు పాదాలు నా మనస్సును ఒక్క ఊపు ఊపేసాయి…
ఆ పాదాల మీద నేనెన్ని అక్షరాలను చుక్కలుగా పెట్టను.. ఎన్ని పాటలను గుర్తుతెచ్చుకోను.. ఎంత మంది నాలా పాదాలను చూసి పరవశించి వాక్యాలుగా మలిచారో .. ఎందరి దృష్టిలో పాదం ఏ రూపంలో రూపు దిద్దుకుందో.. ఒక్కసారి వారి ఊహలలో నేనూ చేరిపోతే… ఆ ఆలోచనలకు ప్రతిరూపం ఈ రచన.
ఉదయం లేవగానే మొదట మంచం మీద నుంచి భూమి పై పాదం మోపుతూ చదువుకోవలసిన శ్లోకం ఒకటి ఉంది .. సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే । విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే ॥ (భూమి నమస్కారం)
ఓ దేవీ, సముద్రమే వస్త్రంగాకల అమ్మా, పర్వతాలే వక్షఃస్థలంగా కల తల్లీ, విష్ణువుకు భార్య అయిన దానా, నీకు నమస్కారము. నా కాలితో (నిన్ను) తాకటాన్ని క్షమించు.
ఈ శ్లోకం చదివి, ఈ భావాన్ని స్మరించి, భూమిని తాకి నమస్కరించిన తరువాతే కింద అడుగు పెట్టాలి అని పెద్దలు చెప్పారు. అది మనం భూమాతకు సమర్పించే కృతజ్ఞత.
అలా మొదలైన పాదం మోపుతూ చెప్పే శ్లోకం నుంచి దేవుడిని ముఖ్యంగా చిన్ని కృష్ణుడు చిట్టి పాదాలపై పాట వైపు తొంగిచూస్తే మొదట స్ఫురించే అన్నమయ్య పాట…
చిన్ని శిశువు చిన్ని శిశువు
ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు॥
తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత
కాయలవంటి జడలా గములతోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పయక యశోద వెంట పారాడు శిశువు॥
అంటూ మువ్వల పాదాల కృష్ణుడు మనకంటి ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడిక మనకు వెంటనే చిన్ని కృష్ణుడు చేసిన కాళీయమర్దనం గుర్తొస్తుంది. అంతే కాదు కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాల గోపాల మా బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ ఇదేనా ఆ మురళీ పాట… ఎస్ జానకి స్వరంతో వీనుల విందుగా వినిపిస్తుంది.
శ్రీనివాసుని పాదాలను తామరలతో పోల్చిన పోలికను గురించి అన్నమయ్య సంకీర్తనాలలో కవిసమయాలు అనే అంశం పై జి. అన్నపూర్ణ గారు రాసిన వ్యాసం ద్వారా కవిసమయాలను విస్తృతంగా చూడవచ్చు దేవతామూర్తులను ఆపాదకేశాంతం వర్ణించడంఆచారం. పాదాలను తామరలు, ఎర్రకలువలు, చిగురుటాకులు, పగడాలతో పోల్చడం కవిసమయం. అన్నమయ్య పాదాలనుతామరలు, తులసీదళం, చిగురు, చింతకొమ్మ, కూర్మం, సంతముద్రకోల, నాగళ్ళతో పోల్చాడు.
పొంచి తామరపువ్వుల బోలిన పాదాలాతడు వంచి తుమ్మెదల కొప్పు వడిసోక మొక్కవే …
అని శ్రీనివాసుని పాదాలను తామరలతో పోల్చాడు. తామరలు అందమైనవి, మకరందంతో నిండినవి, ఆస్వాదించే వారి బడలికను పోగొట్టేవి. అట్టివే స్వామివారి పాదాలు. ఆశ్రయించిన వారి అలసటను తీర్చేవి.
తనను ఆశ్రయించేవారికి గట్టి ఆధారాన్నిచ్చే స్వామివారి పాదాలను చింతకొమ్మలతో పోల్చాడు. కొనల నీ పాద చింతకొమ్మయేదిక్కు (2146) చెట్లలో చింతకొమ్మ చాల గట్టిది. ఆ కొమ్మను పట్టుకుని వేలాడే వారికి అది విరిగిపోతుందనే భయం లేదు. స్వామిపాదాలు జీవికి చింతకొమ్మ లాంటివే. (ఈ మాట జూలై 2001)
పాదాలను గురించిన పాటలు శివునిపై కూడా ఉన్నాయి …
శివ శివ శివ అనరాదా శివ నామము చేదా శివ పాదము మీద నీ శిరసు నుంచ రాదా …అవే పాట ఒకటైతే నాట్యమయూరి పాట
ఈ పాదం ఇలలోన నాట్యవేదం ఈ పాదం నటరాజుతో ప్రమోదం…అనేది. ఇటువంటిదే
- చరణ కింకిరులు ఘల్లు ఘల్లుమన కరకంకణములు గలగలలాడగ ఆడవే మయూరి నటన మాడవే మయూరి
- మరొక అద్భుతమైన పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరంలో ప్రాణం పోసుకున్న పాట …
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం
ప్రణతులే చేయలేనీ ఈ కరమేలా ఈ కరమేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
అంటూ మంజునాథుని వేడుకునే పాట.
ఎంత మధురమైన భక్తి భావన..
ఆ భక్తి దాదాపు అందరు దేవుళ్ళపై అపారంగా కురిసింది .. రామునిపై మరెన్నో…
- ఇదివో ఇదివో ఇనకుల తేజము
ఇదియే రాముని పాదము
పదము పదమునను ప్రణవనాదమై
పరిపాలించెడి పాదము
జై జై రామ్ జై శ్రీ రామ్
గంగమ పుట్టిన గామిడి పాదము
ఘన బ్రహ్మమే తా కడిగిన పాదము
మంగళమగు మహనీయుని పాదము
మాటలకందని మహా పాదము
లింగమూర్తి లాలించిన పాదము
లలన సీత సేవించిన పాదము
అంగవించి ఆ దైత్యుల తునిమిన
అహల్య తాకిన పాదము -ఇదివో
మాత కౌసల్య ముద్దులాడిన
ముంగిట తిరిగిన మురుగుల పాదము
పితర దశరథుని పొట్టను తన్నిన
బాలరాముని భవ్య పాదము
హితవుని కోరి కౌశిక యాగము
కావ్య వచ్చిన కందువ పాదము
గయసేతువు వరకు సాగిన పాదము
సాగర మదమును అణచిన పాదము -ఇదిగో
పసిడి లేడికై పరుగిడు పాదము
వసుధ మరీచుని వధించు పాదము
ఉసురున వాలిని జంపిన పాదము
వెసగు సుగ్రీవుడు వేడిన పాదము
దశకంఠుని ధర కూల్చిన పాదము
ధీర మారుతీ హృదయము పాదము
దిశలెల్లను తానేలిన పాదము
దేవుడు వేంకట రాముని పాదము
సామవేదం వేంకట మురళీకృష్ణ రచించిన ఈ పాట తారక్ మ్యూజిక్ లో తారక్ రామారావు పడాల , హైదరాబాద్ సమర్పణలో యూ ట్యూబ్ లో లభ్యం.
రాముని గురించిన పాటలు అనేకానేకంగా దర్శనమిస్తాయి.
- పదములే చాలు రామా నీ పద ధూళులే పదివేలు
- నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా …
- శ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే
వారిజ భవ సనక సనందన వాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ)
దారిని శిలయై తాపము తాళక
వారము కన్నీరును రాల్చగ
శూర అహల్యను జూచి బ్రోచితివి ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)
అనే కీర్తనలెన్నో …
దైవపరంగా పాదాలను వీక్షిస్తూ పాడిన పాటలలో మతాలకతీతమైన భావన ఉంది
- నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నిన్ను పాడి కీర్తించెదను
యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది వంటి పాటలెన్నో ఉన్నాయి.
కె.వి . ఎస్. రామారావుగారు ఈమాటలోవేటూరి పాటలలో పాదాల ప్రాముఖ్యతను …ఆరాణి పాదాల పారాణి జిలుగులో / నీరాజ భోగాలు పాడనీ తెలుగులో” అన్నా, “నీ చల్లని చరణాలు చల్లిన కిరణాలలో / “అన్నా, శ్రద్ధంతా శబ్దాలంకారాల మీదేఅంటూ విశ్లేషించారు.
- మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా …తోడబుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లమ్మా..ఎవరినైనా కంటతడి పెట్టించే పాట అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక.
గద్దర్ సాహిత్యానికి వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాట.
చిన్ని పాదాలను చిన్నారులను చూసి రాసిన గీతాలు తరచి చూస్తే ఆ భావపరంపరలో మనమూ లీనమవక తప్పదు.
- నీ సిన్ని సిన్ని పాదాలు సూడచాలలేని కన్నులు
బ్రతుకు బాటలోకి ముల్లులు
దాటి మిగిలి ఉన్ననా కన్నులు…అంటూ
సిద్దిపేట శ్రీకాంత్ అప్ లోడ్ చేసిన పాట కదిలించేస్తుంది ( యూ ట్యూబ్) . మరొక పాట
- నీ సిన్ని సిన్ని పాదాలను గుండెలపైనే మోసినా
నీ కాళ్లకు తొడిగిన గజ్జెల సప్పుడు గుండె సప్పుడై దాసిన
నీ కాళ్లకు మట్టి అంటకుండ నీ అడుగుల అడుగై నడచిన
నా పంచ ప్రాణాలు నువ్వేనంటూ గుండెలపైన కాసిన
సెట్టు నీడవోలె నీతోడు వుంటానె సిట్టితల్లి
నువు నిదరోయెయేలల్లో ఊగేటి ఉయ్యాల నేను తల్లీ….
-పెద్దపల్లి ట్యూన్స్ లో సాయిగౌడ్ అప్ లోడ్ చేసిన పాట యూట్యూబులో..రచన దిలీప్ దేవగన్- ఎంత ఆర్దృతతో కూడిన భావన.
పుస్తకాలు పాదాలతో అను సంధానమైన శీర్షికలతో ప్రచురించబడ్డాయి. ప్రముఖ కవి, రచయిత , దర్శకుడు డా.ప్రభాకర్ జైని గారు తన కవితా సంపుటి “పాదముద్రలు ”శీర్షికతో వెలువరించారు.“పాదముద్రలు ”అనే పేరుతో తన రెండో కవితా సంకలనం తీసుకొచ్చాడు కవి మిత్రుడు శాఖమూరి రవి.
దీనిని గురించి కొలిమి లో నాగేశ్వర్ ప్రస్తావిస్తూ “ పక్షిబంధం” అనే కవితలో ఇప్పుడు నా అడుగులది
పక్షి పాదముద్రల వెతుకులాట”…. అని ప్రకటించాడు. నిజమే అవి… శాఖమూరి అప్పారావు పాదముద్రలు భారత విప్లవోద్యమకొండగుర్తులు ఇవి కవి, శాఖమూరి రవి కవితలు…అన్నారు. మరొక పుస్తకం ఉక్కుపాదం – జాక్ లండన్ ధనస్వామ్య వ్యవస్థ పైశాచికానికి, ఫాసిస్టుతత్వానికి జాక్లండన్ పెట్టిన పేరు ”ఉక్కుపాదం“. ఇది 1907లో వెలుగు చూసింది.
సాహితి పాదముద్రలు పేరుతో
కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి తన కవితలో అకస్మాత్తుగా
ఆకాశమెత్తు ఎదగడం
అర నిముషంలో కుప్పకూలటం
ఎన్నిసార్లు చూడలేదు!
నీ యాత్ర పొడవెవనికి కావాలి?
ఈ మట్టి మీద
నీ పాదముద్రల
సంతకాల దాఖలాలేవి?… అంటారు.
భాస్కరభట్ల కవితల్లో అడుగులు సాగిపోయినా జ్ఞాపకాల పాదముద్రలు పదిలమే!
ఒక పాదానికే
చోటుదొరికింది..!
రెండో పాదం గాల్లోనే…
ఫుట్‌బోర్డ్ ప్రయాణం!
—–
చదువుకునే రోజుల్లో …
అందమైన అమ్మాయి కనిపించగానే
చూపులన్నీ
పాదాలమీదే!.
హమ్మయ్య..
మెట్టెల్లేవ్..
ఆమె నాదే!
అంటూ చక్కని భావవ్యక్తీకరణ చేసారు.
జులై 1, 2019 నా అక్షరాలు…పేరుతో పల్లెపు స్వాతి సారంగలో ఒక కవితలో
మా అమ్మ పగిలిన పాదాల్లో కనిపించే మట్టిగుండెల అలజడి నాలో పోటెత్తే సంద్రమైంది.
పార ఎత్తి ఒరం చెక్కేటపుడు
నా కాళ్లకు అంటుకున్న రేగడి చల్లదనమే
ఈ అక్షరాల గుండె తడంతా అనే కవితలో అమ్మ పగిలిన పాదాలను అలజడిని చూపించారు.
మరో కవిత
చిమ్మ చీకటిలో …
ఈ ఇసుక దారుల్లో
నేనెప్పుడు ఒంటరిగా నడిచినా
మిణుగురు పూల వెలుగుల్లో
నీ పాద ముద్రలు కనిపిస్తయ్….
నీ నెత్తురంటిన గడ్డిపూలు
ఆత్మీయంగా పలకరిస్తయ్
మిణుగురు పూల వెలుగులో కనిపించే పాదముద్రలు మన మనసులలో ముద్రను వేస్తాయి.
ఏప్రిల్ 1, 2022 న
మహమూద్ కవితలలోనూ పాదముద్రలు కనిపించాయి….
తేనె ఫలం
ఆ మెత్తటి ఇసుకతిన్నెల్లో
పడ్డ నీ పాద ముద్ర లో
ఒలికిన నా చూపు లో
సగం చీకటి
సగం వెలుతురు ఇప్పుడు..
…..
నీ పాద ముద్రల పదాలను చదువుకొని
నడకలోని అనుభవాలతో మానవ చరిత్రలోని ఎత్తుపల్లాలు తెలుసుకొని
మనుషులు కొత్త నడవడికకు అలవాటు పడ్డారా?
……
నువ్వు పాదం మోపిన చోట
కోటలన్నీ ఓడిపోతాయని
కుటీరాలు తలెత్తుకుంటాయని
చరిత్ర చెప్పిన పాఠం.
మానవ చరిత్రను ఈ పాదముద్రలు ప్రశ్నిస్తున్నాయి…
ఇంటిని ఒంటరిగా వొదిలొచ్చాను ..కవితలో ఇల్లెప్పుడు ఊరిచుట్టే తిరుగుద్ది , సూర్యుడు చుట్టు భూమిలా !అది కనకమేడకాకపోవచ్చు అందులో మా తాతలు నడయాడిన పాదాలున్నాయి ఇల్లుమునిగితే పర్వాలేదు పాదాలగుర్తులు ఏమైపోతాయోననిఒకటే భయం అంటారు ..దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి.
అది మా అమ్మ ……!అంటూ
అది…బురద పొలంలో నాటుకొని కుళ్ళిన పాదం
పల్లెరుల మీద నడిచిన ఆనెల రాళ్ళ పాదం జొన్న కొర్రుల మీద నడిచి నెత్తుటి పూలు పూచిన పాదం బతుకును నిప్పులమీదనడిపించిన ఉక్కుపాదం
ఏమనుకోకు తల్లి
ఒక్కసారి రక్తమోడుస్తున్న ఆ పాదాన్నిముద్దాడ నివ్వు
అది మా అమ్మ పాదం అంటాడు ఇబ్రహీంనిర్గుణ్ తన కవితలో…
బిల్లా మహేందర్ అంతరం అనే కవితలో నిజమే..నువ్వన్నట్లుగా ఆకలేమి అంతగా నేరం కాకపోవచ్చు గాక..కాని..,
చెమట చుక్కల్లోంచి మొలకెత్తే పచ్చని చిగుర్ల మీద పాదం మోపడం నేరం..
ఏపుగా ఎదుగాల్సిన మొలకల్ని నవ్వుతూ దారుణంగా పెకిలించి వేయడం నేరం!!
పాదం ఎక్కడ మోపాలో సూచిస్తే తగుళ్ల గోపాల్ తన కవితలో బాల్యం ఎదురైన చేదు అనుభవాలను పాదాలపరంగా ఇలా అంటారు.. చిన్నప్పటి నుండి పశువులు కాసిన ఆ బాల్యపు జ్ఞాపకాలన్నీ“ముల్లు పాటం” అనే కవిత రాసుకొన్నాడు. అందులో..
“కంపల మీదంగా
వరికొయ్యల మీదంగా
ఎగిరి దుంకి ఆవుల్ని మర్లేసినాక
తూట్లు పడిన జల్లెడ లాగ అరికాళ్ళు
ఎక్కడ కూర్చుంటే అక్కడ,
కాళ్ళను ముందల వేసుకొని,
ముళ్ళను తీయడం తోనే,
గడిచి పోయింది బాల్యం
అంటారు తగుళ్ల గోపాల్…
షేక్ పీర్ల మహమూద్ చిన్నారి పాదం
అనే కవితలో…
ఏదీ ఒక సారి తదేకంగా నీ పాదాన్ని చూడనీ
నిజానికి,దాన్ని ముద్దాడాలి
దాన్నోసారి గుండెల మీద ఆన్చుకోవాలి
మసి పారాణిలా అంటుకున్న
చిన్ని పాదాల గరుకుతనంలో నా బాల్యపు గురుతులేవో వెతుక్కోవాలి…అంటారు.
ఇంద్ర ప్రసాద్ ఓ కవితలో
ఆమెకు దయ లేదు …
అనుకోకుండా పాదాల మీద
చిన్న స్పర్శ
పక్కమీద చిన్న ముడత
గాలి కెరటాల హోరు
ఎక్కడో కాంతి రొద
ఇంక ఈ రాత్రి
నిరీక్షణే… అంటారు.
రవీంద్ర నూటెంకి తన కవితలో
ఆ పాదాలు మన కేమిచ్చాయి?
గుప్పెడంత మట్టినిచ్చాయి
ఆ మట్టిలో మొలకెత్తి విశ్వమంతా వ్యాపించే
విత్తనమంత విశ్వాసాన్నిచ్చాయన్నారు.
ఆ పాదం …
మానవ చరిత్రను సృష్టించిన మట్టిపాదం
ఈ మట్టి చరిత్ర గతిని మార్చిన మహా పాదం
నా కంటి చెలకలో నిరతం కోండ్రలేసే నాగటి పాదం
నిత్యం కన్నీటితో కడుగ వలసిన అమ్మ పాదం
ఆ బ్రహ్మే కడుగ వలసిన మట్టిపాదం వట్టిపాదం అతి మామూలు పాదం
అది మట్టి పాదం
అది మట్టి పాదం !
అంటూ శ్రమ జీవుల పాదాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.
ఇలా చెప్పకుంటూ పోతే ఎన్ని పుస్తకాలో ..ఎన్ని పాటలో..ఎన్ని కవితలో ..ఉటంకించని స్పృశించని పాదాలెన్నో..
పాదాలు ఒకచోట భక్తి పారవశ్యంలో మునిగిపోయే ఆధ్యాత్మిక భావనను కలిగిస్తే మరి కొన్ని పాదాలు ప్రేయసి అందచందాలలో భాగంగా ఓలలాడించాయి. కొన్ని పాదాలు బాల్యపు చెరగని ముద్రలైతే కొన్ని పాదాలు అనుసరించవలసిన సరికొత్త మార్గాలు .. కొన్ని పాదాలు చెమటను చిందించే శ్రమను వ్యక్తీకరిస్తే కొన్ని పాదాలు చరిత్రపుటలను తిరిగేసాయి… చిన్ని పాదాలు గుండెలో సవ్వడి చేస్తూ పవిత్రతకు ప్రతిబింబాలుగా సాక్షాత్కరిస్తాయి ..పాదాలు పరమ పద సోపానాలు . పాదాలు నిష్కల్మష నిజదర్శనాలు. అటువంటి పాదాలకు అక్షరాభివందనాలు.