Sammeta Vijaya
Sammeta Vijaya
12-5-103/1, 301, శ్రీ కళాసాగర్ అపార్ట్ మెంట్ , విజయపురి కాలని, తార్నాక, సికింద్రాబాద్ . డా.సమ్మెట విజయ రచయిత్రి, కవయిత్రి, నాటకరంగ పరిశోధకురాలు, విశ్రాంత ఉపాధ్యాయురాలు .తెలుగులో నాటక రచన, తెర వెనుక నాటక రంగ రచనలు. భావనాంజలి , ఆమెకు రూపాలెన్నో కవితా సంపుటులు , పులవర్తి రామకృష్ణారావు జీవిత చరిత్ర, ఆశే శ్వాసగా కథాసంపుటి, బడే నా లోకం , షాలిని ఎస్ పి ఎల్ బాలల నవలలు రచించారు. అక్షరయాన్ ప్రతినిధి, పలు సాహితీ వ్యాసాలు రచించారు.
వీడేం మగాడండి బాబూ!
ఉత్తమ హాస్య నాటికలు 50 హాస్య వ్యంగ్య నాటికల సుమహారం అనే పుస్తకావిష్కరణ సభకు తెలుగు విశ్వవిద్యాలయానికి వెళ్లడం జరిగింది ఈ పుస్తకం సంపాదకుడు వల్లూరు శివప్రసాద్ సహా సంపాదకుడు గంగోత్రి సాయి గారు తాడేపల్లి గుంటూరు జిల్లా వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకం ఆవిష్కరణ తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఒక హాస్య నాటిక ఈ పుస్తకంలోని చివరి నాటిక వీడే మగాడండి బాబూ! రచన పిటి మాధవ్. దర్శకత్వం జి ఎస్ చలపతి.
రచయిత పిటి మాధవ్:
నటుడు, దర్శకుడు, నాటక రచయిత. పబ్లిక్ పార్క్ నల్లకోటు నవ్వింది నన్ను ఎక్కించండి బోను ఇల్లు నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత ముగింపు లేని శిక్ష జనరల్ బోగీలు 27వ మైలురాయి మొదలైన 30 నాటికలు రచించారు జీరో అవర్,తల్లి దరఖాస్తు ,తెల్లని కాగితాలు, లయతప్పిన కోయిల ,తెల్లకోటు తెల్లబోయింది నాటకాలు వివాద వివాహం, ప్రామిసరీ నోట్, వెళ్ళిపోకే చిన్నమ్మ,దేవుడు ఇచ్చిన తీర్పు మొదలైన రేడియో నాటకాలు సంస్కారమా, బోయవాని వేటలో,మొదలైన టీవీ నాటికలు వెలువరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది నాటకోత్సవాలలో ముగింపు లేని శిక్ష నాటికకు ద్వితీయ ఉత్తమ రచయితగా నంది బహుమతి పొందారు విశాఖరత్న రంగసాయి గురజాడ పురస్కారం తెలుగు భాషా పురస్కారం లాంటి ఎన్నో పురస్కారాలు స్వీకరించారు.
దర్శకత్వం జిఎస్ చలపతి:
రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి . 2002 లో, పోటీ నాటకాలలో ప్రవేశం. 2003 & 2009 , నంది నాటక పోటీలలో, ఉత్తమ హాస్య నటుడు గా, నంది అవార్డు గ్రహీత. కీ. శే. విద్యాసాగర్ గారి దర్శకత్వంలో, ” అమృతం తాగిన రాక్షసులు” తొలి పోటీ నాటకం. ఉభయ రాష్ట్రాలలోని దాదాపు అన్ని పరిషత్ లలోనూ, హాస్య నటుడుగా ఎన్నో బహుమతులు. ” మనిషి మంచోడే” ,” అమెరికా అల్లుడు” , ఈ రెండు హాస్య నాటికలు, 90 సార్లు ప్రదర్శించడం అయినది. తొలిసారిగా దర్శకత్వం వహించిన పోటీ నాటిక, ” వీడేం మగాడండి బాబు”. నంది నాటక పోటీలతో పాటు, ఇంకొన్ని పరిషత్ లకు, “ప్రాధమిక పరిశీలన” మరియు “తుది” న్యాయ నిర్ణేత గా వ్యవహరించడం జరిగింది. ఈటీవీ లో 2005-7 మధ్య ప్రసారమైన ” మాయా బజార్” బాగా పేరు తెచ్చిన సీరియల్. దాదాపు 40 సీరియల్స్, సినిమాలలో నటించిన అనుభవం. ఫిట్టింగ్ మాస్టర్, బెండు అప్పారావు,ఓనమాలు, సింగ్ గీతం, “Dawat e ishq”,, గుర్తింపు తెచ్చిన సినిమాలలో కొన్ని.
నటీనటులు: జిఎస్ చలపతి, శోభారాణి, గోరంట్ల సురేంద్ర, కొల్లా రాధాకృష్ణ,నవీన్
కథాంశం : రాజారావు కాత్యాయని భార్య భర్తలు వారి అబ్బాయికి పెళ్లి చేయాలని మంచి సంబంధం చూడాలని ఎదురు చూస్తుంటారు.చివరకు ఒక సంబంధం నిశ్చయ మవుతుంది. ఆ ఏర్పాట్ల తాలూకు సంభాషణ
కాత్యాయని రాజారావు మధ్య మాటల యుద్ధంలా జరుగుతుంది . వాళ్ళ అబ్బాయి గోవింద్. ఆ అబ్బాయి పెళ్లి చుట్టూ కథనం నడుస్తుంది ఆ సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఒక దొంగ ప్రవేశించడం అప్పారావు ప్రవేశించడం వారందరి మధ్య జరిగే హాస్యస్పూరకమైన సంభాషణలు ప్రతి నిమిషం అందరిని కడుపుబ్బ నవ్విస్తాయి.
కాత్యాయిని కాబోయే వియ్యపురాలు చూడామణి తన కూతురినిచ్చి కాత్యాయని కొడుకుకి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఒక ఫోన్ చేస్తుంది ఆ కూతురు వేరే అతనితో వెళ్లిపోయిన విషయం ఫోన్ లో చెప్పడం విని కాత్యాయని ఆ చూడామణి మీద మండిపడ్డ సన్నివేశం ఫోన్లో మాట్లాడుతూ “నేను కాదే దొంగ నువ్వు దొంగ నీ కూతురు దొంగ నీ మొగుడు దొంగ కూతురిని అడ్డుపెట్టుకొని పెళ్లి పేరుతో వ్యాపారం చేస్తున్నావు నువ్వే పెద్ద దొంగ” అంటూ సూర్యకాంతం ఛాయాదేవి వలే మాటలతో పొట్లాడుకుంటారు.అది అందరిని వినోదంలో ముంచెత్తుతుంది. గోవింద్ గురించి తెలుసుకున్న దొంగ గోవిందుకు చేసిన హితోపదేశం నువ్వు మగాడివి అనిపించుకోవాలంటే ఏమేం చేయాలో చెప్పిన డైలాగు ఈనాటికలో హైలైట్…
హాస్యనాటికలలో ఉండే చివరి ట్విస్ట్ ఎలాగూ ఉంటుంది అది చెప్పడం కంటే చూసి ఆనందిస్తేనే బాగా మనసును కట్టిపడేస్తుంది అలా నాటకం ప్రారంభం నుంచి చివరి వరకు కడుపుబ్బ నవ్వించిన సంభాషణలు ఛలోక్తులు ఎన్నో ఈ నాటికలో ఉన్నాయి.
శోభారాణి గారు, చలపతి గారు తమ తమ పాత్రలలో లీనమై ఆ పాత్రలకు జీవం పోశారు.మిగతా నటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.
సాంకేతిక సహకారం: సంగీతం సురభి నాగరాజు, రంగాలంకరణ అనిల్ రావు
నాటకం ప్రత్యేకత:
పద్య,పౌరాణిక, సాంఘిక నాటకాలలో హాస్య నాటికలు ప్రత్యేకమైనవి. . వినోదాత్మక మనోరంజనం కలిగించే అభినయం కోసం విచ్చేసే ప్రేక్షకులకు హాస్య నాటికలు సంపూర్ణ వినోదాన్ని అందిస్తాయి. ఇక ఆనాటిక లేదా నాటకం ఆద్యంతం హాస్య రసాన్ని పండించినట్లయితే ఆనాటికను లేదా నాటకాన్ని ప్రేక్షకులు అశేషంగా ఆదరిస్తారు ఆనందిస్తారు ఆస్వాదిస్తారు. ఈ మూడు సమపాళ్ళలో ప్రేక్షకులకు అందించిన ఘనత నటీనటులలోను నటించి దర్శకత్వం వహించిన జిఎస్ చలపతి గారిది. చక్కని ఇతివృత్తం ఎక్కడికక్కడ చెణుకులు విసిరే సంభాషణలు వీటన్నిటి వెనక రచయిత ప్రతిభ రచనా శిల్పం గోచరిస్తుంది అంతకు పూర్వం అనేక రచనలు చేసిన పీటి మాధవ్ గారు అటు సాంఘిక నాటికలతో పాటు హాస్య నాటికను రచించి అందరి అభిమానం పొందడం ఆషామాషీ కాదు. హాస్యం పండకపోతే ఆ నాటిక అందరినీ చేరదు. ఆ పట్టు తెలిసిన రచయితగా అద్భుతమైన హాస్యం ఈ నాటకంలో అందించారు.
ఈ నాటకం మీకు అందుబాటులో ప్రదర్శించబడినట్లైతే తప్పనిసరిగా చూడండి. ప్రతి లైబ్రరీలో అందుబాటులో ఉండే ఉత్తమ హాస్య నాటికలు 50 హాస్య వ్యంగ్య నాటికల సుమహారమనే పుస్తకం తెరచి 1027 పేజీలో ఉన్న ‘వీడేం మగాడండి బాబూ!’
నాటికను చదవండి. మంచి హాస్య నాటికల పుస్తకం మీ ఇంట్లో చేర్చుకోవాలంటే ఈ పుస్తకాన్ని కొనుక్కోండి
వన్ ప్లస్ వన్ నాటిక
రచన మాడభూషి దివాకర్ బాబు గారు . దర్శకత్వం డా. శ్రీజ సాదినేని. నటీ నటులు శ్రీజ సాదినేని, శశిధర్ ఘణపురం
వన్ ప్లస్ వన్ సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో రసరంజని , శ్రీ చాట్ల శ్రీ రాములు థియేటర్ ట్రస్ట్ నిర్వహణలో ప్రతిభా పురస్కారం 2025 శ్రీ ఎస్ ఎస్ రామశాస్త్రి గారికి (సీనియర్ రంగస్థల నటులు ) ప్రదానం చేసిన సభలో శ్రీ ఎస్ ఎస్ రామశాస్త్రి గారికి ప్రతిభా పురస్కారం అందించి ఘనంగా సత్కరించిన తరువాత నాటిక ప్రదర్శన జరిగింది. ఇది డా. శ్రీజ సాదినేని దర్శకత్వం వహించిన 38 వ నాటిక.

డా. శ్రీజ సాదినేని ప్రముఖ రంగస్థల, టీవీ, చలనచిత్ర నటి, రచయిత్రి, దర్శకురాలు, వ్యాఖ్యాత, యాక్టింగ్ ఫ్యాకల్టీ, డబ్బింగ్ ఆర్టిస్ట్. చిన్నతనంలోనే హరికథలు చెప్పడం ప్రారంభించిన శ్రీజ అనేక హరికథలను చెప్పడమేకాఉండా కథా వాచస్పతి, అభినేత్రి వంటి బిరుదులు కూడా అందుకుంది. 1994, ఏప్రిల్ 14న తొర్రూరు పరిషత్ లో నిర్వహించిన నాటికల పోటీలలో జన చైతన్య ఒంగోలు వారి మేడిపండు నాటికలో అమ్ములు పాత్ర ద్వారా బాల నటిగా నాటకరంగంలో అడుగుపెట్టిన శ్రీజ అనేక ఇప్పటివరకు అనేక ప్రదర్శనల్లో పాల్గొని, మూడువేలకు పైగా బహుమతులను అందుకున్నది. 150 కి పైగా సాంఘిక నాటికలు/ నాటకాలలో, 15 కు పైగా పద్య నాటకాలు, 40 నాటికలు దర్శకత్వం వహించారు . కొన్ని నాటికలు, ఏక పాత్రలు స్వయంగా రచించారు. జయా ఆర్ట్స్ , హైదరాబాద్ నిర్వహణలో ‘వన్ ప్లస్ వన్‘ నాటిక ప్రదర్శించారు.
రచయిత శ్రీ మాడభూషి దివాకర్ గారు ప్రముఖ సినీ రచయిత యమలీల, శుభలగ్నం, మావి చిగురు , చూడాలని ఉంది , టాప్ హీరో, నెంబర్ వన్ ,ఆహ్వానం, వినోదం ,సర్దుకుపోదాం రండి ,ఇద్దరు మిత్రులు మొదలైన వంద సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే సంభాషణలు అందించారు. కథలు కవితలు రేడియో నాటకాలు అనేకం రచించారు .నాటక రచయితగా ప్రతి నాటికకు నాటకానికి అనేక పరిషత్తులలో ఉత్తమ రచన తదితర బహుమతులు అందుకున్నారు. యువ వాహిని డి.వి. నరసరాజు స్మారక పురస్కారం , అక్కినేని నాటక కళా సమితి అక్కినేని జీవన సాఫల్య పురస్కారం, బాపు రమణ వారి ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ పురస్కారం ,సంస్కృతి సాంస్కృతిక సంస్థ గుంటూరు వారిచే ‘ఆచార్య’ బిరుదులు అందుకున్నారు. మంచి రచనా శిల్పం కలిగిన రచయిత. వైవిధ్యమైన నాటికలు నాటకాలు రచించి ప్రదర్శింపచేసారు.దివాకరబాబు నాటకములు , నాటికలు రెండు వాల్యూములుగా వచ్చాయి. వీటిలో రెండవ వాల్యూమ్ లో వన ప్లస్ వన్ ప్రచురితమై ఉంది .

వన్ ప్లస్ వన్ నాటిక నేపథ్యం :
ఈ నాటికకు ఓ ప్రత్యేకత. నాటకం లో రెండు పాత్రలు. సరిగ్గా రెండు పాత్రలే. జీవితాన్ని ఒంటరిగా గడపడం తప్ప వేరే దారి లేదని భావించే అతను , జీవితాన్ని ఇష్టం లేని వృత్తిలో కొనసాగుతున్న ఆమె ఒకానొక పరిస్థితి లో ఎలా కలిశారు వాళ్ళ మధ్య జరిగిన హృద్యమైన సన్నివేశాల సమాహారం ఈ నాటిక . మనసు విప్పి ఒకరి భావాలు మరొకరు తెలియజేసుకున్న వైనం , ఎలాంటి పరిణామానికి దారి తీసిందో రచయిత సున్నితంగా ఆవిష్కరించారు.
కేవలం రెండు పాత్రలతో కథ నడపడం నాటిక ఎక్కడా విసుగు రాకుండా సాగించిన విధానంలో దర్శకత్వ ప్రతిభ కనబడింది. నాటకం ఆద్యంతం తమ నటనతో ఎప్పటికప్పుడు తగిన హావ భావాలు పలికిస్తూ విరామం లేకుండా నటించడం కష్టసాధ్యమైనప్పటికీ తమ నటనతో ఆకట్టుకున్నారు శశిధర్ , శ్రీజ. నాటిక ను సహజ నటనతో శశిధర్ సొంతం చేసుకుని ఆ పాత్రకు తగిన న్యాయం చేసాడు. శ్రీజ ఎక్కడా ఏ మాత్రం తడబాటు లేకుండా హుషారుగా పాత్రకు ప్రాణం పోసింది. ఇద్దరి మధ్య సున్నితమైన బంధం ఎక్కడా ఇబ్బందికరంగా లేకుండా కొనసాగింది. వారి మధ్య ఒకరిపై ఒకరికి ఏర్పడిన అనుబంధాన్ని
చూపించే ప్రయత్నంలో సంభాషణలు “మాటి మాటికి నిన్ను పిలిపించుకునే ఆర్థిక స్థోమత నాకు లేదు” అన్న అతను “నీ దగ్గర నేనీ ఇంటి ఇల్లాలిననిపించేది” అన్న ఆమె సమాజంలోని స్థితిగతులను ప్రశ్నిస్తాయి.
నాటికకు సహకారం సాంకేతిక నిపుణులు మేకప్ అవినాష్, సంగీతం రాజశేఖర్, సెట్& లైటింగ్ సురభి ఉమా శంకర్ అందించారు.
జయా ఆర్ట్స్ , హైదరాబాద్ నిర్వహణలో ప్రదర్శించిన ‘వన్ ప్లస్ వన్‘ నాటికకు దర్శకత్వం వహించిన శ్రీజను రసరంజని వారు సత్కరించారు. నగదు బహుమానం అందించారు . కార్యక్రమ అతిథి శ్రీ బొల్లినేని కృష్ణయ్య గారు శ్రీజకు , శశిధర్‌కు , రచయితకు , సాంకేతిక నిపుణులు అవినాష్, రాజశేఖర్, ఉమా శంకర్ లకు నగదు బహుమానం అందజేసారు.
రెండు పాత్రలు అనగానే భూమిక థియేటర్ గ్రూప్ లో ఝాన్సీ రచించి వంశీ చాగంటి తో కలిసి ఇదే విధమైన రెండు పాత్రలతో నటించిన నాటకం రవీంద్ర భారతిలో ప్రదర్శించిన విషయం గుర్తు రాక మానదు. ఇటువంటి వైవిధ్య భరితమైన రచనలు తెలుసుకొని నాటకసాహిత్యంలో వాటి వైశిష్ట్యాన్ని తెలియజేయాలి. ప్రదర్శనలు జరిగినప్పుడు ఎంతో శ్రమకోర్చి సాధన చేసి ప్రదర్శించిన నాటిక చూడటం మన సాంస్కృతిక శోభను ఇనుమడింప చేసుకున్నట్లు అవుతుంది.
రచయిత శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు , దర్శకురాలు డా. శ్రీజ సాదినేని, నటుడు శశిధర్ , సాంకేతిక నిపుణులు సర్వదా అభినందనీయులు.





స్వేచ్ఛ నాటిక
విశ్వ శాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వెలువడిన నాటిక స్వేచ్ఛ. వివిధ ప్రదేశాలలో 35కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన నాటిక స్వేచ్ఛ. మూల కథ శ్రీ పి. ఎస్ నారాయణ, నాటకీకరణ శ్రీ పరమాత్ముని శివరాం, దర్శకత్వం శ్రీ బి.ఎం రెడ్డి .
పి .ఎస్ నారాయణ : పి.ఎస్.నారాయణ ప్రముఖ కథారచయిత. ఇతడు 230కు పైగా కథలు, 31 నవలలు, 10 రేడియో నాటికలు, 2 స్టేజి నాటకాలు, ఏన్నో విమర్శా వ్యాసాలు రచించాడు.

స్వేచ్ఛ అంటే మనసుకు నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు సాగించుకోవడం, ప్రవర్తించడం కాదు అంటారు రచయిత (మూల కథకులు) పిఎస్ నారాయణ.
బి.ఎం రెడ్డి : దర్శకునిగా రాణించిన బిఎంనరెడ్డి గారు స్వేచ్ఛ , ఆకెళ్ళ రచించిన కలనేత మొదలైన నాటికలకు దర్శకత్వం వహించారు. స్వేచ్ఛ అంటే నియంత్రణ, సంరక్షణతో కూడుకున్న స్వచ్ఛత ఉండాలని చాటింది విశ్వశాంతి కల్చరల్ హైదరాబాద్ బృందం. పరమాత్ముని శివరాం నాటకీకరణకు బి ఎం రెడ్డి దర్శకత్వంలో నటవర్గం జీవం పోసింది. ఈ నాటిక యొక్క దర్శకత్వం, నటన, సాంకేతికత ప్రేక్షకులను కట్టిపడేసింది. నాటికలో దర్శకత్వ ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రేక్షకులకు విసుగు కలగకుండా ఒక దాని వెనుక మరో సీన్ విరామం లేకుండా ప్రదర్శిండం వలన నాటికకు అందరూ కనెక్టయ్యారు. కళాకారులు. లైట్స్ ఆఫ్, ఆన్ ఉన్నా… సీనులు, తెరలు మారుతున్నా, ఫ్లాష్ బ్యాక్ నడిచినా… అంతరాయం అన్న భావన కలగదు. ఇప్పటి ప్రేక్షకులు కోరుకుంటున్నది ఇదే. అందుకే ఈ నాటిక పలు అవార్డులు గెలుచుకున్నది.


విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ అనేది ఒక సాంస్కృతిక సంస్థ, ఇది ముఖ్యంగా నాటక రంగం మరియు సాహిత్యంలో చురుకుగా ఉంటుంది, ప్రముఖంగా “ఆకెళ్ళ నాటిక రచనల పోటీలు” వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది మరియు నాటక ప్రదర్శనలకు మద్దతు ఇస్తుంది, ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రచయితలను ప్రోత్సహిస్తుంది
విపరీతమైన స్వేచ్ఛ ఎప్పుడూ అడ్డదిడ్డంగానే ఉంటుంది. సరైన గమ్యమూ, గమనము దానికి ఉండదనే విషయాలను ‘స్వేచ్ఛ’ నాటిక రేఖామాత్రంగా చర్చిస్తుంది.
ఆధునిక సంపన్న కుటుంబ కథ ఇది. మహేశ్వరి ఇరవై ఏళ్ల క్రితమే భర్తతో తెగదెంపులు చేసుకుని అవినాశ్‌తో కలిసి జీవనం సాగిస్తున్నది. మహేశ్వరి కూతురు శ్వేత కూడా తల్లి దగ్గరే పెరుగుతుంటుంది. తల్లి ప్రవర్తన శ్వేతకు నచ్చదు. ఆమెకు దూరంగా, అమెరికా వెళ్లి చదువుకోవాలని అనుకుంటుంది. తల్లి అందుకు అంగీకరించదు. తల్లీ-కూతుళ్ల మధ్య ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. తన తండ్రి స్థానంలోకి వచ్చిన అవినాశ్ అంటే శ్వేతకు నచ్చదు.మహేశ్వరి కూడా మన మధ్య సంబంధం మనవరకే పరిమితమని, ఇతర ఏ వ్యక్తిగత విషయాల్లో కలుగ జేసుకోవద్దని అవినాశ్‌ను హెచ్చరిస్తుంది. కూతురు వరుసైన శ్వేతపై కాముక దృష్టి ఉన్న అవినాశ్ కన్నేస్తాడు.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే… మహేశ్వరి అవినాశ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.అతని సహాయంతో ప్రమోషన్ రావడంతో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది . అవినాష్ ను ఇంటికి ఆహ్వానించి విందు ఇస్తుంది. ఆ సందర్భంలో మద్యం తాగుతూ ఇద్దరూ శ్రుతిమించుతారు. ఆధునిక యుగంలో ఇవన్నీ సర్వసాధారణమని వాళ్ల భావన. ఇంటికి వచ్చిన భర్త మూర్తి మందలిస్తాడు. అతను చెప్పే మాటలు వినక ఎదురిస్తుంది. కోపం లో అవినాశ్‌పై చేయి చేసుకుంటాడు మూర్తి . మూర్తిని ఎదురించి అవమానించి తెగతెంపులు చేసుకుని కొడుకును తీసుకుని బయటకు వెళ్ళమంటుంది మహేశ్వరి . వాళ్లకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు ఆనంద్, కూతురు శ్వేత. ‘మగపిల్లవాడిని నీవు తీసుకెళ్లు, కూతుర్ని మాత్రం నా వద్దే ఉంచుకుంటాను’ అని పురుష ద్వేషంతో అంటుంది మహేశ్వరి. చేసేది లేక భార్యకు విడాకులు ఇచ్చేసి ఆనంద్ బాధ్యత తీసుకుంటాడు మూర్తి.
కొంతకాలం గడిచాక మూర్తి చేతుల్లో పెరిగిన ఆనంద్ పెద్దవాడవుతాడు. మూర్తి లాగే ఉంటాడు . మూర్తి మరణిస్తాడు.తల్లి కోసం చెల్లి కోసం ఆరాటపడి వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు . ఆ క్రమం లో శ్వేత పరీక్షకు డబ్బు కట్టడానికి పార్కు కు వచ్చిన విషయం తెలుసుకుని తెలియని వ్యక్తిగా వచ్చి కథ నడిపిస్తాడు.అన్నాచెల్లెళ్లు తల్లికి ఎలా బుద్ధి చెబుతారో చూడాలంటే స్వేచ్ఛ నాటిక చూడాల్సిందే!

మందుకు బానిసవడం స్వేచ్చా? అని మూర్తి సంధించిన ప్రశ్న మహేశ్వరి తో పాటు ఈ సమాజానికి వర్తిస్తుంది.
మితి మీరిన స్వేచ్ఛ తెడ్డు లేని పడవలా ఉండడమా?
స్వేచ్ఛ పేరుతో నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావా? వంటి ప్రశ్నలు ఆలోచింపజేస్తాయి.
పలు అవార్డులు అందుకున్న స్వేచ్ఛ నాటికలో మహేశ్వరి పాత్రలో సురభి లలిత , అవినాశ్ పాత్రలో శ్రీనివాస్ , మూర్తి,ఆనంద్ పాత్రల్లో డా . వెంకట్ గోవాడ, శ్వేత పాత్రలో మంజు , సాంకేతక సహకారం నాగరాజ్ , తేజ , ఫణీంద్ర , రోహిత్, భీం తదితరులు అందించారు. బి ఎం రెడ్డి గారి దర్శకత్వంలో విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ సమర్పణలో స్వేచ్ఛ నాటిక తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది

రాత – నాటిక
వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వెలగలేరు

వారి సమర్పణలో పలువురి ప్రశంసలు అందుకున్న నాటిక ‘రాత’ తక్కువ పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా అద్భుతమైన ఇతివృత్తంతో సాగిన నాటిక రాత .
దర్శకుడు శ్రీనివాసరావు పోలుదాసు. స్వయంగా నాటక రంగం , సినీ నటుడు. టీవీ ,సినీ రంగాలలో డబ్బింగ్ కళాకారుడు. నట శిక్షణ, వాయిస్ శిక్షణ ఇస్తూ, అటు సినీ రంగం ఇటు టెలివిజన్ నాటక రంగాలలో నిరంతరం కృషి చేస్తున్న నటుడు. ఏ పాత్రకైనా న్యాయం చేసే నైపుణ్యం నాటకాల పట్ల అంకితభావం కలిగిన నటుడుగా మాత్రమే కాకుండా స్వయంగా రచించి దర్శకత్వ బాధ్యతను చేపట్టిన శ్రీనివాసరావు పోలుదాసు ప్రధాన పాత్రలో ఈనాటికలో కనిపిస్తాడు. హైదరాబాదులో మూడుసార్లు రాత నాటిక ప్రదర్శించబడింది. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 28 ప్రదర్శనలు ఈనాటిక ప్రదర్శించబడింది. నిశి నాటిక రచన కూడా వీరిదే. భ్నీం గారు రచించిన మూల కథ ‘హరిలోరంగ హరి’ నాటకీకరణ శ్రీనివాసరావు పోలుదాసుగారు చేసి సమకాలీన పద్యనాటకంగా ప్రదర్శింపచేయగా ఈ నాటకం పలువురి మన్ననలందుకుంది.
తాను పొందాల్సినవి మంచిగా పొందుతూ తిరిగి ఇవ్వాల్సిన విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న తీరుని వివరిస్తూ ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం వెలగలేరుకు చెందిన వెలగలేరు ఆర్ట్ థియేటర్ కళాకారులు ప్రదర్శించిన ‘రాత’ నాటిక పిఠాపురంలో జనవరిలో ప్రదర్శించబడినప్పుడు పలువురి ప్రశంసలు పొందింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఈ నాటిక నిలవడమే కాక ఉత్తమ దర్శకుడిగా శ్రీనివాసరావు పోలుదాసు ఎంపికయ్యారు. తెలుగు విశ్వవిద్యాలయం సత్కళా భారతి 29వ వార్షికోత్సవంలో కూడా ‘రాత’ నాటిక ప్రదర్శించబడింది.


రాత నాటికలో తండ్రి గోవర్ధన్. కూతురు స్వప్నిక. గోవర్ధన్ భార్య లేకుండా కూతురిని చాలా గారాబంగా పెంచుకుంటాడు. స్వప్నికను కిరణ్ మాస్టారు ఆటలలో ప్రోత్సహిస్తాడు.
అజయ్ అనే వ్యక్తి వచ్చి చక్రి ప్లాస్టిక్ ఇండస్ట్రీని ఆ ఏరియా నుండి తీసేయాలని వారించిన గోవర్ధన్ ను ఆ ఇండస్ట్రీ యజమాని చక్రవర్తి కుమారుడు అజయ్ వచ్చి బెదిరిస్తాడు . కీర్తి ఒక ఆశా వర్కర్ . చక్రి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ గురించి రిపోర్ట్ తయారుచేసింది డ్యూటీ నుంచి వస్తుండగా ఆమెకు యాక్సిడెంట్ చేయించి చంపేస్తాడు. ఆ కీర్తి గోవర్ధన్ భార్య. ఈ విషయం గుర్తు చేసిన అజయ్ తో ఆ బెదిరింపుకు బెదిరేది లేదంటాడు గోవర్ధన్. మాట వినకపోతే తన కూతురిని అలాగే చేస్తామని బెదిరించి వెళ్తాడు అజయ్.


స్వప్నిక ఆటలు ఆడుతుండగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది . ఆ పరిస్థితుల్లో డాక్టరుకి చూపించుకోగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది .ఇకపై ఆటలు ఆడకూడదని డాక్టర్ సలహా ఇస్తాడు. ఆటల పట్ల ఆసక్తి ఉన్న స్వప్నిక బాగా కృంగిపోతుంది. దేన్నైనా ఇష్టపడటమే నేను చేసే తప్పా అని సూటిగా ప్రశ్నించిన స్వప్నిక తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న దానికి కారణం బ్రహ్మ రాసిన రాత అని వివరిస్తాడు గోవర్ధన్. స్వప్నిక బ్రహ్మను ప్రశ్నించగా బ్రహ్మ వచ్చి స్వప్నికతో మాట్లాడే వృత్తాంతం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈనాటికలో మనుషుల గురించి మనుషుల మనస్తత్వం గురించి బ్రహ్మతో చెప్పించడం నాటికలోని వైవిధ్యం. మనిషి జీవితానికి సైన్స్ కి ఆధునికతకి సాంకేతికకి మధ్య మనిషి ఏం చేస్తున్నాడో ఆలోచింపచేస్తుంది ఈ నాటిక. స్వప్నికకు ఏం జరిగింది గోవర్ధన్ స్వప్నికకు ఏం చెప్పాడు చివరకు ఏం జరుగుతుంది తెలియాలంటే రాతనాటిక చూడాల్సిందే !
రాతను రచించిన శ్రీనివాసరావు పోలుదాసు ప్రస్తుతం మనల్ని పట్టిపీడిస్తున్న సమస్యను పరిమిత పాత్రలతో ప్రేక్షకులను ఆలోచింపజేసేలాగా రచించారు. 28 ప్రదర్శనలు అనేక బహుమతులు అందుకున్న రాతనాటికకు తండ్రి గోవర్ధన్ పాత్రను రచయిత దర్శకుడు అయిన శ్రీనివాసరావు పోలుదాసు ముఖ్యపాత్రను పోషించారు. స్వప్నిక గా సురభి వాగ్దేవి ఎక్కడ తడుముకోకుండా డైలాగులను చెబుతూ పాత్రకు జీవం పోసింది . మాస్టారుగా కిరణ్ పాత్రలో సురభి రాఘవ , అజయ్ పాత్రలో పవన్ కళ్యాణ్, బ్రహ్మ పాత్రలో దిలీప్ …తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఏనాటిక విజయవంతంగా ప్రదర్శించబడిందని చెప్పినా విన్నా దాని వెనక సాంకేతిక నిపుణుల సహకారం ఎంతైనా ఉంటుంది. సంగీతం అందించింది సురభి నాగరాజు, ఆహార్యం సురభి రాఘవ, సెట్ మరియు లైటింగ్ సురభి ఉమాశంకర్, సహకారం బుగ్గోజు జయరాం. ఈనాటిక ప్రదర్శకులు వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ , వెలగలేరు, కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా. సామాజిక సమస్యలపై దృష్టి సారింపజేసే ఇటువంటి నాటికల ప్రదర్శన నేడు అత్యవసరం అందుకు పూనుకున్న శ్రీనివాసరావు పోలుదాసు సర్వదా అభినందనీయుడు.


డేంకణి కోట కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మిగారి భక్తి భండారి- సాహిత్య సంభారి అనే పుస్తక రచయిత్రి రంగరాజు పద్మజ గారు. రంగరాజు పద్మజ గారు 1953లో మహబూబాబాద్ ఇనగుర్తి లో జన్మించి ప్రస్తుతం జనగామ వాసిగా ఉన్నారు. వీరు గృహిణి. హరిదాసి, మనసే కోవెల ,గుండె లోతుల్లోంచి, వ్యాస వితతి ,చిత్ర కవితలు, నాటి నుంచి నేటి వరకు, ఖడ్గ తిక్కన పద్య కావ్య పరిష్కృతం , కవిత విరిమాల వంటి అనేక రచనలు చేసిన విదుషీమణి.
వ్యాఖ్యాన సామ్రాజ్ఞి, సహస్ర పద్య కంఠీరవ, ఆర్ష ధర్మ ప్రదీపిక బిరుదులు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మాతృ వందనం , తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి వరిష్ఠ పురస్కారం, సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం , అక్షరయాన్ అభిజ్ఞ నుంచి వెంగమాంబ పురస్కారం అందుకున్నారు. ఒద్దిరాజు సోదరులలో ఒకరైన రాఘవ రంగారావు గారి పుత్రికగా తెలంగాణ వేగుచుక్కలైన తండ్రి బాటలో నడిచి సాహిత్యాన్ని పండించారు.
పరిశోధనాత్మకంగా చేసిన వీరి రచన డేంకణి కోట కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మి గారి గురించిన రచన. భక్తి భంఢారి సాహిత్య సంభారి శీర్షికలోనే జయలక్ష్మి గారు ఒక భక్తి భండారమని సూచించారు . శ్రీ జిఎస్ స్వామి మంగళాశీర్వచనంతో ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారి నిర్మల చరితం పేరుతో చక్కని సమీక్షతో ప్రారంభమైంది వీరి రచన. ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారు అన్నట్లు రంగరాజు పద్మజ గారు ఎంతో ప్రతిభ పూర్వకంగా ఔచిత్యం, ఆంతర్యం, సారం ఏమాత్రం చెడకుండా సుదీర్ఘ వర్ణనలను కుదిస్తూ సరళా కృత వ్యవహారికానువర్తనం చేసి విద్వజ్జనుల ఆమోదం పొందారని చెప్పిన వాక్యాలు అక్షర సత్యాలు.

డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు ఏ యే ప్రకరణాన్ని రంగరాజు పద్మజ గారు ఎలా పరిచయం చేశారో వివరిస్తూ పాఠకులకు వడ్డించిన విస్తరిలా రచించారని ప్రశంసించారు. చక్కని శైలి అవసరానికి మించని వ్యక్తికరణలతో జీవిత సాహిత్య గ్రంథ రచనలకు మార్గదర్శకంగా సాగిన గ్రంథమని ఆదర్శవంతమైన అనుశీలన అని అభివర్ణించారు.
ఆచార్య ఇ సత్యనారాయణ గారు ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు రచించిన ముందు మాటలు డేంకణి కోట తాముండే కుప్పం దగ్గరలోని అని చెబుతూ ఈ రచన ద్వారా బడిలో పెద్దగా చదవని జయలక్ష్మి గారు చేసిన వేలాది రచనలు మనకు తెలిసేలా రంగరాజు పద్మజ గారు చేశారని ఆనాటి సామాజిక కట్టుబాట్ల మధ్య మహిళా సాధికారికత సాధించిన మహిళ జయలక్ష్మి అన్న విషయం తెలిసిందని అన్నారు.
అయినంపూడి శ్రీలక్ష్మి గారు అక్షరయాన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రచించిన ముందుమాటలో అసలు ఎవరు ఈ జయలక్ష్మి అంటూ ఒక పరిశోధక విద్యార్థిలా జయలక్ష్మి గారి గురించి వివరాలు సేకరించి రచించారని ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభమైన కథని అనేక విషయాలు తెలుసుకొని కష్టపడి రచించిన రచన అని ఆ సామర్థ్యం రంగరాజు పద్మజ గారిలో పరిపూర్ణంగా ఉండడం వల్లనే అక్షరయాన్ మాతృ వందనం పురస్కారంతో సత్కరించామని అన్నారు.
జయలక్ష్మి గారి సంతానం కూడా తల్లిని గురించిన మనోభావాలను ముందుమాటలో పంచుకుంటూ హైదరాబాద్ నుంచి హోసూర్ కు వచ్చి మా తల్లి గారి గురించి వివరాలు సేకరించి క్రోడీకరించి రాయడం పట్ల ముగ్గులై రంగరాజు పద్మరాజు గారి శైలికి ధారణా శక్తికి ఆశ్చర్య పడుతూ పుస్తకం తీసుకురావడంలో తోడ్పడిన అయినంపూడి శ్రీలక్ష్మి గారికి సహకారం అందించిన శ్రీ అరుణ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. రంగరాజు పద్మజ గారు ప్రచురించిన అక్షరాలు జయ లక్ష్మమ్మకు స్వర్గ కానుకలు గా భావించారు.
డా కొండపల్లి నిహారిణి తన ముందు మాటలో పుస్తకం శ్రద్ధగా చదివి ఆనందిస్తూ తరిగొండ వెంగమాంబ మంజరి ద్విపద లో రాసిన ఆ లక్షణాలను వీరి రచనలో చూడవచ్చు అన్నారు భక్తి దారుల్లో పయనించిన రంగరాజు పద్మజ గారు భక్తి బండారి 300 పైగా పేజీలతో జీవిత చరిత్ర నా నవలనా అని ఆసాంతం చదివింపజేసే రచనగా రచించారని అదే రంగరాజ పద్మజ గారి గొప్పతనం అని అన్నారు.70 వ దశకం లో వీరి ఈ రచన తప్పక చదవాలని సూచించారు
ఆప్త వాక్యం పలుకుతూ రంగరాజు పద్మజ గారు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక రచయిత్రి ఆత్మకథ దీనిని ఆ భగవంతుడే నా చేత రాయించాడని అన్నారు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పుస్తకం లోపలికి ప్రవేశిస్తే ఇది మొత్తం ఆరు ప్రకరణాలుగా రూపొందించబడింది మొదటి ప్రకరణంలో జయలక్ష్మి గారి జీవితం గృహిణి ధర్మం జీవితంలో ఒడిదుడుకులు సాహిత్య రచనపై ప్రవేశం కలిగించిన అంశాలున్నాయి రెండవ ప్రకరణంలో ద్వాదశి మణిమాలలను గురించి రాశారు అప్పటికి తెలుగు రాక తమిళ లిపిలో రాసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. మూడవ ప్రకరణంలో జయలక్ష్మి గారు రచించిన ఖండకావ్యాలు శ్రీరామ కథామృతం శ్రీమద్ భాగవత ఆణిముత్యాలు పరిచయం ఉంది నాలుగవ ప్రకరణములు రంగరాజు పద్మజ గారు జయలక్ష్మి గారు రచించిన అనుభవాలు వారి కుమారులు చెప్పిన అనుభవాలను వివరించారు ఐదవ ప్రకరణంలో ఆ అనుభవాలు కొనసాగిస్తూ వీరి కుమారులు చెప్పిన అంశాలను ఎక్కువగా ప్రస్తావించారు ఆరవ ప్రకరణంలో శ్రీమతి జయలక్ష్మి గారి సాహిత్య జీవనం సమీక్షాత్మకంగా రచించారు.
డేంకణి కోట కోట జయలక్ష్మి గారు 1923 లో జన్మించారు సరిగా 102 సంవత్సరాల అయింది 27 లో స్వర్గస్తులయ్యారు 94
సంవత్సరాల నిండు జీవితం బాల్యంలో పదేళ్ల నుంచి గో సేవ పాలు కాయడం పెరుగుచిలకడం వెన్న తీయడం పిడకలు చేయడం ఇల్లు అలకడం వాకిలి చిమ్మి ముగ్గులు వేయడం వంటివి ఆ కాలంలో అందరి స్త్రీల వలి చేశారు కానీ ఇదే నా జీవితం ఇంకా ఏదో ఉందని అనుకున్నారు అలా అనుకోవడమే ఈరోజు మనం ఆమె గురించి ముచ్చటించుకునే దశకు చేరుకుంది.
ఆ కాలంలో ఉన్న మహిళలలో అరుదుగా కనిపించే విదుషీమణి జయలక్ష్మి గారు. ఈ పుస్తక రచన రంగరాజు పద్మజ గారు రాయడానికి ఎందుకు పూనుకున్నారంటే మనలో కొందరు కవిత్వం రాస్తారు కొందరు నవలలు కొందరు పద్యాలు కొందరు నాటికలు కానీ అన్ని ప్రక్రియలను సృజించిన కవయిత్రి జయలక్ష్మి గారు.
ఆమె జీవిత చరిత్ర ద్వారా రచయిత్రి రచనా కాలంలో సామాజిక గమనం పరిణామాలు స్త్రీలు వంటగదికే పరిమితమయ్యే కాలంలో అనేక రచనలు చేసిన మహిళా మణి గురించి రాయడం వల్ల ఈ రచన ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశాభావంతో రంగరాజు పద్మజ గారు ఈ రచన చేశారు .
జయలక్ష్మి గారి తల్లిదండ్రులు వెంకటరమణ అయ్యగారు లక్ష్మీ గారు జయలక్ష్మి గారి కుమారులు శ్రీరామమూర్తి గారు శ్రీ శ్రీనివాసన్ గారు వీరి కుమార్తె రమామని గారు జయలక్ష్మి గారు సింగమనే గ్రామంలో తిరువన్నామలైకు దగ్గరలో ఉన్న గ్రామంలో అమ్మమ్మ గారింట జన్మించారు. జయలక్ష్మి గారు ఉన్నది తమిళనాడులో . అక్కడ గ్రామ పాఠశాలలో మూడవ తరగతి అవగానే బడి మాన్పించారు అంతకుమించి వయసుగల వారిని బడికి పంపరాదు అని నియమం.
అప్పటి కాలంలో చిన్న వయసులోనే వివాహాలు జరిగేవి. తనలో ఒక భావన వెంకటేశ్వర స్వామి తన భర్తని దానికి తగినట్లు ఆమెకి చూసిన సంబంధం వరుడు వెంకట రామయ్య గారు వారు చదివింది ఎస్.ఎస్.ఎల్.సి చివరికి తన భర్తని వెంకటేశ్వర స్వామి అనుకున్నారు జయలక్ష్మి గారికి నలుగురు సోదరీమణులు. అక్కడ పేదరికంతో పెరిగి మెట్టినింట కూడా అదే కొనసాగి అత్తింటి ఆరళ్లతో అనారోగ్యం పాలయ్యింది. జయ లక్ష్మీ గారి భర్త ఇంట వారి దూరపు బంధువు అమ్మాళమ్మ గారు భర్త మరణించి వీరింట చేరారు. మరో బంధువు సుందరయ్య కూడా వారింట ఉండేవారు. భర్త వెంకటరామయ్య గారి కుటుంబంలో వారి తల్లిదండ్రులు రామక్కమ్మ వెంకటసుబ్బయ్య గార్లు.. వారికి నలుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు అందులో పెద్ద కొడుకు వెంకట రామయ్య గారు వారి భార్య జయలక్ష్మి గారు. వెంకటసుబ్బయ్య గారి పెద్ద కూతురు లక్ష్మికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు .ఐదవ సంతానం 15 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు లక్ష్మీ గారు మరణించారు వారంతా వెంకటసుబ్బయ్య గారి ఇంట్లో చేరారు. రెండవ కూతురు అన్నపూర్ణమ్మ ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు . ఆమె కూడా కూతురు జన్మించాక మరణించారు. ఆ పిల్లల పోషణ కూడా వీరిదే సరిగ్గా జయలక్ష్మి గారి వివాహమై కోడలుగా వచ్చాక ఆ ఇంట్లో ఐదుగురు మేనల్లుళ్లు ,ముగ్గురు మేనకోడళ్ళు ,తన వయసున్న ఆడపడుచు తనకన్నా పెద్దవారైనా ఇద్దరు మరుదులు అత్తగారు మామగారు ఇంతకు పూర్వం మనం చెప్పుకున్న అమ్మాళమ్మ, సుందరయ్య వెరసి 17 మంది. మీరు కాకుండా వచ్చే పోయే బంధువులు. అన్ని పనుల భారం తన మీద పడేది. చెప్పుడు మాటలు విని భర్త కూడా ఆమె మనసును గాయపరిచేవారు . ఎవరికోసం బతకాలి అనే ఆలోచన మారేగానపల్లెలో అనుకొని గడిపారు జీవితం.
భర్త అక్కడ నుంచి బెంగళూరులో ఉపాధ్యాయులుగా చేరారు. భర్త అక్కడ భార్య ఇక్కడ చాకిరీ చేస్తూ వారి ఇంట్లో ఉన్న అమ్మాళమ్మ గారు జయలక్ష్మి గారిని చెంగం గ్రామానికి వెళ్లి సాకమ్మ రామాయణం రాసుకోమన్నారు అమ్మాళమ్మ , సుబ్బాలమ్మ ఇద్దరి వద్ద సాకమ్మ రామాయణం నేర్చుకున్నారు జయలక్ష్మి గారు. అక్కడ భార్య శ్రమను గుర్తించి వెంకట రామయ్య గారు జయలక్ష్మి గారిని బెంగళూరుకి తీసుకొచ్చారు. అది చిన్న ఇల్లు దేవుడి గదిలేక వంటగది గోడకి బొట్టు పెట్టి అదే దేవుడిగా భావించే ఆమె అది చూసి వారి బంధువు ఒకతను రాముల వారి పటం తెచ్చి ఇచ్చాడు. అదే ఈనాటికీ వారి కుటుంబం పూజిస్తున్నారు. ఒక స్నేహితుడు వచ్చి భర్త మనసు మార్చి జయలక్ష్మి గారిని బాధింప చేయగా తాను ఆత్మహత్యకు కూడా పూనుకొనే ప్రయత్నం చేశారు అని తెలిపారు రంగరాజు పద్మజ గారు.
సాకమ్మ జయలక్ష్మి గారి బంధువే ఈ కథనాలు లో సాకమ్మ వృత్తాంతం ఉంది తనకు నిద్రలో సరస్వతి దేవి నాలుక మీద రాసిందని సాకమ్మ చెప్పగా అందరూ సాకమ్మని గొప్ప దానివవుతామని భావించారు వీరి యక్షగానంలో ద్విపదలు పాటలు కీర్తనలు, పద్యాలు, భజనలు ఉంటాయి మచ్చుకి ఒక ఘట్టం హనుమంతుడు ఉంగరం అందుకుంటున్న ఘట్టాన్ని మనం గమనించినట్లయితే..
ఉంగరమా ఉంగరమా ముద్దుటుంగరమా !
ఓ తరుణీ నిన్నెడబాయనని పలుమారు బాసచేసెనే
ఉంగరమా ముద్దుటుంగరమా!
ఏక పత్నీవ్రతుడ నేను
ఏలా వగపు నీకు అనెనే
ఉంగరమా ముద్దుటుంగరమా అంటూ గమ్మత్తుగా సాగుతుందీ యక్షగానం.
ఈ పుస్తకంలో జయలక్ష్మి గారి అందమైన చూచి రాతతో తాను స్వయంగా రాసిన పేజీలను జోడించడం పుస్తకానికొక వన్నె తెచ్చింది . సాకమ్మ యక్షగానం రామాయణం అంకితం వివరాలను కూడా పొందు పరిచారు.
జయలక్ష్మిగారు భరించిన కష్టాలలో కొన్ని ఇంట్లో ఉన్న అమ్మాళమ్మగారు తన కూతురు మనవరాళ్ళు మరణిస్తే జయలక్ష్మి గారి రాక వల్లే ఇలా జరిగిందని ఆడిపోసుకున్నారు. ఆమె మానసికంగా చాలా కృంగి పోయారు . తన మూడవ కూతురు జన్మించి కొన్ని నెలలకే చనిపోవడంతో ఆ బాధలు మరింత పెరిగాయి. అయినా ఇంటిల్లిపాదికీ సేవలు చేసారు. 95 ఏళ్ల వరకు చైతన్య వంతంగా గాన మాధుర్యంలో తేలిపోతూ జీవించారు తళి అనే గ్రామంలో ఈ సమీపంలో వేణుగోపాల స్వామి శ్రీరాముని గుడులు ఉండేవి అక్కడకు వెళ్లి పద్యాలు కీర్తనలు పాడితే విజయలక్ష్మి గారికి పిచ్చి పట్టిందని అనుకున్నారంతా భూతవైద్యాన్ని పిలిపించి వైద్యం చేయించారు కూడా ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండగా పక్కన ఉన్న డేంకణి కోటకు బదిలీపై వచ్చారు. అక్కడ ఆమె భర్త ఇద్దరు కూతుర్లతో జీవనం గడపగా క్రమంగా ఆమె ఆరోగ్యం మెరుగైంది .1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడే ఆమె బాధలకు విముక్తి కలిగిందని రచయిత్రి చెప్పడం ఔషధంగా అనిపించింది.

తన దైనందిక దినచర్యను రంగరాజు పద్మజ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు పనివారు లేకుండా సమస్తము చేసుకుంటూ మధ్య మధ్య యక్షగానాలు ఆలపించే వారిని అందరికీ తన పాటలతో మేలుకొలుపులు పాడేవారని సూర్యుడికి , వీరుడికి మేలుకొలుపులు తులసికి మేలుకొలుపులు కూడా పాడేవారు.
కరిమిప్ప బృందావనం ఎవరింట్లో ఉన్నాను
లేచి మొక్కిన వారి పాపములు పోవును
తులసమ్మ మేలుకొనవే తులసమ్మ మేలుకొనవే
కృష్ణ తులసి మేలుకొనవే
రామ తులసి మేలుకొనవే
లక్ష్మీ తులసి మేలుకొనవే
మేలుకొనవమ్మా తులసమ్మ మేలుకొనవే !
ఉదయం లేవగానే తన పక్కన ఉన్న నోట్ బుక్కులో ఆల్వారులు, రుక్మిణమ్మ, అయ్యంగార్లు కొందరినీ స్మరించుకునేవారు. ఆఖేట వెంకటేశ్వరుని పూజించేవారు పండుగలు పూజలు వ్రతాలు చేసేవారు పది రోజులలో పూర్తి రామాయణం పారాయణం చేసేవారు. త్యాగయ్య పురందరదాసులు రచించిన కీర్తనల మాదిరిగా తాను ఆఖేట వెంకటేశ్వరునిపై కీర్తనలు రాయడానికి పూనుకున్నారు. అలా రాసిన ఓ భాగం…
రవితేజడు నీవని రామానుజల పలుకు
ఆదినారాయణడని హనుమంతుని పలుకు
వాసు దేవుడవు నీవని వైద్యుని పలుకు
డేంకణీ ధరుడవు నీవని జయ విజయులు పలుకు
మేలుకో శ్రీ బేటనాథా మేలుకో!
ఒక ప్రవాహంలా ఉండేది జయలక్ష్మి గారి రచనలు భర్త సహకారం జయలక్ష్మి గారికి ఉండేది ఆమె తమిళంలో రాసిన వాటిని వెంకట్రామయ్య గారు తెలుగులో చేతితో రాసేవారు తన చేత్తో ఆ బేటనాథుని సుప్రభాతాన్ని రాసి అందరికీ పంపి సమీక్షించమని వారు ఒక కుమ్మరి పిల్లవాడు కూడా తెలుగులో ఆమె రచనలు రాసేవాడు జయలక్ష్మి కుమారులు కూడా కొంత భాగాన్ని తెలుగు లిపిలో రాశారు రకరకాల ఛందస్సు ఉపయోగించి పద్యాలను రచించారు తల్లిని అనుసరించి కూతురు రమామణి గారు ప్రహేళికలు ద్విపద పద్యాలు రచించారు. ఆమె సోదరులు తల్లి రచనలను విశ్లేషించి ఎన్నో పుస్తకాలు ముద్రించారు జయలక్ష్మి గారు రచించిన కీర్తనలను బంధువుల ఇంట్లో ఇళ్లలో మహిళలు నేర్చుకొని పాడేవారు ఇంత గొప్ప సమాచారం అంతా మొదటి ప్రకరణలో అమర్చారు. రంగరాజు పద్మ గారు ఆమె జీవితం తెలుసుకుంటే ఆ తర్వాత ఆమె కృషి మనకు మరింత సునాయాసంగా అర్థమవుతుందని వారి ఆశాభావం
రెండవ ప్రకరణంలో జయలక్ష్మి గారు రచించిన వివిధ కీర్తనలతో పాటు ఛందస్సు తెలుసుకొని 108 కి పైగా పద్యాలు రచించారు ఎక్కువ భాగం కందపద్యాలే. కందం రాయడం కష్టమైన పని అంటారు కానీ జయలక్ష్మి గారు సులువుగా రచించారు.
పద్యాలను 108 కూర్చి 12 శతమని మాలలను ద్వాదశ శతకమని పేరుతో గ్రంథం గా తయారు చేశారు అరవిందమనే ప్రథమ శత మణి మాల కల్యాణోత్సవ ఉయ్యాల పాట గమనించినట్లయితే
కుందనంపు కాళ్ళ చప్పరమందు
పొందినటి నీలముల గొలుసుతోను
అందమగు వజ్ర వేదిక మీద
ఆఖేట నాథా నీవు ఉయ్యాలలూగు
అని రచించారు .ఈ విధంగా ఒక్కొక్క శతమణి మాలకు ఒక్కొక్క పేరు అరవింద ,కదంబ ,నీలోత్పల ,కుండము ,చందూరము, వకుళ మాలిక, మాలతీ మాల, మాధవి మాల, చంపకమాల సేమంతీక మాల ,పారిజాతమాల, తులసిమాల అనే ద్వాదశ శతమణి మాలలను ద్వితీయ ప్రకరణములో పొందుపరిచారు.
హృదయ ప్రకరణంలో ఖండకావ్యమని కొమ్మలు భాగవత ఫలాలు , అంతర్యామి అలసితి సొలసితి, సృష్టి సాకే నటరా మధురైన అంశాలను వివరించారు ఈ ప్రకరణంలో అంతర్యామి అలసితి సొలసితిలో 14 – 8 డా- 2017 న చివరి దశలో ఆమె పక్కన శ్రీనివాసన్ ,నరసింహన్ కుమారులు ఉన్నారని తెలియజేశారు.
చతుర్ధ ప్రకరణములు అనుభవాలు జ్ఞాపకాలు పిల్ల తెమ్మెరలు
వరుసగా వివిధ సందర్భాలలో జయలక్ష్మి గారి అనుభవాలను వేంకటేశ్వరుని సాక్షాత్కారమును వెలుగు రేఖ కనిపించడం వంటి వాటితో విషాద పరిచారులలో రమామని రామమూర్తి శ్రీమతి ఉషా రామమూర్తి జానకి నరసింహ వీరంతా కుటుంబ సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు ఏ విధంగా నడుస్తున్న చరిత్రలో వ్యాసం ప్రచురింపజేసారో వివరించారు.
ఐదవ ప్రకరణంలో పట్టి కలలో వచ్చిన పుస్తక ఆవిష్కరణల వార్తలు జయలక్ష్మి గారిని ప్రశంసిస్తూ వచ్చిన కథనాలు పద్య పుష్పాంజలి శతజయంతి సంచిక శ్రీరామ కథామృతం జయలక్ష్మి గారి ఇంటర్వ్యూలు అన్ని పత్రికలలో వచ్చిన వాటి వివరాలను పొందుపరిచారు చేతిరాతతో రాయించి పుస్తకాలు ముద్రించి వేయ ప్రయాసలతో పుస్తకావిష్కరణలు చేయించారు ద్వాదశ శతమణి మాల సిడిలను ఆవిష్కరించారు.
అస్వస్థులై 25 -1 – 2006న వేంకట రామయ్య గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు తర్వాత ఈ పుస్తకంలో ఇదే ప్రకరణలో జయలక్ష్మి గారి వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించారు.
షష్ఠమ ప్రకరణంలో ఆసక్తి కలిగించే అంశం ఆ కాలంలో అది తమిళనాడు తెలుగులో డిటిపి అందుబాటులో లేదు తమిళ మాధ్యమంలో చదివిన సంతానానికి రెండవ కుమార్తె రమామని పెద్ద కుమారుడు రామమూర్తిలకు మాత్రమే తెలుగు చదివారు 1988లో శ్రీ పెరంబదూర్ ఆది కేశవ పెరుమాళ్ దేవాలయ జీయర్ గారు దేనికని కోట ప్రవచనాలు చేయడానికి ఆకీట వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి కొడుకు నరసింహాని చూపించిన జయలక్ష్మి గారి రాతప్రతి చదివి పుస్తకం ప్రచురించినప్పుడు స్వయంగా ముందుమాట రచించడం ఇది గొప్ప ఆశీర్వచనం.
నడుస్తున్న చరిత్ర పత్రికలో తిరువళ్లిన్నేణి మహత్మ్యం అని వ్యాసం ప్రచురించబడింది. డేంకణి కోట వెంకటేశ్వర స్వామి సుప్రభాతం తమిళం తెలుగు సంస్కృత భాషలలో టీకా తాత్పర్య సహితంగా ముద్రించబడింది.2007 లో ఆఖేట వేంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అది దేవాలయంలో ఆవిష్కరణ జరిగింది సుప్రభాతం సిడి సౌమ్య అనే గాయని చేత పాడించి సిడి రూపంలో విడుదల చేశారు 2018లో నిహాల్ స్వరంలో అష్టోత్తర శతనామావళి ఆడియో విడుదల చేశారు ఆంధ్రజ్యోతిలో వీరి గురించి ముఖాముఖి వచ్చింది.
జయలక్ష్మి గారి రచనలు మొదటి గ్రంథం ద్వాదశ శతమణి మాలలు 12 శతకమణులు సంపుటి దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రథమ తృతీయ దశమ ఏకాదశ ద్వాదశ శతమణులు కీర్తనలు . ద్వితీయ పంచమ, షష్ఠమ, సప్తమ ,నవమ శతమణులు తెలుగు పద్యాలు శతమణి మాల పాశురము అనే తమిళ భాష రూపంలో ఉంది.
మరొక ప్రత్యేక రచన శ్రీరామ కథామృతం 2019లో వెలువడింది మధ్య పుష్పాంజలి అనే పుస్తకం వందలాది కవీశ్వరులు జయలక్ష్మి గారి రచనలను అభినందించి వ్రాసిన పద్యాలు.
ఈ విధంగా 39 సంవత్సరం నుండి రచనలు చేయడం ప్రారంభించిన జయలక్ష్మి గారు 12 శతకాలు ఐదు కావ్యాలు శ్రీరామ కథామృతం 30 ప్రబంధాలు కథనాలు 600 వరకు కీర్తనలు సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి , మంగళ శాసనం కరావలంబ స్తోత్రం మొదలైనవి రచించారు. స్థల చరిత్ర సంక్షిప్తంగా పద్యాల రూపంలో సమగ్రంగా వచనంలో రచించారు.
మరొక విశేషం తెలుగు భాషలోనే కాదు సంస్కృతం తమిళ కన్నడ భాషలలో కొన్ని కీర్తనలు పద్యాలు సెయ్యుళ్ళు రాసారు. విశేషమైన వీరి కృషిని ఈ రకంగా దేనికని కోట కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మి గారి గురించి భక్తి బండారి సాహిత్య సంబారి అనే శీర్షికతో ఒక పరిశోధనాత్మక గ్రంథానికి ఏ మాత్రం తీసుకోకుండా తమిళనాడు ఉన్న తెలుగు దేశాన్ని ఆమె సాహితీ సంపత్తిని మన ముందుకు తీసుకువచ్చారు రంగరాజు పద్మజ గారు .
ఆమె శైలి సులభంగా అలతి అలతి పదాలతో అలవోకగా ఆద్యంతం చదివింపజేసింది. తీసుకున్న ఇతివృత్తం ఎవరికి తెలియని ఒక విజ్ఞాన ఖనిని అక్షరార్చనతో మన ముందు నిలబెట్టింది జయలక్ష్మి గారి రచనల జాబితా లెక్కలేనంత ప్రింట్ లో ఆరు పేజీల వరకు ఉంది.
ఆమె చేసిన సాహితీ కృషి అనన్యం అద్వితీయం అటువంటి మహత్తర మనిషి జీవితాన్ని రచనలను వెలుగులోకి తెచ్చిన రంగరాజు పద్మజ గారు అనే అనేక అనేక అభినందనలకు పాత్రులు ఈ పుస్తకం వెలికి తెచ్చిన కుమారులు పుస్తకం ఆవిష్కరణ అధ్యక్షత బాధ్యతలను చేపట్టి రంగరాజు పద్మజ గారిని గౌరవించిన అక్షర అధినేత్రి అయినంపూడి శ్రీ లక్ష్మీ గారికి మన పూర్వక అభినందనలు. వారి కుటుంబ సభ్యులకు శుభాభినందనలు. ఆశీస్సులు.
మనం నిత్యం అనే కానేక సమస్యలతో సతమతమవుతూ ఉంటాం సమస్యలు లేనిది ఎవరికి ? కొందరికి కొంచెం. మరికొందరికి పుట్టెడు. ఎన్ని ఉన్నా మన సంకల్పంతో తాను దైవాన్ని నమ్మి 95 సంవత్సరాలు యక్షగానాలతో కీర్తనలతో పద్యాలతో సుప్రభాతాలతో, అష్టోత్తరాలతో , రామ గానామృతంతో అనేక రూపాలుగా తన హృదయం తన అక్షరం పరిపూర్ణం చేసుకొని మనందరికీ ఆదర్శప్రాయంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిన డేంకణి కోట కీ.శే. శ్రీమతి జయలక్ష్మి గారికి స్మృత్యంజలి ఘటిద్దాం.
.
రచయిత్రి: మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన సాంఘిక నవల . పశ్చిమగోదావరి కృష్ణ గుంటూరు జిల్లాలలోని వ్యవసాయ కుటుంబాలు వంద సంవత్సరాలలో నాలుగు తరాల జీవిత చిత్రాలను చిత్రీకరించినటువంటి నవలగా మట్టి మనిషి మలచబడింది. ఈ నవల ప్రత్యేకత 14 భారతీయ భాషలలోకి అనువదింపబడడం . దీని యొక్క కథ నేపథ్యం భూస్వామి ధనిక రైతు దళారి వ్యవస్థ మధ్య ఉన్న సంఘర్షణని చిత్రీకరించినటువంటి నవల. ప్రధాన పాత్రధారి సాంబయ్య అనే రైతు . అతని భూమి కుటుంబం అతని తర్వాత వంశం ఎటువంటి సంఘర్షణలకు లోనయ్యారు అన్నది వివరిస్తుంది. ఈ నవల లో సాంబయ్య కు భూమి పట్ల గల ప్రేమను కళ్ళకు కట్టినట్లు చూపించారు . భూమి అనేది రైతుకు జీవితంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నది ఈ నవలలో ప్రస్ఫుటంగా వివరించే ప్రయత్నం చేశారు వాసిరెడ్డి సీతాదేవి గారు.

39కి పైగా నవలలు 100కి పైగా కథలు రచించినటువంటి ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు. వీరి మరీచిక నవలను ఆనాటి ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత అది తొలగిపోయింది. సీతాదేవి గారు 2000 లో మట్టి మనిషి నవలను రచించారు. కొన్ని నవలలు ప్రజానాయకుడు , మనస్సాక్షి, ఆమెకథ , మృగతృష్ణ మొదలైనవి సినిమాలుగా వచ్చాయి.
జవహర్ బాలభవన్ డైరెక్టర్ గాను ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గారు పని చేసారు. కొన్ని అనువాదాలు కూడా. 5 సార్లు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. రచయిత్రిగా ప్రత్యేక స్థానం పొందిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి.
నాటకీకరణ :
ఈ నవల నాటకీకరణ కు పూనుకున్న రచయిత శ్రీ వల్లూరు శివప్రసాద్ గారు. కథా , నాటక రచయితగా సాహితీ లోకంలో విశేషంగా కృషి చేస్తున్నారు . 70 కి పైగా రచించిన కథల్లో 30 కి పైగా బహుమతులు పొందినవి. గత సంవత్సరం వీరు రచించిన కొరివి కథకు అనిల్ కథలపోటీలో 25 వేల బహుమానం అందుకున్నారు. అనేకమైన నాటికలు రచించారు . 25 నాటికల సంపుటిని ఇతర సంపుటులు వెలువరించారు. శ్రీ చక్రం , ఎడారికోయిల, మిస్సెడ్ కాల్స్, ధ్వంస రచన , క్షతగాత్ర గానం, హింసధ్వని వంటి పలు నాటికలు ,నాటకాలు , శ్రవ్య నాటికల సంపుటి వీటన్నింటితో పాటు అరసం ప్రధాన సంపాదకులు గా పలు సంపుటాలను వెలువరించారు . నాటక చర్చా కార్యక్రమాలు నిర్వహించారు.


దర్శకత్వం:
మట్టి మనిషి నాటకం దర్శకత్వం చేసిన వారు. యస్ యం బాషా గారు . అనేక నాటకాలలో నటించి , దర్శకత్వం వహించిన బాషాగారు స్వయంగా ఈ నాటకంలో కీలకమైన కనకయ్య పాత్రలో నటించి నాటకమంతా తనదైన పాత్రతో హుషారుతనం జోడించారు. నాటకానికి నిండుతనం ఈ పాత్రలోనే అన్నట్లుగా తనదైన నటనను ప్రదర్శించారు.
కథాంశం :
మట్టి మనిషి పెద్ద నవల. కథలో పాత్రలు వీరభద్రయ్య దగ్గర పాలేరుగా వెంకయ్య పని చేసేవారు . ఆ పాలేరు వెంకయ్య కొడుకు సాంబయ్య. యజమాని అయిన వీరభద్రయ్య కొడుకు బలరామయ్య. బలరామయ్య కూతురు వరూధిని.
సాంబయ్య కొడుకు వెంకటపతి. తండ్రి పాలేరుగా పడిన అవస్థ నుంచి బయటపడి ఏనాటికైనా తనకు కొంత భూమి సమకూర్చుకుని స్వంతంగా వ్యవసాయం చేసి ఆ భూమిని క్రమంగా పెంచుకుంటూ పోవాలని తాపత్రయం సాంబయ్యది . దాని కోసం చాలా కష్టపడి భూమిని కంటికి రెప్పలా చూసుకుని క్రమక్రమంగా కొన్ని ఎకరాల భూమి ఇల్లు సంపాదిస్తాడు.


ఈ క్రమంలో భార్య సహాయం కూడా తీసుకుంటాడు . తీరా భార్య పురిటి నొప్పులతో ఉంటే పంట నూర్పిడి చేయిస్తూ పని కొందరికి అప్పగించి భార్య దగ్గర కు వస్తాడు మగబిడ్డ పుట్టాడని మురిసి పోయాడు. కానీ భార్య అనారోగ్యం తో ఉందని బయట పట్నం ఆసుపత్రికి తీసుకు వెళ్ళాలని నాటు వైద్యుడు చెప్పగానే అయోమయం లో సరైన నిర్ణయం తీసుకోలేక పోతాడు. ఫలితంగా భార్యను కోల్పోతాడు.
పొలం పనుల ధ్యాసలో వేరే వివాహం చేసుకోకుండా కొడుకు వెంకటపతి ని కూడా తన బాటలో నడిపిస్తాడు.
పెంచుకున్న భూమి తనలో ఆశను పెంచింది . ఏ యజమాని దగ్గర తన తండ్రి పనిచేసాడో అదే యజమాని కొడుకైన బలరామయ్య తన కూతురైన వరూధినిని తన కొడుకు వెంకటపతికిచ్చి కాళ్ళు కడిగించాలనుకుంటాడు. వరూధిని కోడలిగా ఇంట్లో అడుగు పెడుతుంది. మొగ దిక్కులేని ఇంటిని అందంగా తీర్చిదద్దినట్లు చేసి ఇంటిని భర్తను తన అధీనంలోకి తీసుకుంటుంది.
మామ గారైన సాంబయ్య కష్టార్జితాన్ని తన ఆలోచనలు విలాసం కోసం వినియోగించి తన స్నేహితుడైన రామనాథం సినిమా థియేటర్ యజమానితో చేతులు కలిపి , మరో డి.ఎస్పీని కలుపుకుని పెట్టుబడులు పెట్టి భర్తను తాగుడుకు బానిస చేసి ఉన్నదంతా కోల్పోతుంది. ఈ ప్రక్రియలో లాయర్లు నమ్ముతుంది. అందుకు తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటుంది. కోలుకోలేని ఎదురు దెబ్బకు బలౌతుంది . భర్త వెంకటపతి తండ్రికి ముఖం చూపలేక కొడుకైన రవిని సాంబయ్య ఉండే చోట వదిలి వెళ్ళిపోతాడు.
మనవడు రవి వచ్చి సాంబయ్య ను చేరగానే సర్వం కోల్పోయిన దుఃఖం లో ఉన్న సాంబయ్య కు ప్రాణం లేచి వస్తుంది. మనవడు తన వారసుడు తిరిగి తనకు పొలం సమకూర్చాలని తాపత్రయంతో బంజరు భూమిని తన దగ్గర ఉన్న నగలు తాకట్టు పెట్టి కూరగాయలు మనవడికి చూపిస్తూ పని నేర్పుతూ పంట పండిస్తాడు. ఈ క్రమంలో తాతా మనవడు సంభాషణలు రైతుకు పొలం పట్ల మట్టితో ఉన్న అనుబంధం వివరించబడుతుంది.
పంట చేతికి వచ్చే సమయానికి పొలం అప్పచెప్పిన కనకయ్య అది తన భూమి అని పోలీసులను తీసుకొస్తాడు. చేతికొచ్చిన పంట భూమి నీది కాదు అన్న మాట జీర్ణించుకోలేక ఆ మట్టిలోనే ప్రాణం విడుస్తాడు సాంబయ్య. సాంబయ్య చనిపోవడం తట్టుకోలేక చిన్నవాడైన రవి కర్ర తీసుకుని కనకయ్యని కొట్టబోగా అది పక్కన ఉన్న కామందు తలకు తగిలి రక్తం కారుతుంది. హత్యా ప్రయత్నం చేసాడని పోలీసులు రవిని అరెస్ట్ చేస్తారు. రవి తిరిగి వస్తా నీ అంతు తేలుస్తా అనడంతో కథ ముగుస్తుంది.
హైదరాబాద్ రంగభూమిలో ప్రదర్శన:
మట్టి మనిషి నాటకీకరణ చేసి మొదట్లో నాలుగు గంటల నాటకం గా గతంలో ప్రదర్శనలిచ్చారు. ప్రస్తుతం 3 గంటలకు కుదించిన నాటకాన్ని ఇటీవల రంగభూమి లో ప్రదర్శన మే నెల 31, జూన్ 1 వ తేదీ రెండు రోజులు ప్రదర్శన ఏర్పాటు చేసారు. విజయ వంతంగా రెండు ప్రదర్శనలు జరిగాయి. నాటకం చూసేందుకు సీతాదేవి గారి కుటుంబం నుంచి కృష్ణకుమారి గారు మరి కొందరు వచ్చి పారితోషికం అందజేసారు.
నటీ నటులు:
నాటకం ముందు ప్రస్తావన తో మధ్య మధ్య జరిగే కథనం వ్యాఖ్యానంతో సూత్రధారి గా సురభి నిఖిలేశ్ , సురభి ప్రియాంక అందరినీ ఆకట్టుకున్నారు.
ప్రధాన పాత్రధారి సాంబయ్య పాత్రను మొదటి దశలో పి. భుజంగరావు గారు , తర్వాత దశలో ఎం వి. రాజర్షి గారు ఇరువురూ తమ పాత్రలకు న్యాయం చేసారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. వరూధిని పాత్రలో ఎన్ షణ్ముఖి పూర్తిగా పాత్రలో ఇమిడిపోయే నటనను ప్రదర్శించింది. ఒక రకంగా వరూధిని నాటకంలో నవల పరంగా ఎక్కువ భాగం నాటకం లో తన పాత్రతో చుట్టూ ఉన్న పాత్రధారులు తో తానై నిలిచింది. ఎక్కువ సమయం ఈ సన్నివేశాలలో సాగింది. వాసిరెడ్డి సీతాదేవి గారు భూమి పట్ల పట్టింపు లేక తర్వాత తరాలు వ్యసనాలకు లోనయ్యారని తెలపడం వరూధిని తన భర్త, ఆ తరం ఎలా ప్రవర్తించారో తెలియజెప్పారు.


నాటకం ఆద్యంతం రకరకాల హావభావాలతో సమయానుకూల స్పందనలతో ఆకర్షణీయంగా , ఆకట్టుకునే నటన కనకయ్య పాత్రధారి అయిన నట దర్శకుడు యస్ ఎం బాషా గారు పాత్రౌచిత్య నటనతో నాటకంలో చైతన్యవంతమైన ప్రదర్శన చేసి అందరినీ అలరించారు. నటన దర్శకత్వం రెండు బాధ్యతలను స్వీకరించి తదనుగుణంగా నాటకాన్ని నడిపించారు.
కొడుకు వెంకటపతి గా కె. గోవర్ధన్ రెడ్డి అమాయకంగా ను , రామనాథ బాబు గా ఎస్ . డి. హసన్ మోసకారి గాను చక్కని నటనను అందించారు . నాటకంలో ఇతర పాత్రలలో సోల్జర్ షఫి డి ఎస్ పి గాను, యలమంద గా పి. తిరుమల రావు, ఏసోబు గా డి. సాయికిరణ్, రామి గా బి.సంధ్య, రత్తమ్మ గా సాయి దీపిక , ఆచారిగా , గురునాథంగా ఎం సాంబశివరావు, దుర్గమ్మ పాత్రలో , బుచ్చమ్మ పాత్రల్లో యస్ మాధవి , పాపారావుగా జె. రత్న రాజు, కాంతమ్మ గా డి. చిత్కళ, జూనియర్ వెంకటపతిగా శ్రీకర్, పోలీస్-1గా, ఆఫీస్ బాయ్ , క్లీనర్ పాత్రలలో సాయికిరణ్, పోలీస్ -2 గా దానిష్ అలీ, నటి గా రూపిక , స్త్రీలుగా చిత్కళ, దివ్య, రూపిక, సాయి దీపిక, శేషమ్మ గా సురభి ప్రియాంక , బలరామయ్య గా కె. శేఖర్ రెడ్డి , గుమాస్తాగా సుజిత్, పాపారాయుడు గా మాధవ్ , రాముడు ఎస్ వంశీ, దాసుగా పి. తిరుమలరావు, గోపాలరావుగా బి స్వరాజ్, శివరామ కృష్ణయ్య గా , మంత్రి గా , రామానందం పాత్రలలో వై. వి ఆర్ ఆచార్యులు, కృష్ణయ్య గా సుజిత్, రవి పాత్రలో దేవేష్ నటించారు.
సాంకేతిక నిపుణులు:
ఇంత పెద్ద నాటకానికి సాంకేతిక నిపుణుల సహకారం ఎంతో అవసరమైనది. ఆహార్యం పచ్చల శివ, సంగీతం సురభి నాగరాజు, కాస్ట్యూమ్ బి . సంధ్య/ ఎస్ వంశీ , కీ బోర్డ్ వై. గంగాధర్, గేయ రచన చింతలపల్లి అనంత్ , గేయ రచన సుద్దాల అశోక్ తేజ , పాటలు వసీం, డప్పు డప్పు అనిల్, లైటింగ్/ సెట్ సురభి ఉమా శంకర్/ అభి అందించగా స్టేజ్ మానేజర్ గా అభి రెడ్డి, ఆడిటోరియం మానేజర్ గా అర్షద్ షేక్, /శివరామ కృష్ణ ఆడిటోరియం అసిస్టెంట్ గా వెంకట్ లక్ష్మన్ వ్యవహరించారు. ఫొటో , వీడియో, పబ్లిసిటీ బి . సాయికిరణ్ చూసుకున్నారు. పి ఆర్ ఓ గా అర్షద్ షేక్/ సాయికిరణ్ ఉన్నారు. వీరందరి సమిష్టి సహకారం నాటకంలో నిండుతనాన్ని తీసుకు వచ్చాయి.

ఇంతమంది కళాకారులను సిద్ధం చేసుకుని సమన్వయం చేసుకుంటూ చేసిన ప్రయత్నం గొప్పది .ఈ విషయం
నాటకంలోని సాంబయ్య రవితో అన్న మాటలతో తెలుస్తుంది.
మనిషికి సంతోషం ఎక్కడుందంటావు? కష్టపడి పని చేయడంలో ఉంది . చెమటోడ్చి భూమి దున్నడం లో ఉంది. రెక్కల కష్టం అక్కరకు రావడంలో ఉంది. మన కష్టార్జితం మన చేతుల్లోకి వచ్చే ఆనందం లాంటిది ఈభూమి . దీనిని మించినది మరొక్కటి లేదురా.. అంటాడు రవితో.
బడిలో చదివే విద్యార్థికి పొలంలో పని చేసే రైతుకి సామ్యం చెప్పే ఒక గొప్ప డైలాగ్ సాంబయ్య మనవడితో అనడం . ” ఈ నేల నా పలక. నాగలే నా బలపం . పొలమే నా బడి . భూమి మీద దిద్దాను . రోజుకు ఒక్కొక్క మాట ఈ భూమే నాకు నేర్పింది. నా తల్లి , దైవం, గురువు ఈ భూమేరా రవీ! ఇప్పుడు చెప్పురా మనవడా నీ బడి గొప్పదా నా బడి గొప్పదా? “
పొలాన్ని బడిగా మార్చుకున్న మట్టి మనిషి జీవన రేఖా నాటకమిది.
దళిత చైతన్యం నింపుతూ వస్తాను భూమిని ఆక్రమించే వారి పని పట్టడానికి అని చెప్పడం ఆశావహ దృక్పథం కలిగిస్తుంది. చివరిగా మట్టిలో పుట్టిన వాడ్ని
మట్టి మీద బతికిన వాడ్ని
మట్టిలో కలిసి పోతున్న వాడ్ని
వంటి మీద మట్టి ఉండక
మరి బంగారం ఉంటుందా !
అని ప్రశ్నించిన పాత్ర మట్టి మనిషి.
మట్టి మనిషి నవల ప్రముఖ నవలలలో 13 వ స్థానంలో నిలిచిన నవలగా పేరొందడమే గాక గొప్ప నాటకంగా వల్లూరు శివప్రసాద్ గారిచే నాటకీకరణ గా మలచబడి యస్. ఎం బాషా గారు దర్శకత్వం లో రూపుదిద్దుకుని మనందరి మనసులలో స్థిరంగా నిస్సందేహంగా నిలిచి ఉండే నాటకం మట్టి మనిషి .
అద్భుతాలను సృష్టించిన నాటిక అమ్మ చెక్కిన బొమ్మ
మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.. అన్నారు తల్లిది ఎన్నటికీ ప్రథమ స్థానమే!
అమ్మ పేరులోని మాధుర్యానికి అక్షరాలతో అభిషేకించిన పాటలెన్నో..
• అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట..
• పెదవే పలికిన మాటల్లోని తీయని పలుకే అమ్మా
• అమ్మని మించి దైవమున్నదా..
ఇలా చెప్పుకుంటూ పోతే పాటలనేకం
కొత్తగా ప్రత్యేకంగా వినపడుతున్న పాట..
బొమ్మరా ఇది బొమ్మరా అమ్మచెక్కిన బొమ్మరా.. ఈ పాట మనల్ని అమ్మ ప్రేమలో ముంచెత్తుతుంది. శ్రీనిధి వీనులవిందుగా పాడిన ఈ పాట అమ్మ చెక్కిన బొమ్మ నాటికలోనిది.
మొదలు పెట్టిన కొద్ది కాలంలోనే పలువురి ప్రశంసలతో పలు ప్రదర్శనలవైపుకి విస్తరించి ప్రదర్శించిన ప్రతి చోటా అభినందనలు , అవార్డుల వెల్లువ కొనసాగుతున్న అమ్మచెక్కిన బొమ్మ . ఆ నాటకం వివరాలలోకి వెళితే …
రచయిత్రి :
అమ్మ చెక్కిన బొమ్మ నాటికను శ్రీమతి జ్యోతిరాజ్ బీశెట్టి రచించారు. ప్రముఖ నాటకరంగ దర్శకుడు, నటుడు అయిన డా. వెంకట్ గోవాడ తన తల్లి పేరు మీద నిర్వహించిన అమ్మ కథాంశంగా నిర్వహించిన నాటికలపోటీలో ద్వితీయ బహుమతి పొందిన నాటిక.
జ్యోతి రాజ్ బీశెట్టి పలు నాటకాలలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న నటి. అమ్మ చెక్కిన బొమ్మ లో ప్రధానమైన అమ్మ పాత్రను తానే నటించారు .నాటికను తనే రచించి నటించడం ఈ నాటిక ప్రత్యేకత. జ్యోతి పదకొండేళ్ళ వయసులో రేపేంది నాటికలో తొలిప్రదర్శన చేసి, తిరిగి 2017 లో “బావా ఎప్పుడు వచ్చితివీవు” నాటికతో మొదలుపెట్టి నేటి వరకు నిరంతరాయంగా నాటకాలలో నటిస్తున్నారు. శిష్లా చంద్రశేఖర్ గారి రచనల మీద ప్రస్తుతం పి హెచ్ డి చేస్తున్నారు . జ్యోతి అంతకు ముందు మూల్యం నాటికతో మంచి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు .మంచి ఇతివృత్తం , సామాజిక అంశాన్ని ఎంచుకోవడం జ్యోతి రచనకు నటనకు వన్నె తెచ్చాయి.

దర్శకత్వం : డా. వెంకట్ గోవాడ తెలుగు నాటక రంగంలో యువ నాటక దర్శకుడు నటుడు నిర్మాత ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి పూర్తిస్థాయిలో నాటక రంగానికి తమ సేవలను అందిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్ లో పీజీ డిప్లమా చేసిన డాక్టర్ వెంకట్ గోవాడ పలు నాటకాలలో విభిన్న పాత్రలను పోషించి అందర్నీ మెప్పించారు . 2013లో గోవాడ క్రియేషన్స్ ప్రారంభించి పలు నాటకాలలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు సినిమాలు సీరియల్స్ లో పాత్రలు పోషిస్తున్నారు. మూల్యం నాటికలో నటన తో పాటు దర్శకత్వం వహించి పలువురి ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం వీరి దర్శకత్వంలో అమ్మ చెక్కిన బొమ్మ రెండు తెలుగు రాష్ట్రాలలోను అందరి ప్రశంసలను అందుకుంటుంది. పరిషత్తులలో పలు అవార్డులను సొంతం చేసుకుంది.
కథాంశం: అమ్మ చేతిలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న అబ్బాయి ఎదుగుతున్న క్రమంలో కొన్ని మార్పులు గ్రహిస్తుంది తల్లి. మొదట పొరపడుతున్నాననుకుంది తర్వాత గమనించింది. అబ్బాయిగా ఉన్న కొడుకు అమ్మాయిగా ఉండటానికి ఇష్టపడటం అతనిలో మార్పులు ..తనలో జరుగుతున్న మార్పుల పట్ల సంఘర్షణ.. ఈ విషయమై తల్లి పాట్లు, భర్త విముఖత సమాజానికి భర్తకు ఎదురీది తల్లి తీసుకునే నిర్ణయం దాని ఫలితం .. వీటన్నింటి మధ్య రూపుదిద్దుకున్న నాటిక.
పాత్రలు: వెన్నెల గా రూపుదిద్దుకునే ముందు చిన్న బాబు గా దివేష్, కాస్త పెద్దయ్యాక భాను ప్రకాష్ వెన్నెలగా మారిన ట్రాన్స్ జెండర్ పాత్రలో ట్రాన్స్ జెండర్ హర్షిణి మేకల పాత్రలకు జీవం పోసారు. తండ్రిగా డా. వెంకట్ గోవాడ తల్లిగా జ్యోతి పరిణితి చెందిన కళాకారులుగా నాటకాన్ని తల్లితండ్రుల మానసిక స్థితిని భావోద్వేగ నాటకంగా మలిచి పాత్రలలో లీనమై నటించారు. బొమ్మరా ఇది బొమ్మరా పాటతో శ్రీనిధి, సంగీతం సమకూర్చిన నాగరాజ్ , ఫణీంద్ర రోహిత్ సెట్ డిజైన్.. ఇతర సిబ్బంది సహకారంతో రూపుదిద్దుకున్నదీ అమ్మ చెక్కిన బొమ్మ.

ప్రత్యేకత :
విన్నూత్న కథాంశం.. ఎదురు దెబ్బలకు తట్టుకున్న ధీరగా తల్లి పాత్ర, భర్తా బిడ్డా మధ్య బిడ్డవైవు మొగ్గు చూపిన సంఘటనలు సంభాషణలు.. ట్రాన్స్ జెండర్ల దుస్థితి వారి భవితను ఎంచుకొనే విషయంలో లేని సహకారం , ఎదుర్కొన్న వివక్ష, అవమానం చివరకు కన్న తండ్రి నిరాదరణ .. అన్నింటిని అధిగమించి చేరుకున్న లక్ష్యం ఐ ఏ ఎస్ వెన్నెల గా రూపాంతరం .. అనేక విషయాల కలబోత ఈ బొమ్మ.. తను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఏది? తను మాత్రం తన సాధనతో సమాధానమై నిలిచింది.

ప్రత్యేక ప్రశంస : ఈ నాటికలో ప్రత్యేక ప్రశంస అందించ వలసిన అమ్మ చెక్కిన బొమ్మ వెన్నెల పాత్రలో నటించిన హర్షిణి మేకల . హర్షిణి మేకల ఒక ట్రాన్స్ వుమన్, ఆమె అందాల పోటీలలో, నటనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె చిన్నతనంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె 2024 లో జరిగిన మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలలో ఐదవ స్థానంలో నిలిచారు మరియు మూడు టైటిల్స్ గెలుచుకున్నారు. తన జీవితం లాంటి ఈ నాటికలో తను నటించడం ఈ పాత్రకు న్యాయం చేసినట్లైంది. హర్షిణి నటన అందరి ప్రశంసలకు నోచుకుంది.
అద్భుతమైన కథనం రచించిన జ్యోతిరాజ్, విలక్షణంగా నటింపజేసి దర్శకత్వం వహించిన డా వెంకట్ గోవాడ, ట్రాన్స్ జెండర్ ఆత్మకథ అనిపించిన రీతిలో స్వయంగా ఆ పాత్రకు న్యాయం చేసిన హర్షిణి , తన స్వరంలో అమ్మ చెక్కిన బొమ్మను చూపిన శ్రీనిధి .. నాటకంలోని భావాలలోకి సంగీతం జోడించిన నాగరాజ్ , వెన్నంటి ఉన్న రాధ గారు స్వరాజ్ గారు తదితర బృందం మొత్తం అభినందనీయులే! ఈ మహత్తర నాటకంలో అవార్డులతో పాటు ప్రశంసల జల్లుకు పాత్రులు. మరిన్ని విజయాలను అందుకుంటూ సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల మన దారుణమైన ప్రవర్తన మార్చుకునేందుకు దోహదం చేస్తుందీ నాటిక.
భూతకాలం ప్రముఖ రచయిత దివాకర్ బాబు గారు రచించిన నాటకం దీనిని డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వంలో 90 నిమిషాల నిడివిలో రూపొందించారు. ఈ నాటకం మానవ భావోద్వేగాలు విలువలు ప్రధానమైన అంశంగా ఎంచుకొని రచించిన నాటకం.
గోవాడ క్రియేషన్స్ 15 సంవత్సరాలుగా వివిధ నాటకాలను 25 కు పైగా ప్రదర్శించారు వీరి నాటకాలు సామాజిక స్పృహను కలిగించే దిశలో మానవ విలువల మీద దృష్టిని కేంద్రీకరించి మంచి నాటకాలను అందించే ప్రయత్నం కొనసాగిస్తూ చేసేటువంటి ప్రదర్శనలు అందులో భూతకాలం ఒకటి.
ఈ నాటకం రవీంద్రభారతిలో తొలి ప్రదర్శన మార్చి 1వ తేదీన 2024లో జరిగింది.రచయిత ఎం దివాకరబాబుతో పాటు డాక్టర్ కె.వి రమణ చారి గారు ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ బ్రహ్మానందం గారు ప్రముఖ సినీ నటులు, ఎస్వీ కృష్ణారెడ్డి గారు ప్రముఖ సినీ దర్శకులు, అచ్చిరెడ్డి గారు ప్రముఖ సినీ నిర్మాత, డాక్టర్ మామిడి హరికృష్ణ గారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, శ్రీ సాయి మాధవ్ గారు ప్రముఖ సినీ రచయిత, శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారు ప్రముఖ రంగస్థలం నటులు, రచయిత ,శ్రీ గుంటూరు శాస్త్రి గారు ప్రముఖ రంగస్థల దర్శకులు, శ్రీ డి రామకోటేశ్వరరావు గారు ప్రముఖ రంగస్థల ప్రయోక్త అతిథులుగా వేదికను అలంకరించి ముందస్తుగా నాటకం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

డాక్టర్ కేవీ రమణాచారి గారు ప్రసంగిస్తూ అద్భుతమైన నాటకం అని ప్రశంసలు కురిపించి మనిషిని సృష్టించిన భగవంతుడిని ఆ మనిషికి ఏది ఎంత ఇవ్వాలో తెలుస్తుందని అన్నారు.
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు మనీషా ఫిలిమ్స్ ద్వారా విజయవంతమైన సినిమాలు తీయడానికి ప్రధాన పాత్ర వహించిన దివాకర్ బాబు రచయితగా అందరికీ సుపరిచితులని అతని కలం నుంచి వచ్చిన నాటకం భూతకాలం గొప్ప నాటకం అన్నారు. ప్రతి మాట ప్రతి అక్షరం ఆచితూచి రచించగల సాహిత్యం మీద పట్టు ఉన్న రచయిత దివాకర్ బాబు అన్నారు పలు నాటకాలను ప్రస్తావిస్తూ నాటక పరిణామ క్రమం తెలియజేశారు అద్భుతమైన నాటక విన్యాసాలను తెలియజేస్తూ నాటక ప్రక్రియకు వన్నెతెచ్చేలా భూతకాలం అనే నాటకం రచించారని ప్రశంసించారు.
శ్రీ బుర్ర సాయి మాధవ్ గారు మాట్లాడుతూ దివాకర్ బాబు గారి రేపేంది నాటకంలో నన్నుచాలా ప్రభావితం చేసింది.నన్ను నటుడిగా గుర్తింపు తెచ్చిన నాటకం అని ప్రస్తావిస్తూ భూతకాలం వంటి నాటకాలు రావాలి ఇలాంటి నాటకాలు రాయాలి ప్రేక్షకులకు మంచి నాటకాలు పిల్లలకి చూపించాలి , చదివించాలి అన్నారు. నా మంచి నాటకం అంటే కాలాన్ని గెలవడం. నాటకం అమ్మతో సమానం అమ్మని బ్రతికించండి అన్నారు.
జూన్ 30వ తేదీన కర్నూల్ లో ద్వితీయ ప్రదర్శన జరిగింది టీ జీవి కళాక్షేత్రంలో ఈ నాటకం ప్రదర్శించబడింది .
ఇక మూడవ ప్రదర్శన డిసెంబర్ 27న రవీంద్ర భారతిలో గోవాడ క్రియేషన్స్ లో రెస్రంజని ఆధ్వర్యంలో జరిగింది బుక్ మై షో ద్వారా 50 రూపాయల టిక్కెట్టుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఈ నాటక ప్రదర్శనలో ప్రత్యేకతలు విస్తృతమైన ప్రచారం సోషల్ మీడియాలో ఇన్‌స్ట్రాగ్రామ్ లో హాజరవుతున్న అతిథులతో , నాటకం చూడాలనే ఉత్సాహం చూపించిన యువతతో వీడియోలు తీసి శ్రీ సాయి తేజ అయినంపూడి ఈ నాటకంలో ఒక పాత్రధారి అయి ఉండి చక్కని ప్రమోషన్ చేయడం శుభసూచకం. ఇది భవిష్యత్ నాటికలను యువతరానికి చేర్చేందుకు సుగమమైన బాటను వేసి నాటకాన్ని టిక్కెట్ కొని చూసే దిశలో మరికొందరిని అనుసరించేందుకు చేసిన చక్కని ప్రయోగం !
నాటకం యొక్క కథా సంగ్రహం ఎలుక దేవుడి కోసం తపస్సు చేసి ఏనుగుంట బలం కావాలని కోరిన దేవుడు ఇవ్వడు అలాగే ఏనుగు తపస్సు చేసి నాకు రెక్కలు కావాలి నేను ఎగరాలి అంటే ఇవ్వదు అదే చేస్తే ఎంత అనర్ధం జరుగుతుందో దేవుడికి తెలుసు మనకి ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు అందుకే మనం నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఎన్ని పూజలు చేసిన భగవంతుడు ఇవ్వడు జీవితాన్ని జీవించాలి అనుకునేవాడు భూత కాలాన్ని పీడ కలగా భావించి విస్మరించాలి వర్తమానంలో కలలు కనాలి శ్రమించాలి భవిష్యత్తును భగవంతుడు నిర్ణయిస్తాడు.

ఆహారం, ప్రేమ సంతోషం సంతానం ఇలా సృష్టిలో కావలసిన వన్నీటిని మనకన్నా ముందే భగవంతుడు పంపేస్తాడు మనం చేయవలసిందల్లా మన మాట మనం తీసుకోవడంతో సహా కృషి చేయడం అలా కాదని అత్యాశకు పోతే మనకు అధికంగా ఏమీ రాకపోగా ఉన్నది కూడా పోతుంది కనుక
Be yourself
Live yourself
Achieve yourself
ఈ నేపథ్యం కలిగిన నాటికలు అతివ నాయక నాయకుడు కామనుడు. కామనుడు అతివను ప్రేమించగా అతివ అతను పేదవాడని తిరస్కరిస్తుంది .అది తట్టుకోలేక కామానుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక చెట్టు వద్దకు వస్తాడు. అక్కడ అతన్ని భూతాలు అడ్డుకొని తనని రక్షిస్తామని దేవుడు వరం ఇస్తే మేము రవం (రివర్స్ )ఇస్తామని నాలుగు రవాలు కోరికలుగా కోరుకోవచ్చని చెప్తారు .

దీనికి లోబడి తన బలహీనతను జయించి ఎలా నిలబడతాడు తెలుసుకోవాలంటే నాటకం ఆశాంతం చూడాల్సిందే!
నాటకంలో కామనుడిగా శ్రీ మంజునాథ , అతివగ కుమారి అనూష, ప్రధాన భూతంగా శ్రీ నిఖిలేష్ సురభి, బాబాయిగా శ్రీ స్వరాజ్ కుమార్ భట్టు, ఆడిటర్ గా డాక్టర్ వెంకట్ గోవాడ, వాస్తవ్ గా శ్రీ సతీష్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ సాయి తేజ ఐనంపూడి భూతాలుగా కుమారి దివ్య శ్రీ గణేష్ శ్రీ రుద్విఖ శ్రీ రాజేశ్వర్ శ్రీ సాకేత్ కుమారి దాక్షాయణి నటించారు నాటకం ప్రదర్శనకు అనువైన సహకారం అందించిన సాంకేతిక నిపుణులు పాటలు శ్రీ కార్తీక్ గానం శ్రీ విద్యాసాగర్ డాక్టర్ హారిక గోవాడ సంగీతం శ్రీ నాగరాజు సెట్ శ్రీ దివాకర్ ఫణీంద్ర అండ్ టీ లైటింగ్ శ్రీ చెన్నకేశవ మేకప్ శ్రీమతి సరిత నిర్వహణ డాక్టర్ రాధాగోవాడ డాక్టర్ గీతిక గోవాడ డాక్టర్ లిఖిత్కాంత్ నిర్వహణ ప్రసరంజని బృందం .
పరుచూరి రఘుబాబు నాటక కళాపరిషత్తులు ప్రదర్శించిన ఈ నాటకం ఉత్తమ ప్రదర్శనగా బహుమతి పొందడం విశేషం!
దర్శకుడు డాక్టర్ వెంకట్ గోవాడ ఈ నాటకం గురించి చెబుతూ అందరి సమిష్టి కృషి ఈ నాటకమని ఇంత అద్భుత ప్రదర్శనకు దోహదం చేసిన రచన దివాకర్ బాబు గారిదని సమినయంగా తెలిపారు. నాటకంలో ఒక తాత్వికత ఉందని జీవితంలో జరిగే అన్ని విషయాలకు భగవంతునిపై ఆధారపడే బదులు మన జీవితాలను మనం నిర్మించుకునేలా కథ మనల్ని ప్రోత్సహిస్తుంది . దురాశ మరియు నిజాయితీ మన మనసుల్ని కప్పి వేసినప్పుడు జరిగే పరిణామాలను కూడా ఈ నాటకం చూపిస్తుందన్నారు . నాటకం అంటే ఏమిటి అని ప్రశ్నించే వారికి ఈ నాటకం సమాధానంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు . నాటకం ఆధునికతతో ముందుకు దూసుకు వెళ్తుంది అనడానికి ఋజువుగా ప్రదర్శనకు ముందు నాటకం చూడమంటూ చెప్పిన వీడియో క్లిప్పింగ్స్ ప్రత్యేక ఆకర్షణ అయితే నాటక ప్రదర్శన అనంతరం అతిధుల ప్రసంగాలన్నీ అభినయ శ్రీనివాస్ గారు యూట్యూబ్‌లో భూతకాలం నాటక సభలో సందేశాలుగా నిక్షిప్తం చేసి అందరికీ అందుబాటులో ఉంచడం గొప్ప విషయం.
నాటకం ఆధునికత వైపు పరుగులు పెడుతుంది . థియేటర్ కి టిక్కెట్ కొని చూసే దిశకు కావలిసిన రంగం సిద్ధం చేసి సజీవతకు సప్రమాణంగా నిలిచి ప్రేక్షకుల ఆదరణ కోసం ఎదురు చూస్తుంది.

కావ్యాలలో నాటకం రమ్యమైనది.” నాటకాంతం హి సాహిత్యం ” అన్న మహాకవి కాళిదాసు భావనలో అన్ని సాహిత్య ప్రక్రియలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం . కవిత్వం, వ్యాసం ,కథ, నవల వీటన్నిటి తర్వాత నాటకం వస్తు రూపంలో భావగంధం కలిగి మనోరంజనం కలిగిస్తూ సామాజిక ప్రయోజనం తో పాటు సందేశాన్ని అందించే అద్భుత దృశ్యరూపకం నాటకం.
సజీవ ప్రదర్శన తో నాటకం అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ ఏయే నాటకాలు నాటికలు ప్రదర్శించబడ్డాయో వాటి కథ, నటీనటులు , సాంకేతిక నిపుణులు ,దర్శకుడు వీరందరి గురించిన సమాచారం తిరిగి చూసుకోవాలంటే మనకు కనిపించదు అందుకోసం నా పరిధిలో నేను గమనించిన చూసిన నాటకాలను పరిచయం చేయాలని ఉద్దేశంతో మన తెలుగు నాటకాలు అనే పేరుతో నేను కొన్ని నాటకాలను పరిచయం చేయాలనుకుంటున్నాను. తద్వారా మన తెలుగు నాటకాలు కొన్ని చదివి తెలుసుకునే అవకాశం కొంతమందికైనా కలుగుతుందని ఆశాభావం. అయితే నాటకం చదివి తెలుసుకోమన్నది నా ఉద్దేశం కాదు. నాటకం ఖచ్చితంగా రంగస్థలం మీద ప్రదర్శించినప్పుడు చూడవలసినదే . కాకపోతే ఆ నాటకం గురించిన సమగ్ర సమాచారం తెలుసుకోవడం ద్వారా నాటక రచయిత ,నటీనటుడు ,ప్రదర్శనలు తీసుకున్నటువంటి శ్రద్ధ కళాకారుల నైపుణ్యం వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను మీ అందరి ఆదరణను కోరుకుంటున్నాను. ఇక పై నేను ధారావాహిక గా అందించే మన తెలుగు నాటకాలను మీరందరూ చదివి తెలుసుకుంటారు కదూ .. ఆయా నాటికలను మీ సమీపంలో ప్రదర్శించబడినప్పుడు తప్పనిసరిగా చూస్తారని ఆశిస్తున్నాను.

వ్యక్తిత్వాన్ని గురించి, తన అస్తిత్వాన్ని గురించి తనను తాను ఆవిష్కరించుకొని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుర్కొన్న సంఘర్షణలను అధిగమించి చేసే యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించిన నాటకం మూల్యం . రచన శ్రీ సింహప్రసాద్ దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ . సింహ ప్రసాద్ గారు పరిచయం అవసరం లేని రచయిత. వారి పూర్తి పేరు చలంకూరి వరాహ నరసింహ ప్రసాద్. ఎన్నో కథలు నవలలు నాటికలు సీరియల్స్ రచించిన వీరు అన్నింటిలోనూ ఎక్కువ శాతం బహుమతులు అందుకోవడంలో తనకు తాను ప్రత్యేకతను నిలుపుకున్నారు 2013లో స్త్రీ పర్వం నవలకు స్వాతి అనిల్ అవార్డు అందుకున్నారు . 277 కథలు,
54 నవలలు రచించారు 2017 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారాత్మ పురస్కారం కథలకు సోమేపల్లి పురస్కారం అందుకున్నారు శ్రీ పర్వం నాటకం పలుమార్లు నాటక రచన పోటీల్లో ప్రథమ బహుమతి అందుకుంది 2022లో ఆకిళ్ల నాటక పోటీలలో గ్రహణం నాటకానికి ప్రథమ బహుమతిని అందుకున్నారు ఇటీవల ఆరు నాటికలు ఆరు ఇతివృత్తాలతో విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయంలో తపస్వి కల్చరల్ ఆర్ట్స్ ఆంధ్ర నాటక కళా సమితి కొడాలి బ్రదర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రదర్శింప చేసిన నాటికలలో మూల్యం ఒకటి.
డా. వెంకట్ గోవాడ తెలుగు నాటక రంగంలో యువ నాటక దర్శకుడు నటుడు నిర్మాత ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి పూర్తిస్థాయిలో నాటక రంగానికి తమ సేవలను అందిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్ లో పీజీ డిప్లమా చేసిన డాక్టర్ వెంకట్ గోవాడ పలు నాటకాలలో విభిన్న పాత్రలను పోషించి అందర్నీ మెప్పించారు . 2013లో గోవాడ క్రియేషన్స్ ప్రారంభించి పలు నాటకాలలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు సినిమాలు సీరియల్స్ లో పాత్రలు పోషిస్తున్నారు. మూల్యం నాటికలో నటన తో పాటు దర్శకత్వం వహించి పలువురి ప్రశంసలను అందుకున్నారు.

గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారిద్వారా ప్రదర్శించిన మూల్యం విభిన్నమైన కథాంశం కలిగి ఉంది. నేటి మన సమాజంలో ఆడపిల్లల మీద అడుగడుగునా రకరకాల ఆంక్షలు విధించబడుతున్నాయి జననంతో మొదలుకొని పెంపకం చదువులు సమాజవర్తన , వివాహం , ఉద్యోగం , స్వేచ్ఛ , దృష్టి దృక్పథం , చిన్న చూపు , వివక్ష ..ఇది చాలదన్నట్టు పెళ్ళవగానే మహిళ శరీరం మీద శరీరాంగాల మీద తన ఆమె భర్తకు సర్వాధికారాలు సంక్రమిస్తాయి అనడం నిస్సందేహంగా అన్యాయమే! వివక్షే!
మహిళను సాటి మనిషిగా గుర్తించకపోవడం నిజంగా అకృత్యమే అమానుషమే. మగవారితో సమానంగా అన్ని రంగాలలో భుజం భుజం కలిపి నడుస్తూ విజయబావుట ఎగురవేస్తున్న మహిళా శక్తిని కించపరచడమే అవమానించడమే!
లింగ అసమానతను దుర్విచక్షణ హక్కుల హసనాన్ని నేటి మహిళ ఎలా సహిస్తుంది? మరి ఎలా భరిస్తుంది ? అలాంటి దారుణ వివక్షకు వ్యతిరేకంగా ఒక వివాహిత మహిళ శంఖారావం చేసి తన హక్కును నిరూపించుకొని మరీ సాధించిన ఒక అపూర్వ ఘటన ఈ నాటిక !
నాటకానికి సంబంధించి ఏ వివరము తెలియకుండా వెళ్లినవారు ఈ సరికొత్త కోణం చూసి ఆశ్చర్య పడతారు అనడం అతిశయోక్తి కాదు . కథలోని పదును దానికి తగిన నటన నాటకాన్ని సమున్నత స్థానంలో నిలబడుతుంది . నాటకంలో ప్రధాన పాత్ర జయతి గా శ్రీమతి జ్యోతి రాజ్ భీశెట్టి , భర్త రాజారావు పాత్రను డాక్టర్ వెంకట్ గోవాడ , తండ్రి – -భాగి శాస్త్రి ,
లాయరు వేణు -బలగంగాధర్ మరియు గోవిందరాజుల నాగేశ్వరావు , ప్రతి లాయరు బ్రహ్మం -స్వరాజ్ కుమార్ మరియు ఉదయ్ సంతోష్ , డాక్టరు- ఉదయ్ సంతోష్ మరియు రాజకుమార్ , సంగీతం – మువ్వా నాగరాజు ,ఆహార్యం – గోవాడ క్రియేషన్స్ టీం లైటింగ్ సెట్ – దివాకర ఫణీంద్ర. వీరందరి సమిష్టి కృషి మూల్యం .
జయతి తండ్రి ఆరోగ్య సమస్యతో ఇంటికి వస్తాడు . వైద్యం చేయిస్తే అతనికి కిడ్నీ పాడైంది ఎవరైనా కిడ్నీ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్ చెబుతాడు . ఇంటికి వచ్చిన మామయ్యను అనారోగ్యంతో ఉండగా పట్టించుకోకుండా మన ఇంటి మీదికి పంపాడు ఏమిటి మీ అన్నయ్య .. అని జయతిని నిలదీస్తాడు. అన్నయ్య చూసుకోకపోతే ఏం నేను చూసుకుంటాను అంటుంది జయతి. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి . వైద్యం చేసుకునేందుకు కిడ్నీ తానే ఇస్తానంటుంది జయతి. మీరైనా చెప్పండి అని లాయర్ వేణుని అడిగితే మీ కుటుంబ సమస్యలలో మేము తల దూర్చకూడదని వెళ్ళి పోతాడతను. కోపంతో కిడ్నీ ఇవ్వడానికి వెళ్తే నువ్వు తిరిగి రానవసరం లేదంటాడు భర్త కిడ్నీని దానం చేసేటట్లయితే ఒక ఫారం మీద భర్త అనుమతితో సంతకం పెట్టించుకుని తీసుకురావాలంటాడు డాక్టర్ . నా శరీరంలో భాగం నేను మా నాన్నకు ఇవ్వడానికి నా భర్త అనుమతి దేనికి అని ప్రశ్నిస్తుంది జయతి.
చివరికి భర్తను అడుగుతుంది భర్త నిరాకరిస్తాడు దిక్కుతోచని స్థితిలో కోర్టు నాశ్రయిస్తుంది కోర్టులో డాక్టరు లాయరు, ప్రతి లాయరు ,తండ్రి ,భర్తల మధ్య సంభాషణలు ఆద్యంతం ఆసక్తికరంగా అద్భుతమైన వాదోపవాదాలతో కొనసాగుతాయి . ఎవరి వైపు వారు తమ వాదనలతో సమర్థించుకుంటారు. తండ్రి కోసం కిడ్నీ ఇస్తే భార్యగా తనకు తన పిల్లలకు భవిష్యత్తులో కొనసాగడం కష్టమంటాడు భర్త రాజారాం . ఒక తండ్రి యొక్క స్థానాన్ని అందరికీ చాటి చెబుతుంది జయతి. తల్లిదండ్రుల తర్వాతే భర్త అని చెప్తుంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటారు కానీ పతిదేవోభవ అనరని అంటుంది. సమర్ధించుకుంటున్న భర్తను ఈ పరిస్థితి మీకే వస్తే మీరేం చేస్తారు అని సూటిగా ప్రశ్నిస్తుంది.
నా శరీరం నాది నా శరీరంలో అవయవం నేను దానం చేసే హక్కు నాకు ఎందుకు లేదు అని కోర్టును ప్రశ్నిస్తుంది నా శరీరం మీద భర్త కు ఎలా హక్కు ఉంది అంటుంది? అంటుంది . అన్ని రంగాల్లో పురోగమిస్తున్న స్త్రీ వివాహమైనంత మాత్రాన తన దేహం మీద హక్కుల్ని ఎలా ఎందుకు వదులుకోవాలి అని తీవ్రంగా నిశితంగా నిరసించి న్యాయస్థానాన్ని సూటిగా నిలదీస్తుంది జయతి.
లింగ అసమానతను దుర్విచక్షణను హక్కుల హసనాన్ని నాటిక సహితుకంగా శక్తివంతంగా ఎండగట్టింది నా శరీరం మీద అవయవాల మీద ఉన్న హక్కులు నావే అని నిరూపించుకోవడానికి నేను ఏ మూల్యం చెల్లించుకోవాలి ఈ మూల్యానికి నేను ఏం చెల్లించుకున్నానో తెలుసా మా నాన్న ప్రాణాలు అని భావురం అంటుంది కుప్పకూలిన ఆ దృశ్యం పతాక సన్నివేశం అందరి హృదయాలను కదిలించి వేస్తుంది అద్భుతమైన నటనతో జీవించింది ఆ పాత్రలో జ్యోతిరాజ్ బి శెట్టి భర్త రాజారాం పాత్రకు తగిన నటనను పరిపూర్ణంగా పోషించారు వెంకట్ గోవాడ.
ఈ నాటకం 30కి పైగా ప్రదర్శనలు చేసి నాటకం యొక్క ఉత్తమ ప్రదర్శన , ద్వితీయ ఉత్తమ ప్రదర్శన , ఉత్తమ రచయిత , ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి , ఉత్తమ సహాయ నటుడు , ఉత్తమ లైటింగ్ & రంగాలంకరణ ఇలాంటి అనేకానేక అవార్డులను సొంతం చేసుకుంది.
రచయితగా శ్రీ సింహ ప్రసాద్ కు దర్శకుడుగా డాక్టర్ వెంకట గోవాడకు , నటిగా జ్యోతి రెడ్డి బి శెట్టి గారికి మూల్యం నాటకం అమూల్యమైన ఆదరణను అందించింది . చూడని వారందరూ తప్పని సరిగా చూసి తీరాల్సిన నాటకం మూల్యం !
