Home బాల‌సాహిత్యం ప్రతాపరుద్ర యుగంధర కథలు

ప్రతాపరుద్ర యుగంధర కథలు

by Ammangi Venugopal

గ్రహణం

కాకతీయు ప్రధాన గూఢచారి త్రినేత్రుడు ప్రతిభావంతుడే. కాని, తొందర ఎక్కువ. ఒక్కోసారి తన తొందరపాటుకు తాను ఇబ్బందుల్లో పడడమే కాక ఇతరులను కూడ ఇబ్బందుల్లో పడేస్తాడు. శత్రుదేశపు సామంతరాజు తన గూఢచారులను దట్టమైన అటవీ మార్గాల ద్వారా కాకతీయ సామ్రాజ్యంలోకి పంపుతున్నాడు. వారిలో కొందరు మాత్రమే అరకొర సమాచారంతో తిరిగి వస్తున్నారు. మరికొందరు పట్టుబడి బందీలవుతున్నారు. ఇక తక్కినవారు సుభిక్షంగా వున్న కాకతీయ సామ్రాజ్యం విడువలేక అక్కడే ఉండిపోతున్నారు. వీరిలో అవివాహితులు, కాయకష్టం చేసి బతికేవారు ఎక్కువ. ఇట్లాంటివారు అక్కడి అమ్మాయిలనే పెండ్లి చేసుకొని అక్కడే స్థిరపడిపోతున్నారు.

త్రినేత్రుడు శత్రు రాజు లాగా తాను కూడా దట్టమైన అటవీ మార్గం ద్వారా శత్రురాజ్యంలో ప్రవేశించి అక్కడి సైన్య రహస్యాలను తెలుసుకొని తమ రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని ఉబలాటపడ్డాడు. ‘లేడికి లేచిందే పరుగు’ అన్నట్టు వెంటనే మహామంత్రి యుగంధరుణ్ణి కలిసి విషయం తెలిపి మారువేషంలో శత్రురాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతి కోరాడు. ఎప్పుడూ వందలకొద్ది రాజ్య సమస్యలతో సతమతమవుతూ క్షణం తీరిక లేని యుగంధరుడు

“సరే! హద్దు మీరి ప్రవర్తించకు. జాగ్రత్త” అన్నాడు.

త్రినేత్రునికి ‘సరే!’ అన్నమాట మాత్రమే వినిపించింది. ఆ తర్వాత వాక్యం వినిపించలేదు!

ఉత్సాహంతో ఇంటికి వెళ్ళి నమ్మిన బంటు పింగళుణ్ణి పిలిపించి చర్చించాడు. ‘కోయల వేషంలో అటవీ మూలికలు, పలుకులు, జుంటి తేనె తీసుకొని అక్కడి ప్రవేశ ద్వారంలో ఉండే కాపలా సైనికులకు ఉచితంగా ఇచ్చేస్తే, సులభంగా నగర ప్రవేశం చేయవచ్చునని’, పింగళుడు అన్నాడు.

ఇద్దరూ సరంజామాతో శత్రురాజ్యంలోకి ప్రవేశించారు. ప్రవేశ ద్వారం వద్ద తమ విలువైన దినుసులను కాపలా సైనికులకు సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వేరువేరుగా – “మందులోయమ్మ మందులూ, అడవి దినుసులూ” అంటూ వీధుల్లో తిరుగసాగారు. అసలు కోయవాళ్ళు అమ్మే ధరకన్నా తక్కువకే అమ్ముతూ మొదటి నాలుగైదు దినాల్లో కొన్ని రాజ్య రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

రాజధానిలోని ప్రసిద్ధ వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు ఇచ్చే సలహాలను అక్కడి – ప్రధాన గూఢచారి సకలాక్షుడు విని పాటిస్తుంటాడని తెలుసుకొని ఒకరోజు రాత్రి అర్చకుని ఇంటికివెళ్ళి పది బంగారు మాడలు దక్షిణగా సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి-

“ఏదో ఉడుతాభక్తి. దయచేసి స్వీకరించండి. వెంకటేశ్వరుడు కరుణిస్తే ఇంకా సమర్పించు కుంటా”నని చెప్పి నిష్క్రమించాడు.

ఎవడో సాటికులం వాడు కులం కట్టుతప్పి, అటవీ దినుసులు అమ్ముతున్నాడని, అసలు కోయలకు తెలిసింది. నిఘా వేసి త్రినేత్రుణ్ణి పట్టుకున్నారు. అతని మాట తీరే వారికి అనుమానాస్పదంగా ఉంది. అసలతడు కోయకాడని అక్కడున్న గస్తీ సైనికునికి అప్పగించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, అట్లాంటివారిని రహస్యంగా సమీప గూఢచారి అధికారికి అప్పగించాలని వారికి ఆదేశాలున్నాయి. పెద్దగా రచ్చ చేయకుండా ఆ సైనికుడు గూఢచారులకు అప్పగించాడు. చాటు నుండి ఇదంతా చూసిన పింగళుడు తన దగ్గర మిగిలిన సరుకులను ప్రవేశద్వారం దగ్గరున్న గస్తీ సైనికులకు పంచేసి, కాకతీయ రాజ్యం ప్రవేశించాడు. వెంటనే విషయాన్ని యుగంధరుని దృష్టికి తెచ్చాడు.

యుగంధరుడు వెంటనే కొన్ని చర్యలు తీసుకున్నాడు. త్రినేత్రుని పోలికలు బాగా ఉన్న అతని కవల తమ్ముడు నేత్రపర్వుణ్ణి, అతని భార్యను ప్రధాన గూఢచారి నివాసంలోకి మార్చాడు. ఇప్పుడు నేత్రపర్వుడే ప్రధాన గూఢచారి వేషభాషల్లో రథం మీద చక్రవర్తి కొలువు కూటానికి పోయి వస్తున్నాడు. త్రినేత్రుని భార్యను వెంటనే అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు. తాను మెరికల్లాంటి పదిమంది సైనికులను తీసుకొని మారువేషాలలో శత్రుదేశం చేరుకున్నాడు. అంచె వేగుల ద్వారా ఏరోజు వార్త ఆరోజు ప్రతాప రుద్ర చక్రవర్తికి తెలియజేస్తున్నాడు.

శత్రుదేశపు గూఢచారులు త్రినేత్రుణ్ణి రహస్య స్థావరంలో ఉంచి విచారణ సాగిస్తున్నారు. అతణ్ణి అదుపులోకి తీసుకున్న విషయం బయటకు పొక్కనీయలేదు. తనది గుంటూరని ఒకసారి, రాజమహేంద్రవరం అని ఒకసారి, ఒరిస్సా అని ఒకసారి పొంతన లేని సమాధానాలు చెప్పుతూ వచ్చాడు. వేధింపులు ఎక్కువ అయ్యాయి. దాంతో తనది ఓరుగల్లు అని, కోయవాణ్ణేనని కాని చాలాకాలంగా తెలుగువాళ్ళ మధ్య ఉంటుండటం వల్ల కోయభాష మరిచిపోయానని చెప్పాడు. ఆ విచారణకు సంబంధించిన పరిణామాలన్నీ పింగళుని ద్వారా యుగంధరునికి, యుగంధరుని ద్వారా చక్రవర్తి ప్రతాపునికి తెలుస్తున్నాయి.

ఒకరోజు శత్రు రాజ్య ప్రధాన గూఢచారి సకలాక్షుడు స్వయంగా వచ్చి విచారణ చేపట్టాడు.

“నీకు కాకతీయుల ప్రధాన గూఢచారి తెలుసా?” అని అడిగాడు.

“త్రినేత్రుడు గారు తెలియకేం. ఆయనకు పుట్టతేనె చాలా ఇష్టం. వారికి సరిపడా తేనెను నేనే సరఫరా చేస్తుంటాను” అన్నాడు.

“మరి వారి భార్య సంగతి?”

“ఆమెకు వజ్రాలు పొదిగిన ఆభరణాలంటే యెక్కడ లేని మోజు” అన్నాడు.

ఈ సమాధానాలు నిజమేనని తమ వేగుల ద్వారా రూఢి చేసుకున్నాడు.

కోయవాడి విషయంలో ఏం చెయ్యాలో చెప్పగలిగే సూక్ష్మ బుద్ధి ఉన్నవాడెవడూ అక్కడ లేడు తమ శత్రుదేశంలో ఉంటున్నానని ఒప్పుకున్నాడు కనుక ఉరితీయటమే మంచిదని న్యాయకోవిదులు తెలియజేశారు. రాజూ, మంత్రీ అదే అభిప్రాయానికి వచ్చి సకలాక్షునికే ఉరి బాధ్యతను అప్పగించారు.

వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకుడు రామానుజాచార్యులు తమ తమ్ముడు లక్ష్మీనరసింహా చార్యులను వెంటబెట్టుకొని ప్రధాన గూఢచారి ఇంటికి వచ్చాడు. తనకు పాదాభివందనం చేయగానే మంత్రసహితంగా ఆశీర్వదించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశాడు. ఆ తర్వాత తన సమస్య మనవి చేసుకున్నాడు.

“అయ్యా! మా అమ్మాయికి అనారోగ్యం చేసింది. నన్ను కలువరిస్తున్నదని ఇదిగో ఈ తమ్ముడు వార్త తెచ్చాడు” అంటూ పెద్దపిలక, జంధ్యం, మడి వస్త్రధారణ, నామాలతో తేజోమూర్తిగా కనిపిస్తున్న నడీడువాణ్ణి పరిచయం చేశాడు.

“అయ్యా వీడు మా తమ్ముడు లక్ష్మీనరసింహాచార్యులు. పెద్ద ఘనాపాటి. మా గోదావరి ప్రాంతంలో ఈయన పెట్టిన ముహూర్తానికే కార్యాలు జరుగుతుంటాయి. నేను నెలరోజులు సెలవు మీద వెళ్ళిపోతాను. నా స్థానంలో నా తమ్ముడు ప్రధానార్చకుడిగా ఉంటాడు. అనుమతించండి” అన్నాడు.

“సరే. ఇది చిన్న విషయం మీరు రేపే వెళ్ళిపోవచ్చు. అయితే మాకో సలహా కావాలి. మేం ఒక నేరస్తుణ్ణి ఉరి తీయాలి. ఆ పనికి ఏది అనుకూలమైన రోజో చెప్పండి” అడిగాడు ప్రధాన గూఢచారి.

అప్పుడు ఇద్దరూ వేళ్ళమీద లెక్కించుకొని, ఒక నిర్ణయానికి వచ్చారు.

“నాల్గురోజుల తర్వాత వచ్చే శనివారం సంపూర్ణ సూర్యగ్రహణం మధ్యాహ్నం రెండుగంటలకు నరకలోక ద్వారాలు పూర్తి తెరచి వుంటాయి. ఆ సమయంలో ఉరి తీస్తే నేరస్తునికి నరకం. వాడి రాజుకు అరిష్టం ప్రాప్తిస్తాయి” అన్నాడు రామానుజాచార్యులు. దాన్ని కమ్మ మీద రాసిచ్చాడు. ప్రధాన గూఢచారి అంగీకరించాడు. వాళ్ళు సెలవు తీసుకొని వచ్చేశారు.

ఉరితీతకు అన్ని ఏర్పాట్లు రహస్యంగా జరిగాయి. త్రినేత్రుణ్ణి చివరి కోరిక ఏమిటో అడిగారు. అతడు –

“వెంకటేశ్వర స్వామి దైవ ప్రసాదాన్ని తన ఉరికి ముందు అక్కడున్న వాళ్ళంతా స్వీకరించి ఆరగిస్తే, చూసి సంతృప్తితో ఉరికి వేలాడుతా. దైవ కృపతో నాకు నరకం తప్పవచ్చు. ఇదే నా చివరి కోరిక” అన్నాడు. ప్రసాదం విషయమై వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకునికి ఆదేశాలు వెళ్ళాయి.

శనివారం రోజు సంపూర్ణ సూర్యగ్రహణానికి పావుగంట ముందే త్రినేత్రుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి నలుగురు బలిష్ఠులైన సైనికులు విచ్చుకత్తులు ధరించి ఉరితీసే వేదికపైకి తీసుకు వచ్చారు. త్రినేత్రుణ్ణి తలారికి అప్పగించి కిందికి వచ్చి క్రమశిక్షణతో నిలబడ్డారు.

తలారి ఉరితాడును పరీక్షించి చూసుకొని సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వెంకటేశ్వరాలయం ప్రస్తుత ప్రధాన అర్చకుడు లక్ష్మీనరసింహాచార్యులు మరో పూజారితో పాటు ప్రసాదం తీసుకువచ్చి కింద తమ అశ్వాల పక్కన నిలబడి ఉన్న న్యాయమూర్తికి, ప్రధాన వైద్య ఆరోగ్య శాఖాధిపతికి, విచ్చుకత్తుల సైనికులకు మంత్రోక్తంగా ఇచ్చి – 

“ఉరితీతకు సమయం లేదు ప్రసాదం వెంటనే ఆరగించండి” అన్నాడు వారంతా వెంటనే సభక్తికంగా ఆరగించారు. బలి వేదిక మీదికి వెళ్ళి తలారికి ఇచ్చాడు. అతడూ దాన్ని నోట్లో వేసుకొని త్రినేత్రుని వైపు తిరిగి –

“అయ్యా! మీరెవరో నాకు తెలియదు. నేనెవరో మీకు తెలియదు. మనిద్దరి మధ్య పగ, ద్వేషం లేవు. మా మహారాజు గారి ఆజ్ఞ మేరకు మిమ్ములను ఉరి తీస్తున్నాను. దేవుడు క్షమించుగాక” అని అంటుండగా సంపూర్ణ సూర్యగ్రహణం మొదలయింది.

చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. చీకటయిందని భ్రమించి పక్షులు అరుస్తున్నాయి. ఆకాశంలో చుక్కలు కనిపించసాగాయి. వేదిక కింద ఉన్న నలుగురు సైనికులు, న్యాయమూర్తి, ప్రధాన వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆ ప్రసాదం మత్తులో నేలకు ఒరిగిపోయారు. పైన తలారి కూడా ఆ మత్తుకు తట్టుకోలేక ఒరిగిపోయాడు. ప్రధాన అర్చకుని వేషంలో ఉన్న యుగంధరుడు అర్చక వేషం వదలేసి సైనికుని దుస్తులు వేసుకున్నాడు. రెండు నిమిషాలలో వారు అక్కడి వాళ్ల అశ్వాలు అధిరోహించి వాయు వేగంతో తమ రాజ్యం వైపు వాటిని పరుగులు తీయించారు. అదివరకే పింగళుని అటవీ దినుసులు ఆరగించి అక్కడి గస్తీ సైనికులు మత్తులో మునిగిపోయారు.

అరగంట దాటీ దాటగానే ఆ చీకటిలో వీళ్ళంతా శత్రు రాజ్య సరిహద్దులను దాటేశారు. అప్పటికి సంపూర్ణ సూర్యగ్రహణం వీడి పాక్షిక గ్రహణంగా మారింది. సన్నని కిరణాలు భూమిని తాకుతుండగా అందరి మత్తు క్రమంగా వదిలింది.

సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ, మత్తుమందును ప్రయోగించి ప్రతాప యుగంధరులు వేసిన ఎత్తును తెలుసుకొని శత్రు రాజ్యం రాజు, మంత్రి, ప్రధాన గూఢచారి సంభ్రమాశ్చర్యాల మత్తులో మునిగిపోయారు.

కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కొలువుకూటం ఆనందోత్సాహాలతో కోలాహలంగా ఉంది. చక్రవర్తి, మంత్రి ప్రముఖులు ఉరిశిక్షను తప్పించుకొని ప్రాణాలతో తిరిగి వచ్చిన త్రినేత్రుణ్ణి అక్కున చేర్చుకొని అభినందిస్తున్నారు.

ఆ రణగొణ ధ్వనులను చీల్చుతూ-

“ఇంతకూ బంగారుమాడ ఎవరికి బహుకరించాలి” అని అడిగాడు మేఘ గంభీర స్వరంతో చక్రవర్తి, ఆ మాడను ప్రదర్శిస్తూ.

“దాన్ని లక్ష్మీనరసింహాచార్యుల వేషధారి మన మహామంత్రి యుగంధరుల వారికివ్వటం న్యాయం” అన్నాడు త్రినేత్రుడు.

“ఆ అవతారం శత్రురాజ్యంలోనే సమాప్తమయింది. కనుక మనకు పూర్తిగా సహకరించిన వారి అన్నగారు రామానుజాచార్యుల వారికి బహూకరిస్తే బాగుంటుందని నా విన్నపం” అన్నాడు యుగంధరుడు.

“మరి వారు గోదావరి తీరానికి వెళ్ళిపోయారు గదా!” అన్నాడు ఒక సామంతరాజు.

“ఆ గోదావరి తీరం ఇక్కడ కూడా ఉంది. వారిని ప్రవేశ పెట్టండి” అని ఆదేశించాడు ప్రతాప రుద్ర చక్రవర్తి.

సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న రామానుజాచార్యులు వెంకటేశ్వర స్తోత్రం చదువుకుంటూ ప్రవేశించి బంగారు మాడను స్వీకరించి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని చక్రవర్తికి అందజేశాడు. దాన్ని స్వీకరించి –

“ఈ ప్రసాదం ఆ ప్రసాదం కాదు గదా!” అన్న చక్రవర్తి ఛలోక్తితో కొలువుకూటంలో నవ్వులు విరబూశాయి.

అయితే, అక్కడ శత్రు రాజ్యంలో ఇంకా గ్రహణం వీడలేదు.

(కల్పితం)

You may also like

Leave a Comment