తిరిగొచ్చిన నెక్లెస్
ఒక వారంలోనే శ్రావణి పెళ్ళి కుదిరింది. అబ్బాయి తండ్రి సత్యనారాయణ కట్నం అడుగకుండానే తన కుమారునికి నా కూతురు శ్రావణిలో పెళ్లి జరపడానికి నిశ్చయించాడు. పెళ్ళి చూపులకు వచ్చి రాగానే సత్యనారాయణ అంత తొందరగా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన సుల్తాన్ శాయిలో నా అర్థాంగి ప్రమీలకు ప్రైమరీ స్కూల్ లో చదువుచెప్పడమే.
పూర్వ పరిచయం వల్లనూ, అంతకుముందే ప్రమీల పుట్టించివారితో సంబంధం ఉండడంవల్లనూ సత్యనారాయణ పెళ్లికి ఆమోదముద్రవేశాడని నాకు తెలిసింది.
ఐతే, పెళ్ళి ఒక వారంలో జరగాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు. కారణమేమంటే వాళ్ళబ్బాయి మా అమ్మాయి పెళ్ళాడి పదిరోజుల్లో అమెరికా వెళ్లిపోవాలి.
నా కంత తొందరగా పెళ్ళి చేయడం ఇబ్బందిగానే ఉండింది. కట్నం క్యాష్ రూపంలో ఏమీ ఇవ్వకున్నా బంగారమైనా పెట్టాలి కదా! ప్రమీలతో మాట్లాడాను. ఆమె తన పెద్ద గొలుసును, నెక్లెస్ (రాళ్ళులేనిది)ను అమ్మాయికి ఇవ్వడానికి ఒప్పుకుంది. నేనూ సంతోషించాను.
మా ఇంటి ముందు శివయ్యగారు ఒక చిన్నర కొట్టును నడుపుకుంటున్నాడు. నేను ఏదో కొనడానికి పోతే, “ఏం సార్ మీరు కొంచెం విచారంగా కనిపిస్తున్నారు. కారణం తెలుసుకోవచ్చా?’’ అని అడిగాడు.
నేను అమ్మాయికి వారంలోనే పెళ్ళి చేసే విషయాన్ని ఆయనకు చెప్పాను. “చాలా సంతోషం. మీకేమైనా డబ్బు సర్దమంటే సర్దుతాను” అని ఆయనే స్వయంగా అనడం, నేను ఒక రెండు లక్షలు ఆయన దగ్గర మిత్తిలేకుండానే తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.
పెళ్లి బాగా జరిగింది. అబ్బాయి పెళ్లి తర్వాత నాల్గు రోజులుండి యు.ఎస్. వెళ్లిపోయాడు. అమ్మాయి శ్రావణి కూడా నాల్గు నెలల తర్వాత యు.ఎస్.వెళ్లిపోయింది.
శ్రావణికి పెళ్లైన రెండేళ్లకు శ్రేష్ఠ జన్మించింది. శ్రేష్ఠ రెండేళ్లు ఇండియాలోనే పెరిగింది. తన కూతురిని తీసుకపోవడానికి శ్రావణి, నాగరాజులు ఇండియాకు వచ్చారు.
శ్రావణికి నగలంటే వల్లమాలిన ప్రేమ. పాత నగల్ని కరిగించి కొత్తవి చేయడం గాని, పాతవి అమ్మేసి కొత్తవి కొనడంగాని ఆమె కిష్టం.
ఒక రోజు శ్రావణి నన్నూ, ప్రమీలను తీసుకొని ఆబిడ్స్ లోని జ్యువెలరీ షాప్ కు తీసుకొని వెళ్లింది. కొత్త నగలకు ఆర్డర్ ఇస్తూ, పెళ్లినాడు ప్రమీల నుంచి తనకు కట్నంగా వచ్చిన నెక్లెస్ ను అమ్మే ప్రయత్నం చేసింది.
అయ్యో! నేను ప్రేమతో ప్రమీలకు చేయించిన నెక్లెస్ ను శ్రావణి అమ్మయేడం నాకు బాధ కల్గించింది. షాపు నాడు వెంటనే ఆరువేలకు ధర కట్టి తీసుకున్నాడు. ఒక్క క్షణంలో నాకు మంచి ఆలోచన వచ్చింది. నేనే ఆ నెక్లెస్ను తీసుకుంటే ఎంత బాగుంటదనిపించింది. ఆలస్యం చేయకుండా నా దగ్గరున్న ఆరువేలు షాపుతనకిచ్చి నెక్లెస్ ను తీసుకున్నాను. నేను చేసిన పనికి ప్రమీల ఏమనుకున్నదోగాని, శ్రావణి మాత్రం కొంచెం సిగ్గుపడినట్లు కనిపించింది.
శ్రావణి వివాహమై పదిహేనేండ్లు గడిచాయి. అది 2015వ సంవత్సరం. నేను రిటైర్మెంట్ అయిన మూడు మాసాలకే ప్రమీల అకస్మాత్తుగా నన్ను శోక సముద్రంలో ముంచి పరలోకకేగింది.
కొన్ని రోజులు గడిచాయి. ప్రమీల రెండు అల్మార్ల నిండా చీరలే. ప్రత్యేకంగా నగల పెట్టె కూడా ఉంది. నా పిల్లలు ముగ్గురు అల్మారాలు తెరిచారు. నా అనుమతితో చీరలూ, నగలూ వారికిష్టమైన రీతిలో పంచుకున్నారు. ముగ్గురూ సామరస్యంగా నగల్ని పంచుకోవడం నాకూ బాగనిపించింది!
ఆశ్చర్యమేమంటే ప్రమీల ధరించిన ఆభరాల్లో శ్రావణి అమ్మితే నేను కొన్న నెక్లెస్ కూడా ఉంది. ఆ నెక్లెసంను చూడగానే నా కళ్ళు చెమర్చాయి. శ్రావణి కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. తన పాలుకు ఆ నెక్లెస్ ఉండాలని కోరింది. అన్నదమ్ములందుకు ఒప్పుకున్నారు.
తన చేతికి తిరిగొచ్చిన ఆ బంగారు నెక్లెస్ను శ్రావణి తన కూతురు శ్రేష్ఠ మెడలో అలంకరించడం కొస మెఱుపు. నా మనుమరాలికంఠంలో ఆ నెక్లెస్ ను చూసి, తిరిగి ప్రమీలనే ధరించినంత ఆనందానుభూతిని పొందాను.