‘ప్రళయాక్షరాలు’:
ప్రపంచం నా మాట వినట్లేదని
తాళలేని గొంతుక
దారితప్పిన వలయకాలువలా
ఘీంకరిస్తూ బాష్పీభవిస్తుంది
ఆ ఆవిరి సెగలు
ఉరుముల్లా
కాగితంపై నర్తిస్తుంటే
ఎండుటాకు శబ్దాల క్రోధనినాదాలు
చిగురుటాకు లబ్దాల కరతాళాలు
యుద్ధం.. శత్రువు.. గెలుపు..
అనే అభిప్రాయ వేదికపై
సహనములు
సరిగమలు మూటగట్టి
నీకో రహస్యం దాచిపెట్టా!
నిండు కలల వంతెనపై
కదపలేని వేళ్లతో ఈ ఉదాంతాన్ని రాసింది నేనే
నిన్ను చుట్టు ముట్టి
కదిపే కళ్లతో ఈ వేదాంతాన్ని చదువుతున్నది నేనే..
‘కవిత్వ కరవాలం’:
అక్షరం తప్ప వేరే గత్యంతరం లేదు
భావం తప్ప మరో బాంధవ్యం తెలీదు
గుప్పెడు కవిత్వం రాసుకోడానికి
గుక్కెడు భావం అందులో పోసుకోడానికి
పుస్తకాలెన్నో తిరగడం
మస్తకాలెన్నో వెతకడం
అనువైన వాటిని అరువుతెచ్చుకోడానికి
అన్నీ కలిపి ఆకృతిని ఇచ్చి ప్రాణం పోస్తే
అది కవిత్వమని ప్రకృతి చెప్పింది
బహుశా అదే అనుకుంటా ప్రకృతితో మాట్లాడే తీరు
అంతే అనుకుంటా తనకి తాను పెట్టుకున్న పేరు
గాలిని తాగి తాగి
నీటిలో కాగి కాగి
నిప్పులో మాగి మాగి
మట్టిని తిన్నాక అర్థమైంది
మెరుగులద్దుకొని విధిగా నిలువరిస్తే అవగతమైంది
రగిలే ఆలోచనల్లో కాలితేనే ఆశయాల ఆకాశం అందుతుందని
అప్పుడు నేను మారాను మనిషి నుండి
మహత్తు నిండిన కవిత్వంలా
అప్పుడే నేను మారాను కరుణగుణం నుండి
క్రోదాగ్నితనం నిండిన సిరాపాతంలా
నేను రోజు బడభాగ్నితో మాట్లాడతాను
నేను రోజు శూన్యంతో స్నేహం చేస్తాను
నేను రోజు స్వప్నాలతో కలిసి నడుస్తాను
నేను రోజు మెలుకువతో నిద్రిస్తాను
ప్రశ్నలు లేని సమాధానాల్ని ఛేదిస్తూ
ఒంటి నిండా ఖడ్గగుచ్ఛాలతో రోజూ ఉదయిస్తాను..
కర్మాకర్మల కర్మాగారాల పొగ పీలుస్తూ
గాయపడిన కాయంలా జాలిగా హీనంగా నీరసిస్తాను..
ఎండ వానల సమాంతర స్థితిలో జనించిన ఇంద్రధనుస్సులా హాయిగా అద్భుతంగా నవ్వుతాను..
హృదయ ప్రాకారాల ఆవిర్లను ఒడిసిపట్టి
దాహాన్ని తడుముకుంటూ
నిషా నిండిన వాక్యాలతో జీర్ణ కుడ్యాల
ఆకలిని కరుచుకుంటూ
నాటి ప్రణవ శబ్ద మూలం బోధించే
నేటి ప్రయాణ ప్రారబ్దం తెలుసుకుంటూ
అష్టదిక్కుల్లో తిష్టవేసిన అస్థిత్వాన్ని
అర్ధాంతర విన్యాసాల అగోచరత్వాన్ని
అనువుగా సృష్టించుకున్న జ్ఞాన స్థిరత్వాన్ని
కాగితాలపై కారుస్తున్నా కాలాన్ని వల్లె వేస్తూ…
ఖగోళాన్ని ఓ కంట కనిపెడుతున్నా
ఒంటి చేత్తో కవనాలను పూయిస్తూ.