అలల హొయలున్నాయి అలజడి ఉంది
తీరం వెంట పడి లేచే ఉరుకులు పరుగుల్లో ఉత్సాహం ఉంది
ఒడ్డుకు కొట్టుకొని ముందుకు వెళ్లలేని అసహాయత ఉంది
కొండ అడ్డంగా వస్తే చుట్టూ తిరిగి
కదలి వెళ్లే నేర్పరితనం ఉంది
అడ్డంకులు అధిగమించే సాహసం ఉంది
కెరటాల గమకాల్లో శ్రావ్య సంగీతం ఉంది
చెప్పలేని ఏదో బాధల హోరు ఉంది
వెలుగును వెన్నెలను తాగి ఊగుతుంది
వేదనలు దాచుకోలేక
అప్పుడప్పుడు మూలుగుతుంది
భీష్మ గ్రీష్మం చురుకైనప్పుడు వీచికాంతరంగాన్ని మూసుకొని శోషిల్లుతుం ది
వర్ష హర్షం చినుకైనప్పుడు తరంగాల గంతులు వేస్తుంది
హేమంత శిశిరాలు సమీపిస్తే
కాలోర్మికలతో జోకొడుతూ సహిస్తుంది
అన్ని ఋతువుల్లోనూ అదే నడక
ప్రవాహం లయాత్మకం
ప్రయాణం ఆపదు
గమనం ఆగదు
ప్రవాహమే జీవితం
జీవితమే కాల ప్రవాహం
వెలుగు వెంట చీకటి ,చీకటి వెంట వెలుగు
వినోద విషాదాల సమ్మే లనమే జీవనం.
ప్రవాహం
previous post