Home కవితలు బాపు

నీవు లేని నీకోసం కవిత రాయాలని
ముప్పిరి గొన్న ఆలోచనల.. కలం చేత పెట్టాను
ఆరు పదుల పైగా నీ తో నడిచిన రోజులన్నీ
ఒకటొకటిగా మెదడు సందుగ దూకి నెట్టుకొస్తున్నాయి

నీవు లేని నీకోసం తన్నుకొస్తున్న అక్షర ప్రవాహం
కంటి సుడిగుండాల వలయాల చీల్చి వర్శిస్తూ..
మసక మసకగా కాగితం మీద వాలిన
పదాల పాదాలను నదీ జలమై అభిషేకిస్తూ..

బాపూ!నీవు లేని నీకోసం కవిత రాయాలనుకున్నా
నీ చుట్టే నేనున్నానని భుజం తడుతున్నట్టు..బాపు

ముందు రోజు మల్లెపువ్వులా నవ్వులు చల్లి
మనవడి పెళ్లి శుభలేఖ ఆసాంతం చదివి
అందులో నీ పేరు ఉందని మెరిసి
విద్యుద్దీపకాంతుల్లో ఇల్లంతా బాగుందని మురిసి
చక్రాల కుర్చీ మీద ఫోటోలకు ఫోజులిస్తివి
చూసి అబ్బురపడితివి కదా బాపూ..
పత్తి పువ్వు లా చూసుకున్నాము కదా …
అంతలోనే ఏమైంది…ఇంటి నిండా చీకట్లు
చెప్పా చెయ్యక ఎలా వెళ్ళిపోయావు బాపూ..

మేమంతా ఉన్నతంగా ఎదగాలి అన్నావు
నీవేమో ఉన్నంతలోనే బతకాలనుకున్నావు

నీ స్వప్న సాకారం కోసం మా చదువుల కోసం
మాటిమాటికి ఇరుకిరుకు ఇళ్లకు మారుతూ
కిరాయి ,కిరాణా దుకాణం ఖాతా,ఫీజులు బట్టలు పుస్తకాలు,రోగాలు..మధ్యతరగతి ఖర్చులకై..
బతుకు తెరువు కోసం చాలీచాలని
ఆనాటి అత్తెసరు జీతాల బడిపంతులు నీవైనా
నిర్మొహమాటంగా గలగల మాట్లాడే నిష్కపటి వై
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకుడివై
ఎదిగి జీవించిన ఆత్మాభిమానపు జెండా నీవు బాపు

ఉద్యోగానంతరమే అసలు జీవితమని
అరిగిపోయిన శేష జీవితం కాదని అది అశేష మని
సుప్తంగా ఉన్న అంతశ్చేతనను తట్టిలేపి
పసితనపు ఛాయతో కవిత్వమై వెలిగావు
ఒక విశాల ప్రపంచంలో ఒదిగి పోయావు

తనదైన భావన పరిధిలో తట్టిన ప్రతిదీ
కవిత్వీకరించి పిలిచిన ప్రతి చోటా
దూరాభారమనక వయసును మరిచి
వినిపించి పొంగిపోయావు కదా!బాపు

కలల కుంచెతో అక్షరీకరించి
కలల కొలిమి తో స్నేహించి
కలల సంతకం చేసిన చెలిమి నీవు
కలుపుగోలుతనం అసలు రూపం నీవు

కోపం లోనూఆర్ద్రతలోను శివుడి పేరును
సార్థకం చేసుకున్న ధరణీశ్వరుడవు నీవు
అవును భోళాశంకరుడివి నీవు నీ వని
నీవు లేని నీకోసం ఏమి రాసినా…

గుర్తొస్తే చాలు బరువెక్కి ఎక్కెక్కి ఏడిచే గుండెలు
మర్చిపోతే కదా!చాక్పీస్ చేతులతోఎందరికో
జ్ఞాన గవాక్షాలు తెరిపించిన బోధి వృక్షాన్ని…
ఆ నీడలో మమ్ము నడిపించిన జ్ఞాన సుగంధాన్ని..

అన్నీ ఉన్నా నీవు లేవు
నీవే లేనప్పుడు ఎన్ని ఉన్నా ఏదో వెలితి
మా అందరి హృదయాల్లో ఏదో కలత

You may also like

1 comment

రాంబాబు కొప్పర్తి June 22, 2022 - 3:26 pm

నీహారిని గారి సాహితీ సేవకు వందనం

Reply

Leave a Comment